7వ అధ్యాయము
ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు ఒక ఆహ్వానము ఇవ్వబడెను—మనఃపూర్వకముగా ప్రార్థన చేయుడి—కీడు నుండి మేలును తెలుసుకొనుటకు క్రీస్తు యొక్క ఆత్మ మనుష్యులకు సహాయము చేయును—క్రీస్తును తిరస్కరించి, కీడు చేయమని సాతాను మనుష్యులను ప్రోత్సహించును—క్రీస్తు యొక్క రాకను ప్రవక్తలు బయలుపరచుదురు—విశ్వాసము ద్వారా అద్భుతములు చేయబడును మరియు దేవదూతలు పరిచర్య చేయుదురు—మనుష్యులు నిత్యజీవము కొరకు నిరీక్షించవలెను మరియు దాతృత్వమును హత్తుకొనవలెను. సుమారు క్రీ. శ. 401–421 సం.
1 ఇప్పుడు మొరోనై అను నేను, విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వమును గూర్చి నా తండ్రి మోర్మన్ పలికిన మాటలలో కొన్నిటిని వ్రాయుచున్నాను; ఏలయనగా, ఆరాధనా స్థలము కొరకు వారు కట్టిన సమాజ మందిరమందు అతడు వారికి బోధించుచుండగా ఈ మాదిరి చొప్పున అతడు జనులకు చెప్పెను.
2 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మోర్మన్ అను నేను మీతో మాట్లాడుచున్నాను; తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప మరియు ఆయన పరిశుద్ధ చిత్తము ద్వారా నాకు ఆయన పిలుపు యొక్క బహుమానమును బట్టి ఈ సమయమున నేను మీతో మాట్లాడుటకు అనుమతించబడితిని.
3 అందువలన సంఘపు వారై, క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులై, తగినంత నిరీక్షణను పొందిన మీతో నేను చెప్పునదేమనగా—ఆ నిరీక్షణ ద్వారా, ఈ సమయము నుండి మొదలుకొని పరలోకమందు మీరు ఆయనతో విశ్రాంతి పొందు వరకు ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించుదురు.
4 ఇప్పుడు నా సహోదరులారా, నరుల సంతానముతో మీ సమాధానపు నడతను బట్టి నేను మీకు ఈ సంగతులను తీర్పు తీర్చుదును.
5 ఏలయనగా, వారి క్రియలను బట్టి మీరు వారిని ఎరుగుదురని చెప్పిన దేవుని వాక్యమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను; వారి క్రియలు మంచివైన యెడల, వారు కూడా మంచి వారగుదురు.
6 ఇదిగో, ఒక మనుష్యుడు చెడ్డవాడైయుండి మంచి దానిని చేయలేడని దేవుడు చెప్పియున్నాడు; అతడు ఒక బహుమానమును ఇచ్చినా లేదా దేవునికి ప్రార్థన చేసినా అతడు మనఃపూర్వకముగా చేయని యెడల, అది అతనికి ఏ ప్రయోజనము చేకూర్చదు.
7 అది అతనికి నీతిగా యెంచబడదు.
8 ఏలయనగా, ఒక మనుష్యుడు చెడ్డవాడైయుండి ఒక బహుమానమును ఇచ్చిన యెడల, అతడు దానిని అయిష్టముగా ఇచ్చును; అందువలన, అతడి బహుమానమును అతడే ఉంచుకొనినట్లు అతనికి యెంచబడును; కావున అతడు, దేవుని యెదుట చెడుగా యెంచబడును.
9 అదే విధముగా మనఃపూర్వకముగా ప్రార్థన చేయని యెడల, అది ఒక మనుష్యునికి చెడుగా యెంచబడును; మరియు అది అతనికి ఏ ప్రయోజనము చేకూర్చదు, ఏలయనగా అట్టి వానిని దేవుడు అంగీకరించడు.
10 అందువలన, చెడ్డవాడు మంచి దానిని చేయలేడు లేదా మంచి బహుమానమును ఇవ్వలేడు.
