సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
సిద్ధాంతాన్ని బోధించండి


“సిద్ధాంతాన్ని బోధించండి,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“సిద్ధాంతాన్ని బోధించండి,” రక్షకుని విధానములో బోధించుట

12 సంవత్సరాల వయస్సులో దేవాలయంలో బోధిస్తున్న యేసు క్రీస్తు

దేవాలయంలో క్రీస్తు, హీన్రిచ్ హాఫ్‌మన్ చేత

సిద్ధాంతాన్ని బోధించండి

యేసు తన జీవితమంతా తెలివి మరియు జ్ఞానమందు పెరిగినప్పటికీ, ఆయన తన కాలంలోని ఇతర మత నాయకుల వలె అధికారికంగా విద్యనభ్యసించలేదు. అయినప్పటికీ ఆయన బోధించినప్పుడు, “చదువుకోని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెను” అని జనులు ఆశ్చర్యపోయారు. ఆయన బోధనలు ఎందుకు అంత శక్తివంతంగా ఉన్నాయి? “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని రక్షకుడు వివరించెను (యోహాను 7:15–16). సిద్ధాంతమనేది నిత్య సత్యం—లేఖనాలలో మరియు కడవరి దిన ప్రవక్తల మాటలలో కనుగొనబడుతుంది—అది మన పరలోకంలో ఉన్న మన తండ్రిలా మారుటకు మరియు ఆయన యొద్దకు తిరిగి వెళ్ళుటకు మార్గాన్ని చూపుతుంది. బోధకునిగా మీరు ఎంత అనుభవజ్ఞులైనప్పటికీ, తండ్రి సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా రక్షకుని వలె మీరు శక్తితో బోధించగలరు. మీ బోధన మరియు అభ్యాసం ఆయన వాక్యంపై ఆధారపడినప్పుడు దేవుడు పంపే ఆశీర్వాదాలను చూసి మీరు మరియు మీరు బోధించే వారు ఆశ్చర్యపోతారు.

సిద్ధాంతాన్ని బోధించుటకు

  • మీ అంతట మీరు యేసు క్రీస్తు సిద్ధాంతాన్ని తెలుసుకోండి.

  • లేఖనాల నుండి మరియు కడవరి దిన ప్రవక్తల మాటల నుండి బోధించండి.

  • లేఖనాలలోని సత్యాలను వెదకుటకు, గుర్తించుటకు మరియు అర్థం చేసుకొనుటకు అభ్యాసకులకు సహాయం చేయండి.

  • పరివర్తనకు దారితీసే సత్యాలపై దృష్టి పెట్టండి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోండి.

  • యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతంలో వ్యక్తిగత ఔచిత్యాన్ని కనుగొనుటకు అభ్యాసకులకు సహాయపడండి.

రక్షకుడు సిద్ధాంతాన్ని నేర్చుకొనెను

రక్షకుడు తన యవ్వనములో “జ్ఞానమందును … దేవుని దయయందును” వర్థిల్లుచున్నప్పుడు లేఖనముల నుండి నేర్చుకున్నట్లు స్పష్టంగా కనిపించుచున్నది (లూకా 2:52). యూదుల బోధకులకు బోధిస్తూ, వారి ప్రశ్నలకు జవాబిస్తున్న ఆయనను ఆ చిన్న వయస్సులో దేవాలయం వద్ద ఆయన తల్లిదండ్రులు కనుగొనినప్పుడు, తండ్రి సిద్ధాంతము గురించి ఆయన లోతైన గ్రహింపు స్పష్టంగా కనిపించింది (జోసెఫ్ స్మిత్ అనువాదము, లూకా 2:46 [లూకా 2:46, పాదవివరణ లో] చూడండి). తరువాత, సాతాను ఆయనను అరణ్యంలో తీవ్రమైన శోధనకు గురిచేసినప్పుడు, లేఖనాలలోని సిద్ధాంతం గురించి యేసు కలిగియున్న జ్ఞానం ఆ శోధనను ఎదిరించడానికి ఆయనకు సహాయపడింది (లూకా 4:3–12 చూడండి).

