లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 35


35వ ప్రకరణము

1830 డిసెంబరు 7న, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో లేదా సమీపములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్‌లకివ్వబడిన బయల్పాటు. ఈ సమయములో, ప్రవక్త ఇంచుమించు ప్రతిదినము పరిశుద్ధ గ్రంథ అనువాదములో నిమగ్నమైయుండెను. ఈ అనువాదము 1830 జూన్‌ లోపు ప్రారంభమయ్యెను మరియు ఆలీవర్ కౌడరీ, జాన్ విట్మర్ ఇరువురు లేఖకులుగా పనిచేసిరి. వారిప్పుడు ఇతర బాధ్యతలకు పిలువబడిరి గనుక, సిడ్నీ రిగ్డన్ దైవిక నియామకము చేత ఈ పనిలో ప్రవక్తకు లేఖకునిగా పిలువబడెను (20వ వచనము చూడుము). ఈ బయల్పాటు గురించి ఈ గ్రంథము యొక్క పీఠికగా జోసెఫ్ స్మిత్ చరిత్ర ఇట్లు తెలుపుచున్నది: “డిసెంబరులో (ఒహైయో నుండి) ప్రభువునొద్ద విచారించుటకు సిడ్నీ రిగ్డన్ వచ్చెను, అతనితోపాటు ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ వచ్చెను. … ఈ ఇద్దరు సహోదరులు వచ్చిన కొద్దికాలము తరువాత, ప్రభువు ఈ విధముగా పలికెను.”

1–2, నరులు ఏవిధముగా దేవుని కుమారులు కావచ్చును; 3–7, బాప్తిస్మమిచ్చుటకు, పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు సిడ్నీ రిగ్డన్ పిలువబడెను; 8–12, విశ్వాసము వలన సూచకక్రియలు, అద్భుతములు చేయబడెను; 13–16, ప్రభువు సేవకులు ఆత్మశక్తి వలన రాజ్యములను తూర్పారబెట్టుదురు; 17–19, మర్మముల తాళపుచెవులను జోసెఫ్ స్మిత్ కలిగియుండును; 20–21, ఎన్నుకోబడినవారు ప్రభువు రాకడ దినమును ఎదుర్కొని నిలబడగలరు; 22–27, ఇశ్రాయేలు రక్షింపబడును.

1 అల్ఫాయు ఓమెగయు, ఆదియు అంతమునైయున్న మీ దేవుడైన ప్రభువు స్వరమును ఆలకించుము, ఆయన మార్గము ఒక నిత్య వలయమైయుండి, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్నాడు.

2 తండ్రియందు నేనును, నా యందు తండ్రియు ఏకమైయున్న రీతిగా మనము ఏకమైయుండునట్లు నా యందు ఏకమై, నా నామమందు నమ్మికయుంచిన వారందరు దేవుని కుమారులగునట్లు లోకపాపముల కొరకు సిలువ వేయబడిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేను.

3 ఇదిగో నా సేవకుడవైన సిడ్నీ, నిన్నును, నీ కార్యములను నేను చూచియున్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను నీ ప్రార్థనలను విని, మరింత గొప్ప కార్యమునకు నిన్ను సిద్ధపరచియున్నాను.

4 నీవు గొప్ప కార్యములు చేయుదువు గనుక నీవు ధన్యుడవు. నాకును, రావలసియున్న ఏలీయాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు యోహాను వలే నీవు పంపబడితివి మరియు దానిని నీవు యెరుగకయుంటివి.

5 పశ్చాత్తాపము నిమిత్తము నీటి ద్వారా నీవు బాప్తిస్మము ఇచ్చియున్నావు, కానీ వారు పరిశుద్ధాత్మను పొందలేదు;

6 కానీ ఇప్పుడు నేను నీకొక ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేమనగా నీవు నీటి ద్వారా బాప్తిస్మమియ్యవలెను, ప్రాచీన అపొస్తలులు ఇచ్చిన విధముగా, హస్తనిక్షేపణము వలన వారు పరిశుద్ధాత్మను పొందెదరు.

7 జరుగబోవునదేమనగా, ఈ దేశములో అనగా అన్యజనుల మధ్య ఒక గొప్ప కార్యము చేయబడును, ఏలయనగా వారి అవివేకము, దుష్కార్యములు జనులందరికి తెలియజేయబడును.

8 ఏలయనగా నేను దేవుడను, నా చెయ్యి కురచయైపోలేదు; నా నామమందు విశ్వసించు వారందరికి నేను అద్భుతములను, సూచకక్రియలను, ఆశ్చర్యకార్యములను చూపెదను.

9 విశ్వాసముతో నా నామములో వీటిని అడుగువారందరు దయ్యములను వెళ్ళగొట్టుదురు; వారు రోగులను స్వస్థపరచుదురు; గ్రుడ్డివారు తమ చూపును పొందునట్లు, చెవిటివారు వినునట్లు, మూగవారు మాట్లాడునట్లు, కుంటివారు నడుచునట్లు వారు చేయుదురు.

