లేఖనములు
1 నీఫై 2


2వ అధ్యాయము

లీహై తన కుటుంబమును ఎఱ్ఱసముద్ర తీరమున గల అరణ్యములోనికి తీసుకొనివెళ్ళును—వారు తమ ఆస్థిని వదిలివేయుదురు—లీహై ప్రభువుకు బలిని అర్పించి, దేవుని ఆజ్ఞలు పాటించవలెనని తన కుమారులకు బోధించును—లేమన్‌, లెముయెల్ లు తమ తండ్రికి వ్యతిరేకముగా సణుగుదురు—నీఫై విధేయుడైయుండి విశ్వాసముతో ప్రార్థన చేయును; ప్రభువు అతనితో మాట్లాడును, అతడు తన సహోదరులపై పరిపాలించుటకు ఎన్నుకోబడును. సుమారు క్రీ. పూ. 600 సం.

1 ఏలయనగా ప్రభువు నా తండ్రితో ఒక స్వప్నమందు మాట్లాడి ఇట్లు చెప్పెను: లీహై, నీవు చేసిన క్రియలను బట్టి నీవు ధన్యుడవు; నీవు విశ్వాసముగా ఉండి, నేను నీకు ఆజ్ఞాపించిన వాక్యములను ఈ జనులకు ప్రకటించితివి; కావున, వారు నీ ప్రాణము తీయుటకు ప్రయత్నించుచున్నారు.

2 తరువాత ఒక స్వప్నములో తన కుటుంబమును తీసుకొని, అరణ్యములోనికి వెళ్ళిపోవలెనని ప్రభువు నా తండ్రిని ఆజ్ఞాపించెను.

3 అతడు ప్రభువు వాక్కునకు విధేయుడై, ప్రభువు అతడిని ఆజ్ఞాపించినట్లుగా చేసెను.

4 అతడు అరణ్యములోనికి వెళ్ళిపోయెను. తనతోపాటు ఏమియు తీసుకొనకుండా అతడు తన ఇంటిని, తన స్వాస్థ్యమైన భూమిని, బంగారమును, వెండిని, ప్రశస్థ వస్తువులను వదిలివేసి, తన కుటుంబమును, భోజన సామాగ్రిని, గుడారములను మాత్రమే తీసుకొని అరణ్యములోనికి వెళ్ళిపోయెను.

5 ఎఱ్ఱసముద్రము ఒడ్డుకు దగ్గరలోనున్న సరిహద్దులనొద్దకు వచ్చి, ఆ సరిహద్దులలోని అరణ్యములో అతడు ప్రయాణము చేసెను; అరణ్యములో నా తల్లి శరయ, నా అన్నలు లేమన్‌, లెముయెల్, శామ్‌లతో కూడిన తన కుటుంబముతో ప్రయాణము చేసెను.

6 అరణ్యములో మూడు దినములు ప్రయాణము చేసిన తరువాత, ఒక నది ఒడ్డున గల లోయలో తన గుడారమును వేసుకొనెను.

7 తరువాత, అతడు రాళ్ళతో బలిపీఠమొకటి కట్టి ప్రభువుకు అర్పణ చేసి, మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను.

8 అతడు ఆ నదిని లేమన్‌ అని పిలిచెను, అది ఎఱ్ఱసముద్రములోనికి ప్రవహించుచుండెను; ఆ లోయ దాని సరిహద్దు ద్వారమునొద్ద ఉండెను.

9 ఆ నది యొక్క జలములు ఎఱ్ఱసముద్రపు ఊటలోనికి ప్రవహించుట చూచినప్పుడు, నా తండ్రి లేమన్‌తో ఇట్లు చెప్పెను: ఓయీ, నీవు ఈ నది వలే సమస్త నీతి యొక్క ఊటలోనికి నిరంతరము పరుగులిడుచుండవలెను!

10 అతడు లెముయెల్ తో కూడా ఇట్లు చెప్పెను: ఓయీ, నీవు ఈ లోయ వలే స్థిరముగాను, ధృఢముగాను, కదలకయుండి ప్రభువు ఆజ్ఞలను పాటించుచుండవలెను!

