“ఆగష్టు 10–16. ఆల్మా 53–63: ‘ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడిరి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“ఆగష్టు 10–16. ఆల్మా 53–63,“ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
ఆగష్టు 10–16
ఆల్మా 53–63
“ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడిరి”
సువార్త సత్యాలను జీవించడం లేక వాటిని నిరాకరించడం వలన కలిగే ఫలితాలను చూచేందుకు ఆల్మా 53–63 లోని వృత్తాంతాలు మీకు సహాయపడగలవు. మీరు ఆల్మా 53–63 చదివినప్పుడు, ప్రేరేపణలను నమోదు చేయండి మరియు మీరు నేర్చుకున్న సత్యాలను జీవించగల విధానాలను ధ్యానించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
లేమనీయుల సైన్యములతో పోల్చినప్పుడు, 2,000 మంది యౌవన నీఫైయులు గల హీలమన్ యొక్క “చిన్న సైన్యము” (ఆల్మా 56:33) ఎదురు నిలిచే అవకాశమే లేదు. సంఖ్యలో కొద్దిగా ఉండడమే కాకుండా, హీలమన్ సైనికులు “అందరు మిక్కిలి యౌవనులు” మరియు “వారెన్నడును యుద్ధము చేయలేదు” (ఆల్మా 56:46–47). సాతానుకు మరియు లోకంలోని చెడు శక్తులకు వ్యతిరేకంగా మన కడవరి-దిన యుద్ధంలో కొన్నిసార్లు మనలో పరిమితమైనవారిగా మరియు నిష్ఫలంగా భావించే వారికి కొన్ని విధాలుగా ఈ సందర్భం పరిచయమైనదిగా అనిపించవచ్చు.
కానీ హీలమన్ సైన్యానికి లేమనీయుల కంటే కొన్ని ప్రయోజనాలున్నాయి, వాటికి, వారి సంఖ్యకు లేదా సైనిక నైపుణ్యాలకు సంబంధం లేదు. వారు తమను నడిపించేందుకు హీలమన్ అనే ప్రవక్తను ఎంచుకున్నారు (ఆల్మా 53:19); “వారు సందేహించని యెడల దేవుడు వారిని విడిపించునని వారి తల్లుల చేత వారు బోధింపబడిరి” (ఆల్మా 56:47); మరియు “వారికి బోధింపబడిన దానియందు వారు అధికమైన విశ్వాసము కలిగియుండిరి.” ఫలితంగా వారు ”దేవుని యొక్క అద్భుతమైన శక్తి” (ఆల్మా 57:26) చేత రక్షించబడిరి. వారందరు యుద్ధములో గాయపడినప్పటికీ, “వారిలో ఒక్క ఆత్మ కూడా నశించియుండలేదు” (ఆల్మా 57:25). కాబట్టి మనలో ప్రతిఒక్కరికి జీవితము ఆత్మీయ గాయాలను చేసినప్పుడు, మనం ధైర్యం తెచ్చుకోగలము—హీలమన్ సైన్యము యొక్క సందేశమిదే, “ఒక న్యాయమైన దేవుడున్నాడు, ఎవరు సందేహించరో వారు ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడుదురు” (ఆల్మా 57:26).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ఆల్మా 53:10–22; 56:43–48, 55–56; 57:20–27; 58:39–40
నేను దేవుని యందు విశ్వాసమును సాధన చేసినప్పుడు, ఆయన తన ఆశ్చర్యకరమైన శక్తి చేత నన్ను దీవిస్తారు.
హీలమన్ యొక్క యౌవన యోధుల విజయాల వంటి అద్భుతమైన కథలతో పోల్చుకోవడం కష్టం, ఎందుకంటే అవి అసంభవమైనవి. కానీ అటువంటి కథలు లేఖనాలలో ఉండడానికి ఒక కారణం, మనకు విశ్వాసమున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడని మనకు చూపడమే. క్రింది వచనాలలో యోధుల గురించి మీరు చదివినప్పుడు, వారు దేవునియందు తమ విశ్వాసాన్ని ఎలా సాధన చేసారు, వారి విశ్వాసాన్ని అంత బలంగా చేసినదేది మరియు అద్భుతాలను సాధ్యం చేసినదేది అనేవాటి గురించి సమాచారం వెదకండి: ఆల్మా 53:10–22; 56:43–48, 55–56; 57:20–27; మరియు 58:39–40. మీరు కనుగొనిన దానిని నమోదు చేయగల ఒక విధానాన్ని క్రింది పట్టిక సూచిస్తుంది.
హీలమన్ యోధుల స్వభావాలు: | |
వారికి బోధించబడినది: | |
వారు చేసినది: | |
వారు పొందిన దీవెనలు: |
ఈ వచనాలను అధ్యయనం చేసిన తర్వాత, మీ విశ్వాసాన్ని సాధన చేయడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?
యోధుల విశ్వాసాన్ని బలపరచడంలో తల్లుల పాత్రను హీలమన్ ఉదహరించెను (ఆల్మా 56:47–48; 57:20–27 చూడండి). మీ విశ్వాసాన్ని వృద్ధి చేయడంలో కుటుంబ సభ్యులు మరియు ఇతరులు ఎటువంటి పాత్ర పోషించారు? మీ కుటుంబం మరియు స్నేహితుల విశ్వాసాన్ని బలపరచడానికి మీరేమి చేయగలరు?
