2024 రండి, నన్ను అనుసరించండి
జూలై 29–ఆగష్టు 4: “దేవుని వైపు చూచి జీవించుము.” ఆల్మా 36–38


“జూలై 29–ఆగష్టు 4: ‘దేవుని వైపు చూచి జీవించుము.’ ఆల్మా 36-38,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“జూలై 29–ఆగష్టు 4. ఆల్మా 36-38,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

చిత్రం
ప్రార్థిస్తున్న స్త్రీ

Woman [స్త్రీ], జెన్ టోల్మన్ చేత, నకలు చేయబడదు

జూలై 29–ఆగష్టు 4: “దేవుని వైపు చూచి జీవించుము”

ఆల్మా 36–38

ఆల్మా తన చుట్టూ ఉన్న దుర్మార్గమును చూసినప్పుడు, అతడు లోతైన “బాధ,” “శ్రమ” మరియు “మనోవేదనను” (ఆల్మా 8:14) అనువించాడు. “ఈ జనుల మధ్య అట్టి దుష్టత్వము నా ఆత్మను బాధపెట్టును” అని (ఆల్మా 31:30) జోరమీయులను గూర్చి అతడు చెప్పాడు. జోరమీయులకు అతని సువార్త సేవ నుండి తిరిగివచ్చిన తరువాత అతడు అదేవిధముగా భావించాడు—నీఫైయులలో అనేకమంది “జనుల హృదయములు కఠినమగుచున్నవని, వాక్యము యొక్క ఖచ్చితత్వమును బట్టి వారు నొచ్చుకొనుట మొదలుపెట్టిరని” అతడు గమనించాడు మరియు ఇది అతడు “హృదయమందు మిక్కిలి దుఃఖించేలా” చేసింది (ఆల్మా 35:15). తాను చూసిన మరియు భావించిన దాని గురించి ఆల్మా ఏమి చేసాడు? అతడు కేవలము నిరాశ చెందలేదు లేదా లోక స్థితి గురించి ద్వేషించలేదు. బదులుగా, “అతడు తన కుమారులు సమావేశమగునట్లు చేసి,” వారికి “నీతికి సంబంధించిన సంగతులను గూర్చి” (ఆల్మా 35:16) బోధించాడు. “మనుష్యుడు రక్షింపబడగల మరే ఇతర మార్గము లేదా సాధనము లేదని, కేవలము క్రీస్తునందు మరియు ద్వారానే” అని, … ఆయనే సత్యము మరియు నీతి వాక్యమైయున్నాడు” అని (ఆల్మా 38:9) అతడు వారికి బోధించాడు.

గృహములో మరియు సంఘములో బోధించడానికి ఉపాయములు

ఆల్మా 36; 38:5–6

నేను దేవుని వలన జన్మించగలను.

ఆల్మా యొక్క పరివర్తన వలె మనలో కొందరు నాటకీయమైన అనుభవాలు కలిగియుంటారు. కానీ సాధారణంగా అది క్రమంగా సంభవించినప్పటికీ, ప్రతీఒక్కరు తప్పకుండా “దేవుని వలన జన్మించాలి” (ఆల్మా 36:2338:6). మీరు ఆల్మా 36 చదివినప్పుడు, దేవుని వలన జన్మించుట అనగా అర్థమేమిటో ఆలోచించండి. ఉదాహరణకు, దేవుని వలన జన్మించు ప్రక్రియలో మీరు పాపము గురించి, యేసు క్రీస్తు గురించి ఎలా భావిస్తారు? దేవుని వలన జన్మించుట మీ స్వంత తప్పిదాలకు ప్రతిస్పందనగా మీరు చేసేదానిని ఎలా ప్రభావితం చేస్తుంది? మీ నమ్మకాలు మరియు క్రియలందు ఏ ఇతర మార్పులు సంభవిస్తాయి? మీరు ఈ మార్పులను ఎలా అనుభవిస్తున్నారో ధ్యానించండి.

మోషైయ 5:7; 27:25–26; ఆల్మా 5:14; 22:15; హీలమన్ 3:35 కూడా చూడండి.

ఆల్మా 36:12-24; 38:8-9

యేసు క్రీస్తు దుఃఖమును ఆనందంతో భర్తీచేస్తారు.

పశ్చాత్తాపాన్ని పాపము కొరకైన బాధాకరమైన శిక్షగా చూస్తూ, కొన్నిసార్లు జనులు పశ్చాత్తాపపడడానికి భయపడతారు. దాని గురించి ఆల్మా ఏమి చెప్తున్నాడని మీరనుకుంటున్నారు? దానిని కనుగొనడానికి మీరు, ఆల్మా పశ్చాత్తాపపడడానికి ముందు అతని జీవితం ఎలా ఉంది (ఆల్మా 36:6–17 చూడండి) అనే దానిని అతడు పశ్చాత్తాపపడిన తర్వాత అతడు తననుతాను వర్ణించుకున్న దానితో (18–27 వచనాలు చూడండి) పోల్చవచ్చు. ఆల్మా 36:17–18 ప్రకారం, ఆల్మా ఈ క్షమాపణను ఎలా పొందాడు?