మీరు కూడా నిజమైన సిద్ధాంతాన్ని బోధించే ముందు దానిని మరింత లోతుగా నేర్చుకొనుటకు ప్రయత్నించవచ్చు. మీరు బోధించుటకు మరియు ఇతరులతో కలిసి నేర్చుకొనుటకు సిద్ధమవుతున్నప్పుడు, మీరు బోధిస్తున్న సత్యములను గూర్చి ప్రభువు చెప్పిన వాటి కొరకు జాగ్రత్తగా చూడండి. వివరణ మరియు సలహా కొరకు లేఖనాలు మరియు సజీవ ప్రవక్తల మాటలను శోధించండి. మీరు అధ్యయనం చేసే సత్యాలను జీవించడం మరియు అన్వయించడం మీకు సిద్ధాంతాన్ని మరింత లోతైన మార్గాలలో బోధించడానికి మరియు మీరు బోధించే వారి హృదయాలలో సిద్ధాంతం యొక్క సత్యాన్ని నిర్ధారించడానికి ఆత్మను ఆహ్వానిస్తుంది.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీకై మీరు సువార్త సత్యాలను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం? మీరు సువార్త సత్యాల గురించి లోతైన అవగాహనను ఏవిధముగా పొందారు? లేఖనములు మరియు సజీవ ప్రవక్తల మాటల గురించి మీ అధ్యయనమును మెరుగుపరచుకొనుటకు మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారు?

లేఖనముల నుండి; సామెతలు 7:1–3; 2 నీఫై 4:15–16; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:21; 88:118

రక్షకుడు లేఖనముల నుండి బోధించెను

రక్షకుని మరణం తరువాత, ఆయన శిష్యులలో ఇద్దరు తమ హృదయాలలో విచారం మరియు ఆశ్చర్యం కలగలిసి మాట్లాడుతూ నడుస్తూ ఉన్నారు. అంతకుముందు జరిగిన దానిని వారు ఎలా అర్థం చేసుకోగలరు? తమ విమోచకునిగా వారు విశ్వసించిన నజరేయుడైన యేసు చనిపోయి అప్పటికి మూడు రోజులైంది. తరువాత ఆయన సమాధి ఖాళీగా ఉందని, ఆయన సజీవంగా ఉన్నారని దేవదూతలు ప్రకటించారనే నివేదికలు ఉన్నాయి. ఈ శిష్యుల విశ్వాసం యొక్క ఈ కీలకమైన సమయంలో, ఒక అపరిచితుడు వారి ప్రయాణంలో చేరెను. “లేఖనములన్నిటిలో [రక్షకుని] గూర్చిన వచనముల భావము వారికి తెలుపుట” ద్వారా ఆయన వారిని ఓదార్చెను. చివరికి, ఆ ప్రయాణీకులు తమ బోధకుడు యేసు క్రీస్తే అని మరియు ఆయన నిజంగా లేచెనని గ్రహించారు. వారు ఆయనను ఎలా గుర్తుపట్టారు? “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” అని వారు పర్యాలోచించారు. (లూకా 24:27, 32).

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ ఇలా బోధించారు, “అన్ని లేఖనాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం తండ్రి అయిన దేవునిపై మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుపై విశ్వాసంతో మన ఆత్మలను నింపడమే” (“The Blessing of Scripture,” Liahona, May 2010, 34). యేసు తన పరిచర్య అంతటా, ఇతరులకు బోధించుటకు, సరిదిద్దుటకు మరియు ప్రేరేపించుటకు లేఖనాలను ఉపయోగించారు. మీ బోధనలు లేఖనాలు మరియు ప్రవక్తల మాటలకు దూరంగా ఉండకుండా చూసుకోండి. మీ బోధనలో దేవుని వాక్యంపై మీరు నమ్మకంగా ఆధారపడినప్పుడు, రక్షకుడు చేసిన దానినే మీరు ఇతరులకు చేయగలరు. ఆయనను తెలుసుకునేలా మీరు వారికి సహాయం చేయగలరు, ఎందుకంటే మనందరికీ రక్షకునిపై మన విశ్వాసం క్రమంగా బలపడడం అవసరం. లేఖనాల పట్ల మీకున్న ప్రేమ మీరు బోధించే వారికి స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి మరియు కుమారుని యొక్క సాక్ష్యముతో వారి హృదయాలను మండేలా చేయుటకు మీ బోధన ఆత్మను ఆహ్వానిస్తుంది.

