6వ అధ్యాయము
అంత్యదినములలో ప్రభువు ఇశ్రాయేలును తిరిగి రక్షించును—లోకము అగ్నిచేత కాల్చబడును—మనుష్యులు అగ్ని గంధకములు గల గుండమును తప్పించుకొనుటకు క్రీస్తును అనుసరించవలెను. సుమారు క్రీ. పూ. 544–421 సం.
1 ఇప్పుడు నా సహోదరులారా, నేను ప్రవచించుదునని మీతో చెప్పియున్నట్లుగా ఇదిగో ఇదే నా ప్రవచనము—ప్రవక్త జీనస్ ఇశ్రాయేలు వంశస్థులను పెంపుడు ఒలీవ చెట్టుతో పోల్చిచెప్పిన ఆ వాక్యములు నిశ్చయముగా తప్పక జరుగవలెను.
2 తన జనులను తిరిగి రక్షించుటకు రెండవసారి ఆయన మరలా తన చేతిని చాపు దినమే ప్రభువు యొక్క సేవకులు ఆయన ఒలీవతోటను పోషించి శుద్ధి చేయుటకు చివరిసారి ఆయన శక్తితో ముందుకు వెళ్ళు దినము; దాని తరువాత అంతము త్వరగా వచ్చును.
3 ఆయన ఒలీవతోటయందు శ్రద్ధగా పనిచేసిన వారెంత ధన్యులు; తమ స్వస్థలములోనికి పడవేయబడు వారెంత శాపగ్రస్తులు! మరియు లోకము అగ్నిచేత కాల్చబడును.
4 మన దేవుడు మన యెడల ఎంతో కనికరము గలవాడు, ఏలయనగా ఆయన ఇశ్రాయేలు వంశస్థులను, వ్రేళ్ళు మరియు కొమ్మలతోసహా జ్ఞాపకము చేసుకొనును; ఆయన తన చేతులను దినమంతయు వారికి చాపును; వారు మెడబిరుసు జనులు, వాదులాడు జనులైయున్నారు; కానీ తమ హృదయములను కఠినపరచుకొనని వారందరు దేవుని రాజ్యమందు రక్షించబడుదురు.
5 అందువలన నా ప్రియమైన సహోదరులారా, మీరు పశ్చాత్తాపపడవలెననియు హృదయము యొక్క సంపూర్ణ సంకల్పముతో రావలెననియు ఆయన మిమ్ములను అంటిపెట్టుకొనియున్నట్లు దేవుని అంటిపెట్టుకొని యుండుడనియు గంభీరమైన మాటలతో నేను మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ఉదయకాంతిలో కనికరముగల ఆయన బాహువు మీ వైపు చాపబడియుండగా మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
6 ఈ దినమున మీరు ఆయన స్వరమును విని, మీ హృదయములను కఠినపరచుకొనని యెడల మీరెందుకు చనిపోయెదరు?
7 దేవుని మంచి వాక్యము ద్వారా దినమంతయు మీరు పోషింపబడిన తరువాత, నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుటకు మీరు చెడు ఫలమును ఫలించుదురా?
8 ఇదిగో మీరు ఈ మాటలను తిరస్కరించుదురా? మీరు ప్రవక్తల మాటలను తిరస్కరించుదురా? ఆయనను గూర్చి అనేకులు చెప్పియుండిన తరువాత, క్రీస్తును గూర్చి చెప్పబడియున్న మాటలన్నిటినీ మీరు తిరస్కరించుదురా? క్రీస్తు యొక్క మంచి వాక్యమును, దేవుని శక్తిని మరియు పరిశుద్ధాత్మ వరమును తిరస్కరించుదురా? పరిశుద్ధాత్మను అణిచివేసి, మీ కొరకు సిద్ధము చేయబడిన గొప్ప విమోచన ప్రణాళికను ఎగతాళి చేయుదురా?
9 మీరీ క్రియలను చేసిన యెడల, క్రీస్తునందున్న విమోచన మరియు పునరుత్థానము యొక్క శక్తి మిమ్ములను దేవుని న్యాయపీఠము యెదుట సిగ్గుతో, భయంకరమైన దోషారోపణతో నిలబడునట్లు చేయునని మీరెరుగరా?
10 న్యాయము నిరాకరించబడలేదు, కనుక న్యాయము యొక్క శక్తిని బట్టి మీరు అగ్ని గంధకములు గల గుండములోనికి వెళ్ళవలెను, దాని జ్వాలలు ఆర్పబడవు, దాని పొగ నిరంతరము ఆరోహణమగును, ఆ అగ్ని గంధకములు గల గుండమే అంతము లేని వేదన.
11 ఓ నా ప్రియమైన సహోదరులారా, నిత్యజీవమును పొందు వరకు మీరు పశ్చాత్తాపపడి, తిన్నని ద్వారమందు ప్రవేశించి, ఇరుకైన మార్గమందు సాగుడి.
12 జ్ఞానులుగా యుండుడి. ఇంతకంటే నేనేమి చెప్పగలను?
13 చివరిగా, దుర్మార్గులను భయంకరమైన భీతితో, భయముతో కొట్టు దేవుని న్యాయపీఠము యెదుట నేను మిమ్ములను కలుసుకొను వరకు మీ నుండి సెలవు తీసుకొనుచున్నాను. ఆమేన్.