లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 41


41వ ప్రకరణము

1831 ఫిబ్రవరి 4న, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఒహైయోలోని కర్ట్లాండ్‌లో సంఘమునకు ఇవ్వబడిన బయల్పాటు. దేవుని “ధర్మశాస్త్రము”ను పొందుటకు ప్రార్థన చేయమని ఈ బయల్పాటు ప్రవక్తకు, సంఘ పెద్దలకు సూచించుచున్నది (42వ ప్రకరణము చూడుము). జోసెఫ్ స్మిత్ అప్పుడే న్యూయార్క్‌ నుండి కర్ట్లాండ్‌కు వచ్చెను మరియు ఒహైయోలోని థాంప్సన్ సమీపములో సంఘ సభ్యుడైన లేమన్ కోప్లీ “సహోదరుడు జోసెఫ్ మరియు సిడ్నీ[రిగ్డన్] … తనతో నివసించాలని, వారికి ఇండ్లు, వనరులు సమకూరుస్తానని విజ్ఞప్తి చేసెను.” ఈ బయల్పాటు జోసెఫ్ మరియు సిడ్నీ ఎక్కడ నివసించాలో స్పష్టము చేయును మరియు ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌ను సంఘము యొక్క మొదటి బిషప్పుగా పిలుచును.

1–3, ప్రవచనాత్మ చేత పెద్దలు సంఘమును నిర్వహించెదరు; 4–6, నిజమైన శిష్యులు ప్రభువు ధర్మశాస్త్రమును స్వీకరించి, పాటించెదరు; 7–12, సంఘ బిషప్పుగా ఎ‌డ్వర్డ్ పాట్రిడ్జ్ పిలువబడెను.

1 ఓ నా జనులారా, విని ఆలకించుడని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు, నన్ను వినే మిమ్ములను, అన్నింటికంటే గొప్ప దీవెనలతో దీవించుటకు నేను ఆనందించుచున్నాను; నా జనులుగా చెప్పుకొనుచు నన్ను వినని వారిని అన్ని శాపములకంటే ఘోర శాపముతో నేను శపించెదను.

2 నేను పిలిచియున్న ఓ నా సంఘ పెద్దలైన మీరు ఆలకించుడి, ఇదిగో నేను మీకొక ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేమనగా నా వాక్యమును అంగీకరించుటకు మీరందరు సమకూడవలెను;

3 విశ్వాస సహితమైన మీ ప్రార్థన ద్వారా మీరు నా ధర్మశాస్త్రమును పొందెదరు, తద్వారా నా సంఘమును ఏవిధముగా నిర్వహించవలెనో తెలుసుకొని, నా యెదుట సమస్త సంగతులను సరియైన క్రమములో కలిగియుందురు.

4 నేను వచ్చినప్పుడు నేను మీ పరిపాలకునిగా ఉందును; ఇదిగో, నేను త్వరగా వచ్చెదను మరియు నా ధర్మశాస్త్రము పాటించబడునట్లు మీరు చూడవలెను.

5 ఎవడైతే నా ధర్మశాస్త్రమును పొంది, దానికి విధేయుడైయుండునో, అట్టివాడే నా శిష్యుడు; ఎవడైతే దానిని పొందితినని చెప్పి, దానికి విధేయుడైయుండడో, అట్టివాడు నా శిష్యుడు కాడు మరియు వానిని మీ మధ్య నుండి వెళ్ళగొట్టవలెను;

6 ఏలయనగా రాజ్యసంబంధులకు చెందిన విషయములను అవిధేయులైన వారికి లేదా కుక్కలకు ఇచ్చుట లేదా పందుల యెదుట ముత్యములు వేయుట సరికాదు.

7 మరలా, నివాసముండుటకు, అనువదించుటకు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. కు ఒక గృహము నిర్మించుట యుక్తము.

8 మరలా, నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ నా ఆజ్ఞలు పాటించునంతవరకు అతనికి ఏది సరియైనదిగా తోచునో ఆవిధముగా జీవించుట యుక్తము.

9 మరలా, నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌ను నేను పిలిచితిని; అతడు సంఘ స్వరము చేత నిర్ణయింపబడి, సంఘమునకు బిషప్పుగా నియమింపబడవలెనని, అతని వర్తకమును వదిలి తన సమయమునంతా సంఘ పనులలో వినియోగించవలెనని నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను.

10 నా ధర్మశాస్త్ర ప్రకారము నేనతనికి ఇచ్చు దినమున అతనికి నియమింపబడిన విషయములన్నిటిని చూచుకొనవలెను.

11 ఇది ఎందుకనగా అతని హృదయము నా యెదుట శుద్ధముగానున్నది, ఏలయనగా అతడు ఏ కపటము లేని ప్రాచీన నతానుయేలు వలే ఉన్నాడు.

12 ఈ మాటలు మీకివ్వబడినవి, అవి నా యెదుట నిర్మలముగానున్నవి; కాబట్టి, వాటిని మీరు ఏవిధముగా యెంచెదరో దాని విషయమై జాగ్రత్తగానుండుము, ఏలయనగా వాటి విషయమై తీర్పుదినమున మీ ఆత్మలు లెక్క అప్పజెప్పవలసియుండును. అలాగే జరుగును గాక. ఆమేన్.