11 ఏలయనగా, చేదైన ఊట మంచి నీటిని తీసుకురాలేదు లేదా మంచి ఊట చేదైన నీటిని తీసుకురాలేదు; అందువలన, ఒక మనుష్యుడు అపవాది యొక్క సేవకుడైయుండి క్రీస్తును వెంబడించలేడు; అతడు క్రీస్తును వెంబడించిన యెడల, అతడు అపవాది యొక్క సేవకుడు కాలేడు.
12 కావున, మంచి సంగతులన్నియు దేవుని నుండి వచ్చును, చెడ్డవి అపవాది నుండి వచ్చును; ఏలయనగా, అపవాది దేవునికి శత్రువైయుండి ఆయనకు విరుద్ధముగా నిరంతరము పోరాడుచున్నాడు; పాపము చేయుటకు మరియు నిరంతరము చెడు చేయుటకు ఆహ్వానించుచూ ప్రలోభపెట్టుచున్నాడు.
13 కానీ, దేవుని నుండి వచ్చునది నిరంతరము మంచిని చేయుటకు ఆహ్వానించుచూ ప్రేరేపించును; అందువలన మంచిని చేయుటకు, దేవుడిని ప్రేమించుటకు మరియు ఆయనను సేవించుటకు ఆహ్వానించి, ఆకర్షించు ప్రతి సంగతి దేవుని వలన ప్రేరేపించబడినది.
14 కావున నా ప్రియమైన సహోదరులారా, చెడ్డ దానిని దేవునికి సంబంధించినదని లేదా మంచిదైయుండి దేవుని నుండి వచ్చినదానిని అపవాదికి సంబంధించినదని మీరు తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడుడి.
15 నా సహోదరులారా, మీరు చెడు నుండి మంచిని తెలుసుకొనునట్లు తీర్పు తీర్చు సామర్థ్యము మీకు ఇవ్వబడినది మరియు మీరు పరిపూర్ణ జ్ఞానముతో తెలుసుకొనునట్లు తీర్పు తీర్చు విధానము రాత్రి పగలు మధ్య తేడా తెలుసుకొనగలిగినంత సులువుగానున్నది.
16 ఏలయనగా, చెడు నుండి మంచిని ఎరుగునట్లు క్రీస్తు యొక్క ఆత్మ ప్రతి మనుష్యునికి ఇవ్వబడినది; అందువలన, తీర్పు తీర్చు విధానమును నేను మీకు చూపెదను; ఏలయనగా, మంచి చేయమని ఆహ్వానించుచూ, క్రీస్తునందు విశ్వసించమని ప్రోత్సహించు ప్రతి సంగతి క్రీస్తు యొక్క శక్తి మరియు బహుమానము ద్వారా పంపబడెను; అందువలన అది దేవునికి సంబంధించినదని పరిపూర్ణమైన జ్ఞానముతో మీరు తెలుసుకొనగలరు.
17 కానీ, చెడు చేయమని, క్రీస్తునందు విశ్వాసముంచకుండా ఆయనను తిరిస్కరించమని, దేవుడిని సేవించవద్దని ఏదైనా మనుష్యులను ప్రోత్సహించిన యెడల, అప్పుడు అది అపవాదికి సంబంధించినదని పరిపూర్ణమైన జ్ఞానముతో మీరు తెలుసుకొనగలరు; ఏలయనగా, ఈ విధముగా అపవాది పనిచేయును; అతడు, అతని దూతలు లేదా అతనికి తమను లోబరచుకొన్నవారు ఏ మనుష్యుని, కనీసము ఒక్కరిని కూడా మంచి చేయుటకు ప్రోత్సహించరు.
18 ఇప్పుడు నా సహోదరులారా, మీరు దేని ద్వారా తీర్పు తీర్చగలరో ఆ వెలుగును, అనగా క్రీస్తు యొక్క వెలుగును మీరు ఎరిగియున్నందున, మీరు పొరపాటుగా తీర్పు తీర్చరాదని చూచుకొనుడి; ఏలయనగా, మీరు తీర్చిన అదే తీర్పుతో మీరు కూడా తీర్పు తీర్చబడుదురు.
