సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
ఆత్మచేత బోధించండి


“ఆత్మచేత బోధించండి,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“ఆత్మచేత బోధించండి,” రక్షకుని విధానములో బోధించుట

చిత్రం
యూదయ అరణ్యములో రక్షకుడు

రక్షకుడు తన పరిచర్యకు ఆత్మీయంగా సిద్ధపడుటకు సమయాన్ని వెచ్చించినట్లే, ఆత్మ ద్వారా బోధించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.

ఆత్మచేత బోధించండి

రక్షకుడు తన సువార్తను ప్రకటించమని జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లను ఆజ్ఞాపించినప్పుడు, ఆయన వారికి ఈ వాగ్దానం చేసెను, “మీరు చెప్పువాటన్నిటికి సాక్ష్యము చెప్పుటకు పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 100:8; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:15–17; 50:17–22 కూడా చూడండి). మీతో సహా సువార్తను బోధించే వారందరికీ అదే వాగ్దానం వర్తిస్తుంది. మీరు యేసు క్రీస్తు సువార్తను బోధిస్తున్నప్పుడు, మీకు మార్గనిర్దేశం చేయుటకు మరియు మీరు బోధించే వారి మనస్సులకు, హృదయాలకు సత్యాన్ని సాక్ష్యమిచ్చుటకు పరిశుద్ధాత్మను మీరు కలిగియుండగలరు (సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2 చూడండి). మీరు బోధించేటప్పుడు మీరు ఒంటరిగా లేరు, ఎందుకనగా “చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు” (మార్కు 13:11).

పరిశుద్ధాత్మ నిజమైన బోధకుడు. సత్యానికి సాక్ష్యమివ్వడంలో, క్రీస్తుకు సాక్ష్యమివ్వడంలో మరియు హృదయాలను మార్చడంలో ఆయన పాత్రను ఏ మర్త్య బోధకుడు, ఎంత నైపుణ్యం లేదా అనుభవజ్ఞుడైనప్పటికీ భర్తీ చేయలేడు. కానీ బోధకులందరు దేవుని పిల్లలకు ఆత్మ ద్వారా నేర్చుకునేందుకు సహాయం చేసే సాధనంగా ఉండగలరు.

ఆత్మచేత బోధించుటకు

  • ఆత్మీయంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

  • అభ్యాసకుల అవసరాలకు సంబంధించిన ఆత్మీయ ప్రేరేపణలకు స్పందించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.

  • అభ్యాసకులు పరిశుద్ధాత్మ చేత బోధించబడే పరిస్థితులను మరియు అవకాశాలను సృష్టించండి.

  • వ్యక్తిగత బయల్పాటును వెదకుటకు, గుర్తించుటకు మరియు దానిపై పనిచేయుటకు అభ్యాసకులకు సహాయపడండి.

  • తరచుగా సాక్ష్యం చెప్పండి మరియు వారి మనోభావాలను, అనుభవాలను, సాక్ష్యాలను పంచుకోమని అభ్యాసకులను ఆహ్వానించండి.

రక్షకుడు బోధించుటకు ఆత్మీయముగా తననుతాను సిద్ధము చేసుకొనెను

తన పరిచర్య కొరకు సిద్ధపడుటకు, “దేవునితో ఉండుటకు” యేసు 40 దినములు అరణ్యములో గడిపెను (జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 4:1 [మత్తయి 4:1, పాదవివరణ లో]). కానీ ఆయన ఆత్మీయ సిద్ధపాటు చాలాకాలం ముందు ప్రారంభమైంది. సాతాను ఆయనను శోధించినప్పుడు, ఆయన తనకు అవసరమైన “ఆ గడియ” కొరకు భద్రపరచుకొనిన “జీవపు మాటలు” పొందగలిగెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85). బోధించుటకు ఆత్మీయంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొనుటకు మీ స్వంత ప్రయత్నాల గురించి ఆలోచించండి. మీ ఆత్మీయ సిద్ధపాటులో మీరు రక్షకుని మాదిరిని ఎలా అనుసరించవచ్చనే దాని గురించి మత్తయి 4:1–11 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఆత్మయే నిజమైన బోధకుడు మరియు పరివర్తనకు నిజమైన మూలాధారం. శక్తివంతమైన సువార్త బోధనకు కేవలం పాఠాన్ని సిద్ధం చేయడమే కాకుండా, మీరు బోధించడం ప్రారంభించే ముందు ఆత్మీయంగా మిమ్మల్ని మీరు బాగా సిద్ధం చేసుకోవడం అవసరం. మీరు ఆత్మీయంగా సిద్ధమైనట్లయితే, మీరు బోధిస్తున్నప్పుడు ఆత్మ యొక్క నడిపింపును మీరు బాగా వినగలరు మరియు అనుసరించగలరు. మీ బోధనలోకి పరిశుద్ధాత్మను ఆహ్వానించే మార్గము ఏదనగా, ఆయనను మీ జీవితంలోకి ఆహ్వానించడమే. రక్షకుని మాదిరిని అనుసరించుటకు మరియు మీ పూర్ణ హృదయముతో ఆయన సువార్తను జీవించుటకు శ్రద్ధగా కృషి చేయుట ఇందులో కలిపియున్నది. మనలో ఎవ్వరూ దీనిని సంపూర్ణముగా చేయరు గనుక, అనుదినము పశ్చాత్తాపపడడం అని కూడా దీని అర్థం.

