10వ అధ్యాయము
మోర్మన్ గ్రంథమును గూర్చి సాక్ష్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చును—ఆత్మ యొక్క వరములు విశ్వాసులకు ఇవ్వబడును—ఆత్మీయ వరములు ఎల్లప్పుడు విశ్వాసముతో పాటు వచ్చును—మొరోనై సందేశము ధూళి నుండి మాట్లాడును—క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి, మీ ఆత్మలను పరిశుద్ధపరచుకొనుడి. సుమారు క్రీ. శ. 421 సం.
1 ఇప్పుడు మొరోనై అను నేను, నాకు ముఖ్యము అనిపించిన దానిని వ్రాయుదును; నేను, నా సహోదరులైన లేమనీయులకు వ్రాయుచున్నాను; క్రీస్తు యొక్క రాకడను గూర్చి సూచన ఇవ్వబడినప్పటి నుండి నాలుగు వందల ఇరువది సంవత్సరముల కంటే అధికము గతించిపోయినవని వారు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను.
2 మీకు ఉద్భోధించు విధములో నేను కొద్ది మాటలు పలికిన తరువాత, నేను ఈ వృత్తాంతములను ముద్రవేయుదును.
3 ఇదిగో, మీరు ఈ సంగతులను చదివినప్పుడు, మీరు వాటిని చదువుట దేవునియందు వివేకమైన యెడల, ఆదాము యొక్క సృష్టి నుండి మీరు ఈ సంగతులను అందుకొను సమయము వరకు నరుల సంతానముపట్ల ప్రభువు ఎంత కనికరముతోనుండెనో మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని, దానిని మీ హృదయములలో ధ్యానించవలెనని నేను మీకు ఉద్భోధించుచున్నాను.
4 మీరు ఈ సంగతులను పొందినప్పుడు, ఇవి సత్యమా కాదా అని మీరు నిత్యుడగు తండ్రియైన దేవుడిని క్రీస్తు యొక్క నామమందు అడుగవలెనని నేను మీకు ఉద్బోధించుచున్నాను; మీరు యథార్థ హృదయముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, మనఃపూర్వకముగా అడిగిన యెడల, ఆయన వాటి సత్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రత్యక్షపరచును.
5 పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అన్నిసంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు.
6 మంచి సంగతి ఏదైనను న్యాయమైనది మరియు సత్యమైనదైయుండును; కావున మంచిదేదియు క్రీస్తును నిరాకరించదు, కానీ ఆయన ఉన్నాడని ఒప్పుకొనును.
7 మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఉన్నాడని మీరు తెలుసుకొందురు; కావున దేవుని శక్తిని నిరాకరించవద్దని నేను మీకు ఉద్బోధించుచున్నాను; ఏలయనగా నేడు, రేపు మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్న ఆయన, శక్తి ద్వారా నరుల సంతానము యొక్క విశ్వాసమును బట్టి పనిచేయును.
8 మరలా నా సహోదరులారా, మీరు దేవుని బహుమానములను నిరాకరించవద్దని నేను మీకు ఉద్బోధించుచున్నాను, ఏలయనగా అవి అనేకమైనవి మరియు అవి ఒకే దేవుని నుండి వచ్చును. ఈ బహుమానములు అనేక మార్గములలో ఇవ్వబడెను; కానీ అందరిలోను అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే మరియు వారి ప్రయోజనము కొరకు దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షతల ద్వారా అవి మనుష్యులకు ఇవ్వబడెను.
9 ఏలాగనగా, జ్ఞానవాక్యమును బోధించునట్లు దేవుని ఆత్మ ద్వారా ఒకనికి అనుగ్రహించబడినది;
10 మరియొకనికి ఆ ఆత్మననుసరించి బుద్ధివాక్యమును బోధించునట్లు;
11 మరియొకనికి ఆ ఆత్మవలననే మిక్కిలి గొప్ప విశ్వాసము, మరియొకనికి స్వస్థపరచు వరములు;
12 మరియొకనికి మహా అద్భుతములు చేయునట్లు;
13 మరియొకనికి సమస్త సంగతులను గూర్చి ప్రవచించునట్లు;
14 మరియొకనికి దేవదూతలను, పరిచర్య చేయు ఆత్మలను చూచునట్లు;
15 మరియొకనికి అన్నిరకములైన భాషలు;
16 మరియొకనికి నానావిధమైన భాషలును, భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.
17 ఈ బహుమానములన్నియు క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా వచ్చును మరియు అవి, ఆయన చిత్తమును బట్టి ప్రతి మనుష్యునికి వేర్వేరుగా వచ్చును.
18 నా ప్రియమైన సహోదరులారా, ప్రతి మంచి బహుమానము క్రీస్తు నుండి వచ్చునని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను మీకు ఉద్భోధించుచున్నాను.
19 నా ప్రియమైన సహోదరులారా, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడని, నేను చెప్పిన ఆత్మ సంబంధమైన ఈ బహుమానములన్నీ నరుల సంతానము యొక్క అవిశ్వాసమును బట్టి తప్ప, లోకము నిలిచినంత వరకు ఎన్నడూ తీసివేయబడవని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను మీకు ఉద్భోధించుచున్నాను.
20 అందువలన విశ్వాసము ఉండవలెను; విశ్వాసము ఉండవలసిన యెడల, నిరీక్షణ కూడా ఉండవలెను; మరియు నిరీక్షణ ఉండవలసిన యెడల, దాతృత్వము కూడా ఉండవలెను.
21 మీరు దాతృత్వము కలిగియుండని యెడల, మీరు దేవుని రాజ్యమందు ఏ విధముగానూ రక్షింపబడలేరు; విశ్వాసము లేని యెడల, మీరు దేవుని రాజ్యమందు రక్షింపబడలేరు; మీకు నిరీక్షణ లేని యెడల కూడా మీరు రక్షింపబడలేరు.
