లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 67


67వ ప్రకరణము

1831 నవంబరు ఆరంభములో, ఒహైయోలోని హైరంలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ సందర్భమేమనగా సంఘము యొక్క ఒక ప్రత్యేక సమావేశము, ప్రవక్త ద్వారా ప్రభువు యొద్దనుండి ఇదివరకే పొందబడియున్న బయల్పాటుల ప్రచురణ పరిగణించబడి, కార్యరూపము దాల్చెను (1వ ప్రకరణ శీర్షిక చూడుము). విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ మిస్సోరిలోని ఇండిపెండెన్స్‌లో అప్పుడే సంఘముద్రణ కార్యాలయమును స్థాపించెను. ఆ సమావేశము Book of Commandments (ఆజ్ఞల గ్రంథము)లోనున్న బయల్పాటులను ప్రచురించుటకు మరియు 10,000 ప్రతులు ముద్రించుటకు నిర్ణయించెను (కొన్ని అనివార్య కారణముల వలన తరువాత అది 3,000 ప్రతులకు కుదించబడెను). వారిపై క్రుమ్మరించబడిన పరిశుద్ధాత్మ సాక్ష్యము చెప్పగా, సహోదరులలో అనేకులు అప్పుడు ప్రచురణ కొరకు సంపుటీకరించబడిన బయల్పాటులు నిశ్చయముగా సత్యమైనవని హృదయపూర్వకముగా సాక్ష్యమిచ్చిరి. 1వ ప్రకరణముగా చెప్పబడిన బయల్పాటును పొందిన తరువాత, బయల్పాటులలో ఉపయోగించబడిన భాషను గూర్చి కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు జోసెఫ్ స్మిత్ చరిత్ర నమోదుచేసెను. తరువాత ప్రస్తుత బయల్పాటు ఇవ్వబడినది.

1–3, ప్రభువు తన పెద్దల ప్రార్థనలు విని, వారిని కనిపెట్టుకొనియుండును; 4–9, ఆయన బయల్పాటులలో మిక్కిలి అల్పమైన దానికి సరిసమానమైన దానిని వ్రాయమని మహాజ్ఞానియైన వ్యక్తిని ఆయన సవాలు చేయును; 10–14, విశ్వాసముగల పెద్దలు ఆత్మవలన జీవమును పొంది, దేవుని చూచెదరు.

1 మీకై మీరు సమావేశమయిన ఓ నా సంఘ పెద్దలారా, ఇదిగో ఆలకించుడి, మీ ప్రార్థనలను నేను వినియున్నాను, మీ హృదయములు నేనెరిగియున్నాను, మీ కోరికలు నా సన్నిధికి వచ్చియున్నవి.

2 ఇదిగో చూడుడి, నా కన్నులు మీపై నున్నవి, పరలోకము, భూమియు నా చేతులలో నున్నవి, నిత్యత్వపు ఐశ్వర్యములు ఇచ్చుటకు అవి నాకు చెందినవైయున్నవి.

3 మీకు ఇవ్వజూపిన దీవెనలను మీరు పొందవలెనని నమ్ముటకు మీరు ప్రయత్నించిరి; కానీ ఇదిగో, మీ హృదయములో భయమున్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు పొందకపోవుటకు కారణము నిశ్చయముగా ఇదియే.

4 ఇప్పుడు, ప్రభువైన నేను మీ యెదుటనున్న ఈ ఆజ్ఞల సత్యమును గూర్చి సాక్ష్యమును మీకిచ్చుచున్నాను.

5 మీ కన్నులు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. పైనున్నవి, అతని భాషను మీరెరిగియున్నారు, అతని లోపములను మీరెరిగియున్నారు; అతని భాషకంటే ఉన్నతముగా వ్యక్తపరచుటకు జ్ఞానమును మీ హృదయములలో మీరు కోరియున్నారు; ఇది కూడా మీకు తెలియును.

6 ఇప్పుడు, ఆజ్ఞల గ్రంథములోనున్న వాటిలో అల్పమైన దానిని మీరు వెదకుడి మరియు మీ మధ్యనున్న మహా జ్ఞానిని అటువంటిది చేయుటకు నియమించుడి;

7 లేదా అటువంటి దానిని చేయువాడు మీలో ఎవడైనా ఉన్నయెడల, అప్పుడు అవి సత్యమైనవో కావో మేమెరుగమని చెప్పుటలో మీరు నీతిమంతులుగా తీర్పుతీర్చబడుదురు;

8 కానీ అటువంటి దానిని మీరు చేయలేని యెడల, అవి సత్యమని మీరు సాక్ష్యము వహించని యెడల, మీరు నిందించబడుదురు.

9 ఏలయనగా వాటిలో ఎటువంటి దుర్నీతి లేదని మీరెరుగుదురు, నీతిగలది పైనుండి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి క్రిందికి వచ్చును.

10 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇది మీ విశేషాధికారము, ఈ పరిచర్యకు నియమించబడిన మీకు నేనొక వాగ్దానము చేయుచున్నాను, అదేమనగా అసూయలను, భయాలను విడనాడి, నా యెదుట తగ్గించుకొనియుండిన యెడల, (ఏలయనగా మీరు తగినంతగా తగ్గించుకొనలేదు) తెర చీలిపోయి మీరు నన్ను చూచి, నేను సజీవుడనని—ఐహికమైన లేదా ప్రకృతి సంబంధమైన మనస్సుతో కాక, ఆత్మీయ మనస్సుతో తెలుసుకొందురు.

11 ఏలయనగా దేవుని ఆత్మవలన సజీవుడైతే తప్ప, శరీరమందు ఏ మనుష్యుడు ఎన్నడూ దేవుని చూచియుండలేదు.

12 ప్రకృతి సంబంధియైన ఏ మనుష్యుడు లేదా ఐహికమైన మనుస్సుగలవాడెవడు దేవుని సన్నిధిలో నిలువలేడు.

13 ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలోనైనను, పరిచర్య చేయు దూతల యొద్దనైనను నిలువలేరు; కాబట్టి, మీరు పరిపూర్ణులగువరకు సహనముతో కొనసాగుడి.

14 మీ మనస్సులను వెనుకకు త్రిప్పుకొనవద్దు; మీరు యోగ్యులైనప్పుడు, నా యుక్త కాలమందు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. హస్తముల ద్వారా మీకు అనుగ్రహించబడిన దానిని మీరు చూచి, తెలుసుకొందురు. ఆమేన్.