ధ్యానించవలసిన ప్రశ్నలు: రక్షకుని గురించి బాగుగా తెలుసుకొనుటలో మీకు సహాయం చేయుటకు లేఖనాలను ఉపయోగించిన బోధకుని చేత మీరు ఎలా ప్రభావితమయ్యారు? మీరు బోధిస్తున్నప్పుడు లేఖనాలు మరియు ప్రవక్తల మాటలపై ఎక్కువగా ఆధారపడేందుకు మీరు ఏమి చేయవచ్చు? మీరు బోధించే వారు దేవుని వాక్యాన్ని తెలుసుకునేలా మరియు ప్రేమించేలా మీరెలా సహాయపడగలరు?

లేఖనముల నుండి; లూకా 4:14–21; ఆల్మా 31:5; హీలమన్ 3:29–30;3 నీఫై 23

సత్యాన్ని వెదకుటకు, గుర్తించుటకు మరియు అర్థం చేసుకొనుటకు రక్షకుడు జనులకు సహాయం చేసెను.

ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు, “బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?” అని అడిగెను. ప్రతిస్పందనగా, రక్షకుడు ప్రశ్నించేవానిని లేఖనాల వైపు నడిపించెను: ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావు?” ఇది ఆ మనుష్యుడిని “నీ దేవుడైన ప్రభువును … మరియు నీ పొరుగువాని ప్రేమింపవలెను” అనే అతడి సమాధానానికి దారితీయడమే కాక, “నా పొరుగువాడెవడు?” అనే తదుపరి ప్రశ్నకు కూడా దారితీసింది. అవసరతలో ఉన్న తోటి ప్రయాణికుడిని చూసిన ముగ్గురు వ్యక్తుల గురించిన ఒక ఉపమానంతో రక్షకుడు ఈ ప్రశ్నకు సమాధానమిచ్చెను. ఆ ముగ్గురిలో ఒకడైన సమరయుడు-అతడు వచ్చిన ప్రదేశమును బట్టి యూదులచేత ద్వేషింపబడినవాడు-మాత్రమే సహాయం చేయుటకు ఆగెను. తరువాత యేసు అతడి స్వంత ప్రశ్నకు జవాబిచ్చుటకు ధర్మశాస్త్రోపదేశకుడిని ఆహ్వానించెను: “ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది?” (లూకా 10:25–37 చూడండి).

ఈ విధంగా, అనగా వెదకుటకు, ధ్యానించుటకు మరియు కనుగొనుటకు ఆహ్వానించుటతో ప్రశ్నలకు ప్రతిస్పందించడం ద్వారారక్షకుడు ఎందుకు బోధించారని మీరనుకొనుచున్నారు? సమాధానంలో భాగమేమిటంటే, సత్యాన్వేషణ కొరకు చేసే ప్రయత్నానికి ప్రభువు విలువిస్తారు. “వెదకుడి, మీకు దొరకును” అని ఆయన పదే పదే ఆహ్వానించెను (ఉదాహరణకు, మత్తయి 7:7; లూకా 11:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 4:7 చూడండి). వెదకువాని విశ్వాసపు మరియు సహనపు చర్యలకు ఆయన ప్రతిఫలమిస్తారు.

రక్షకుని వలె, సత్యాన్ని గుర్తించి, అర్థం చేసుకొనుటకు మీరు బోధించే వారికి మీరు సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, లేఖనాలు సువార్త సత్యాలతో నిండి ఉన్నాయి, కానీ కొన్నిసార్లు వాటిని కనుగొనడానికి జాగ్రత్తగా ప్రయత్నించడం అవసరం. మీరు లేఖనాల నుండి కలిసి నేర్చుకుంటున్నప్పుడు, ఆగి, మీరు బోధించే వారిని వారు గమనించిన సువార్త సత్యాల గురించి అడగండి. ఈ సత్యాలు పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళికతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడడానికి వారికి సహాయపడండి. కొన్నిసార్లు నిత్య సత్యాలు లేఖనాలలో పేర్కొనబడ్డాయి, కొన్నిసార్లు అవి మనం చదివే వ్యక్తుల కథలు మరియు జీవితాలలో వివరించబడ్డాయి. మీరు చదువుతున్న వచనాల యొక్క చారిత్రక నేపథ్యాన్ని, అలాగే వచనాల యొక్క అర్థాన్ని మరియు అవి ఈ రోజు మనకు ఎలా వర్తిస్తాయి అనే విషయాన్ని కలిసి అన్వేషించడం కూడా సహాయకరంగా ఉండగలదు.