22 మీకు నిరీక్షణ లేని యెడల, మీరు తప్పక నిస్పృహలో ఉండవలెను మరియు నిస్పృహ దుర్నీతిని బట్టి వచ్చును.
23 క్రీస్తు వాస్తవముగా మన పితరులతో ఇట్లు చెప్పెను: మీరు విశ్వాసము కలిగియున్న యెడల, నా యందు యుక్తమైన సంగతులన్నిటినీ మీరు చేయగలరు.
24 ఇప్పుడు మీ మధ్యనుండి దేవుని శక్తి మరియు బహుమానములు తీసివేయబడు దినము వచ్చిన యెడల, అది అవిశ్వాసమును బట్టియేనని భూదిగంతములన్నిటికి నేను చెప్పుచున్నాను.
25 ఇట్లు జరిగిన యెడల, నరుల సంతానమునకు ఆపద; ఏలయనగా మీ మధ్య మంచి చేయువాడు ఎవడూ ఉండడు, ఒక్కడు కూడా ఉండడు. మంచి చేయువాడు మీ మధ్య ఒక్కడు ఉండినను, వాడు దేవుని శక్తి మరియు బహుమానములను బట్టి పని చేయును.
26 ఇప్పుడు ఈ సంగతులను అంతము చేసి మరణించు వారికి ఆపద, ఏలయనగా వారి పాపములలో వారు మరణించెదరు మరియు వారు దేవుని రాజ్యమందు రక్షింపబడలేరు; క్రీస్తు యొక్క మాటలను బట్టి నేను దీనిని చెప్పుచున్నాను; మరియు నేను అబద్ధమాడను.
27 ఈ సంగతులను జ్ఞాపకము చేసుకొనవలెనని నేను మీకు ఉద్బోధించుచున్నాను; నేను అబద్ధమాడుటలేదని మీరు తెలుసుకొను సమయము త్వరగా వచ్చును, ఏలయనగా మీరు నన్ను దేవుని న్యాయపీఠమునొద్ద చూచెదరు; మరియు ప్రభువైన దేవుడు మీతో ఇట్లనును: మృతులలోనుండి ఒకడు మొరపెట్టుచున్నట్లుగా, ధూళి నుండి ఒకడు మాట్లాడుచున్నట్లుగా ఈ మనుష్యుని ద్వారా వ్రాయబడిన నా మాటలను నేను మీకు ప్రకటించలేదా?
28 ప్రవచనములు నెరవేరునట్లు నేను ఈ సంగతులు ప్రకటించుచున్నాను. ఇదిగో, అవి నిత్యదేవుని నోటి నుండి బయలు వెళ్ళును; ఆయన మాట తరతరములకు తీక్షణముగా వెళ్ళును.
29 మరియు నేను వ్రాసినది సత్యమని దేవుడు మీకు చూపును.
30 మీరు క్రీస్తు నొద్దకు రావలెనని, ప్రతి మంచి బహుమానమును పట్టుకొనవలెనని, చెడు బహుమానమును లేదా అపవిత్రమైన దానిని ముట్టుకొనరాదని నేను మీకు మరలా ఉద్భోధించుచున్నాను.
31 ఓ యెరూషలేమా మేల్కొనుము, ధూళి నుండి పైకి లెమ్ము; ఓ సీయోను కుమారీ, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము; నీవు ఇకపై కలవరపెట్టబడకుండునట్లు, ఓ ఇశ్రాయేలు వంశమా, నిత్యుడైన తండ్రి నీతో చేసిన నిబంధనలు నెరవేరునట్లు నీ స్టేకులను బలపరచుము మరియు నీ సరిహద్దులను నిరంతరము విస్తరించుము.
32 క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి మరియు సమస్త భక్తిహీనతనుండి మిమ్ములను మీరు ఉపేక్షించుకొనుడి; మీకైమీరు సమస్త భక్తిహీనత నుండి ఉపేక్షించుకొని, మీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో దేవుడిని ప్రేమించిన యెడల, అప్పుడు ఆయన కృప మీకు చాలును; ఆయన కృప ద్వారా మీరు క్రీస్తు నందు పరిపూర్ణులగుదురు; దేవుని కృప ద్వారా మీరు క్రీస్తు నందు పరిపూర్ణులైన యెడల, మీరేవిధముగానూ దేవుని శక్తిని నిరాకరించలేరు.
33 మరలా, మీరు దేవుని కృప ద్వారా క్రీస్తు నందు పరిపూర్ణులై ఆయన శక్తిని నిరాకరించని యెడల, దేవుని కృప ద్వారా క్రీస్తునందు మీరు పరిశుద్ధపరచబడుదురు; మీ పాపములు క్షమించబడునట్లు తండ్రి యొక్క నిబంధనలో భాగముగా ఉన్న క్రీస్తు యొక్క రక్తము చిందించబడుట ద్వారా మీరు పరిశుద్ధులుగా, మచ్చలేనివారిగా అగుదురు.
34 ఇప్పుడు, నేను అందరికి వీడ్కోలు చెప్పుచున్నాను. నా ఆత్మ మరియు శరీరము తిరిగి ఏకమై, సజీవులకును మృతులకును నిత్య న్యాయాధిపతియైన గొప్ప యెహోవా యొక్క ప్రీతికరమైన న్యాయపీఠము యెదుట మిమ్ములను కలుసుకొనుటకు ఆకాశమండలము గుండా జయించిన వానిగా నేను ముందుకు తేబడువరకు, దేవుని పరదైసులో విశ్రాంతి పొందుటకు నేను త్వరగా వెళ్ళుదును. ఆమేన్.
సమాప్తము