లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 32


32వ ప్రకరణము

1830 అక్టోబరు ఆరంభములో, న్యూయార్క్‌లోని మాంచెస్టర్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా పార్లీ పి. ప్రాట్, జీబా పీటర్సన్‌లకివ్వబడిన బయల్పాటు. లేమనీయుల ప్రవచనాత్మక దీవెనలను గూర్చి మోర్మన్ గ్రంథము నుండి సంఘము నేర్చుకొనెను, వారిని గూర్చిన గొప్ప ఆసక్తి, అభిలాషలు పెద్దలచేత భావించబడెను. ఫలితముగా, ఆ సమయములో పెద్దలు పశ్చిమమునున్న ఆదిమవాసి తెగల యొద్దకు పంపబడవలెనో లేదోనని ప్రభువు తన చిత్తమును తెలుపవలెనని విన్నపము చేయబడినది. దానిననుసరించి ఈ బయల్పాటు ఇవ్వబడెను.

1–3, పార్లీ పి. ప్రాట్, జీబా పీటర్సన్ లేమనీయులకు ప్రకటించుటకు, ఆలీవర్ కౌడరీ, పీటర్ విట్మర్ జూ. లకు తోడుగా వెళ్ళుటకు పిలువబడెను; 4–5, లేఖనములను గ్రహించుటకు వారు ప్రార్థించవలెను.

1 ఇప్పుడు నా సేవకుడైన పార్లీ పి. ప్రాట్ విషయమై—ఇదిగో నేను చెప్పునదేమనగా, నా జీవము తోడు అతడు నా సువార్తను ప్రకటించి, నా నుండి నేర్చుకొని, సాత్వీకునిగా, దీనమనస్సు గలవానిగా ఉండుట నా చిత్తమైయున్నది.

2 నేనతనికి అప్పగించినదేమనగా, అతడు నా సేవకులైన ఆలీవర్ కౌడరీ, పీటర్ విట్మర్ జూ. లతో కలిసి అరణ్యములోనికి లేమనీయుల మధ్యకు వెళ్ళవలెను.

3 జీబా పీటర్సన్ కూడా వారితో వెళ్ళవలెను; నేను కూడా వారితో వెళ్ళి, వారి మధ్యనుండెదను; తండ్రి యొద్ద నేను వారి తరఫున న్యాయవాదిగా నుందును, వారి ఎదుట ఏదియు నిలువనేరదు.

4 వ్రాయబడియున్న దానికి వారు చెవియొగ్గవలెను, మరే ఇతర బయల్పాటును పొందియున్నామని ఆరోపించరాదు; దానిని వారు గ్రహించునట్లు నేను చేయుటకు వారు నిత్యము ప్రార్థించవలెను.

5 అపహాస్యము చేయక ఈ మాటలకు వారు చెవియొగ్గవలెను మరియు వారిని నేను దీవించెదను. ఆమేన్.