ధ్యానించవలసిన ప్రశ్నలు: లేఖనాలలో లేదా ప్రవక్తల మాటలలో నిత్య సత్యాలను మీరు ఎలా గుర్తిస్తారు? ఆ సత్యాలు మీ జీవితాన్ని ఎలా దీవిస్తున్నాయి? వారికి అర్థవంతమైన సత్యాలను అభ్యాసకులు గుర్తించి, అర్థం చేసుకోవడానికి మరియు వారిని దేవునికి దగ్గరగా తీసుకురావడానికి మీరు సహాయపడగలకొన్ని మార్గాలేవి?

లేఖనముల నుండి; యోహాను 5:39; 1 నీఫై 15:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:12

అధ్యయనం చేస్తున్న విద్యార్థులు

మనం బోధించే వారు సత్యాన్ని కనుగొనడంలో మరియు గుర్తించడంలో మనం వారికి సహాయం చేయగలము.

పరివర్తనకు దారితీసే మరియు విశ్వాసాన్ని పెంపొందించే సత్యాలను రక్షకుడు బోధించెను

ఒక విశ్రాంతిదినమున, ఆకలితో ఉన్న రక్షకుడు మరియు ఆయన శిష్యులు ఒక పొలాన్ని దాటి వెళ్ళుచూ వెన్నులు తినడం ప్రారంభించారు. మోషే ధర్మశాస్త్రంలోని చక్కని అంశాలను నొక్కిచెప్పడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉన్న పరిసయ్యులు, వెన్నులు త్రుంచడం అనేది సాంకేతికంగా ఒక రకమైన పని అని, అది విశ్రాంతిదినమున నిషేధించబడిందని సూచించారు (మార్కు 2:23–24 చూడండి). మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన జేకబ్ యొక్క పదబంధాన్ని ఉపయోగించాలంటే, పరిసయ్యులు “గురిని దాటి చూచుచున్నారు” (జేకబ్ 4:14). మరో మాటలో చెప్పాలంటే, వారు ఆజ్ఞల యొక్క సాంప్రదాయిక వివరణలపై ఎంతగా దృష్టి సారించారంటే, వారు ఆ ఆజ్ఞల యొక్క దైవిక ఉద్దేశ్యమైన మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురావడంలో విఫలమయ్యారు. నిజానికి, విశ్రాంతిదినమును గౌరవించమని ఆజ్ఞ ఇచ్చిన వ్యక్తి తమ ముందు నిలబడి ఉన్నాడని కూడా పరిసయ్యులు గ్రహించలేదు.

రక్షకుడు తన దైవిక గుర్తింపు గురించి సాక్ష్యమివ్వడానికి మరియు విశ్రాంతిదినము ఎందుకు ముఖ్యమైనదో బోధించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనెను. విశ్రాంతిదినమునకు ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధించే దినముగా అది మన కోసం సృష్టించబడింది (మార్కు 2:27–28 చూడండి). దేవుని ఆజ్ఞలు కేవలం మన బాహ్య ప్రవర్తన గురించి మాత్రమే కాదని అర్థం చేసుకోవడానికి అలాంటి సత్యాలు సహాయం చేస్తాయి. అవి మన హృదయాలను మార్చుకోవడానికి మరియు మరింత సంపూర్ణంగా పరివర్తన చెందుటలో సహాయం చేయడానికి ఉద్దేశించబడ్డాయి.