నేను ఇతరులలో మంచిని గుర్తించడానికి మరియు బాధపడకుండా ఉండేందుకు ఎంచుకోగలను.
హీలమన్ మరియు పహోరన్ ఇద్దరికీ బాధపడేందుకు తగిన కారణాలున్నాయి. హీలమన్ తన సైన్యానికి తగినంత సహకారాన్ని అందుకోవడం లేదు, మరియు ఆ సహకారాన్ని నిలిపివేసాడని మొరోనై చేత పహోరన్ తప్పుగా నిందించబడ్డాడు (ఆల్మా 58:4–9, 31–32; 60 చూడండి). ఆల్మా 58:1–12, 31–37 మరియు ఆల్మా 61 లో వారి స్పందనలలో మిమ్మల్ని ఆకట్టుకున్నదేమిటి? అటువంటి సందర్భాలలో మీరు వారి మాదిరిని ఏవిధంగా అనుసరించగలరు?
ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో, ఈ సంఘంలో ఎవరో ఒకరు బాధాకరంగా యెంచబడేలా ఏదైనా చేస్తారు లేదా అంటారు. అటువంటి సందర్భం మనలో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఎదురవుతుంది—నిశ్చయంగా అది ఒకటి కంటే ఎక్కువసార్లు సంభవిస్తుంది. … మీరు మరియు నేను ఇతరుల ఉద్దేశాలను లేక ప్రవర్తనను నియంత్రించలేము. అయినప్పటికీ, మనం ఏవిధంగా ప్రవర్తిస్తామనే దానిని మనమే నిర్ణయిస్తాము. మీరు మరియు నేను నైతిక కర్తృత్వము కలిగియున్న స్వతంత్రులమని మరియు మనము బాధపడకుండా ఉండేందుకు ఎంచుకోగలమని దయచేసి గుర్తుంచుకోండి” (“And Nothing Shall Offend Them,” Ensign or Liahona, నవం. 2006, 91).
సామెతలు 16:32; మొరోనై 7:45; David A. Bednar, “Meek and Lowly of Heart,” Ensign or Liahona, May 2018, 30–33 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయ కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
ఆల్మా 53:10–17
ఆంటై-నీఫై-లీహైయులు రక్తము చిందించరాదని నిబంధన చేసారు. మనము దేవునితో ఏ నిబంధనలు చేసాము? ఆల్మా 53:10–17 లో మనము చదివినది ఏది మన నిబంధనల పట్ల మరింత విశ్వాసంగా ఉండేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది?
ఆల్మా 53:20–21
మనము మరింతగా హీలమన్ యొక్క యౌవనస్థులవలె ఎలా ఉండగలము? ఈ వచనాలలోని కొన్ని వాక్యభాగాల అర్థాన్ని చర్చించడం సహాయపడవచ్చు; ఉదాహరణకు, “బలము మరియు కార్యశీలతయందు … శూరులైయుండుట“ అనగా అర్థమేమిటి? “(దేవుని) యెదుట యధార్థముగా నడచుట” అనగా అర్థమేమిటి?
ఆల్మా 58:9–11, 33, 37
గొప్ప అవసరత గల సమయాల్లో నీఫై సైనికులు చేసినట్లుగా మనం పరలోక తండ్రి వైపు తిరుగుతామా? వారి ప్రార్థనలకు ఆయన ఏవిధంగా జవాబిచ్చారు? మన ప్రార్థనలకు ఆయన ఏవిధంగా జవాబిచ్చారు?
ఆల్మా 61:2, 9, 19
మనం తప్పుగా నిందించబడినప్పుడు ఏవిధంగా స్పందించాలనే దాని గురించి పహోరన్ నుండి మనమేమి నేర్చుకుంటాము?
ఆల్మా 62:39–41
మన శ్రమల చేత మనము కఠినపరచబడేందుకు లేక మృదువుగా చేయబడేందుకు మనం ఎంచుకోగలమని అర్థం చేసుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు ఇక్కడొక వస్తుపాఠమున్నది: మరుగుతున్న నీరు గల పాత్రలో ఒక పచ్చి బంగాళదుంప మరియు ఒక పచ్చి గుడ్డును ఉంచండి. బంగాళదుంప మరియు గుడ్డు మనల్ని సూచిస్తున్నాయి, నీరు మనము ఎదుర్కొనే శ్రమలను సూచిస్తున్నది. బంగాళదుంప మరియు గుడ్డు ఉడుకుతుండగా, మీ కుటుంబం ఎదుర్కొంటున్న కొన్ని శ్రమల గురించి మీరు మాట్లాడవచ్చు. ఈ రకమైన శ్రమలకు స్పందించగల వివిధ మార్గాలేవి? ఆల్మా 62:41 ప్రకారం, శ్రమల పట్ల మన స్పందనలు మనల్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయి? బంగాళదుంప మరియు గుడ్డు పూర్తిగా ఉడికిన తర్వాత, ఒకే రకమైన “శ్రమ” బంగాళదుంపను మెత్తగాను గుడ్డును గట్టిగాను చేసిందని చూపడానికి బంగాళదుంపను కోసి చూపండి మరియు గుడ్డును పగులగొట్టి చూపండి. మన శ్రమలు మనల్ని వినయంగా చేసి, దేవుడికి దగ్గరగా చేస్తాయని నిశ్చయపరచడానికి మన కుటుంబం ఏమి చేయగలదు?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.