లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 133


133వ ప్రకరణము

1831, నవంబరు 3న హైరం, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటుకు ముందుమాటగా జోసెఫ్ స్మిత్ చరిత్ర ఇలా తెలుపుచున్నది, “ఈ సమయములో భూలోక నివాసులకు సువార్తను ప్రకటించుటకు సంబంధించి, సమకూడుటను గూర్చి అనేక విషయములను పెద్దలు తెలుసుకొనగోరిరి; సత్యపు వెలుగులో నడుచుటకు, పైనుండి బోధింపబడుటకు 1831, నవంబరు 3న నేను ప్రభువును విచారించి, ఈ ముఖ్యమైన బయల్పాటును పొందితిని.” ఈ బయల్పాటు మొదట సిద్ధాంతము మరియు నిబంధనల గ్రంథమునకు అనుబంధముగా చేర్చబడెను, తరువాత దానికి ప్రకరణ సంఖ్య ఇవ్వబడెను.

1–6, రెండవ రాకడకు సిద్ధపడమని పరిశుద్ధులు ఆజ్ఞాపించబడిరి; 7–16, మనుష్యులందరు బబులోను నుండి పారిపోయి, సీయోనుకు వచ్చి, ప్రభువు యొక్క ఆ మహాదినము కొరకు సిద్ధపడమని ఆజ్ఞాపించబడిరి; 17–35, ఆయన సీయోను పర్వతముపైన నిలువబడును, ఖండములు ఒక ప్రదేశముగా అగును, ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గోత్రములు తిరిగివచ్చును; 36–40, సర్వలోకమునకు ప్రకటించబడుటకు జోసెఫ్ స్మిత్ ద్వారా సువార్త పునఃస్థాపించబడెను; 41–51, దుష్టులపై ప్రతీకారము తీర్చుకొనుటకు ప్రభువు క్రిందకు దిగివచ్చును; 52–56, అది విమోచించబడిన వారి సంవత్సరముగానుండును; 57–74, పరిశుద్ధులను రక్షించుటకు, దుష్టులను నాశనము చేయుటకు సువార్త పంపబడును.

1 నా సంఘ జనులైన మీరు ఆలకించుడని, మిమ్ములను గూర్చిన ప్రభువు వాక్యమును వినుడని మీ దేవుడైన ప్రభువు—

2 అకస్మాత్తుగా తన మందిరమునకు వచ్చు ప్రభువు; తీర్పుతీర్చుటకు ఒక శాపముతో లోకమునకు, అనగా దేవుని మరచిన జనములన్నింటి మీదకు మరియు మీ మధ్యనున్న భక్తిహీనుల మీదకు దిగివచ్చు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

3 ఏలయనగా సమస్త జనముల కన్నుల యెదుట ఆయన తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు, భూదిగంత నివాసులందరు తమ దేవుని రక్షణను చూచెదరు.

4 కాబట్టి సిద్ధపడుడి, ఓ నా జనులారా సిద్ధపడుడి; మిమ్ములను మీరు పవిత్రపరచుకొనుడి; నా సంఘ జనులారా, ఇతర ప్రదేశములలో నిలువుమని ఆజ్ఞాపించబడని మీరందరు సీయోను ప్రదేశమునకు కూడిరండి.

5 బబులోను నుండి బయలు వెళ్ళుడి. ప్రభువు పాత్రలను ధరించు మీరు పవిత్రులుగానుండుడి.

6 మీ వ్రతదినమును ఏర్పాటుచేసి, ఒకరితోనొకరు తరచు మాట్లాడుకొనుడి. ప్రతివాడును ప్రభువు నామమున ప్రార్థనచేయుడి.

7 అవును మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రభువు స్వరము మీకు వర్తించు సమయము వచ్చెను; బబులోను నుండి బయలువెళ్ళుడి; జనముల మధ్యనుండి, నలుదిక్కులనుండి, ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు మీరు కూడిరండి.

