8వ అధ్యాయము
లేమనీయులు, నీఫైయులను వెతికి పట్టుకొని నాశనము చేయుదురు—దేవుని శక్తి చేత మోర్మన్ గ్రంథము వెలుగులోనికి వచ్చును—ప్రభువు యొక్క కార్యమునకు వ్యతిరేకముగా ఆగ్రహమును ప్రదర్శించి, కలహించు వారిపై ఆపదలు ప్రకటించబడినవి—దుష్టత్వము, నైతిక పతనము మరియు విశ్వాసభ్రష్టత్వము యొక్క దినమందు నీఫైయుల వృత్తాంతము వెలుగులోనికి వచ్చును. సుమారు క్రీ. శ. 400–421 సం.
1 ఇదిగో మొరోనై అను నేను, నా తండ్రి మోర్మన్ యొక్క గ్రంథమును ముగించుచున్నాను. నేను వ్రాయుటకు కొన్ని విషయములను మాత్రమే కలిగియున్నాను, ఆ విషయములలో నా తండ్రి చేత నేను ఆజ్ఞాపించబడియున్నాను.
2 ఇప్పుడు కుమోరా వద్ద జరిగిన ఆ గొప్ప భయంకరమైన యుద్ధము తరువాత, దక్షిణమువైపు దేశములోనికి తప్పించుకొని పోయిన నీఫైయులందరూ నాశనము చేయబడువరకు లేమనీయుల చేత వారు వేటాడబడిరి.
3 నా తండ్రి కూడా వారి చేత చంపబడెను మరియు నా జనుల నాశనము యొక్క దుఃఖపూరితగాథను వ్రాయుటకు నేను ఒక్కడినే మిగిలియుంటిని. కానీ ఇదిగో, వారు వెడలిపోయిరి మరియు నేను, నా తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుచున్నాను. వారు నన్ను సంహరించుదురేమో నేనెరుగను.
4 కావున నేను వృత్తాంతములను వ్రాసి, భూమిలో దాచిపెట్టెదను; తరువాత నేను ఎక్కడికి వెళ్ళెదనో అనునది ముఖ్యము కాదు.
5 ఇదిగో, నా తండ్రి ఈ వృత్తాంతమును, దాని ఉద్దేశ్యమును వ్రాసియున్నాడు. పలకలపై స్థలమున్న యెడల నేను కూడా వ్రాసియుండెడి వాడను, కానీ స్థలము లేదు; నేను ఎట్టి ముడిలోహమును కలిగిలేను, ఏలయనగా నేను ఒంటరిగా ఉంటిని. నా తండ్రి మరియు నా బంధువులందరు యుద్ధములో సంహరింపబడిరి; నాకు స్నేహితులెవరూ లేరు లేదా నేను వెళ్ళుటకు స్థలమేదియూ లేదు; ఇంకెంతకాలము నేను బ్రదుకునట్లు ప్రభువు అనుమతించునో నేనెరుగను.
6 ఇదిగో, మన ప్రభువు మరియు రక్షకుడు వచ్చినప్పటి నుండి నాలుగు వందల సంవత్సరములు గతించిపోయెను.
7 నా జనులైన నీఫైయులను పూర్తిగా నిర్మూలించునట్లు, లేమనీయులు పట్టణము నుండి పట్టణమునకు, స్థలము నుండి స్థలమునకు వారిని వేటాడిరి; వారి పతనము ఘోరముగా ఉండెను, అనగా నా జనులైన నీఫైయుల యొక్క నాశనము తీవ్రముగా, ఆశ్చర్యకరముగా ఉండెను.
8 ఇదిగో, దానిని చేసినది ప్రభువు యొక్క హస్తమే. లేమనీయులు కూడా ఒకరితోనొకరు యుద్ధము చేయుచుండిరి; ఈ దేశమంతయు హత్య, రక్తపాతముల యొక్క నిత్య వలయమైయున్నది; మరియు యుద్ధము యొక్క ముగింపును ఎవరూ ఎరుగరు.
9 ఇప్పుడు వారిని గూర్చి నేనిక ఏ మాత్రము చెప్పుట లేదు, ఏలయనగా దేశమంతటా లేమనీయులు మరియు దొంగలు తప్ప, ఎవరునూ లేరు.