19 అందువలన సహోదరులారా, మీరు చెడు నుండి మంచిని తెలుసుకొనునట్లు క్రీస్తు యొక్క వెలుగు నందు శ్రద్ధగా వెదుకవలెనని నేను మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను; మీరు ప్రతి మంచి సంగతిని హత్తుకొని, దానిని ఖండించని యెడల మీరు తప్పక క్రీస్తు యొక్క బిడ్డయగుదురు.
20 ఇప్పుడు నా సహోదరులారా, మీరు ప్రతి మంచి సంగతిని హత్తుకొనుట ఎట్లు సాధ్యము?
21 ఇప్పుడు, నేను మాట్లాడుదునని చెప్పిన ఆ విశ్వాసమును గూర్చి నేను చెప్పెదను; మరియు ప్రతి మంచి సంగతిని మీరు హత్తుకోగల మార్గమును నేను మీకు చెప్పెదను.
22 ఏలయనగా, సమస్త సంగతులను ఎరిగియుండి, యుగయుగముల వరకు ఉన్న దేవుడు క్రీస్తు యొక్క రాకను గూర్చి విశదము చేయుటకు, నరుల సంతానమునకు పరిచర్య చేయుటకు దేవదూతలను పంపెను; మరియు క్రీస్తునందు ప్రతి మంచి సంగతి వచ్చును.
23 క్రీస్తు వచ్చునని తన నోటిద్వారా దేవుడు ప్రవక్తలకు కూడా ప్రకటించెను.
24 ఇదిగో, అనేకమార్గములలో ఆయన నరుల సంతానమునకు మంచి సంగతులను విశదము చేసెను; మంచివైన అన్ని సంగతులు క్రీస్తు నుండి వచ్చును; లేని యెడల, మనుష్యులు పతనమగుదురు మరియు వారి యొద్దకు ఏ మంచి సంగతి రాజాలదు.
25 కావున, దేవదూతల పరిచర్య ద్వారా మరియు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మనుష్యులు క్రీస్తునందు విశ్వాసము సాధన చేయసాగిరి; ఆ విధముగా, విశ్వాసము ద్వారా వారు ప్రతి మంచి సంగతిని హత్తుకొనిరి మరియు క్రీస్తు వచ్చు వరకు ఆ విధముగా ఉండెను.
26 ఆయన వచ్చిన తరువాత, మనుష్యులు ఆయన నామమందు విశ్వాసము ద్వారా కూడా రక్షింపబడిరి; విశ్వాసము ద్వారా వారు దేవుని కుమారులగుదురు. మరియు క్రీస్తు జీవముతోడు ఆయన మన పితరులతో ఈ విధముగా చెప్పుచూ పలికెను: మంచిదైన ఏ సంగతియైననూ మీరు పొందుదురని నమ్ముచూ నా నామమందు తండ్రిని మీరు విశ్వాసముతో అడిగిన యెడల, అది మీకు చేయబడును.
27 అందువలన నా ప్రియమైన సహోదరులారా, ఆయన నరుల సంతానముపై కలిగియున్న కనికరపు హక్కులను తండ్రి నుండి పొందుటకు క్రీస్తు పరలోకములోనికి ఆరోహణుడై దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చున్నందున అద్భుతములు ఆగిపోయినవా?
28 ఆయన ధర్మశాస్త్రము యొక్క అవసరాలను చెల్లించెను మరియు ఆయన యందు విశ్వాసము కలిగిన వారందరినీ ఆయన హక్కుగా కోరును; ఆయనయందు విశ్వాసము కలిగిన వారు ప్రతి మంచి సంగతిని హత్తుకొందురు; అందువలన ఆయన నరుల సంతానము యొక్క హేతువును వాదించును; ఆయన నిత్యము పరలోకములందు నివసించును.