8 సుదూర ప్రాంతములలోనున్న జనములకు నా సంఘ పెద్దలను పంపుడి; సముద్ర ద్వీపములకు; విదేశములకు పంపుడి; సమస్త జనములకు ప్రకటించుడి, మొదట అన్యజనులకు, తరువాత యూదులకు ప్రకటించుడి.

9 ఇదిగో, ఇది వారికి ప్రకటనగాను, సమస్త జనులకు ప్రభువు స్వరముగాను ఉండును: సీయోను ప్రదేశమునకు మీరు వెళ్ళుడి, తద్వారా నా జనుల సరిహద్దులు వెడల్పు చేయబడును, ఆమె మేకులు దిగగొట్టబడును మరియు సీయోను చుట్టుప్రక్కల గల ప్రదేశములకు వెళ్ళును.

10 అవును, ఆ ప్రకటన సమస్త జనుల మధ్యకు వెళ్ళవలెను: పెండ్లి కుమారుని కలుసుకొనుటకు మేల్కొనియుండి, లేచి ముందుకు సాగుడి; ఇదిగో చూడుడి, పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు; ఆయనను కలుసుకొనుటకు బయలు వెళ్ళుడి. ప్రభువు యొక్క ఆ మహాదినము కొరకు మిమ్ములను మీరు సిద్ధపరచుకొనుడి.

11 ఆ దినమైనను, గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

12 కాబట్టి అన్యజనుల మధ్యనున్న వారు సీయోనుకు పారిపోవలెను.

13 యూదా గోత్రమునకు చెందినవారు యెరూషలేములోని ప్రభువు యొక్క మందిరమున్న పర్వతములకు పారిపోవలెను.

14 జనములమధ్య నుండి అనగా బబులోనునుండి, ఆత్మీయ బబులోనైన చెడుతనము మధ్యనుండి బయలు వెళ్ళుడి.

15 కానీ నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు పారిపోవుటకు త్వరపడవద్దు, కానీ మీ యెదుట సమస్తమును సిద్ధపరచుకొనుడి; పారిపోవువాడు వెనుకతట్టు చూడకూడదు, లేనియెడల వానికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును.

16 భూలోకవాసులారా, విని ఆలకించుడి. నా సంఘ పెద్దలారా కలిసి ఆలకించుడి, ప్రభువు స్వరమును వినుడి; ఆయన మనుష్యులందరిని పిలుచుచున్నాడు, ప్రతిచోట ఉన్న మనుష్యులందరిని పశ్చాత్తాపపడమని ఆజ్ఞాపించుచున్నాడు.

17 ఏలయనగా ఇదిగో—ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన మార్గములు సరాళము చేయుడి, ఏలయనగా ఆయన వచ్చు గడియ సమీపములోనున్నది అని ఆకాశ మధ్యమున ప్రకటించుచున్న ఒక దూతను దేవుడైన ప్రభువు పంపెను.

18 ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడినప్పుడు, ఆయన తండ్రి నామము నొసళ్ళయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడా ఉందురు.

19 కాబట్టి, పెండ్లి కుమారుని రాక కొరకు మీరు సిద్ధపడుడి; వెళ్ళుడి, ఆయనను కలుసుకొనుటకు బయలువెళ్ళుడి.

20 ఏలయనగా ఇదిగో, ఒలీవల వనము అనబడు కొండమీదను, శక్తివంతమైన మహాసముద్రము అనగా గొప్ప అగాధము మీదను, సముద్ర ద్వీపముల మీదను సీయోను ప్రదేశము మీదను ఆయన నిలుచుండును.

21 ఆయన సీయోనుకు తన స్వరమును వినిపించును, యెరూషలేము నుండి ఆయన మాట్లాడును, ఆయన స్వరము సర్వజనుల మధ్య వినబడును;

22 ఆ స్వరము విస్తారజలముల స్వరమువలెను, గొప్ప ఉరుము యొక్క స్వరమువలెను ఉండును, అది పర్వతములను పగులగొట్టును, లోయలు కనబడకుండా పోవును.