ధ్యానించవలసిన ప్రశ్నలు: బోధించుటకు మిమ్మల్ని మీరు ఆత్మీయముగా సిద్ధము చేసుకొనుట అంటే ఏమిటి? ఆత్మీయముగా మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకునే విధానాన్ని మెరుగుపరచుకొనుటకు మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారు? ఆత్మీయ సిద్ధపాటు మీ బోధనలో మార్పు తీసుకురాగలదని మీరెలా అనుకుంటున్నారు?

లేఖనముల నుండి; ఎజ్రా 7:10; లూకా 6:12; ఆల్మా 17:2–3, 9; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:21; 42:13–14

ఇతరుల అవసరాలు తీర్చుటకు రక్షకుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండెను

సమాజమందిరపు అధికారియైన యాయీరు, మరణిస్తున్న తన కుమార్తెకు సహాయం చేయమని యేసు పాదాలపై పడి వేడుకున్నాడు. యేసు మరియు ఆయన శిష్యులు రద్దీగా ఉండే వీధుల గుండా యాయీరు ఇంటి వైపు వెళుతుండగా, యేసు అకస్మాత్తుగా ఆగిపోయెను. “నన్ను ముట్టినది ఎవరు?” అని ఆయన అడిగెను. ఇది విచిత్రమైన ప్రశ్నలా అనిపించింది—జనుల తోపులాటలో, ఆయనను ఎవరు ముట్టకుండా ఉన్నారు? కానీ ఆ జనసమూహంలో ఎవరో ఒక నిర్దిష్ట అవసరంతో మరియు ఆయన అందించే స్వస్థతను పొందాలనే విశ్వాసంతో ఆయనను సంప్రదించినట్లు రక్షకుడు గ్రహించెను. యాయీరు కుమార్తెను సందర్శించడానికి ఇంకా సమయం ఉంటుంది. అయితే ముందుగా ఆయన వస్త్రమును ముట్టుకున్న ఆమెతో ఆయన “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానవై పొమ్ము” అని చెప్పెను (లూకా 8:41–48).

బోధకునిగా, మీరు బోధించుటకు సిద్ధం చేసిన విషయాన్ని పూర్తి చేయుటకు కొన్నిసార్లు మీరు తొందరపడవచ్చు. అది ముఖ్యమైనదే అయినప్పటికీ, మీరు బోధిస్తున్న వారి అత్యవసర అవసరాన్ని మీ తొందరపాటులో అనాలోచితంగా నిర్లక్ష్యము చేయకుండా చూసుకోండి. మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు మీరు కోరిన ఆత్మీయ నడిపింపుతో పాటు, మీరు బోధిస్తున్నప్పుడు కూడా ఆత్మ యొక్క నడిపింపును కోరండి. అభ్యాసకుల అవసరాలు, ప్రశ్నలు మరియు ఆసక్తుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు బోధించిన విషయాన్ని ఒక అభ్యాసకుడు ఎలా స్వీకరిస్తున్నాడు లేదా అర్థం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని గుర్తించడంలో పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయును. మీ ప్రణాళికలను మార్చమని కొన్నిసార్లు ఆయన మిమ్ములను ప్రేరేపించవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక అంశంపై ఉద్దేశించిన దానికంటే ఎక్కువ సమయం వెచ్చించాలని లేదా అభ్యాసకులకు ఇప్పుడు మరింత ముఖ్యమైన దాని కోసం కొంత చర్చను తరువాత జరుపుటకు విడిచిపెట్టాలని మీరు ప్రేరేపించబడవచ్చు.