29 మరియు నా ప్రియమైన సహోదరులారా, ఆయన దీనిని చేసియున్నందున అద్భుతములు ఆగిపోయినవా? ఆగలేదు అని నేను మీతో చెప్పుచున్నాను; నరుల సంతానమునకు దేవదూతలు పరిచర్య చేయుట కూడా మానివేయలేదు.
30 ఏలయనగా, బలమైన విశ్వాసము కలిగియుండి, దైవభక్తి యొక్క ప్రతివిధమందు నిబ్బరమైన మనస్సు కలిగిన వారికి తమనుతాము కనబరచుకొనుచూ, ఆయన ఆజ్ఞ ప్రకారము పరిచర్య చేయుటకు వారు ఆయనకు లోబడియున్నారు.
31 వారి పరిచర్య బాధ్యత ఏమనగా, పశ్చాత్తాపపడమని మనుష్యులను పిలుచుట, నరుల సంతానమునకు తండ్రి చేసిన నిబంధనల కార్యము నెరవేర్చుట మరియు చేయుట, వారు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చునట్లు ప్రభువు యొక్క ఎన్నుకోబడిన పాత్రలకు క్రీస్తు యొక్క వాక్యమును ప్రకటించుట ద్వారా నరుల సంతానము మధ్య మార్గమును సిద్ధపరచుట.
32 ఆ విధముగా చేయుట ద్వారా తన శక్తిని బట్టి మనుష్యులలో మిగిలిన వారు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండునట్లు, పరిశుద్ధాత్మ వారి హృదయములలో స్థానము కలిగియుండునట్లు, ప్రభువైన దేవుడు మార్గమును సిద్ధము చేయును; మరియు ఈ మాదిరిని తండ్రి, నరుల సంతానముతో చేసిన నిబంధనలను నెరవేర్చును.
33 మరియు క్రీస్తు ఇట్లు చెప్పియుండెను: మీరు నా యందు విశ్వాసము కలిగియున్న యెడల, నా దృష్టిలో సరియైనది ఏదైనను చేయుటకు మీరు శక్తి కలిగియుందురు.
34 మరియు ఆయన ఇట్లు చెప్పియుండెను: భూదిగంతములలో నున్న మీరందరు పశ్చాత్తాపపడి నా యొద్దకు రండి, నా నామమున బాప్తిస్మము పొందుడి మరియు మీరు రక్షింపబడునట్లు నా యందు విశ్వాసము కలిగియుండుడి.
35 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో చెప్పిన ఈ సంగతులు సత్యమైన యెడల, అవి సత్యమని దేవుడు అంత్యదినమున శక్తి మరియు గొప్ప మహిమతో మీకు చూపిన యెడల మరియు అవి సత్యమైన యెడల, అద్భుతముల దినము ఆగిపోయినదా?
36 లేదా దేవదూతలు నరుల సంతానమునకు కనిపించుట మానివేసెనా? లేదా వారిని చేరకుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆయన నిలిపివేసెనా? లేదా కాలమున్నంతవరకు, భూమి నిలుచునంత మట్టుకు, లేదా దాని పైన రక్షింపబడుటకు ఒక మనుష్యుడు ఉండునంత వరకు ఆయన నిలిపివేయునా?
37 లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా, విశ్వాసము ద్వారానే అద్భుతములు జరిగించబడును; విశ్వాసము ద్వారానే దేవదూతలు మనుష్యులకు కనిపించి, పరిచర్య చేయుదురు; అందువలన ఈ సంగతులు ఆగిపోయిన యెడల, నరుల సంతానమునకు ఆపద; ఏలయనగా, అవిశ్వాసమును బట్టియే అట్లు జరుగును మరియు అంతయు వ్యర్థమగును.
