లేఖనములు
మోర్మన్ 6


6వ అధ్యాయము

నీఫైయులు అంతిమ యుద్ధముల నిమిత్తము కుమోరా దేశములో సమకూడుదురు—పవిత్ర గ్రంథములను మోర్మన్‌ కుమోరా కొండపై దాచిపెట్టును—లేమనీయులు విజయులగుదురు మరియు నీఫైయుల దేశము నాశనము చేయబడును—వందల వేలమంది ఖడ్గము చేత సంహరింపబడుదురు. సుమారు క్రీ. శ. 385 సం.

1 మరియు నా జనులైన నీఫైయుల యొక్క నాశనమును గూర్చిన నా వృత్తాంతమును నేను పూర్తి చేయుచున్నాను. ఇప్పుడు మేము లేమనీయుల యెదుట ముందుకు నడిచితిమి.

2 మోర్మన్‌ అను నేను, లేమనీయుల రాజుకు ఒక లేఖ వ్రాసితిని, అందులో కుమోరా దేశమందున్న కుమోరా అని పిలువబడిన ఒక కొండ వద్ద మేము మా జనులతో సమకూడునట్లు అతడు మాకు అనుమతి ఇయ్యవలెనని, అక్కడ మేము వారితో యుద్ధము చేయగలమని అతడిని కోరితిని.

3 మరియు నేను కోరిన ప్రకారము లేమనీయుల రాజు నాకు అనుగ్రహించెను.

4 అంతట మేము కుమోరా దేశమునకు నడిచి వెళ్ళి, కుమోరా కొండ చుట్టూ మా గుడారములను వేసుకొంటిమి; అది అనేక జలములు, నదులు మరియు నీటి ఊటల యొక్క దేశమందు ఉండెను; ఇక్కడ మేము లేమనీయులపై గెలిచెదమను నిరీక్షణను కలిగియుంటిమి.

5 మూడు వందల ఎనుబది నాలుగు సంవత్సరములు గతించిపోయినప్పుడు, మేము మా జనులలో మిగిలిన వారందరిని కుమోరా దేశములో సమకూర్చితిమి.

6 మేము మా జనులందరిని ఒక్కటిగా కుమోరా దేశములో సమకూర్చినప్పుడు, అది నా జనుల యొక్క చివరి పోరాటమని ఎరిగి, మా పితరుల ద్వారా అందించబడిన పవిత్ర గ్రంథములు లేమనీయుల చేతులలోనికి పడకుండా చూడవలెనని వృద్ధుడనైన మోర్మన్‌ అను నేను ప్రభువు చేత ఆజ్ఞాపించబడినవాడనై, (ఏలయనగా, లేమనీయులు వాటిని నాశనము చేయుదురు) ఈ వృత్తాంతమును నేను నీఫై పలకలపై చేసితిని మరియు నా కుమారుడైన మొరోనైకి నేను ఇచ్చిన ఈ కొద్ది పలకలు తప్ప, ప్రభువు యొక్క హస్తము ద్వారా నాకు అప్పగించబడిన గ్రంథములన్నిటినీ కుమోరా కొండపై దాచివేసితిని.

7 ఇప్పుడు, లేమనీయుల సైన్యములు వారి వైపు నడిచి వచ్చుటను నా జనులు తమ భార్యాపిల్లలతో పాటు చూచిరి; మరియు దుష్టులందరి రొమ్ములను నింపు మరణము యొక్క ఆ ఘోరమైన భయముతో వారిని ఎదుర్కొనుటకు వేచియుండిరి.

8 వారు మాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వచ్చిరి మరియు వారి సంఖ్యల యొక్క గొప్పతనమును బట్టి, ప్రతి ఆత్మ మహాభీతితో నిండెను.

9 వారు ఖడ్గముతో, విల్లుతో, బాణముతో, గొడ్డలితో మరియు అన్ని రకములైన యుద్ధ ఆయుధములతో నా జనులపై దాడిచేసిరి.

10 నా మనుష్యులు, అనగా నాతోనున్న పదివేలమంది నరికి వేయబడిరి మరియు నేను వారి మధ్యలో గాయపడియుంటిని; వారు నా ప్రక్క నుండి వెళ్ళినందున, నన్ను సంహరించలేదు.