10 మరియు జనులతో నిలిచియుండుటకు ప్రభువు వారిని అనుమతించనంతగా జనుల యొక్క దుష్టత్వము గొప్పదగు వరకు దేశమందు నిలిచిన యేసు యొక్క శిష్యులు తప్ప, నిజమైన దేవుడిని ఎరిగిన వారెవరూ అక్కడ లేకుండెను; అయితే, వారు భూ ముఖముపై ఉన్నారో లేదో అనునది ఏ మనుష్యుడూ ఎరుగడు.
11 కానీ నేను, నా తండ్రి వారిని చూచియున్నాము మరియు వారు మాకు పరిచర్య చేసిరి.
12 ఈ వృత్తాంతమును అంగీకరించి దానిలోనున్న తప్పులను బట్టి దానిని ఖండించని వాడు, వీటికంటే గొప్ప విషయములను ఎరుగును. ఇదిగో, నేను మొరోనైని; సాధ్యమైన యెడల, నేను మీకు అన్ని విషయములను తెలియజేసెదను.
13 ఇప్పుడు ఈ జనులను గూర్చి మాట్లాడుట నేను ముగించెదను. నేను మోర్మన్ యొక్క కుమారుడను మరియు నా తండ్రి నీఫై యొక్క వంశస్థుడు.
14 ఈ వృత్తాంతమును ప్రభువు కొరకు దాచిపెట్టునది నేనే; ప్రభువు యొక్క ఆజ్ఞను బట్టి, ఆ పలకలు ఎట్టి విలువను కలిగిలేవు. ఏలయనగా, లాభము పొందుటకు ఎవరూ వాటిని పొందలేరని ఆయన నిజముగా చెప్పుచున్నాడు; కానీ, వాటిపైనున్న వృత్తాంతము అత్యంత విలువైనది; మరియు దానిని వెలుగులోనికి తెచ్చు వానిని ప్రభువు ఆశీర్వదించును.
15 ఏలయనగా దేవునిచేత ఇవ్వబడితే తప్ప, దానిని వెలుగులోనికి తెచ్చుటకు ఎవరూ శక్తి కలిగియుండరు; అది ఆయన మహిమయే లక్ష్యముగా లేదా ప్రాచీనమైన మరియు దీర్ఘకాలము చెదిరిన ప్రభువు యొక్క నిబంధన జనుల క్షేమము నిమిత్తము చేయబడవలెనని దేవుడు కోరుచున్నాడు.
16 ఈ వృత్తాంతమును వెలుగులోనికి తెచ్చువాడు ధన్యుడు; ఏలయనగా దేవుని వాక్యము ప్రకారము, అది అంధకారములో నుండి వెలుగులోనికి తేబడును; అది భూమిలో నుండి బయటకు తేబడి, అంధకారములో నుండి ప్రకాశించి, జనులకు తెలియజేయబడును; అది దేవుని శక్తి చేత చేయబడును.
17 ఒకవేళ తప్పిదములున్న యెడల, అవి మానవ తప్పిదములే. కానీ, మేమెట్టి తప్పిదమును ఎరుగము; అయినప్పటికీ, దేవుడు అన్ని విషయములను ఎరుగును; కావున, ఖండించువాడు తెలుసుకొనవలెను, లేనియెడల అతడు నరకాగ్ని యొక్క అపాయమందుండును.
18 మరియు నాకు చూపని యెడల నీవు కొట్టబడుదువని చెప్పువాడు జాగ్రత్తపడవలెను, లేని యెడల ప్రభువు చేత నిషేధింపబడిన దానిని అతడు ఆజ్ఞాపించును.
19 ఏలయనగా తొందరపాటుగా తీర్పు తీర్చువాడు, తిరిగి తొందరపాటుగానే తీర్పు తీర్చబడును; అతని క్రియలను బట్టియే అతని జీతముండును; కావున, కొట్టువాడు తిరిగి ప్రభువు చేత కొట్టబడును.
20 లేఖనము ఏమి చెప్పుచున్నదో చూడుడి—మనుష్యుడు కొట్టరాదు లేదా అతడు తీర్పు తీర్చరాదు; ఏలయనగా, తీర్పు నాది, పగ కూడా నాది మరియు నేను బదులు చెల్లించెదనని ప్రభువు చెప్పుచున్నాడు.
