6వ అధ్యాయము
పశ్చాత్తాపపడిన వ్యక్తులకు బాప్తిస్మము ఇవ్వబడి, వారితో సహవాసము చేయబడును—పశ్చాత్తాపపడిన సంఘ సభ్యులు క్షమించబడుదురు—పరిశుద్ధాత్మ శక్తి చేత సమావేశములు నిర్వహించబడెను. సుమారు. క్రీ. శ. 401–421 సం.
1 ఇప్పుడు నేను బాప్తిస్మమును గూర్చి మాట్లాడెదను. ఇదిగో పెద్దలు, యాజకులు, బోధకులు బాప్తిస్మము పొందిరి; మరియు వారు దానికి యోగ్యులైయున్నారనుటకు తగిన ఫలమును వారు ఫలించితే తప్ప, వారు బాప్తిస్మము పొందలేదు.
2 విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మతో ముందుకువచ్చి, తమ పాపములన్నిటి విషయమై వారు నిజముగా పశ్చాత్తాపపడిరని సంఘమునకు సాక్ష్యమిచ్చిన వారికి తప్ప, ఎవరికీ వారు బాప్తిస్మమివ్వలేదు.
3 క్రీస్తు నామమును తమపై తీసుకొని, అంతము వరకు ఆయనను సేవించుటకు నిశ్చయించుకున్నవారు తప్ప, ఎవరూ బాప్తిస్మము కొరకు అంగీకరించబడలేదు.
4 మరియు వారు బాప్తిస్మము కొరకు అంగీకరించబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపించబడి శుద్ధి చేయబడిన తరువాత, వారు క్రీస్తు యొక్క సంఘజనుల మధ్య లెక్కింపబడిరి; మరియు వారిని సరియైన మార్గమందు ఉంచుటకు, వారిని నిరంతరము ప్రార్థన యందు మెలకువగా ఉంచుటకు, వారి విశ్వాసము యొక్క ఆదియు అంతమునైన క్రీస్తు యొక్క యోగ్యతలపై మాత్రమే ఆధారపడుచూ వారు జ్ఞాపకము చేసుకొనబడి, దేవుని సువార్త ద్వారా పోషింపబడునట్లు వారి పేర్లు తీసుకొనబడినవి.
5 మరియు ఉపవాసముండుటకు, ప్రార్థన చేయుటకు, వారి ఆత్మల సంక్షేమమును గూర్చి ఒకరితోనొకరు మాట్లాడుటకు సంఘము తరచుగా కూడుకొనెను.
6 ప్రభువైన యేసు యొక్క జ్ఞాపకార్థము, రొట్టె మరియు ద్రాక్షారసమందు పాలుపొందుటకు వారు తరచుగా సమకూడిరి.
7 వారి మధ్య ఏ దోషము జరుగకుండా చూచుటలో వారు ఖచ్చితముగా ఉండిరి; దోషము చేయుచూ కనుగొనబడి, పెద్దల యెదుట సంఘము యొక్క ముగ్గురు సాక్షులచేత ఖండించబడిన వారెవరైనా పశ్చాత్తాపపడకుండా తప్పు ఒప్పుకొనని యెడల, వారి పేర్లు తొలగించబడెను మరియు వారు క్రీస్తు యొక్క జనుల మధ్య లెక్కింపబడలేదు.
8 కానీ మనఃపూర్వకముగా ఎంత తరచుగా వారు పశ్చాత్తాపపడి క్షమాపణ కోరితిరో, అంత తరచుగా వారు క్షమించబడిరి.
9 మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆత్మ ప్రభావితము చేసినట్లుగా వారి సమావేశములు సంఘము చేత నిర్వహించబడెను; ఏలయనగా ప్రవచించుటకు, ఉద్బోధించుటకు, ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు లేదా పాడుటకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిని ఎట్లు నడిపించెనో అట్లు చేయబడెను.