లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 134


134వ ప్రకరణము

1835, ఆగష్టు 17న కర్ట్‌లాండ్, ఒహైయోలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశములో ప్రభుత్వములు, చట్టములను గూర్చి ఏకగ్రీవ ఆమోదము ద్వారా అవలంబించబడిన ఒక విశ్వాస ప్రకటన. సిద్ధాంతము మరియు నిబంధనల మొదటి ప్రచురణ యొక్క ప్రతిపాదించబడిన విషయసూచికను పరిగణించుటకు అనేక పరిశుద్ధులు కూడివచ్చిరి. ఆ సమయములో ఈ ప్రకటనకు ఈ ఉపోద్ఘాతము ఇవ్వబడినది: “భూలోక ప్రభుత్వములు, చట్టములకు సంబంధించి మా విశ్వాసమును తప్పుగా వ్యక్తీకరించి, అపార్థము చేసుకొనకుండా ఉండుటకు, ఈ గ్రంథము ముగింపులో దానికి సంబంధించిన మా అభిప్రాయమును తెలుపుట సరియైనదిగా మేము తలంచితిమి.”

1–4, ప్రభుత్వములు వ్యక్తిగత స్వేచ్ఛను, ఆరాధించే స్వేచ్ఛను కాపాడవలెను; 5–8, మనుష్యులందరు వారి ప్రభుత్వములను సమర్థించి, చట్టమును గౌరవించి, లోబడవలెను; 9–10, మత సంఘాలు పౌరాధికారములను అమలుపరచకూడదు; 11–12, మనుష్యులు తమను, తమ ఆస్థులను కాపాడుకొనుట న్యాయమైనదిగా యెంచబడును.

1 మానవ ప్రయోజనము కొరకు ప్రభుత్వములు దేవునిచేత స్థాపించబడినవని మేము నమ్ముచున్నాము; సమాజము యొక్క మేలు మరియు రక్షణ కొరకు చట్టములు చేయుటలోను, వాటిని నిర్వహించుటలోను రెండింటి పట్ల తమ ప్రవర్తనకు మనుష్యులను దేవుడు బాధ్యులుగా చేయును.

2 అటువంటి చట్టములు ప్రతి ఒక్కరికి తమ అంతరాత్మను అనుసరించు స్వేచ్ఛను, ఆస్థిపై హక్కును, నియంత్రణను, ప్రాణ రక్షణను కల్పించును, గనుక వాటిని రచించి, అతిక్రమించకుండా చేయుట వలన తప్ప ఏ ప్రభుత్వము శాంతియుతముగా పనిచేయలేదని మేము నమ్ముచున్నాము.

3 అన్ని ప్రభుత్వములకు వాటి చట్టములను అమలుపరచుటకు ప్రభుత్వ అధికారులు మరియు న్యాయాధికారులు తప్పక అవసరము; ప్రజాస్వామ్య ప్రభుత్వమైతే న్యాయముతోను, ధర్మముతోను చట్టమును నిర్వహించు ప్రభుత్వ అధికారులను వెదకి, ప్రజావాక్కు చేత లేదా సర్వోత్కృష్ట పరిపాలకుని చిత్తము చేత వారిని సమర్థించవలెను.

4 మతము దేవుని చేత స్థాపించబడినదని మేము నమ్ముచున్నాము; వారి మతాభిప్రాయములు ఇతరుల హక్కులను మరియు స్వేచ్ఛను కాలరాయుటకు వారిని ప్రోత్సహించనంత వరకు దానిని సాధన చేయుటకు మనుష్యులు ఆయనకు, కేవలము ఆయనకే ఉత్తరవాదులైయున్నారని మేము నమ్ముచున్నాము; కానీ మానవచట్టము మనుష్యుల మనస్సాక్షిని నిర్భంధించుటకు, ఆరాధన నియమాలను సూచించుటలో జోక్యము చేసుకొనుటకు, బహిరంగ లేదా వ్యక్తిగత ఆరాధనకు మార్గములను ఆదేశించుటకు హక్కును కలిగియుందని మేము నమ్ముటలేదు; అదేవిధముగా సామాజిక న్యాయాధికారి నేరమును అడ్డగించవలెను, కానీ ఎన్నడూ మనస్సాక్షిని అదుపు చేయకూడదు; దోషులను శిక్షించవలెను, కానీ ఆత్మ యొక్క స్వేచ్ఛను అణచివేయకూడదు.

