లేఖనములు
మోర్మన్ 2


2వ అధ్యాయము

నీఫైయుల సైన్యములను మోర్మన్‌ నడిపించును—దేశమంతటా రక్తపాతము, మారణహోమము జరిగెను—నశించిపోయిన వారి నిమిత్తము దుఃఖముతో నీఫైయులు విలపించుదురు మరియు దుఃఖించెదరు—వారి కృపాదినము గతించెను—నీఫై యొక్క పలకలను మోర్మన్‌ సంపాదించును—యుద్ధములు కొనసాగును. సుమారు క్రీ. శ. 327–350 సం.

1 అదే సంవత్సరమందు నీఫైయులు మరియు లేమనీయుల మధ్య మరలా ఒక యుద్ధము మొదలాయెను. నేను చిన్నవాడనైనప్పటికీ ఆకారమందు పెద్దగా ఉంటిని; కావున, నన్ను వారి నాయకునిగా లేదా వారి సైన్యములపై నాయకునిగా నీఫై జనులు నియమించిరి.

2 అందువలన, నా పదహారవయేట లేమనీయులకు వ్యతిరేకముగా నీఫైయుల యొక్క సైన్యమును నడిపించుచూ నేను ముందుకు సాగితిని; మరియు మూడు వందల ఇరువది ఆరు సంవత్సరములు గతించిపోయెను.

3 మూడు వందల ఇరువది ఏడవ సంవత్సరమందు లేమనీయులు గొప్ప శక్తితో మాపై దాడిచేసిరి, ఎంతగాననగా వారు నా సైన్యములను భయపెట్టిరి; కావున, వారు యుద్ధము చేయకుండా ఉత్తరము వైపునున్న దేశములకు పారిపోవనారంభించిరి.

4 మరియు మేము అంగోలా పట్టణమునకు వచ్చి, ఆ పట్టణమును స్వాధీనపరచుకొని, లేమనీయుల నుండి మమ్ములను కాపాడుకొనుటకు ఏర్పాట్లు చేసితిమి. మా శక్తిమేరకు మేము పట్టణమును బలపరచితిమి; కానీ, బలమైన కోటలున్నప్పటికీ లేమనీయులు మాపై దాడిచేసి, మమ్ములను పట్టణము నుండి బయటకు తరిమివేసిరి.

5 వారు మమ్ములను దావీదు దేశము నుండి కూడా బయటకు తరిమివేసిరి.

6 మేము ముందుకు సాగి, సముద్రపు ఒడ్డున పశ్చిమ సరిహద్దులందున్న యెహోషువ దేశమునకు వచ్చితిమి.

7 మేము వారిని ఏకసమూహముగా సమకూర్చునట్లు సాధ్యమైనంత త్వరగా మా జనులను సమకూర్చితిమి.

8 కానీ, దేశము దొంగలతోను లేమనీయులతోను నిండియుండెను; నా జనులపైకి గొప్ప నాశనము రానున్నప్పటికీ, వారు తమ చెడు క్రియలను గూర్చి పశ్చాత్తాపపడలేదు; కావున, దేశమంతటా నీఫైయులవైపు మరియు లేమనీయులవైపు ఇరువైపుల రక్తపాతము, మారణహోమము కొనసాగెను; దేశములోనున్న జనులందరు తిరుగుబాటు చేసిరి.

9 ఇప్పుడు, లేమనీయులు అహారోను అను పేరుగల రాజును కలిగియుండిరి; అతడు మాకు వ్యతిరేకముగా నలుబది నాలుగు వేలమంది సైన్యముతో వచ్చెను. నేను నలుబది రెండు వేలమందితో అతడిని ఎదుర్కొంటిని. నేనతడిని నా సైన్యముతో జయించగా, అతడు నా యెదుట నుండి పారిపోయెను; ఇదంతయూ జరిగెను మరియు మూడు వందల ముప్పది సంవత్సరములు గతించిపోయెను.