21 ప్రభువు యొక్క కార్యమునకు, ఇశ్రాయేలు వంశస్థులైన ప్రభువు యొక్క నిబంధన జనులకు వ్యతిరేకముగా ఆగ్రహమును ప్రదర్శించి, కలహించువారు మరియు మేము ప్రభువు యొక్క కార్యమును నాశనము చేసెదమని, ఇశ్రాయేలు వంశముతో ఆయన చేసిన నిబంధనను ప్రభువు జ్ఞాపకము చేసుకొనడని చెప్పువారు నరికి వేయబడి, అగ్నిలోనికి పడవేయబడు అపాయములో ఉన్నారు;
22 ఏలయనగా, ఆయన వాగ్దానములన్నియు నెరవేరువరకు ప్రభువు యొక్క నిత్య సంకల్పములు కొనసాగును.
23 యెషయా యొక్క ప్రవచనములను పరిశీలించుడి. నేను వాటిని వ్రాయలేను. ఇదిగో, నా కంటే ముందు మరణించిన వారు మరియు ఈ దేశమును స్వాధీనపరచుకొనిన ఆ పరిశుద్ధులు మొరపెట్టుదురు, ముఖ్యముగా ధూళి నుండి వారు ప్రభువుకు మొరపెట్టుదురని నేను మీతో చెప్పుచున్నాను; మరియు ప్రభువు జీవముతోడు, ఆయన వారితో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకము చేసుకొనును.
24 వారి ప్రార్థనలను ఆయన ఎరుగును; అవి, వారి సహోదరుల నిమిత్తమని ఎరుగును. ఆయన వారి విశ్వాసమును ఎరుగును, ఏలయనగా ఆయన నామమందు వారు పర్వతములను కదిలించగలిగిరి; ఆయన నామమందు వారు భూమి కంపించునట్లు చేయగలిగిరి; ఆయన వాక్యము యొక్క శక్తి చేత వారు చెరసాలలు నేలకు దొర్లిపడునట్లు చేసిరి; ఆయన వాక్యము యొక్క శక్తిని బట్టి, భయంకరమైన అగ్నిగుండము, అడవి మృగములు లేదా విషసర్పములు వారికి హాని చేయలేకపోయెను.
25 మరియు వారి ప్రార్థనలు, ఈ విషయములను వెలుగులోనికి తెచ్చుటకు ప్రభువు అనుమతించు వాని నిమిత్తము కూడా అయ్యున్నవి.
26 అవి రావని ఎవరూ చెప్పనవసరము లేదు, అవి తప్పక వచ్చును, ఏలయనగా ప్రభువు దానిని పలికియున్నాడు; భూమి నుండి ప్రభువు యొక్క హస్తము ద్వారా అవి వచ్చును మరియు దానినెవరూ ఆపలేరు; అద్భుతములు నిలిపివేయబడినవని చెప్పబడు దినమందు అవి వచ్చును మరియు మృతులలోనుండి ఒకడు మాట్లాడునట్లుగా అవి వచ్చును.
27 రహస్య కూడికలు మరియు అంధకార క్రియలను బట్టి, పరిశుద్ధుల రక్తము ప్రభువుకు మొరపెట్టు దినమున అవి వచ్చును.
28 దేవుని శక్తి నిరాకరించబడి, సంఘములు చెరుపబడి, తమ హృదయ గర్వమందు పైకెత్తబడు దినమున, అనగా వారి సంఘములకు చెందిన వారిపట్ల అసూయ చెందునంతగా సంఘ నాయకులు మరియు ఉపదేశకుల హృదయములు గర్వమందు పైకెత్తబడు దినమున అవి వచ్చును.
29 ఇతర దేశములలో మంటలు, తుఫానులు మరియు పొగ ఆవిరి గురించి వినబడు దినమున అవి వచ్చును.
30 వివిధ స్థలములలో యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులు మరియు భూకంపముల గూర్చి కూడా వినబడును.
31 భూముఖముపై గొప్ప కలుషితములుండు దినమున అవి వచ్చును; అక్కడ హత్యలు, దొంగతనములు, అబద్ధములు, మోసములు, జారత్వములు మరియు అన్ని రకములైన హేయకార్యములుండును; అప్పుడు, ఇది చేయుము, అది చేయుము, అది ముఖ్యము కాదు, ఏలయనగా ప్రభువు అంత్యదినమున అట్టి వారిని పైకెత్తునని చెప్పువారు అనేకులుందురు. కానీ, అట్టి వారికి ఆపద, ఏలయనగా వారు ఘోర దుష్టత్వములో, దుర్నీతి యొక్క బంధకములలో ఉన్నారు.