మీరు దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న సిద్ధాంతం మరియు సూత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. చర్చించగలిగిన సత్యాలు లేఖనాలలో అనేకమున్నప్పటికీ, పరివర్తనకు దారితీసేవి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించే సువార్త సత్యాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. రక్షకుడు బోధించిన మరియు ఉదహరించిన సరళమైన, ప్రాథమిక సత్యాలు—ఆయన ప్రాయశ్చిత్తం, రక్షణ ప్రణాళిక, దేవుడిని ప్రేమించాలి మరియు మన పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞలు మొదలైన వాటి గురించిన సత్యాలు మన జీవితాలను మార్చడానికి గొప్ప శక్తిని కలిగి ఉన్నాయి. అవి మీరు బోధించే వారి హృదయాలలోనికి వెళ్ళడానికి సహాయం చేస్తూ, ఈ సత్యాల గురించి సాక్ష్యమివ్వడానికి ఆత్మను ఆహ్వానించండి.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీరు యేసు క్రీస్తుకు మరింతగా పరివర్తన చెందడానికి మరియు ఆయనపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉండడానికి మీకు సహాయపడిన కొన్ని సువార్త సత్యాలేవి? సువార్త యొక్క అత్యంత ముఖ్యమైన సత్యాలపై దృష్టి పెట్టడానికి ఒక బోధకుడు మీకు ఎలా సహాయం చేసాడు? ఇతరులు యేసు క్రీస్తుకు మరింత లోతుగా పరివర్తన చెందడానికి సహాయం చేసే వేటిని మీరు బోధించగలరు?

లేఖనముల నుండి; 2 నీఫై 25:26; 3 నీఫై 11:34–41; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:31–32; 68:25–28; 133:57; మోషే 6:57–62

తన సిద్ధాంతములో వ్యక్తిగత సంబంధమును వెదకుటకు రక్షకుడు జనులకు సహాయపడెను

“ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనముచేయుచున్నాడు,” అని పరిసయ్యులు యేసును గూర్చి ఫిర్యాదు చేసారు—ఇది ఒక ఆధ్యాత్మిక బోధకుడికి తగిన ప్రవర్తన కాదని సూచించారు (లూకా 15:2). వారికి కొన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి ఇది ఒక అవకాశంగా యేసు చూసారు. ఆయన దానిని ఏవిధముగా చేయును? అపరిశుద్ధమైనవి మరియు స్వస్థత అవసరమైనవి పరిసయ్యుల హృదయాలే కాని ఆయన హృదయము కాదని వారు చూడడానికి ఆయన ఎలా సహాయం చేస్తారు? వారి ఆలోచన మరియు ప్రవర్తన మారాలని వారికి చూపించడానికి ఆయన తన సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగిస్తారు?

మందలో నుండి తప్పిపోయిన గొఱ్ఱె గురించి మరియు తప్పిపోయిన నాణెం గురించి వారితో మాట్లాడటం ద్వారా ఆయన దీనిని చేస్తారు. క్షమాపణ కోరిన తిరుగుబాటుదారుడైన కుమారుడి గురించి మరియు అతడిని స్వీకరించడానికి లేదా అతనితో తినడానికి నిరాకరించిన సోదరుడి గురించి ఆయన మాట్లాడెను. ఈ ఉపమానాలలో ప్రతీఒక్కటి ఇతరులను పరిసయ్యులు ఎలా చూసారో అనేదానికి సంబంధించిన సత్యాలను కలిగియుంది మరియు ప్రతీ ఆత్మకు గొప్ప విలువ ఉందని వారికి బోధించింది (లూకా 15 చూడండి). రక్షకుడు తన ఉపమానాలలో ఎవరిని గుర్తించాలో అని పరిసయ్యులకు లేదా మనలో ఎవరికీ చెప్పలేదు. కొన్నిసార్లు మనము ఆత్రుతగా ఉన్న ఆ తండ్రియైయున్నాము. కొన్నిసార్లు మనము అసూయపడే ఆ సహోదరుడైయున్నాము. తరచుగా మనం తప్పిపోయిన గొఱ్ఱె లేదా మూర్ఖపు కొడుకైయున్నాము. కానీ మన పరిస్థితులు ఏవైనప్పటికీ, తన ఉపమానాల ద్వారా రక్షకుడు తన బోధనలలో సంబంధాన్ని కనుగొనమని మనలను ఆహ్వానిస్తున్నారు—అదేమనగా మనం ఏమి నేర్చుకోవాలని ఆయన కోరుచున్నారో మరియు మన స్వంత ఆలోచనలో, ప్రవర్తనలో మనం ఏమి మార్చుకోవాలని కోరుచున్నారో కనుగొనుట.