ధ్యానించవలసిన ప్రశ్నలు: ఒక అభ్యాసకుడిగా మీ అవసరాల గురించి తల్లిదండ్రులు లేదా ఇతర బోధకుడు తెలుసుకున్నారని మీరు ఎప్పుడు భావించారు? పాఠం పూర్తి చేయడం కంటే వారి అభ్యాసంపై మీకు ఎక్కువ ఆసక్తి ఉందని మీరు బోధించే వారికి తెలుసా? ఏవిధంగా మీ ఆసక్తిని మీరు ఉత్తమంగా తెలియజేయగలరు?

లేఖనముల నుండి; 1 పేతురు 3:15; ఆల్మా 32:1–9; 40:1; 41:1; 42:1

పరిశుద్ధాత్మ చేత బోధించబడుటకు రక్షకుడు జనులకు అవకాశాలను కల్పించారు

యేసు కాలంలో నిజంగా ఆయన ఎవరో అర్థం చేసుకొనుట చాలా మందికి కష్టంగా ఉండేది, కానీ అక్కడ చాలా అభిప్రాయాలు ఉన్నాయి. “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని” ఆయన శిష్యులు తెలియజేసారు. అయితే, యేసు తన శిష్యులను ఇతరుల అభిప్రాయాలను ప్రక్కనపెట్టి, వారి హృదయాలలోనికి చూడమని ఆహ్వానించే ఒక ప్రశ్న అడిగారు: “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?” వారు తమ సమాధానాన్ని “నరుల” నుండి కాక నేరుగా “పరలోకమందున్న నా తండ్రి” నుండి కనుగొనాలని ఆయన ఆశించెను. ఈ రకమైన సాక్ష్యం—పరిశుద్ధాత్మ నుండి వచ్చిన వ్యక్తిగత బయల్పాటు—“నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్తయి 16:13–17 చూడండి) అని ప్రకటించుటకు పేతురుకు శక్తినిచ్చెను.

కడవరి దినములలో ఆత్మీయంగా జీవించాలంటే, మీరు బోధించే వ్యక్తులకు సత్యానికి సంబంధించిన ఆత్మీయ సాక్ష్యం అవసరం. మీరు దానిని వారికి ఇవ్వలేరు, కానీ దానిని కోరుటకు వారిని ఆహ్వానించవచ్చు, ప్రోత్సహించవచ్చు, ప్రేరేపించవచ్చు మరియు బోధించవచ్చు. సువార్త నేర్చుకొనుటకు పరిశుద్ధాత్మ ఎంత కీలకమో మీరు మీ మాటలు మరియు చర్యల ద్వారా స్పష్టంగా చెప్పగలరు. ఉదాహరణకు, మీరు సృష్టించే మరియు ప్రోత్సహించే అభ్యాస వాతావరణాన్ని పరిగణించండి. గదిలో కుర్చీల అమరిక లేదా నేర్చుకునే వారిని మీరు పలకరించే మరియు వారితో సంభాషించే విధానం వంటివి అభ్యాసకులు పొందే అనుభవానికి ఆత్మీయ స్వరాన్ని సిద్ధం చేస్తాయి. మీరు బోధించుటకు ఆత్మీయంగా సిద్ధపడినట్లే, నేర్చుకోవడానికి తమను తాము ఆత్మీయంగా సిద్ధం చేసుకోమని మీరు అభ్యాసకులను కూడా ఆహ్వానించవచ్చు. వారు తీసుకొని వచ్చే ఆత్మ కొరకు బాధ్యత వహించమని వారిని అడగండి. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి ఆత్మ సాక్ష్యమిచ్చుటను వారు అనుభూతి చెందుటకు మీరు వారికి అవకాశాలను కలిగించగలరు. ఆ సాక్ష్యము వారికి ఒక “రాయి” అగును, “మరియు పాతాళ లోకద్వారములు [వారి] యెదుట నిలువనేరవు” (మత్తయి 16:18).

ధ్యానించవలసిన ప్రశ్నలు: సువార్తను నేర్చుకునే ఆత్మీయ వాతావరణానికి ఏది దోహదం చేస్తుందని మీరు గమనించారు? దానిని ఏది పక్కదారి పట్టిస్తుంది? మీరు బోధించే వ్యక్తులు ఆత్మ నుండి నేర్చుకొనుటకు ఏది సహాయపడుతుంది? మీరు తరచుగా బోధించే స్థలము గురించి ఆలోచించండి. మీరు అక్కడ ఉన్నప్పుడు ఏవిధంగా భావిస్తారు? అక్కడ ఉండుటకు ఆత్మను మీరు మరింత సమర్థవంతంగా ఎలా ఆహ్వానించగలరు?

