4వ అధ్యాయము
యుద్ధము మరియు మారణకాండ కొనసాగును—దుష్టులు, దుష్టులను శిక్షించెదరు—ఇశ్రాయేలంతటిలో ముందెన్నడూ లేనంత అధికమైన దుష్టత్వము ప్రబలును—స్త్రీలు మరియు పిల్లలు విగ్రహములకు బలి ఇవ్వబడెదరు—లేమనీయులు వారి యెదుట నుండి నీఫైయులను తరిమివేయసాగిరి. సుమారు క్రీ. శ. 363–375 సం.
1 ఇప్పుడు మూడువందల అరవై మూడవ సంవత్సరమందు, నీఫైయులు తమ సైన్యములతో లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు నిర్జన దేశము నుండి బయటకు వెళ్ళిరి.
2 మరియు నీఫైయుల సైన్యములు నిర్జన దేశమునకు తిరిగి వెనుకకు తరుమబడెను. వారు ఇంకను అలసియుండగా, లేమనీయుల యొక్క క్రొత్త సైన్యమొకటి వారి మీదికి వచ్చెను; వారు భీకర యుద్ధము చేసిరి, ఎంతగాననగా లేమనీయులు నిర్జన పట్టణమును స్వాధీనపరచుకొని, నీఫైయులలో అనేకులను సంహరించిరి మరియు అనేకమందిని బందీలుగా కొనిపోయిరి.
3 మిగిలిన వారు పారిపోయి, టియాంకమ్ పట్టణము యొక్క నివాసులను చేరిరి. ఇప్పుడు, టియాంకమ్ పట్టణము సముద్రపు ఒడ్డు ప్రక్కన సరిహద్దులయందు ఉండెను మరియు అది నిర్జన పట్టణమునకు సమీపముగా ఉండెను.
4 నీఫైయుల సైన్యములు లేమనీయుల యొద్దకు వెళ్ళినందువలననే వారిపై దాడి మొదలాయెను; అట్లుకాని యెడల, లేమనీయులు వారిపై ఎట్టి శక్తిని కలిగియుండేవారు కారు.
5 కానీ, దేవుని తీర్పులు దుష్టులపై వచ్చును; మరియు దుష్టులు శిక్షించబడునది దుష్టుల చేతనే; ఏలయనగా, నరుల సంతానము యొక్క హృదయములను రక్తపాతమునకు పురిగొల్పునది దుష్టులే.
6 ఇప్పుడు టియాంకమ్ పట్టణముపై దాడిచేయుటకు లేమనీయులు ఏర్పాట్లు చేసిరి.
7 మూడు వందల అరవై నాలుగవ సంవత్సరమందు, లేమనీయులు టియాంకమ్ పట్టణమును కూడా స్వాధీనపరచుకొనునట్లు, టియాంకమ్ పట్టణముపై దాడిచేసిరి.
8 వారు నీఫైయుల చేత త్రిప్పి కొట్టబడి, వెనుకకు తరుమబడిరి. వారు లేమనీయులను తరిమివేసిరని చూచినప్పుడు, నీఫైయులు మరలా తమ బలమందు అతిశయపడిరి; వారు తమ బలమందు ముందుకుసాగి నిర్జన పట్టణమును తిరిగి స్వాధీనపరచుకొనిరి.
9 ఇప్పుడు ఈ క్రియలన్నియూ జరిగెను; నీఫైయులు మరియు లేమనీయులలో ఇరువైపులా వేలమంది సంహరింపబడిరి.
10 మూడువందల అరవై ఆరవ సంవత్సరము గతించిపోయెను మరియు నీఫైయులపై యుద్ధము చేయుటకు లేమనీయులు తిరిగి వచ్చిరి; అయినను వారు చేసిన చెడును బట్టి నీఫైయులు ఇంకను పశ్చాత్తాపపడలేదు, కానీ నిరంతరము వారి దుష్టత్వములో కొనసాగిరి.