38 ఏలయనగా క్రీస్తు యొక్క మాటల ప్రకారము, ఆయన నామమందు విశ్వాసము కలిగియుండని యెడల ఏ మనుష్యుడు రక్షింపబడలేడు; అందువలన ఈ సంగతులు ఆగిపోయిన యెడల, అప్పుడు విశ్వాసము కూడా ఆగిపోవును; మరియు మనుష్యుని యొక్క స్థితి భయంకరమగును, ఏలయనగా వారు ఎట్టి విమోచన చేయబడనట్లు ఉందురు.
39 కానీ నా ప్రియమైన సహోదరులారా, నేను మిమ్ములను గూర్చి శ్రేష్ఠమైన సంగతులను తీర్పు తీర్చెదను, ఏలయనగా మీ సాత్వికమును బట్టి, మీరు క్రీస్తునందు విశ్వాసము కలిగియున్నారని నేను తీర్పుతీర్చుచున్నాను; మీరు ఆయనయందు విశ్వాసము కలిగియుండని యెడల, మీరు ఆయన సంఘ జనుల మధ్య లెక్కింపబడుటకు యోగ్యులు కారు.
40 మరలా నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో నిరీక్షణను గూర్చి మాట్లాడుదును. మీరు నిరీక్షణ కలిగియుండని యెడల, మీరు విశ్వాసమును ఎట్లు పొందగలరు?
41 మీ నిరీక్షణ దేని కొరకైయున్నది? ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా—క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా నిత్యజీవమునకు లేపబడుటకు మీరు నిరీక్షణ కలిగియుండవలెను; మరియు ఇది వాగ్దానము ప్రకారము ఆయనయందు మీ విశ్వాసమును బట్టియైయున్నది.
42 అందువలన ఒక మనుష్యుడు విశ్వాసము కలిగియున్న యెడల, అతడు తప్పక నిరీక్షణ కలిగియుండవలెను; ఏలయనగా, విశ్వాసము లేకుండా నిరీక్షణ ఉండజాలదు.
43 మరలా నేను మీతో చెప్పునదేమనగా—అతడు సాత్వీకుడైయుండి దీనమనస్సు కలిగియుండని యెడల అతడు విశ్వాసమును, నిరీక్షణను కలిగియుండలేడు.
44 అట్లయిన యెడల, అతని విశ్వాసము మరియు నిరీక్షణ వ్యర్థమైనవి, ఏలయనగా సాత్వీకులు మరియు దీనమనస్సు గలవారు తప్ప, ఎవరూ దేవుని యెదుట అంగీకరించబడరు; మరియు ఒక మనుష్యుడు సాత్వీకుడైయుండి దీనమనస్సు కలిగియుండి, యేసే క్రీస్తని పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఒప్పుకొనిన యెడల, అతడు తప్పక దాతృత్వము కలిగియుండవలెను; ఏలయనగా అతడు దాతృత్వము కలిగియుండని యెడల, అతడు ఏమియు కాడు; అందువలన, అతడు తప్పక దాతృత్వము కలిగియుండవలెను.
45 దాతృత్వము దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును.
46 అందువలన నా ప్రియమైన సహోదరులారా, మీరు దాతృత్వము కలిగియుండని యెడల, మీరు ఏమియు కారు; ఏలయనగా, దాతృత్వము ఎన్నడూ విఫలము కాదు. కావున, అన్నిటిలో గొప్పదైన దాతృత్వమును హత్తుకొనియుండుడి, ఏలయనగా అన్నియు విఫలమగును—
47 కానీ, దాతృత్వము క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది, అది నిత్యము నిలుచును; మరియు అంత్య దినమున దానిని కలిగియుండువానికి మేలు కలుగును.
48 అందువలన నా ప్రియమైన సహోదరులారా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులందరికి ఆయన అనుగ్రహించిన ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని, మీరు దేవుని కుమారులు కావలెనని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక మనము ఆయనను పోలియుండవలెనని, మనము ఈ నిరీక్షణను కలిగియుండవలెనని, ఆయన శుద్ధముగా ఉన్నట్లే మనము శుద్ధము చేయబడవలెనని హృదయము యొక్క పూర్ణ శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి. ఆమేన్.