లేఖనముల నుండి; లూకా 24:31–32; యోహాను 14:26; 16:13–15; మొరోనై 10:4–5; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:16–17; 50:13–24

చిత్రం
ఒక కుటుంబమునకు బోధిస్తున్న సువార్తికులు

మనం బోధిస్తున్నప్పుడు, సత్యానికి సంబంధించిన వారి స్వంత ఆత్మీయ సాక్ష్యాన్ని వెదకుటకు అభ్యాసకులను ఆహ్వానించవచ్చు.

వ్యక్తిగత బయల్పాటు వెదకుటకు, గుర్తించుటకు మరియు దానిపై పనిచేయుటకు రక్షకుడు ఇతరులకు సహాయం చేసారు.

మనతో మాట్లాడాలని ప్రభువు కోరుతున్నారు మరియు ఆయన మనతో మాట్లాడుతున్నారని మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నారు. 1829లో, ఆలీవర్ కౌడరీ అనే 22 ఏళ్ళ పాఠశాల ఉపాధ్యాయుడు ఎవరైనా వ్యక్తిగత బయల్పాటు పొందగలరు అనే ధైర్యమైన, ఉత్తేజకరమైన సిద్ధాంతం గురించి నేర్చుకొనుచుండెను. కానీ మనలో చాలామంది అడిగే ప్రశ్నలే అతనికి ఉన్నాయి: “ప్రభువు నిజంగా నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారా? ఆయన ఏమి చెప్తున్నారో నేనెలా తెలుసుకోగలను?” ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు, ఆత్మీయ శోధనకు సంబంధించిన ఒక ఏకాంత క్షణం గురించి ఆలోచించమని యేసు క్రీస్తు ఆలీవర్‌ను ఆహ్వానించెను. నీ మనస్సుకు నేను శాంతిని కలుగజేయలేదా?” అని ఆయన అడిగెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:21–24 చూడండి.) తరువాత, ఆత్మ మాట్లాడగల ఇతర మార్గాల గురించి ఆయన ఆలీవర్‌కు బోధించెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3; 9:7–9 చూడండి; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–14 కూడా చూడండి).

ఆత్మీయ విషయాలను చాలా తరచుగా విస్మరించే ప్రపంచంలో జీవిస్తున్న మనందరికీ ఆత్మ యొక్క స్వరాన్ని గుర్తించడంలో సహాయం కావాలి. మనకు తెలియకుండానే ఆత్మను మనం అనుభవించి ఉండవచ్చు. ఆత్మను ఎలా వెదకాలి, ఆయన ప్రభావాన్ని ఎలా గుర్తించాలి మరియు ఆయన మనకు ఇచ్చే ప్రేరేపణలపై ఎలా పనిచేయాలి అనే దాని గురించి మనమందరం మరింత తెలుసుకొనగలము. మీరు బోధిస్తున్నప్పుడు, ఆత్మ సంభాషించగల మార్గాలను మరియు ఆయన వారితో ఎలా మాట్లాడిన విధానాలను కనుగొనుటకు అభ్యాసకులకు సహాయం చేయండి. బోధకునిగా మీరు ఇవ్వగల గొప్ప బహుమతులలో ఒకటి ఏమిటంటే, వ్యక్తిగత బయల్పాటు కొరకు చేసే ఈ జీవితకాల సాధనలో పురోగతిని సాధించుటకు మీరు బోధించే వారికి సహాయం చేయడం.

ధ్యానించవలసిన ప్రశ్నలు: వ్యక్తిగత బయల్పాటు పొందుటను నేర్చుకొనుట ఎందుకు ముఖ్యము? ఏవిధంగా బయల్పాటును వెదకవలెనో, గుర్తించవలెనో మీరు అర్థం చేసుకొనుటకు ఎవరైనా ఎప్పుడైనా మీకు సహాయం చేసియున్నారా? పరిశుద్ధాత్మ నుండి బయల్పాటును వెదకుటకు, గుర్తించుటకు మరియు దానిపై పనిచేయుటకు మీరు బోధించే వారిని మీరెలా ప్రోత్సహించగలరు?

