లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 66


66వ ప్రకరణము

1831 అక్టోబరు 29న, ఒహైయోలోని హైరంలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. “జోసెఫ్ స్మిత్‌కు తెలియని ఐదు ప్రశ్నలకు సమాధానము ప్రవక్త ద్వారా తెలుసుకోవాలని విలియం ఈ. మెక్‌లెలిన్ రహస్యముగా ప్రభువుకు మొరపెట్టెను. మెక్‌లెలిన్ విన్నపమును బట్టి ప్రవక్త ప్రభువును విచారించి, ఈ బయల్పాటును పొందెను.”

1–4, సువార్త యొక్క సంపూర్ణతయే నిత్య నిబంధన; 5–8, పెద్దలు ప్రకటించి, సాక్ష్యము చెప్పి, ప్రజలతో తర్కించవలెను; 9–13, నమ్మకమైన పరిచర్య సేవ నిత్యజీవపు స్వాస్థ్యమును అభయమిచ్చును.

1 ఇదిగో, నా సేవకుడైన విలియం ఈ. మెక్‌లెలిన్‌కు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నీ పాపముల నుండి మరలి, నా సత్యములను స్వీకరించిన యెడల నీవు ధన్యుడవని నీ విమోచకుడు, ఆయన నామమునందు విశ్వాసముంచు వారందరికి లోక రక్షకుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

2 నా నిత్య నిబంధన అనగా నరుల సంతానము యొద్దకు పంపబడి, తద్వారా వారు జీవము కలిగి, ప్రాచీన దినములలో ప్రవక్తలు, అపొస్తలుల ద్వారా వ్రాయబడిన ప్రకారము అంత్యదినములలో బయలుపరచబడవలసియున్న మహిమలలో పాలుపంచుకొనునట్లు చేయు సువార్త యొక్క సంపూర్ణతను స్వీకరించినందుకు నీవు ధన్యుడవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

3 నా సేవకుడవైన విలియం, నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీవు పవిత్రుడవే కానీ సంపూర్ణముగా కాదు; కాబట్టి నా దృష్టిలో సంతోషకరముగా లేని ఆ సంగతులను గూర్చి పశ్చాత్తాపపడమని ప్రభువు చెప్పుచున్నాడు, ఏలయనగా ప్రభువు వాటిని నీకు చూపును.

4 ఇప్పుడు, నిన్ను గూర్చి నేనేమి తలంచుచున్నానో లేదా నిన్నుగూర్చి నా చిత్తము ఏమైయున్నదో ప్రభువైన నేను నీకు చూపెదను.

5 ఇదిగో నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రతి ప్రదేశములోను, ప్రతి పట్టణములోను, చుట్టు ప్రక్కల సువార్త ప్రకటించబడని ప్రతి ప్రాంతములోను నీవు సువార్తను ప్రకటించుట నా చిత్తమైయున్నది.

6 ఈ ప్రదేశములో అనేకదినములు ఉండవద్దు; సీయోను ప్రదేశమునకు ఇప్పుడే వెళ్ళవద్దు; కానీ నీవు పంపగలిగినంత వరకు పంపుము; లేనియెడల, నీ ఆస్తిని గూర్చి ఆలోచించవద్దు.

7 తూర్పు ప్రదేశములకు వెళ్ళుము, ప్రతి స్థలములోను, ప్రతి జనమునకును, జనులతో తర్కించుచు వారి సమాజమందిరములలో నీ సాక్ష్యము చెప్పుము.

8 నా సేవకుడైన శామ్యుయెల్ హెచ్. స్మిత్ నీతో వెళ్ళవలెను; అతడిని మరువకుము మరియు నీ సూచనలను అతనికిమ్ము; విశ్వాసముగా నుండువాడు ప్రతి స్థలములో బలపరచబడును; ప్రభువైన నేను నీతో వచ్చెదను.

9 రోగులపై నీ చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందుదురు. ప్రభువైన నేను నిన్ను పంపు వరకు తిరిగి వెళ్ళవద్దు. శ్రమలలో సహనము కలిగియుండుము. అడుగుము, నీవు పొందెదవు; తట్టుము, నీకది తెరువబడును.

10 భారమును మోయుటకు ప్రయత్నించకుము. సమస్త అవినీతిని విడిచిపెట్టుము. వ్యభిచరించకుము—ఈ శోధనతోనే నీవు కలవరపడుచున్నావు.

11 ఈ సంగతులను భద్రపరచుకొనుము, ఏలయనగా అవి సత్యము మరియు నమ్మదగినవైయున్నవి; నీవు నీ స్థానమును ఘనపరచవలెను మరియు అనేకమంది ప్రజలను వారి శిరస్సులపై శాశ్వతానంద కీర్తనలతో సీయోనుకు నడిపించవలెను.

12 అంతము వరకు వీటియందు కొనసాగుము; కృపాసత్యసంపూర్ణుడైన నా తండ్రి కుడిచేతి ప్రక్కన నీవు నిత్యజీవపు కిరీటమును కలిగియుందువు.

13 నిశ్చయముగా, దేవుడైన నీ ప్రభువు, నీ విమోచకుడైన యేసు క్రీస్తు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.