23 ఆయన గొప్ప అగాధమును ఆజ్ఞాపించగా, అది ఉత్తర దేశములలోనికి వెనుకకు తరిమివేయబడును, ద్వీపములు ఒక నేలగా మారును;

24 యెరూషలేము ప్రదేశము, సీయోను ప్రదేశము తమ స్వస్థలములకు వెనుదిరుగును, భూమి అది విభజింపబడక ముందు దినములలో ఉన్న విధముగా ఉండును.

25 ప్రభువు అనగా రక్షకుడు, ఆయన జనులమధ్య నిలుచుండును, సర్వశరీరులను యేలును.

26 ఉత్తర దేశములలోనున్న వారు ప్రభువు స్మరణలోనికి వచ్చెదరు; వారి ప్రవక్తలు ఆయన స్వరమును వినెదరు, వారు ఇక ఎంతమాత్రము నిలిచియుండరు; వారు బండలను పగులగొట్టుదురు, వారి సముఖములో మంచు క్రిందకు జారును.

27 ఆ గొప్ప అగాధము నడుమ ఒక రహదారి వేయబడును.

28 వారి శత్రువులు వారికి ఎరగా మారుదురు,

29 నిస్సారమైన ఎడారులలోనుండి జీవజలపు ఊటలు ఊరును; ఎండిన నేల ఇక ఎంతమాత్రము దప్పికగల ప్రదేశముగా ఉండదు.

30 నా సేవకులైన ఎఫ్రాయిము సంతానమునకు వారు తమ గొప్ప నిధులను తీసుకొనివచ్చెదరు.

31 చిరకాల పర్వతముల సరిహద్దులు వారి సముఖమునందు వణుకును.

32 అక్కడ అనగా సీయోనులో వారు మోకరించి, ప్రభువు సేవకులు అనగా ఎఫ్రాయిము సంతానము చేతులద్వారా మహిమ కిరీటమును పొందుదురు.

33 నిత్య సంతోషకరమైన పాటలతో వారు నింపబడుదురు.

34 ఇదిగో, ఇశ్రాయేలు గోత్రముల యెడల ఇది శాశ్వతమైన దేవుని దీవెనగా మరియు ఎఫ్రాయిము, అతనితోనుండు వారి శిరస్సులపై అతిగొప్ప దీవెనగా ఉండును.

35 యూదా గోత్రమునకు చెందినవారు కూడా వారి బాధ తొలగిపోయిన తరువాత, ఆయన సన్నిధిలో దివారాత్రములు, యుగయుగములు నివసించుటకు ప్రభువు యెదుట పరిశుద్ధముగా కడిగివేయబడుదురు.

36 ఇప్పుడు ఓ భూనివాసులారా, ఈ సంగతులు మీ మధ్య తెలుపబడుటకు నిత్య సువార్తను కలిగి ఆకాశ మధ్యమున ఎగురుచున్న ఒక దూతను నేను పంపియున్నానని ప్రభువు నిశ్చయముగా సెలవిచ్చుచున్నాడు, ఆ దూత కొందరికి ప్రత్యక్షమై దానిని మనుష్యునికి అప్పగించెను, అతడు భూమి మీద నివసించు అనేకులకు ప్రత్యక్షమగును.

37 ఈ సువార్త ప్రతి జనమునకు, వంశమునకు, భాషకు, ప్రజలకు ప్రకటింపబడును.

38 దేవుని సేవకులు బయలువెళ్ళి, బిగ్గరగా ఈలాగు ప్రకటించెదరు: దేవునికి భయపడి, ఆయనను మహిమపరచుడి, ఏలయనగా ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను;

39 ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి—

40 గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక అని దివారాత్రములు వారు ప్రభువు నామమున ప్రార్థించెదరు.

41 అది వారి శిరములపై సమాధానముగా వచ్చును; ఏలయనగా వస్తువులను కరిగించే మండుచున్న అగ్ని వలెను, నీళ్ళను మరిగించు అగ్నివలెను ఆయన సన్నిధి ఉండును.