11 మరియు వారు వెళ్ళి మాలో ఇరువది నలుగురిని తప్ప (నా కుమారుడు మొరోనై వీరి మధ్య ఉండెను), నా జనులందరినీ నరికి వేసినప్పుడు, మేము మా జనుల యొక్క మృతులలో మిగిలిన వారమైయుండి, లేమనీయులు వారి దండులకు తిరిగి వెళ్ళిపోయినప్పుడు మరుసటి ఉదయమున కుమోరా కొండ యొక్క శిఖరము నుండి నా జనులలో పదివేల మందిని, అనగా నేను ముందుండి నడిపించగా నరికి వేయబడిన వారిని చూచితిమి.

12 మరియు నా జనులలో, నా కుమారుడు మొరోనై చేత నడిపించబడిన పదివేలమందిని కూడా మేము చూచితిమి.

13 గిద్‌గిద్దొనా యొక్క పదివేలమంది కూడా సంహరించబడిరి, అతడు కూడా వారి మధ్య పడియుండెను.

14 మరియు లామా అతని పదివేలమందితో సంహరించబడెను, గిల్గాల్ అతని పది వేలమందితో సంహరించబడెను, లింహా అతని పదివేలమందితో సంహరించబడెను, జెనియమ్ అతని పదివేలమందితో సంహరించబడెను మరియు క్యుమెనిహా, మొరోనైహా, ఆంటియోనమ్, షిబ్లోమ్, షెమ్ మరియు జాష్‌లలో ప్రతి ఒక్కరు తమ పదివేలమందితో సంహరించబడిరి.

15 మరో పదిమందిలో ప్రతి ఒక్కరు తమ పదివేలమందితో ఖడ్గము చేత కూలిరి; నాతో ఉన్న ఆ ఇరువది నలుగురు మరియు దక్షిణ దేశములలోనికి తప్పించుకొనిపోయిన కొద్దిమంది మరియు లేమనీయుల నుండి తప్పించుకొనిపోయిన కొద్దిమంది తప్ప, నా జనులందరు సంహరించబడిరి; వారి మాంసము, ఎముకలు, రక్తము నేల మీద కుళ్ళిపోవుటకు మరియు చితికి వారి నేల తల్లికి తిరిగి చేరుటకు, వారి సంహారకుల చేతుల ద్వారా విడువబడి భూముఖముపై పడియుండెను.

16 నా జనులలో సంహరింపబడిన వారిని బట్టి, నా ఆత్మ వేదనతో జయించబడగా నేనిట్లు రోదించితిని:

17 ఓ అందమైన జనులారా, ప్రభువు యొక్క మార్గముల నుండి మీరెట్లు వెడలిపోగలిగితిరి! ఓ అందమైన జనులారా, మిమ్ములను చేర్చుకొనుటకు తెరచిన బాహువులతో నిలిచిన ఆ యేసును మీరెట్లు తిరస్కరించగలిగితిరి!

18 ఇదిగో, మీరు దీనిని చేసియుండని యెడల, మీరు సంహరింపబడి యుండెడివారు కారు. కానీ, మీరు సంహరింపబడియున్నారు మరియు మిమ్ములను కోల్పోవుటను బట్టి నేను దుఃఖపడుచున్నాను.

19 ఓ అందమైన కుమారులు కుమార్తెలారా, తల్లిదండ్రులారా, భార్యాభర్తలారా, అందమైన జనులైన మీరు, ఎట్లు పడిపోతిరి!

20 మీరు వెడలిపోతిరి మరియు నా దుఃఖము మిమ్ములను తిరిగి తీసుకొని రాలేదు.

21 మీ మర్త్య శరీరము అమర్త్యత్వమును ధరించుకొనవలసిన దినము మరియు క్రమముగా క్షీణించి కుళ్ళుచున్న ఈ శరీరములు త్వరలోనే అక్షయమైన శరీరములుగా కావలసిన దినము త్వరగా వచ్చును; అప్పుడు, మీ క్రియలను బట్టి క్రీస్తు యొక్క న్యాయపీఠము యెదుట తీర్పు తీర్చబడుటకు మీరు నిలువవలసియున్నది; మీరు నీతిమంతులైన యెడల, అప్పుడు మీ కంటే ముందు మరణించిన మీ పితరులతోపాటు మీరు ధన్యులైయుందురు.

22 అయ్యో, మీ మీద ఈ గొప్ప నాశనము వచ్చుటకు ముందు మీరు పశ్చాత్తాపపడియున్న యెడల ఎంత మేలు. కానీ, మీరు వెడలిపోయియున్నారు మరియు తండ్రి, అనగా పరలోకము యొక్క నిత్యతండ్రి మీ స్థితిని యెరిగియున్నాడు; ఆయన న్యాయము మరియు కనికరమును బట్టి, ఆయన మీతో వ్యవహరించును.