లేఖనముల నుండి; గలతీయులకు 5:22–23; ఆల్మా 5:45–47; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61; 121:33; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8–20

రక్షకుడు తాను బోధించిన వారికి సాక్ష్యము చెప్పెను

బోధించే మరియు పరిచర్య చేసే ఒక సున్నితమైన క్షణంలో యేసు, తన స్నేహితురాలైన మార్త సహోదరుడు మరణించినప్పుడు ఆమెను ఓదార్చుటకు ప్రయత్నించెను. నిత్య సత్యం యొక్క సాధారణ సాక్ష్యాన్ని ఆయన ఆమెతో పంచుకొనెను: “నీ సహోదరుడు మరల లేచును” (యోహాను 11:23). ఆయన సాక్ష్యము తన స్వంత సాక్ష్యాన్ని పంచుకొనుటకు మార్తాను ప్రేరేపించింది: “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను” (యోహాను 11:24). ఈ నమూనా యోహాను 11:25–27లో ఎలా పునరావృతం అవుతుందో గమనించండి. రక్షకుని మాదిరిలో మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? సువార్త సత్యాల యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం బోధనలో ఎందుకంత ముఖ్యమైన భాగమైయున్నది?

మీ సాక్ష్యం మీరు బోధించే వారిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపగలదు. అది అనర్గళంగా లేదా సుదీర్ఘంగా ఉండవలసిన అవసరం లేదు. మరియు “నేను నా సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను” అని దానిని ప్రారంభించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కేవలం మీకు తెలిసిన వాటిని పంచుకోండి. సత్యము యొక్క సాక్ష్యము నేరుగా, హృదయపూర్వకంగా ఉన్నప్పుడు మిక్కిలి శక్తివంతంగా ఉంటుంది. రక్షకుడు, ఆయన సువార్త మరియు మీ జీవితంలో ఆయన శక్తి గురించి తరచుగా సాక్ష్యమివ్వండి మరియు మీరు బోధించే వారిని కూడా అలా చేయమని ప్రోత్సహించండి. కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన సాక్ష్యము బోధకుడి చేత కాకుండా తోటి అభ్యాసకుల చేత చెప్పబడుతుందని గుర్తుంచుకోండి.

ధ్యానించవలసిన ప్రశ్నలు: సాక్ష్యమిచ్చే వ్యక్తి యొక్క శక్తివంతమైన ప్రభావాన్ని వివరించే ఉదాహరణల కొరకు లేఖనాలలో చూడండి. ఆ ఉదాహరణల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఒకరి సాక్ష్యం ద్వారా మీరు ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు? మీ సాక్ష్యాన్ని పంచుకొనుట మీరు బోధించే వారిని ఎలా ప్రభావితం చేసింది? అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది?

లేఖనముల నుండి; అపొస్తలుల కార్యములు 2:32–38; మోషైయ 5:1–3; ఆల్మా 5:45–48; 18:24–42; 22:12–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 46:13–14; 62:3

మీరు నేర్చుకొనుచున్న దానిని అన్వయించుకొనుటకు కొన్ని మార్గాలు

  • వారు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారికి బోధించిన వాటిని పంచుకోమని అభ్యాసకులను అడగండి.

  • బోధించేటప్పుడు ఆత్మీయ ప్రేరేపణలను పొందుటకు ముందుగానే సిద్ధపడండి.

  • మీరు సిద్ధపడుతున్నప్పుడు వచ్చే ఆత్మీయ మనోభావాలను వ్రాయండి.

  • ఆత్మ వారికి బోధించేదానిని నిశ్శబ్దంగా ధ్యానించుటకు తరగతి సభ్యులకు అప్పుడప్పుడు అవకాశాలు కల్పించండి.

  • ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించడానికి పవిత్రమైన సంగీతం మరియు చిత్రాలను ఉపయోగించండి.

  • మీరు ప్రణాళిక చేస్తున్నప్పుడు మరియు బోధిస్తున్నప్పుడు ప్రేరణలను వినండి మరియు మీ ప్రణాళికలను సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉండండి.

  • తాము నేర్చుకుంటున్న వాటి గురించి సాక్ష్యం చెప్పుటకు అభ్యాసకులందరికీ అవకాశాలను కల్పించండి.

  • ఆత్మ అక్కడ ఉన్నప్పుడు గుర్తించడంలో ఇతరులకు సహాయం చేయండి.

  • మీరు బోధిస్తున్న సత్యాలను బట్టి జీవించండి, తద్వారా మీరు వాటి గురించి సాక్ష్యమివ్వగలరు.

  • ఆకస్మిక, అనధికారిక క్షణాలలో బోధించుటకు ప్రేరేపణలను అనుసరించండి.

ముద్రించు