10 నీఫైయులు వారి దుర్నీతి నిమిత్తము పశ్చాత్తాపపడుట మొదలుపెట్టి, సమూయేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడినట్లు రోదించసాగిరి; ఏలయనగా దేశమందున్న దొంగలు, బందిపోట్లు, హంతకులు, గారడీలు మరియు మంత్రవిద్యల మూలముగా, ఏ మనుష్యుడూ తన స్వంత వస్తువులను కాపాడుకొనలేకపోయెను.

11 ఆ విధముగా ఈ సంగతులను బట్టి దేశమంతటా, ముఖ్యముగా నీఫై యొక్క జనుల మధ్య అధిక సంతాపము మరియు విలాపముండుట మొదలాయెను.

12 మోర్మన్‌ అను నేను, ప్రభువు ఎదుట వారి విలాపము, దుఃఖము మరియు విచారమును చూచినప్పుడు, ప్రభువు యొక్క కనికరమును, దీర్ఘశాంతమును ఎరిగియుండి, నా హృదయమందు ఆనందించుట మొదలుపెట్టితిని, కావున ఆయన వారి పట్ల కనికరము చూపునని, మరలా వారు నీతిమంతులగుదురని నేను తలంచితిని.

13 కానీ, ఈ నా సంతోషము వ్యర్థమాయెను, ఏలయనగా వారి దుఃఖము దేవుని యొక్క మంచితనమును బట్టి పశ్చాత్తాపమునకు వారిని నడిపించుటలేదు; కానీ అది, పాపమందు సంతోషించుటకు దేవుడు వారిని ఎల్లప్పుడు అనుమతించుటలేదని సాతానుకు లోబడిన వారి దుఃఖమైయుండెను.

14 వారు విరిగిన హృదయములు మరియు నలిగిన ఆత్మలతో యేసు యొద్దకు రాలేదు, కానీ దేవుడిని శపించి మరణించవలెనని వారు కోరిరి. అయినప్పటికీ, వారు తమ ప్రాణముల నిమిత్తము ఖడ్గముతో పెనుగులాడుదురు.

15 నేను మరలా విచారించితిని మరియు కృపాదినము వారికి ఐహికముగాను, ఆత్మ సంబంధముగాను రెండు విధముల గతించిపోయెనని నేను చూచితిని; ఏలయనగా, వారిలో వేలమంది తమ దేవునికి వ్యతిరేకముగా బహిరంగ తిరుగుబాటులో నరికివేయబడిరని, పెంటకుప్ప వలే భూముఖముపై వేయబడిరని నేను చూచితిని; ఆ విధముగా, మూడు వందల నలుబది నాలుగు సంవత్సరములు గతించిపోయెను.

16 మూడు వందల నలుబది ఐదవ సంవత్సరమందు నీఫైయులు, లేమనీయుల యెదుట పారిపోవుట మొదలుపెట్టిరి; వారి పలాయనములో వారిని ఆపుట సాధ్యమగుటకు ముందు, వారు జేషన్ దేశమునకు వచ్చు వరకు తరుమబడిరి.

17 ఇప్పుడు, గ్రంథములు నాశనము కాకుండా ఉండునట్లు అమ్మరోన్‌ వాటిని ప్రభువు కొరకు భద్రపరచిన దేశమునకు సమీపమున జేషన్‌ పట్టణము ఉండెను. మరియు నేను అమ్మరోన్‌ మాటల ప్రకారము వెళ్ళి, నీఫై పలకలను తీసుకొని, అమ్మరోన్‌ మాటల ప్రకారము ఒక వృత్తాంతమును వ్రాసితిని.

18 నీఫై యొక్క పలకల మీద దుష్టత్వము మరియు హేయక్రియలన్నిటి యొక్క సంపూర్ణ వృత్తాంతమును నేను వ్రాసితిని; కానీ ఈ పలకలపై వారి దుష్టత్వము మరియు హేయక్రియల సంపూర్ణ వృత్తాంతమును చేయకుండా నేను నిషేధించబడితిని, ఏలయనగా మనుష్యుల క్రియలను చూచుటకు నాకు తగినంత వయస్సు వచ్చినప్పటి నుండి దుష్టత్వము మరియు హేయక్రియల యొక్క నిరంతరమైన దృశ్యము నా కన్నుల యెదుట ఉండెను.