5 అటువంటి ప్రభుత్వముల యొక్క చట్టములచేత తమ స్వాభావికమైన మరియు మార్పుచేయజాలని హక్కులయందు సంరక్షించబడినంతవరకు మనుష్యులందరు వారు నివసించే ప్రాంతము యొక్క ప్రభుత్వములను బలపరచి, సహకరించుటకు బద్ధులైయున్నారని; నిరసన మరియు తిరుగుబాటు చేయు ప్రతి పౌరుడు ఆ విధముగా సంరక్షించబడుటకు యోగ్యుడు కాడని, తగినవిధముగా శిక్షింపబడవలెనని; మరియు ప్రజా ప్రయోజనమును కాపాడుటకు తమ అత్యుత్తమ అభిప్రాయమును బట్టి అటువంటి చట్టములను అమలుపరచుటకు ప్రభుత్వములన్నియు ఒక హక్కును కలిగియున్నవని; అదే సమయములో, వ్యక్తిగత స్వేచ్ఛను పవిత్రమైనదిగా యెంచవలెనని మేము నమ్ముచున్నాము.

6 ప్రతి మనుష్యుడు అతడున్న పదవిలో ఘనపరచబడవలెను; నిరపరాధులను రక్షించుటకు, అపరాధులను శిక్షించుటకు నియమించబడిన పరిపాలకులు మరియు న్యాయాధిపతులు ఆవిధముగా చేయవలెను; అంతేకాక జనులందరు చట్టములను గౌరవించుటకు, వాటికి లోబడుటకు బాధ్యులైయున్నారు, ఎందుకనగా అవి లేని యెడల శాంతి, సామరస్యముల స్థానములో అరాచకత్వము, ఉగ్రవాదము ప్రవేశించును; వ్యక్తులు మరియు రాజ్యముల మధ్య, ఒక మనుష్యునికి మరొక మనుష్యునికి మధ్య సంబంధాలను క్రమపరచు ఏకైక ఉద్దేశ్యముతో మనుష్య చట్టములు నెలకొల్పబడినవి; విశ్వాసము మరియు ఆరాధన కొరకు ఆత్మీయ సంగతులను గూర్చి నియమాలను విధించే దైవిక చట్టములు పరలోకమునుండి ఇవ్వబడినవి; ఈ రెండింటి విషయమై మనుష్యుడు తన సృష్టికర్తకు సమాధానము చెప్పవలెనని మేము నమ్ముచున్నాము.

7 పౌరులందరు తమ మతవిశ్వాసమును స్వేచ్ఛగా సాధన చేసుకొనునట్లు వారి రక్షణ కొరకు పరిపాలకులు, రాష్ట్రములు మరియు ప్రభుత్వములు చట్టములను అమలుపరచు హక్కును కలిగియున్నాయని మరియు కట్టుబడియున్నాయని మేము నమ్ముచున్నాము; కానీ చట్టములకు భక్తి గౌరవములను చూపుచు, అటువంటి మతాభిప్రాయములు దేశద్రోహమును, కుట్రను న్యాయమైనవిగా పరిగణించనంతవరకు పౌరుల విశేషాధికారములను కాలరాయుటకు లేదా వారి అభిప్రాయములు తెలుపకుండా బహిష్కరించుటకు వారు న్యాయపరమైన హక్కును కలిగిలేరని మేము నమ్ముచున్నాము.

8 అపరాధము చేసినప్పుడు నేరము యొక్క స్వభావమును బట్టి శిక్ష విధించబడవలెనని మేము నమ్ముచున్నాము; నరహత్య, రాజద్రోహము, దోపిడి, దొంగతనము మరియు అన్ని విధాలుగా శాంతిభద్రతలకు భంగం కలిగించుట వంటి వాటి కొరకు ఆయా నేరములను బట్టి, మనుష్యుల మధ్య చెడు చేయుటకు మొగ్గుచూపుటను బట్టి ఆ నేరము చేయబడిన ప్రాంత ప్రభుత్వము యొక్క చట్టముల ప్రకారము శిక్ష విధించబడవలెనని మేము నమ్ముచున్నాము; ప్రజాశాంతి మరియు ప్రశాంతత కొరకు మనుష్యలందరు ముందుకు వచ్చి, మంచి చట్టములకు వ్యతరేకముగా అపరాధము చేయువారికి శిక్ష విధించుటకు తమ సామర్థ్యమును ఉపయోగించవలెను.