కొంతమంది అభ్యాసకులు తమకు కొన్ని సత్యాలు ఎందుకు ముఖ్యమైనవో చూడకపోవడాన్ని మీరు గమనించవచ్చు. మీరు బోధించేవారి అవసరాలను పరిగణిస్తున్నప్పుడు, లేఖనాలలోని సత్యాలు వారి పరిస్థితులలో ఎలా అర్థవంతంగా మరియు ఉపయోగకరంగా ఉండగలవో ఆలోచించండి. అభ్యాసకులు వారు కనుగొంటున్న సత్యాలకు సంబంధాన్ని చూడడానికి మీరు సహాయపడే ఒక మార్గం ఏమిటంటే, “మీరు ఇప్పుడు అనుభవిస్తున్న దానిలో ఇది మీకు ఎలా సహాయపడుతుంది?” వంటి ప్రశ్నలను అడగడం. “దీనిని తెలుసుకోవడం మీకు ఎందుకు ముఖ్యమైనది?” “ఇది మీ జీవితంలో ఎలాంటి మార్పును కలిగించగలదు?” మీరు బోధించే వారి మాట ఆలకించండి. ప్రశ్నలు అడగడానికి వారిని అనుమతించండి. రక్షకుని బోధనలు మరియు వారి స్వంత జీవితాల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి వారిని ప్రోత్సహించండి. మీరు బోధిస్తున్న దానిలో మీ స్వంత జీవితానికి ఎలా సంబంధాన్ని కనుగొన్నారో కూడా మీరు పంచుకోవచ్చు. ఇలా చేయడం, వారి జీవితాలలో సిద్ధాంతం ఎలా మార్పు తీసుకురాగలదని వ్యక్తిగతంగా అభ్యాసకులకు బోధించడానికి ఆత్మను ఆహ్వానించగలదు.

ధ్యానించవలసిన ప్రశ్నలు: సువార్త సత్యాలను మీకు అర్థవంతంగా మరియు ఉపయోగకరంగా చేసేదేది? మీరు సువార్తను అధ్యయనం చేస్తున్నప్పుడు వ్యక్తిగత సంబంధాన్ని కనుగొనడంలో మీకు ఏది సహాయపడుతుంది? మీరు బోధించే వారికి సంబంధించిన సత్యాలపై దృష్టి పెట్టడానికి మీరేమి చేస్తున్నారు?

లేఖనముల నుండి; నీఫై 19:23; 2 నీఫై 32:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 43:7–9

మీరు నేర్చుకొనుచున్న దానిని అన్వయించుకొనుటకు కొన్ని మార్గాలు

  • మీరు నిజమైన సిద్ధాంతాన్ని బోధిస్తున్నారని నిర్ధారించుకోవడానికి మీరు ఏమి బోధిస్తున్నారో పరిశీలించండి. ఈ ప్రశ్నలు సహాయపడగలవు:

    • నేను బోధించాలనుకుంటున్నది లేఖనాలు మరియు కడవరి దిన ప్రవక్తల మాటలపై ఆధారపడి ఉన్నదా?

    • అనేకమంది ప్రవక్తలు దీనిని బోధించారా? ప్రస్తుత సంఘ నాయకులు దీని గురించి ఏమి బోధిస్తున్నారు?

    • ఇతరులు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, పశ్చాత్తాపపడి, నిబంధన మార్గంలో పురోగతి సాధించడానికి ఇది ఎలా సహాయం చేస్తుంది?

    • ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు అనుగుణంగా ఉందా లేదా నేను దీని గురించి ఆధ్యాత్మికంగా అస్థిరంగా భావిస్తున్నానా?

  • మీకై మీరు నిజమైన సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి.

  • మీరు బోధిస్తున్నప్పుడు లేఖనాలను మరియు ఆధునిక ప్రవక్తల మాటలను చదవమని అభ్యాసకులను అడగండి.

  • అభ్యాసకులు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు పాదవివరణలు, లేఖన దీపిక మరియు ఇతర వనరులను ఎలా ఉపయోగించాలో వారికి నేర్పించండి.

  • ఒక లేఖన భాగం లేదా కథనంలో సత్యాలను కనుగొనడానికి అభ్యాసకులను ఆహ్వానించండి.

  • ఒక సిద్ధాంతం నిజమని మీరెలా తెలుసుకున్నారో సాక్ష్యం చెప్పండి.

  • అభ్యాసకులు సువార్త సత్యాల గురించి లోతైన అవగాహన పొందడంలో సహాయపడడానికి కథలు లేదా రూపకాలను ఉపయోగించండి.