19 అయ్యో, వారి దుష్టత్వమును బట్టి నేను దుఃఖించుచుంటిని; ఏలయనగా, వారి దుష్టత్వమును బట్టి నా దినములన్నిటా నా హృదయము దుఃఖముతో నిండియుండెను; అయినప్పటికీ, అంత్యదినమున నేను పైకెత్తబడుదునని నేనెరుగుదును.

20 మరియు ఈ సంవత్సరమందు నీఫై యొక్క జనులు తిరిగి వేటాడబడి, తరుమబడిరి. షెమ్ అని పిలువబడిన దేశమునకు ఉత్తరము వైపు మేము వచ్చునంత వరకు మేము ముందుకు తరుమబడితిమి.

21 మేము షెమ్ పట్టణమును బలపరచితిమి మరియు ఒకవేళ మేము వారిని నాశనమునుండి రక్షించగలమేమో అని సాధ్యమైనంత మట్టుకు మా జనులను మేము సమకూర్చితిమి.

22 మరలా మూడు వందల నలుబది ఆరవ సంవత్సరమందు, వారు మాపై దాడిచేయుటకు రాసాగిరి.

23 నేను నా జనులతో మాట్లాడి, వారు లేమనీయుల యెదుట ధైర్యముగా నిలువవలెనని, వారి భార్యాపిల్లలు, ఇళ్ళు, గృహముల కొరకు యుద్ధము చేయవలెనని గొప్ప శక్తితో వారిని ప్రేరేపించితిని.

24 నా మాటలు వారికి కొంత ధైర్యమునిచ్చెను, ఎంతగాననగా వారు లేమనీయుల యెదుటనుండి పారిపోకుండా వారికెదురుగా ధైర్యముతో నిలిచిరి.

25 మేము ఏబది వేలమంది సైన్యమునకు వ్యతిరేకముగా ముప్పది వేలమంది సైన్యముతో పోరాడితిమి. వారు మా యెదుట నుండి పారిపోవునంతగా మేము వారి యెదుట దృఢముగా నిలిచియుంటిమి.

26 వారు పారిపోయినప్పుడు మేము మా సైన్యములతో వారిని వెంబడించి, తిరిగి కలుసుకొని వారిని జయించితిమి; అయినప్పటికీ, ప్రభువు యొక్క బలము మాతో లేకుండెను; అనగా, మాకై మేము ఒంటరిగా విడువబడితిమి; ప్రభువు యొక్క ఆత్మ మా యందు నిలిచియుండనందున, మేము మా సహోదరులవలే బలహీనులమైతిమి.

27 నా జనులపై వచ్చిన ఈ గొప్ప విపత్తును బట్టి, వారి దుష్టత్వము మరియు హేయక్రియలను బట్టి, నా హృదయము దుఃఖించెను. కానీ, మా స్వాస్థ్యమైన దేశములను మేము తిరిగి స్వాధీనపరచుకొనువరకు, మేము లేమనీయులకు మరియు గాడియాంటన్‌ దొంగలకు వ్యతిరేకముగా ముందుకు సాగితిమి.

28 ఇప్పుడు మూడు వందల నలుబది తొమ్మిదవ సంవత్సరము గతించిపోయెను. మూడు వందల యాభైయవ సంవత్సరమందు, మేము లేమనీయులతో మరియు గాడియాంటన్‌ దొంగలతో ఒక ఒప్పందము చేసుకొంటిమి, దానిలో మేము మా స్వాస్థ్యమైన దేశములను విభజించుకొంటిమి.

29 లేమనీయులు మాకు ఉత్తరమువైపు దేశమును, అనగా దక్షిణము వైపు దేశములోనికి నడిపించు సన్నని మార్గము వరకు ఇచ్చిరి మరియు మేము లేమనీయులకు దక్షిణము వైపునున్న దేశమంతటినీ ఇచ్చితిమి.