లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 108


108వ ప్రకరణము

1835, డిసెంబరు 26న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. లైమన్ షెర్మన్ విన్నపమును బట్టి ఈ ప్రకరణము పొందబడినది, అతడు ఇంతకుముందు డెబ్బదిగా నియమించబడెను. అతడు తన బాధ్యతను తెలుపు బయల్పాటు కొరకు ఒక విన్నపముతో ప్రవక్త యొద్దకు వచ్చెను.

1–3, లైమన్ షెర్మన్ తన పాపముల నిమిత్తము క్షమించబడెను; 4–5, సంఘమును నడిపించు పెద్దలతో అతడు లెక్కించబడవలెను; 6–8, సువార్తను ప్రకటించుటకు, తన సహోదరులను బలపరచుటకు అతడు పిలువబడెను.

1 నా సేవకుడవైన లైమన్, నిశ్చయముగా ప్రభువు నీకు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నీ పాపములు క్షమించబడియున్నవి, ఎందుకనగా నేను నియమించిన వాని యొద్దకు ఉపదేశమును పొందుటకు ఈ ఉదయము ఇక్కడికి వచ్చుటలో నా స్వరమునకు నీవు విధేయత చూపితివి.

2 కాబట్టి, నీ ఆత్మీయ స్థానమును గూర్చి నీ ఆత్మకు ఆదరణ కలుగును గాక మరియు నా స్వరమును ఇక ఎంతమాత్రము తిరస్కరింపకుందువు గాక.

3 నీవు చేసియున్న, ఇకపై చేయబోవు నీ ప్రమాణములను పాటించుటలో మరింత జాగ్రత్తగానుండి పనిచేయుము మరియు నీవు చాలా గొప్ప దీవెనలతో దీవించబడుదువు.

4 నా సేవకులచేత వ్రతదినము పిలువబడు వరకు సహనముతో వేచియుండుము. అప్పుడు నా మొదటి పెద్దలతో నీవు జ్ఞాపకములోనుందువు మరియు నేను ఎన్నుకొనిన మిగిలిన నా పెద్దలతో నియామకము వలన హక్కును పొందెదవు.

5 ఇదిగో, నీవు విశ్వాసముతో కొనసాగిన యెడల, తండ్రి నుండి నీకు వాగ్దానము ఇదియే.

6 నా సువార్తను ప్రకటించుటకు నీవు హక్కును కలిగియుండి ఎక్కడికైనను నేను నిన్ను పంపు ఆ దినమున, ఇప్పటినుండి ఆ సమయము వరకు అది నీ యెడల నెరవేరును.

7 కాబట్టి, నీ సంభాషణలన్నిటిలో, నీ ప్రార్థనలన్నిటిలో, నీ ఉద్భోధలన్నిటిలో మరియు నీవు చేయు పనులన్నిటిలో నీ సహోదరులను బలపరచుము.

8 ఇదిగో, ఎప్పటికీ నిన్ను దీవించుటకు మరియు విడిపించుటకు నేను నీతోనున్నాను. ఆమేన్.