లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 21


21వ ప్రకరణము

1830 ఏప్రిల్ 6న, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు, పైన చెప్పబడిన తారీఖున పీటర్ విట్మర్ సీ. గృహములో ఇవ్వబడెను. గతములో బాప్తిస్మము పొందిన ఆరుగురు పురుషులు పాల్గొనిరి. దేవుని ఆజ్ఞ ప్రకారము ఏర్పాటు చేయుటకు ఏకగ్రీవ ఓటు చేత ఈ వ్యక్తులు వారి కోరికను, దృఢ సంకల్పమును తెలిపిరి (20వ ప్రకరణము చూడుము). జోసెఫ్ స్మిత్ జూ., ఆలీవర్ కౌడరీలను సంఘానికి అధ్యక్షత వహించు అధికారులుగా అంగీకరించి, సహకరించుటకు వారు ఓటువేసిరి. తరువాత జోసెఫ్ హస్త నిక్షేపణము ద్వారా ఆలీవర్‌ను సంఘ పెద్దగా నియమించెను, అదేవిధముగా ఆలీవర్ జోసెఫ్‌ను నియమించెను. సంస్కారము నిర్వహించిన తరువాత, పరిశుద్ధాత్మనిచ్చుటకు, ప్రతి ఒక్కరిని సంఘ సభ్యునిగా నిర్ధారించుటకు పాల్గొనిన వారిపై జోసెఫ్, ఆలీవర్ విడివిడిగా హస్త నిక్షేపణము చేసిరి.

1–3, జోసెఫ్ స్మిత్ దీర్ఘదర్శిగా, అనువాదకునిగా, ప్రవక్తగా, అపొస్తలునిగా, పెద్దగా ఉండుటకు పిలువబడెను; 4–8, అతని వాక్యము సీయోను హేతువును నడిపించును; 9–12, ఆదరణకర్త ద్వారా అతడు మాట్లాడగా, పరిశుద్ధులు అతని మాటలను నమ్ముదురు.

1 ఇదిగో, మీ మధ్య ఒక గ్రంథము ఉంచబడవలెను; తండ్రియైన దేవుని చిత్తము, నీ ప్రభువైన యేసు క్రీస్తు కృప ద్వారా దానిలో నీవు ఒక దీర్ఘదర్శిగా, ఒక అనువాదకునిగా, ఒక ప్రవక్తగా, యేసు క్రీస్తు యొక్క ఒక అపొస్తలునిగా, సంఘము యొక్క ఒక పెద్దగా పిలువబడెదవు,

2 దాని పునాదిని వేయుటకు, అతిపరిశుద్ధమైన విశ్వాసము మీద దానిని కట్టుటకు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడెదవు.

3 ఆ సంఘము మీ ప్రభువు యొక్క పదునెనిమిది వందల ముప్పది సంవత్సరములో, ఏప్రిల్ గా పిలువబడు నాలుగవ నెలలో, ఆరవ తేదీన ఏర్పాటు చేయబడి, స్థాపించబడెను.

4 కాబట్టి సంఘము అనగా మీరు, నా యెదుట పూర్తి పరిశుద్ధతతో నడుచుకొనుచూ అతని మాటలన్నింటికి, అతడు వాటిని పొందినప్పుడు మీకిచ్చు ఆజ్ఞలకు చెవియొగ్గవలెను;

5 ఏలయనగా మీరు అతని మాటను పూర్తి సహనముతోను, విశ్వాసముతోను నా నోటినుండి పలికినట్లుగానే స్వీకరించవలెను.

6 ఈ సంగతులను చేయుట ద్వారా నరకపు ద్వారములు మీ యెదుట నిలువజాలవు; అవును, ప్రభువైన దేవుడు అంధకార శక్తులను మీ యెదుట నుండి తరిమివేయును, మీ మేలు కొరకు, ఆయన నామ ఘనత కొరకు పరలోకములు కంపించునట్లు చేయును.

7 కాబట్టి దేవుడైన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మంచి ఉద్దేశ్యము కొరకు సీయోను హేతువును అత్యంత శక్తితో నడిపించుటకు నేనతనిని ప్రేరేపించియున్నాను, అతనికి గల శ్రద్ధ నాకు తెలియును మరియు అతని ప్రార్థనలను నేను ఆలకించియున్నాను.

8 అవును, సీయోను కొరకు అతడు విలపించుట నేను చూచియున్నాను, ఆమె కొరకు అతడు ఇక ఎంతమాత్రము దుఃఖపడకుండునట్లు నేను చేయుదును; అతని పాపక్షమాపణ వలన కలుగు అతని సంతోషకరదినములు, అతని కార్యములపై నా దీవెనల ప్రత్యక్షత వచ్చియున్నది.

9 ఏలయనగా ఇదిగో, నా ద్రాక్షతోటలో పనిచేయు వారందరిని ఒక గొప్ప దీవెనతో నేను దీవించెదను, ఆదరణకర్త చేత నా ద్వారా అతనికి ఇవ్వబడిన అతని మాటలపై వారు నమ్మకముంచెదరు; లోక పాపముల కొరకు, అనగా నలిగిన హృదయము గలవారికి పాపక్షమాపణ కలుగుటకై పాపాత్ములైన మనుష్యుల చేత యేసు క్రీస్తు సిలువ వేయబడెనని ఆ ఆదరణ కర్త ప్రత్యక్షపరచును.

10 కాబట్టి నా అపొస్తలుడైన ఆలీవర్ కౌడరీ, నీ చేత అతడు నియమించబడుట నా చిత్తమైయున్నది;

11 అతని చేతిక్రింద నీవు పెద్దవు గనుక, నీకతడు మొదటివానిగా ఉండగా, నా నామమును కలిగియున్న ఈ క్రీస్తు సంఘమునకు నీవు ఒక పెద్దగానుండునట్లు—

12 సంఘమునకు, లోకము యెదుటను, అన్యజనుల యెదుటను, యూదులకు కూడా ఈ సంఘము యొక్క మొదటి ప్రసంగీకుడవైయుండునట్లు ఇది నీకొక విధియైయున్నది; ఇదిగో, ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.