లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 60


60వ ప్రకరణము

1831 ఆగష్టు 8న, మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలోనున్న ఇండిపెండెన్స్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ సందర్భములో జాక్సన్ కౌంటీకి ప్రయాణమై, ఆ ప్రదేశము మరియు దేవాలయ స్థలమును అంకితమిచ్చుటలో పాల్గొన్న పెద్దలు వారేమి చేయాలో తెలుసుకొనగోరెను.

1–9, పెద్దలు దుష్ట జన సమూహములలో సువార్తను ప్రకటించవలెను; 10–14, వారి సమయమును వృధాగా గడపరాదు, వారి తలాంతులను పాతిపెట్టరాదు; 15–17, సువార్తను తిరస్కరించువారికి విరోధముగా ఒక సాక్ష్యముగా ఉండుటకు వారు తమ పాదములను కడుగుకొనవచ్చును.

1 ఇదిగో, ఆయన సంఘ పెద్దలకు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఎక్కడి నుండి వచ్చిరో ఆ ప్రదేశమునకు వేగముగా తిరిగి వెళ్ళవలెను: ఇదిగో, మీరు ఇక్కడికి వచ్చుట నాకు ఆనందము కలుగజేయుచున్నది;

2 కానీ కొందరి యెడల నేను ఆనందించుట లేదు, ఏలయనగా వారు తమ నోళ్ళను విప్పరు, కానీ మనుష్యునికి భయపడి నేను వారికి ఇచ్చియున్న తలాంతును దాచిపెట్టుదురు. అట్టివారికి శ్రమ, ఏలయనగా వారికి విరోధముగా నా కోపము రగులుకొన్నది.

3 వారు నా యెడల మరింత విశ్వాసముగా నుండని యెడల, వారు కలిగియున్నది కూడా వారినుండి తీసివేయబడును.

4 ఏలయనగా ప్రభువైన నేను, పైన పరలోకములందును, భూలోక సైన్యముల మధ్యను రాజ్యమేలుచున్నాను; నేను నా ఆభరణములను సిద్ధపరచు దినమున, దేవుని శక్తికి సాక్ష్యమిచ్చుచున్న దానిని నరులందరు తెలుసుకొందురు.

5 కానీ మీరు ఎక్కడినుండి వచ్చితిరో, ఆ ప్రదేశమునకు ప్రయాణమును గూర్చి మీతో నేను మాట్లాడుదును. మీ దృష్టికి మంచిదనిపించు దాని ప్రకారము ఒక దోనే చేయబడవలెను లేదా కొనబడవలెను, అది నాకు ముఖ్యము కాదు, సెయింట్ లూయిస్‌గా పిలువబడు ప్రదేశమునకు మీరు వేగముగా ప్రయాణము చేయవలెను.

6 అక్కడి నుండి నా సేవకులైన సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్ జూ., ఆలీవర్ కౌడరీలు సిన్సినాటికి ప్రయాణము చేయవలెను;

7 ఈ ప్రదేశములో వారు తమ స్వరములెత్తి, కోపము లేదా అనుమానము లేకుండా వారి మీద పరిశుద్ధ హస్తములెత్తి, బిగ్గరగా నా వాక్యమును ప్రకటించవలెను. ఏలయనగా నేను మిమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు శక్తిని కలిగియున్నాను, మీ పాపములు క్షమించబడియున్నవి.

8 మిగిలిన వారు, ఇద్దరిద్దరుగా సెయింట్ లూయిస్‌కు ప్రయాణము చేయవలెను, వారు ఎక్కడినుండి వచ్చితిరో అక్కడికి తిరిగి వెళ్ళు వరకు త్వరపడి బయలుదేరకుండా, దుష్ట జనసమూహముల మధ్య వాక్యమును ప్రకటించవలెను.

9 ఇదంతయు సంఘముల మేలు కొరకే చెప్పబడెను; ఈ ఉద్దేశ్యము కొరకే వారిని నేను పంపియున్నాను.

10 నేనతనికి ఇచ్చిన ధనములో ఒక భాగమును నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ తూర్పునకు వెళ్ళమని ఆజ్ఞాపించబడిన నా పెద్దలకు ఇవ్వవలెను;

11 సామర్థ్యముగలవాడు దానిని ప్రతినిధి ద్వారా తిరిగి చెల్లించవలెను; లేనివాని నుండి అది అడుగబడలేదు.

12 ఇప్పుడు ఈ ప్రదేశమునకు రావలసియున్న శేషమును గూర్చి నేను మాటలాడుచున్నాను.

13 ఇదిగో, వారు దుష్ట జనసమూహముల మధ్య నా సువార్తను ప్రకటించుటకు పంపబడియున్నారు; కాబట్టి, ఈవిధముగా వారికి నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను: మీ సమయమును వృధాగా గడపరాదు, మీ తలాంతు తెలియబడకుండునట్లు దానిని పాతిపెట్టకూడదు;

14 మీరు సీయోను ప్రదేశమునకు వచ్చి, నా సువార్తను ప్రకటించిన తరువాత, త్వరపడి బయలుదేరకుండా, కోపముతోను లేదా జగడముతోను కాక దుష్ట జనసమూహముల మధ్య వాక్యమును ప్రకటించుచూ మీరు వేగముగా తిరిగి వెళ్ళవలెను.

15 మిమ్ములను చేర్చుకొనని వారికి విరోధముగా మీ పాద ధూళిని వారి సముఖమున కాకుండా, రహస్యముగా దులిపివేయుడి, లేనియెడల మీరు వారికి కోపము రేపుదురు; తీర్పు దినమున వారికి విరోధముగా సాక్ష్యముగానుండుటకు మీ కాళ్ళను కడుగుకొనుడి.

16 ఇదిగో, ఇది మీకు చాలును, ఇది మిమ్ములను పంపియున్న వాని చిత్తమైయున్నది.

17 నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. నోటి ద్వారా సిడ్నీ రిగ్డన్, ఆలీవర్ కౌడరీలను గూర్చి తెలియజేయబడును. మిగిలినది ఇకముందు తెలియజేయబడును. అలాగే జరుగును గాక. ఆమేన్.