మాథ్యూ ఎస్. హాలండ్, “కుమారుని యొక్క మిక్కిలి శ్రేష్టమైన వరము,” లియహోనా, నవ. 2020, 45–47 కూడా చూడండి.

ఆల్మా 37

“ఒక తెలివైన ఉద్దేశము నిమిత్తము” లేఖనాలు కాపాడబడ్డాయి.

నేడు లేఖనాలను కలిగియుండడం ఎటువంటి అద్భుతము మరియు దీవెనయో పరిగణించండి. మీరు ఆల్మా 37 చదివినప్పుడు, లేఖనాలు కలిగియుండుట వలన వచ్చే దీవెనల కొరకు చూడండి (ఉదాహరణకు, 7–10, 18–19, 44–45 వచనాలు చూడండి).

ఆల్మా 37:38–47 లో, ఆల్మా “క్రీస్తు యొక్క మాటను” లియహోనాతో పోల్చాడు. ఈ పోలికను మీరు ధ్యానించినప్పుడు, “దినదినము” (ఆల్మా 37:40 ) క్రీస్తు యొక్క బోధనల అద్భుతమును మరియు శక్తిని మీరు అనుభవించిన విధానముల గురించి ఆలోచించండి.

చిత్రం
లేఖనాలను చదువుతున్న స్త్రీ

దేవుడిని ఎలా అనుసరించాలో లేఖనాలు మనకు బోధిస్తాయి.

ఆల్మా 37:1-14

చిత్రం
seminary icon
“చిన్న మరియు సాధారణమైన విషయముల ద్వారా గొప్ప క్రియలు జరిగించబడును.”

కొన్నిసార్లు మన సమస్యలు చాలా పెద్దవి మరియు జటిలమైనవని, పరిష్కారములు కూడా పెద్దవి మరియు జటిలమైనవిగా ఉండాలని మనము భావించవచ్చు. కానీ ఎల్లప్పుడు అదే ప్రభువు యొక్క విధానం కాదు. మీరు ఆల్మా 37:1–14 చదువుతున్నప్పుడు, ఆయన తన కార్యమును ఎలా చేస్తారనే దాని గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుందో ఆలోచించండి. అప్పుడు మీరు మీ జీవితంలో ఈ సూత్రము పనిచేసిన విధానములను ధ్యానించి, నమోదు చేయగలరు.

ఈ సూత్రాన్ని మీరు ఎవరికైనా బోధిస్తున్నట్లయితే, దానిని వివరించడానికి ప్రకృతి నుండి లేదా అనుదిన జీవితం నుండి ఏ మాదిరులను మీరు ఉపయోగిస్తారు? కొన్నింటిని మీరు అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గారి సందేశము, చిన్న మరియు సాధారణమైన వస్తువులు” (లియహోనా, మే 2018, 89–92) లో కనుగొనగలరు.

మిమ్మల్ని పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు దగ్గరగా తెచ్చే కొన్ని చిన్న మరియు సాధారణమైన విషయాలేవి?

తరచు మన “చిన్న మరియు సాధారణమైన” ఎంపికలు మన జీవితాల్లో గొప్ప వైవిధ్యాలను తెస్తాయి. మిమ్మల్ని మీరు ఇటువంటి ప్రశ్నలు అడగండి: దీని గురించి నా ఎంపికలు నన్ను మరియు నా చుట్టూ ఉన్న జనులను ఎలా ప్రభావితం చేస్తాయి? గొప్ప శాంతి మరియు సంతోషానికి దారితీసేలా నేను చేయగల చిన్న మరియు సాధారణమైన మార్పులేవి?

మైఖేల్ ఎ. డన్, “ఒక శాతం మెరుగైనది,” లియహోనా, నవ. 2021, 106–8 కూడా చూడండి.

చిన్న మరియు సాధారణమైన విషయాలు ఉపయోగించండి. జీవితంలోని అనేక ఇతర విషయాల వలె, సువార్త బోధన మరియు అభ్యాసము చిన్న మరియు సాధారణమైన సాధనాల ద్వారా చేయబడగలవు. ఉదాహరణకు, చిన్న మరియు సాధారణమైన విషయాల శక్తిని బోధించడానికి చిటికెడు ఉప్పు లేదా ఈస్ట్ ఎలా ఉపయోగించబడగలదు? (మత్తయి 5:13; 13:33 చూడండి).

ఆల్మా 37:35-37

“ప్రభువుతో ఆలోచన చేయండి.”

ఆల్మా 37:35–37 లో, తన కుమారుడైన హీలమన్‌కు ఆల్మా యొక్క ఆహ్వానాల కొరకు చూడండి. ఈ ఆహ్వానాలలో దేనిపై పనిచేయడానికి ప్రేరేపించబడినట్లు మీరు భావిస్తున్నారు? ఉదాహరణకు, “ప్రభువుతో ఆలోచన చేయండి” (37వ వచనము) అంటే ఏమిటో మీరు ఆలోచించవచ్చు. దీనిని చేయడానికి మీరెలా ప్రయత్నించారు? మంచి కోసం ఆయన మీకెలా మార్గనిర్దేశం చేశారు?