32 ముఖ్యముగా, నా యొద్దకు రండి, మీ ధనమును బట్టి మీ పాపములు క్షమించబడునని చెప్పుచూ కట్టబడిన సంఘములుండు దినమున అవి వచ్చును.
33 అయ్యో! దుష్టులైన మూర్ఖులైన మెడబిరుసు జనులైన మీరు, లాభము సంపాదించుటకు మీ కొరకు మీరు సంఘములను ఎందుకు నిర్మించియున్నారు? మీ ఆత్మలపైకి నాశనమును తెచ్చుకొనునట్లు, మీరెందుకు దేవుని పరిశుద్ధ వాక్యమును రూపాంతరము చేసియున్నారు? ఇదిగో, మీరు దేవుని బయల్పాటుల వైపు చూడుడి; ఏలయనగా, ఆ దినమున ఈ విషయములన్నియూ నెరవేరవలసిన సమయము వచ్చును.
34 ఇదిగో, ఈ విషయములు మీ మధ్యకు వచ్చు ఆ దినమున, త్వరలో రానున్న దానికి సంబంధించిన గొప్ప ఆశ్చర్యకరమైన విషయములను ప్రభువు నాకు చూపియున్నాడు.
35 మీరు ఇక్కడున్నట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను, కానీ మీరింకను ఇక్కడ లేరు. ఇదిగో, యేసు క్రీస్తు మిమ్ములను నాకు చూపియున్నాడు మరియు మీ క్రియలను నేనెరుగుదును.
36 మీ హృదయ గర్వమందు మీరు నడుచుచున్నారని నేనెరుగుదును; కొద్దిమంది తప్ప, మిక్కిలి శ్రేష్ఠమైన వస్త్రములు ధరించి, అసూయ, కలహములు, ద్వేషము, హింసలు మరియు అన్ని విధములైన దుర్ణీతుల నిమిత్తము తమ హృదయ గర్వమందు తమనుతాము పైకెత్తుకొనని వారెవరూ లేరు; మీ హృదయ గర్వమును బట్టి, మీ సంఘములలో ప్రతి ఒక్కటి కూడా కలుషితమాయెను.
37 ఏలయనగా పేదవారు, అక్కరలోనున్న వారు, రోగులు మరియు బాధింపబడిన వారిని ప్రేమించుట కంటే అధికముగా మీరు ధనమును, మీ స్వాస్థ్యములను, శ్రేష్ఠమైన మీ వస్త్రములను మరియు మీ సంఘముల యొక్క అలంకరణలను ప్రేమించుచున్నారు.
38 ఓ కలుషితమైన వారలారా, వేషధారులారా, ఉపదేశకులారా, హరించివేయుదాని కొరకు మిమ్ములను అమ్ముకొను వారలారా, దేవుని యొక్క పరిశుధ్ధ సంఘమును మీరెందుకు కలుషితము చేసియున్నారు? క్రీస్తు యొక్క నామమును మీపై తీసుకొనుటకు మీరెందుకు సిగ్గుపడుచున్నారు? ఎన్నడూ అంతముకాని దౌర్భాగ్యము కంటే, అంతము లేని సంతోషము యొక్క విలువ గొప్పదని మీరెందకు తలంచరు—లోకము యొక్క పొగడ్త కొరకా?
39 మీరెందుకు జీవము లేని దానితో మిమ్ములను అలంకరించుకొని, ఆకలితోనున్న వారిని, అక్కరలోనున్న వారిని, దిగంబరులను మరియు బాధింపబడిన వారిని గమనించకుండా మీ ప్రక్కనుండి వెళ్ళనిచ్చెదరు?
40 మీరెందుకు లాభము సంపాదించుటకు మీ రహస్య హేయకార్యములను వ్యాపింపజేయుదురు మరియు విధవరాండ్రు ప్రభువు యెదుట మొరపెట్టునట్లు, అనాథలు ప్రభువు యెదుట మొరపెట్టునట్లు, మీపై ప్రతీకారము తీర్చుకొనుటకు వారి తండ్రులు మరియు వారి భర్తల యొక్క రక్తము నేల నుండి ప్రభువుకు మొరపెట్టునట్లు చేయుదురు?
41 ఇదిగో, ప్రతీకార ఖడ్గము మీపై వ్రేలాడుచున్నది; పరిశుద్ధుల యొక్క రక్తము నిమిత్తము ఆయన మీ మీద పగ తీర్చుకొను సమయము త్వరగా వచ్చును, ఏలయనగా ఇకమీదట వారి మొరలను ఆయన సహించడు.