9 ప్రజా ప్రభుత్వముతో మత ప్రాబల్యము కలిసిపోయి, తద్వారా ఒక మతసమాజము ప్రోత్సహించబడుట, మరియొక దాని ఆత్మీయ విశేషాధికారములు నిషేధించబడుట మరియు దేశపౌరులుగా దాని సభ్యుల వ్యక్తిగత హక్కులు నిరాకరించబడుట న్యాయమైనదని మేము నమ్ముటలేదు.

10 మత సమాజములన్నియు వాటి సభ్యుల క్రమశిక్షణారాహిత్యము పట్ల వారి సమాజ నియమ నిబంధనల ప్రకారము చర్య తీసుకొనుటకు హక్కును కలిగియున్నవని మేము నమ్ముచున్నాము; అటువంటి చర్యలు సహవాసము మరియు మంచి స్థానము కొరకు మాత్రమే తీసుకొనబడవలెను; కానీ, వారి ఆస్థి లేదా జీవితపు హక్కును గూర్చి మనుష్యులను విచారించుటకు, ఈ లోకపు వస్తువులను వారినుండి తీసుకొనుటకు లేదా వారి జీవితానికి లేదా అంగములకు హానిచేయుటకు లేదా వారిపై ఎటువంటి శారీరక శిక్షను విధించుటకు ఏ మత సమాజమైనను అధికారము కలిగియున్నదని మేము నమ్ముట లేదు. వారు కేవలము తమ సమాజము నుండి వారిని బహిష్కరించి, వారి నుండి తమ సహవాసమును వెనుకకు తీసుకొనగలరు.

11 వ్యక్తిగతముగా హింసింపబడినప్పుడు లేదా ఆస్థి లేదా నైతిక హక్కు ఉల్లంఘించబడినప్పుడు, అట్టి వారిని రక్షించుటకు చట్టములు అమలులో ఉన్నప్పుడు తప్పిదములు, ఇబ్బందులు సరిదిద్దుటకు మనుష్యులు చట్టమునకు విజ్ఞాపన చేయవలెనని మేము నమ్ముచున్నాము; కానీ అత్యవసర పరిస్థితులలో, చట్టమునకు విజ్ఞాపన చేయలేని మరియు విముక్తి పొందలేని సమయాలలో మనుష్యులందరు వారిని, వారి స్నేహితులను, ఆస్థిని, ప్రభుత్వమును రక్షించుటకు వ్యక్తులందరి యెడల జరుగు అన్యాయపు దాడులను, ఆక్రమణలను ఎదుర్కొనుట న్యాయమైనదిగా యెంచబడునని మేము నమ్ముచున్నాము.

12 భూలోక జనములకు సువార్తను ప్రకటించుట మరియు లోకపు అవినీతినుండి తమనుతాము కాపాడుకోమని నీతిమంతులను హెచ్చరించుట న్యాయమైనదని మేము నమ్ముచున్నాము; కానీ దాస్యములో ఉన్నవారి పట్ల వారి యజమానుల ఇష్టమునకు వ్యతిరేకముగా జోక్యము చేసుకొనుట, సువార్త ప్రకటించుట లేదా వారికి బాప్తిస్మమిచ్చుట లేదా ఈ లోకములో వారి పరిస్థితి పట్ల వారికి కొంచెమైనా అసంతృప్తి కలిగించునట్లు కలుగజేసుకొనుట లేదా ప్రభావితము చేయుట, తద్వారా మనుష్యుల జీవితాలు సంకటములో పెట్టుట సరియైనది కాదని మేము నమ్ముచున్నాము; అట్టి జోక్యము మానవులను బానిసత్వములో ఉంచు ప్రతి ప్రభుత్వము యొక్క శాంతికి ప్రమాదకరము, అన్యాయము, అధర్మమని మేము నమ్ముచున్నాము.