లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 71


71వ ప్రకరణము

1831 డిసెంబరు 1న, ఒహైయోలోని హైరంలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లకివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటును పొందే వరకు సిడ్నీ రిగ్డన్‌ను తన లేఖకునిగా కలిగియుండి ప్రవక్త బైబిల్ గ్రంథ అనువాదమును కొనసాగించెను, ఆ సమయములో ఇక్కడ ఇవ్వబడిన సూచనను నెరవేర్చుటకు అది తాత్కాలికముగా ప్రక్కన పెట్టబడెను. విశ్వాసభ్రష్ఠుడైన ఎజ్రా బూత్ చేత వ్రాయబడిన లేఖల ప్రచురణ ఫలితముగా సంఘమునకు వ్యతిరేకముగా వృద్ధి చెందిన శత్రుభావములను రూపుమాపుటకు సహోదరులు ముందుకు సాగవలసియుండెను.

1–4, జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్‌లు సువార్త ప్రకటించుటకు పంపబడిరి; 5–11, పరిశుద్ధుల యొక్క శత్రువులు కలవరపెట్టబడుదురు.

1 ఇదిగో, నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ. మరియు సిడ్నీ రిగ్డన్, మీతో ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, కాలము నిశ్చయముగా సమీపించెను గనుక, నా సువార్తను, పరలోకరాజ్య సంగతులను బోధించుచూ నా చిత్తప్రకారము మీకు ఇవ్వబోవు ఆత్మలో ఒక భాగమును మరియు శక్తిని బట్టి లేఖనములలోనున్న మర్మములను వివరించుచూ మీరు మీ నోళ్ళను తెరుచుట నా యందు యుక్తమును, ఆవశ్యకమునైయున్నది.

2 చుట్టుప్రక్కలనున్న ప్రాంతములలో, సంఘములో కూడా మరలా మీకు తెలియపరచబడు వరకు కొంతకాలముపాటు లోకమునకు ప్రకటించుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

3 నేను మీకు ఇచ్చునది నిశ్చయముగా కొంతకాలముపాటు ఒక నియమితకార్యముగా ఉండును.

4 కాబట్టి, మీరు నా ద్రాక్షతోటలో పనిచేయుడి. భూలోక నివాసులకు పిలుపునియ్యుడి, సాక్ష్యము వహించి, రాబోవు ఆజ్ఞలకు, బయల్పాటులకు మార్గమును సిద్ధపరచుడి.

5 ఇదిగో, ఇప్పుడు ఇది వివేకమైయున్నది; చదువువాడు అర్థము చేసుకొనవలెను, అదేవిధముగా స్వీకరించవలెను;

6 ఏలయనగా స్వీకరించువానికి ధారాళముగా శక్తి ఇవ్వబడును.

7 కాబట్టి, మీ శత్రువులను కలవరపెట్టుడి; బహిరంగముగా, రహస్యముగా మిమ్ములను కలుసుకొనుటకు వారిని ఆహ్వానించుడి; మీరు విశ్వాసముగా ఉన్నంతవరకు వారి అపరాధము ప్రత్యక్షపరచబడును.

8 కాబట్టి, ప్రభువుకు విరోధముగా వారి బలమైన కారణములను వారిని తీసుకొనిరానిమ్ము.

9 నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీకు విరోధముగా ఏర్పడు ఏ ఆయుధమైనను వర్ధిల్లదు;

10 ఏ మనుష్యుడైనను మీకు విరోధముగా తన స్వరమెత్తిన యెడల, నా యుక్త కాలమందు అతడు గద్దించబడును.

11 కాబట్టి, నా ఆజ్ఞలు పాటించుడి; అవి సత్యమైనవి మరియు నమ్మదగినవి. అలాగే జరుగును గాక. ఆమేన్.