11 నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురి మధ్య ఉన్న రక్తపాతము మరియు మారణకాండ యొక్క భయంకరమైన దృశ్యపు పరిపూర్ణ వర్ణనను వ్రాయుటకు మనుష్యునికి లేదా వర్ణించుటకు నాలుకకు అసాధ్యము; ప్రతి హృదయము కఠినపరచబడెను, అందును బట్టి వారు నిరంతరము రక్తము చిందించుటలో ఆనందించిరి.
12 మరియు ప్రభువు యొక్క మాటల ప్రకారము, ఈ జనుల మధ్య ఉన్నంత గొప్ప దుష్టత్వము లీహై యొక్క సంతానమంతటి మధ్య ఎన్నడూ లేకుండెను లేదా ఇశ్రాయేలు వంశము వారందరి మధ్య కూడా లేకుండెను.
13 ఇప్పుడు వారి సంఖ్య, నీఫైయుల సంఖ్యను మించి ఉండుటను బట్టి లేమనీయులు నిర్జన పట్టణమును స్వాధీనపరచుకొనిరి.
14 వారు టియాంకమ్ పట్టణమువైపు ముందుకు నడిచి, దాని నివాసులను బయటకు తరిమివేసిరి; స్త్రీలు మరియు పిల్లలలో అనేకమందిని బందీలుగా తీసుకొని, వారి విగ్రహపు దేవుళ్ళకు వారిని బలులుగా అర్పించిరి.
15 మరియు మూడు వందల అరవై ఏడవ సంవత్సరమందు, వారి స్త్రీలను పిల్లలను లేమనీయులు బలిచ్చినందుకు గాను నీఫైయులు కోపముగా ఉండిరి; కావున వారు మిక్కిలి కోపముతో లేమనీయులకు వ్యతిరేకముగా వెళ్ళిరి, ఎంతగాననగా వారు లేమనీయులను జయించి, వారి దేశముల నుండి బయటకు తరిమివేసిరి.
16 మరలా మూడు వందల డెబ్బది అయిదవ సంవత్సరము వరకు లేమనీయులు, నీఫైయులపై దాడి చేయుటకు తిరిగి రాలేదు.
17 మరియు ఈ సంవత్సరమందు, వారు నీఫైయులకు వ్యతిరేకముగా వారి శక్తులన్నిటితో వచ్చిరి; వారి సంఖ్య యొక్క గొప్పతనమును బట్టి వారు లెక్కింపబడలేదు.
18 ఈ సమయము నుండి మొదలుకొని నీఫైయులు, లేమనీయులపై ఎట్టి శక్తిని పొందలేదు, కానీ సూర్యుని యెదుట మంచువలే వారి చేత నాశనము చేయబడసాగిరి.
19 లేమనీయులు నిర్జన పట్టణముపై దాడిచేసిరి మరియు నిర్జన దేశమందు అత్యంత భయంకరమైన యుద్ధము జరిగెను, దానిలో వారు నీఫైయులపై జయించిరి.
20 అంతట వారి యెదుట నుండి పారిపోయి, వారు బోయజ్ పట్టణమునకు వచ్చిరి; మరియు లేమనీయులకు వ్యతిరేకముగా వారు మిక్కిలి ధైర్యముతో నిలిచిరి, ఎంతగాననగా లేమనీయులు రెండవసారి తిరిగి వచ్చేవరకు వారిపై జయించలేకపోయిరి.
21 వారు రెండవసారి వచ్చినప్పుడు నీఫైయులు తరుమబడి, గొప్ప సంహారముతో సంహరించబడిరి; వారి స్త్రీలు మరియు పిల్లలు మరలా విగ్రహములకు బలి ఇవ్వబడిరి.
22 ఇప్పుడు నీఫైయులు, పట్టణములు మరియు పల్లెలు రెండింటిలోనున్న నివాసులందరినీ తమతో తీసుకొని వారి యెదుట నుండి తిరిగి పారిపోయిరి.
23 మరియు లేమనీయులు దేశమును స్వాధీనము చేసుకొనబోవుచున్నారని మోర్మన్ అను నేను చూచితిని, కావున నేను షిమ్ కొండకు వెళ్ళి అమ్మరోన్ ప్రభువు సంరక్షణలో దాచియుంచిన వృత్తాంతములన్నిటినీ తీసుకొంటిని.