11 ఇప్పుడతడు లేమన్‌, లెముయెలుల మెడబిరుసుతనమును బట్టి ఈ విధముగా పలికెను; ఏలయనగా, వారు తమ తండ్రికి వ్యతిరేకముగా ఎన్నో విషయములయందు సణిగిరి; అతడు దర్శనములు చూసేవాడు గనుక, వారి స్వాస్థ్యమైన దేశమును, బంగారమును, వెండిని, ప్రశస్థ వస్తువులను వదిలి అరణ్యములో నశించునట్లు వారిని యెరూషలేము దేశము నుండి బయటకు నడిపించెనని, అతని హృదయము యొక్క మూర్ఖపు ఊహలను బట్టియే అతడిలా చేసెనని వారనిరి.

12 లేమన్‌ లెముయెల్‌లు జ్యేష్ఠులైయుండి తమ తండ్రికి వ్యతిరేకముగా ఈలాగు సణిగిరి; వారిని సృష్టించిన ఆ దేవుని వ్యవహారములు వారెరిగియుండలేదు గనుక వారు సణిగిరి.

13 అంతేకాక, ప్రవక్తల మాటల ప్రకారము ఆ గొప్ప పట్టణమైన యెరూషలేము నాశనము చేయబడగలదని వారు నమ్మలేదు. వారు, నా తండ్రి ప్రాణమును తీసివేయుటకు ప్రయత్నించిన యెరూషలేమందలి యూదుల వలే నుండిరి.

14 అప్పుడు నా తండ్రి ఆత్మపూర్ణుడై వారి ఆకారములు అతని ముందు కంపించు వరకు లెముయెల్ లోయలో శక్తితో వారితో మాట్లాడెను; అతనికి వ్యతిరేకముగా పలుకలేనంతగా అతడు వారి గర్వమణచినందున అతడు ఆజ్ఞాపించినట్లుగా వారు చేసిరి.

15 నా తండ్రి ఒక గుడారములో నివసించెను.

16 నీఫై అను నేను మిక్కిలి యవ్వనుడనైయున్నప్పటికీ, భారీకాయుడనైయుండి, దేవుని మర్మములను తెలుసుకొనవలెననే గొప్ప కోరికలు కలిగియుంటిని; అందువలన, నేను ప్రభువుకు మొరపెట్టగా ఆయన నన్ను దర్శించి, నా హృదయమును మృదువుగా చేసినందున నా తండ్రి చేత పలుకబడిన మాటలన్నింటిని నేను నమ్మితిని; కావున, నా సహోదరుల వలే నేను అతనికి వ్యతిరేకముగా తిరుగబడలేదు.

17 ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా నాకు విశదపరచిన విషయములను తెలియజేయుచూ నేను శామ్‌తో మాట్లాడితిని. అతడు నా మాటల యందు విశ్వసించెను.

18 కానీ లేమన్‌, లెముయెల్‌లు నా మాటలను ఆలకించరు; వారి హృదయ కాఠిన్యమును బట్టి నొచ్చుకొనిన వాడనై, వారి కొరకు నేను ప్రభువుకు మొరపెట్టితిని.

19 అప్పుడు ప్రభువు నాతో మాట్లాడుచూ ఇట్లనెను: నీఫై, నీ విశ్వాసమును బట్టి నీవు ధన్యుడవు, ఏలయనగా నీవు నన్ను శ్రద్ధతోను, దీనమనస్సుతోను వెదికితివి.

20 నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము నీవు వర్ధిల్లుదువు మరియు ఒక వాగ్దానదేశమునకు అనగా మీ కొరకు నేను సిద్ధపరచిన దేశమునకు, మిగిలిన అన్ని దేశముల కంటే శ్రేష్ఠమైన ఒక దేశమునకు నడిపించబడుదువు.

21 నీ సహోదరులు నీకు వ్యతిరేకముగా తిరుగబడిన యెడల, వారు ప్రభువు సన్నిధి నుండి కొట్టివేయబడుదురు.

22 నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము నీవు, నీ సహోదరులపై అధిపతిగాను, ఉపదేశకునిగాను చేయబడుదువు.

23 వారు నాకు వ్యతిరేకముగా తిరగబడు దినమున నేను వారిని బాధాకరమైన శాపముతో శపించెదను. నీ సంతానము కూడా నాకు వ్యతిరేకముగా తిరగబడనంత వరకు, వారికి నీ సంతానముపై ఎట్టి అధికారము ఉండదు.

24 నాకు వ్యతిరేకముగా వారు తిరగబడిన యెడల, వారు నీ సంతానమునకు ఒక కొరడా వలే ఉండి, వారిని స్మరణ మార్గములలోకి పురిగొల్పుదురు.