ఆల్మా 38

యేసు క్రీస్తు గురించి నా సాక్ష్యాన్ని పంచుకోవడం నేను ప్రేమించేవారిని బలపరచగలదు.

తన కుమారుడైన షిబ్లోన్‌కు ఆల్మా చెప్పిన మాటలు సువార్తను జీవించడంలో మనం ప్రేమించేవారిని ఎలా బలపరచాలి మరియు ప్రోత్సహించాలనే దానికి ఒక మంచి మాదిరిని అందిస్తాయి. ఆల్మా 38 చదవడం యేసు క్రీస్తులో బలాన్ని కనుగొనడానికి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు సహాయపడేందుకు కొన్ని ఉపాయాలను మీకు ఇవ్వవచ్చు. మీరు కనుగొన్నది వ్రాయండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 36:6-24

పశ్చాత్తాపము నాకు యేసు క్రీస్తులో ఆనందాన్నిస్తుంది.

  • పశ్చాత్తాపము ఆనందాన్నిస్తుందని మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడేందుకు, మీరు వారికి సంతోషకరమైన ముఖం ఒకవైపు మరియు బాధతో ఉన్న ముఖం మరొకవైపు ఉన్న కాగితాన్ని ఇవ్వవచ్చు. మీరు ఆల్మా 36:13, 17–20 ను చదివినప్పుడు లేదా సంక్షిప్తపరచినప్పుడు వినమని మరియు ఆల్మా ఎలా భావించాడో చూపడానికి ముఖాలలో ఒకదానిని పైకెత్తి పట్టుకోమని వారిని అడగండి. అతడు ఎలా భావించాడో వివరించే పదాలు లేదా వాక్యభాగాలను పెద్ద పిల్లలు వ్రాయవచ్చు. ఏది ఆల్మాను దుఃఖించేలా చేసింది మరియు ఏది అతనికి ఆనందాన్నిచ్చింది? మీరు పశ్చాత్తాపపడినప్పుడు మీరు భావించే ఆనందం గురించి అప్పుడు మీరు వారికి చెప్పవచ్చు.

ఆల్మా 37:6–7

“చిన్న మరియు సాధారణమైన విషయముల ద్వారా గొప్ప క్రియలు జరిగించబడును.”

  • పెద్ద విషయాలు జరిగేలా చేసే చిన్న వస్తువులను కనుగొనడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. బ్యాటరీ, కారు తాళంచెవి లేదా వారికి ఓదార్పునిచ్చే బొమ్మ కూడా ఉదాహరణలు కావచ్చు. తర్వాత మీరు కలిసి ఆల్మా 37:6–7 చదివి, దేవుడు మనల్ని చేయమని కోరిన కొన్ని చిన్న లేదా సాధారణమైన విషయాల గురించి ఆలోచించవచ్చు. ఈ చిన్న లేదా సాధారణమైన ఆజ్ఞలకు మనం లోబడినప్పుడు, ఏ పెద్ద విషయాలు జరుగగలవు?

  • మీ పిల్లలు ఇటువంటిది ఏదైనా కూడా ప్రయత్నించవచ్చు: ఒకసారి ఒక చుక్క చొప్పున ఒక పాత్రను నీటితో నింపడం మొదలుపెట్టండి. ఇది ఆల్మా 37:6–7 తో ఏవిధమైన సంబంధం కలిగియుంది? అప్పుడు మీరు, రోజూ లేఖనాలను చదవడం వంటి ప్రభువు యొక్క “చిన్న మరియు సాధారణమైన విషయాలు” ఒక పాత్రలో నీటి బిందువుల వలె ఎలా ఉన్నాయో మాట్లాడవచ్చు.

  • ఇల్లు, పాఠశాల లేదా సంఘములో వారు గొప్ప విషయాలను చేయగల మార్గాల ఆలోచించడానికి మీ బిడ్డకు సహాయపడండి.

ఆల్మా 37:38-47

లేఖనాలు నాకు ప్రతీరోజు సహాయపడగలవు.

  • ఆల్మా హీలమన్ కొరకు చేసినట్లు, మీ పిల్లలు దేవుని వాక్యము కొరకు ప్రేమను వృద్ధిచేసేలా మీరెలా సహాయపడవచ్చు? లియహోనా గురించి వారికి తెలిసిన దానిని వారు పంచుకుంటున్నప్పుడు దాని చిత్రాన్ని గీయమని వారిని ఆహ్వానించండి (ఆల్మా 37:38–47; 1 నీఫై 16:10, 28–29 చూడండి). లేఖనాలు లియహోనా వలె ఎట్లున్నాయి?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
ఆల్మా మరియు మోషైయ కుమారులకు దేవదూత ప్రత్యక్షమగుట

Angel Appears to Alma and the Sons of Mosiah [ఆల్మా మరియు మోషైయ కుమారులకు దేవదూత ప్రత్యక్షమగును], క్లార్క్ కెల్లి ప్రైస్ చేత

ముద్రించు