42 ఓ ప్రభువా, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై నీవు దిగివచ్చెదవు గాక, జనములందరు నీ సన్నిధిని వణికెదరు గాక—

43 జరుగునని వారనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా;

44 నీవు దిగివచ్చినప్పుడు, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లిను గాక, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, సంతోషముగా నీతి ననుసరించు వానిని నీవు దర్శించుచున్నావు.

45 ఓ దేవా, నీ కొరకు కనిపెట్టువాని విషయమై ఎంత గొప్ప సంగతులు నీవు సిద్ధపరచియున్నావో అనునది నీవు తప్ప లోకారంభము నుండి ఏ మనుష్యుడు వినియుండలేదు, ఏ చెవికి తెలియలేదు, ఏ కంటికి కనబడలేదు.

46 ఈవిధముగా చెప్పబడును: రక్తవర్ణ వస్త్రములు ధరించి పరలోకములోని దేవుని నుండి వచ్చుచున్న యితడెవరు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు తెలియని ప్రాంతములనుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవరు?

47 అతడు ఈలాగు చెప్పును: నీతిని బట్టి మాటలాడుచు, రక్షించుటకు బలవంతుడనైన వాడను నేనే.

48 ప్రభువు వస్త్రములు ఎఱ్ఱగానుండును, ఆయన బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉండును.

49 మరియు ఆయన సమక్షమందు కలుగు మహిమ ఎంత ఘనముగా ఉండుననగా, సిగ్గుతో సూర్యుడు తన ముఖమును మరుగుపరచును, చంద్రుడు వెలుగునిచ్చుటకు తిరస్కరించును, నక్షత్రములు వాటి స్థానములనుండి విసిరివేయబడును.

50 ఆయన స్వరము ఇట్లు వినబడును: ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనులందరికి తీర్పు తీర్చితిని; నాతో ఎవరును ఉండలేదు;

51 కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రముతో వారిని అణగద్రొక్కితిని మరియు వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే; ఏలయనగా నా హృదయమందున్న పగతీర్చుకొను దినము ఇదియే.

52 ఇప్పుడు విముక్తిచేయబడిన వారి దినము వచ్చియుండెను; వారు తమ ప్రభువు యొక్క ప్రేమాకనికరమును గూర్చి చెప్పెదరు; ఆయన వాత్సల్యమును బట్టియు, ప్రేమాకనికరమును బట్టియు వారిమీద నిరంతరము ఆయన క్రుమ్మరించిన యావత్తును గూర్చి వారు ప్రకటన చేసెదరు.

53 వారి యావద్బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధిలోని దూత వారిని రక్షించెను; ప్రేమ చేతను, కనికరము చేతను ఆయన వారిని విమోచించెను, పూర్వదినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొనుచు, మోసుకొనుచు వచ్చెను;

54 అవును, హనోకును, అతనితో ఉన్నవారిని కూడా; అతనికి పూర్వము ఉన్న ప్రవక్తలందరిని కూడా; నోవహును, అతనికి పూర్వము ఉన్న వారిని కూడా; మోషేను, అతనికి పూర్వము ఉన్న వారిని కూడా;

55 మోషేనుండి ఏలీయా వరకు, ఏలీయా నుండి యోహాను వరకు, యేసు క్రీస్తు పునరుత్థానమునందు ఆయనతో ఉన్నవారు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో పాటు పరిశుద్ధ అపొస్తలులు గొఱ్ఱెపిల్ల సన్నిధిని నిలిచెదరు.

56 మరియు పరిశుద్ధుల సమాధులు తెరువబడును; ఆయన సీయోను పర్వతముమీద, పరిశుద్ధ పట్టణమైన నూతన యెరూషలేముమీద నిలువబడినప్పుడు వారు వచ్చి, గొఱ్ఱెపిల్ల కుడి ప్రక్కన నిలువబడుదురు; వారు గొఱ్ఱెపిల్ల కీర్తనను దివారాత్రములు, యుగయుగములు పాడెదరు.