10 మనుష్యుకుమారులకు గొప్ప కార్యములు చూపు సమయము వేగముగా వచ్చుచున్నది;

11 కానీ మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన బబులోనుపై వచ్చు నాశనములు తప్ప ఏదియు విశ్వాసము లేకుండా చూపబడదు.

12 ఈ తరమునకు నేను పంపిన నా సంపూర్ణ సువార్తను స్వీకరించుటకు సిద్ధముగానున్నవారు తప్ప మంచిని చేయువారెవరును లేరు.

13 కాబట్టి, నా ఆత్మ శక్తిచేత జనములను తూర్పారబెట్టుటకు ఈ లోకములో బలహీనమైన వాటిని అనగా విద్యలేని పామరులను, నిరాకరింపబడిన వారిని నేను పిలిచియున్నాను.

14 వారి చెయ్యి నా చెయ్యిగా నుండును, నేను వారి డాలుగా, కేడెముగా నుందును; వారి నడుములకు నేను దట్టీని కట్టెదను, వారు నా కొరకు ధైర్యముగా యుద్ధము చేయుదురు; వారి శత్రువులు వారి పాదముల క్రింద నుండెదరు; వారి తరఫున ఖడ్గము పడునట్లు నేను చేయుదును మరియు నా కోపాగ్నిచేత వారిని రక్షించెదను.

15 పేదలకు, సాత్వీకులకు సువార్త ప్రకటింపబడును మరియు నా రాకడ సమయము కొరకు వారు కనిపెట్టెదరు, ఏలయనగా అది సమీపములో నున్నది—

16 వారు అంజూరపు చెట్టు ఉపమానమును గూర్చి నేర్చుకొందురు, ఏలయనగా ఇప్పటికే వేసవికాలము సమీపముగా నున్నది.

17 నా సేవకుడైన జోసెఫ్ ద్వారా నేను నా సంపూర్ణ సువార్తను పంపియున్నాను; బలహీనతయందు అతడిని నేను దీవించియున్నాను;

18 అతడు నా యందు నిలిచియున్న యెడల, ముద్ర వేయబడియున్న ఆ సంగతులు అనగా లోకము పునాది వేయబడినప్పటి నుండి ఉన్న సంగతులు, ఈ సమయము నుండి నా రాకడ సమయము వరకు రాబోవు సంగతుల మర్మపు తాళపుచెవులను నేనతనికి ఇచ్చియున్నాను, అట్లు కానియెడల, అతనికి బదులు వేరొకనిని నేను నియమించెదను.

19 కాబట్టి, అతని విశ్వాసము తప్పిపోకుండునట్లు అతడిని కనిపెట్టుము మరియు సమస్తమును యెరిగిన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ ద్వారా అది ఇవ్వబడును.

20 నేను నీకొక ఆజ్ఞను ఇచ్చుచున్నాను—అదేమనగా అతని కొరకు నీవు వ్రాయవలెను; ఎన్నుకోబడిన నా స్వజనుల రక్షణార్థము, నా హృదయములో నున్నట్లుగా లేఖనములు ఇవ్వబడును;

21 ఏలయనగా వారు నా స్వరమును విని, నన్ను చూచెదరు మరియు వారు నిద్రించక, నా రాకడ దినమున నిలిచెదరు; ఏలయనగా నేను పరిశుద్ధుడనై ఉన్నట్లే వారును పరిశుద్ధము చేయబడుదురు.

22 ఇప్పుడు నేను నీతో చెప్పునదేమనగా, నీవు అతనితో నుండుము, అతడు నీతో ప్రయాణము చేయును; అతడిని విడిచిపెట్టకుము మరియు నిశ్చయముగా ఈ సంగతులు నెరవేరును.

23 మీరు వ్రాయని సమయములో, అతనికి ప్రవచన వరము ఇవ్వబడును; నీవు నా సువార్తను ప్రకటించవలెను మరియు అతనికి వాక్యములు ఇవ్వబడినప్పుడు, వాటిని నిరూపించుటకు పరిశుద్ధ ప్రవక్తల మాటలను ఉదహరించవలెను.

24 మీరు బద్ధులైయున్న ఆజ్ఞలు, నిబంధనలన్నింటిని పాటించుము; మీ మేలు కొరకు ఆకాశములు కదులునట్లు నేను చేయుదును; సాతాను భయముతో వణకును మరియు కొండలపైనున్న సీయోను ఆనందించి, వర్ధిల్లును;

25 నా యుక్త కాలమందు ఇశ్రాయేలు రక్షించబడును; నేనిచ్చియున్న తాళపుచెవుల వలన వారు నడిపించబడుదురు మరియు వారిక భంగపరచబడరు.

26 మీ హృదయములెత్తుకొని సంతోషించుడి, మీ విడుదల సమీపించుచున్నది.

27 చిన్నమందా భయపడకుడి, నేను వచ్చువరకు రాజ్యము మీదైయున్నది. ఇదిగో, నేను అకస్మాత్తుగా వచ్చెదను. అలాగే జరుగును గాక. ఆమేన్.