57 ఈ కారణము వలన బహిర్గతము కాబోవు మహిమలయందు నరులు పాలివారగునట్లు చేయబడుటకు—

58 లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై బలహీనులను సిద్ధపరచుటకు, బలహీనులు జ్ఞానుల గర్వమణచు దినమందు ప్రభువు కార్యము కొరకు సరళముగాను, సులువుగాను తర్కించునట్లు ప్రభువు ఆయన సంపూర్ణ సువార్తను, ఆయన నిత్య నిబంధనను పంపెను; ఎన్నికలేనివాడు గొప్పజనమగును మరియు ఇద్దరు వారి పదుల వేలమందిని పారద్రోలుదురు.

59 మరియు ప్రభువు లోకములోని బలహీనమైనవాటి చేత ఆయన ఆత్మబలముతో జనములను తూర్పారబెట్టును.

60 ఈ హేతువు చేత ఈ ఆజ్ఞలు ఇవ్వబడినవి; అవి ఇవ్వబడిన దినమున లోకమునుండి వాటిని మరుగుపరచవలెనని వారికి ఆజ్ఞాపించబడెను, కానీ ఇప్పుడు అవి సర్వశరీరులకు వెళ్ళవలెన—

61 ఇది సర్వశరీరులను పాలించు ప్రభువు చిత్తము, మనస్సునైయున్నది.

62 పశ్చాత్తాపపడి, ప్రభువు యెదుట తననుతాను శుద్ధిచేసుకొనిన వానికి నిత్యజీవము ఇవ్వబడును.

63 ప్రభువు స్వరమును వినని వారియెడల—వారు జనుల మధ్యనుండి కొట్టివేయబడవలెనని ప్రవక్తయైన మోషేచేత వ్రాయబడినది నెరవేరును.

64 మరియు ప్రవక్తయైన మలాకీ వ్రాసినది కూడా నేరవేరును: ఏలయనగా, నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

65 కాబట్టి, వారికిది ప్రభువు ప్రత్యుత్తరమైయున్నది:

66 నేను నా వారియొద్దకు వచ్చిన ఆ దినమున, మీలో ఎవరును నన్ను చేర్చుకొనలేదు, మీరు తరిమివేయబడిరి.

67 నేను మరలా పిలిచినప్పుడు ఉత్తరమిచ్చుటకు మీలో ఎవరును లేరు; అయినప్పటికీ నా చేయి విమోచింపలేనంత కురచయైపోలేదు, విడిపించుటకు నాకు శక్తి లేకపోలేదు.

68 ఇదిగో, నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును. నదులను ఎడారిగా చేయుదును; నీళ్ళు లేనందున వాటి చేపలు కంపుకొట్టి, దాహము చేత చచ్చిపోవును.

69 ఆకాశమందు చీకటిని కమ్మజేయుచున్నాను, దానికి గోనెపట్ట ధరింపజేయుచున్నాను.

70 నా వలన ఇది మీకు కలుగుచున్నది—మీరు వేదనగలవారై పడుకొనెదరు.

71 ఇదిగో చూడుము, మిమ్ములను విడిపించు వారెవరును లేరు; ఏలయనగా పరలోకమునుండి నేను పిలువగా మీరు నా స్వరమును వినలేదు; మీరు నా సేవకులను నమ్మలేదు, వారు మీ యొద్దకు పంపబడినప్పుడు వారిని మీరు చేర్చుకొనలేదు.

72 కాబట్టి, వారు సాక్ష్యమును ముద్రించి, ధర్మశాస్త్రమును బంధించిరి, మీరు చీకటికి అప్పగించబడిరి.

73 వీరందరు వెలుపలి చీకటిలోనికి వెళ్ళుదురు, అక్కడ ఏడ్పును, రోదనయు, పండ్లు కొరకుటయు ఉండును.

74 ఇదిగో మీ దేవుడైన ప్రభువు దీనిని సెలవిచ్చెను. ఆమేన్.