లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 124


124వ ప్రకరణము

1841, జనవరి 19న నావూ, ఇల్లినాయ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన బయల్పాటు. ప్రభుత్వ అధికారుల ద్వారా వారికి విరోధముగా అధికమగుచున్న హింస మరియు అన్యాయపు విధానముల వలన, పరిశుద్ధులు మిస్సోరిని విడిచిపెట్టుటకు బలవంతము చేయబడిరి. 1838, అక్టోబరు 27న వారిని సమూలంగా నిర్మూలించుటకు మిస్సోరి గవర్నరైన లిల్బర్న్ డబ్ల్యు. బాగ్స్ చేత విధించబడిన ఆజ్ఞ వారికి మరొక దారి లేకుండా చేసెను. 1841లో ఈ బయల్పాటు ఇవ్వబడినప్పుడు, ఇల్లినాయ్‌లోని పూర్వపు కామర్స్ గ్రామమే నావూ పట్టణము పరిశుద్ధులచేత నిర్మించబడెను, ఇక్కడ సంఘపు ప్రధాన కార్యాలయము స్థాపించబడెను.

1–14, సంయుక్త రాష్ట్రాల అధ్యక్షునికి, అన్ని రాజ్యముల గవర్నర్లకు, పరిపాలకులకు సువార్తను గంభీరముగా ప్రకటించమని జోసెఫ్ స్మిత్‌కు ఆజ్ఞాపించబడెను; 15–21, సజీవులు మరియు మృతులలో హైరం స్మిత్, డేవిడ్ డబ్ల్యు. పేటన్, జోసెఫ్ స్మిత్ సీ. మరియు ఇతరులు వారి నిజాయితీ, సుగుణముల వలన ధన్యులు; 22–28, నావూలో అపరిచితులకు ఆతిథ్యమిచ్చుటకు ఒక గృహము, ఒక దేవాలయము రెండిటిని నిర్మించమని పరిశుద్ధులు ఆజ్ఞాపించబడిరి; 29–36, దేవాలయములలో మృతుల కొరకు బాప్తిస్మములు నిర్వహించబడవలెను; 37–44, పరిశుద్ధ విధుల నిర్వహణ కొరకు ప్రభువు జనాంగము ఎల్లప్పుడు దేవాలయములను నిర్మించెదరు; 45–55, వారి శత్రువుల అణచివేత కారణముగా పరిశుద్ధులు జాక్సన్ కౌంటీలో దేవాలయము నిర్మించు బాధ్యతనుండి తప్పించబడిరి; 56–83, నావూ మందిరము నిర్మించుటకు నిర్దేశకములు ఇవ్వబడెను; 84–96, గోత్రజనకునిగా తాళపుచెవులు పొందుటకు, ఆలీవర్ కౌడరీ స్థానములో నిలువబడుటకు హైరం స్మిత్ పిలువబడెను; 97–122, విలియం లా మరియు ఇతరులకు వారు చేయు పనులలో ఉపదేశములివ్వబడెను; 123–145, ప్రధాన మరియు ప్రాంతీయ అధికారుల పేర్లు, వారి బాధ్యతలు, సమూహములతో వారికున్న సంబంధములు ఇవ్వబడెను.

1 నా సేవకుడవైన జోసెఫ్ స్మిత్, నీతో ప్రభువు నిశ్చయముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు చేసియున్న నీ అర్పణలు, ఒప్పుకోలుల విషయమై నేను మిక్కిలి ఆనందించుచున్నాను; ఈ లోకమందు బలహీనమైన వాటి ద్వారా నా జ్ఞానమును చూపుటకు ఇందు నిమిత్తమే నేను నిన్ను సిద్ధపరచితిని.

2 నీ ప్రార్థనలు నాకు అంగీకారముగానున్నవి; వాటికి ప్రత్యుత్తరముగా నేను నీకు చెప్పునదేమనగా, ఇప్పుడు నీవు నా సువార్తను గూర్చి సీయోనుకు మూలరాయిగా ఉండుటకు, నేను స్థాపించిన ఈ స్టేకును గూర్చి ఒక గంభీర ప్రకటన చేయుటకు తక్షణమే పిలువబడితివి, అది రాజమందిరమునకై చెక్కబడిన విధముగా చెక్కబడును.

3 ఈ ప్రకటన భూలోక రాజులందరికి, దాని నలుమూలలకు, ఎన్నుకోబడిన ఘనత వహించు అధ్యక్షునికి, నీవు నివశించుచున్న దేశపు ఘనులైన గవర్నర్లకు, విదేశాలలో చెదిరిపోయిన రాజ్యములన్నింటికి చేయబడవలెను.

4 ఇది సాత్వీకమైన మనస్సుతోను, దీనిని వ్రాయు సమయములో నీలో ఉండు పరిశుద్ధాత్మ శక్తితోను వ్రాయబడవలెను;

5 ఏలయనగా ఆ రాజులు, అధికారులను గూర్చి నా చిత్తమును తెలుసుకొనుటకు, భవిష్యత్తులో వారికి జరుగునది కూడా నీకు పరిశుద్ధాత్మ ద్వారా తెలుపబడును.

6 ఇదిగో, సీయోను వెలుగును, మహిమను లక్ష్యపెట్టుటకు వారిని నేను పిలువబోవుచున్నాను, ఏలయనగా దానిమీద దయచూపుటకు నిర్ణీతకాలము ఆసన్నమాయెను.

7 కాబట్టి, ఎలుగెత్తి ప్రకటన చేయుచు నీ సాక్ష్యముతో వారిని వేడుకొనుము, వారికి భయపడకుము, ఏలయనగా వారు గడ్డిని పోలియున్నారు, వారి మహిమ త్వరగా రాలిపోవు గడ్డిపువ్వు వలే ఉన్నది, తద్వారా వారు కూడా క్షమాపణలేకయుందురు—

8 దర్శనదినమున వారిని నేను దర్శించెదను, వారు నా సేవకులను, వారికి బయలుపరచిన నా సాక్ష్యమును తిరస్కరించిన యెడల, వేషధారులతో బలాత్కారునికి పాలు నియమించుటకు అప్పుడు నా ముఖపు ముసుగును నేను తీసివేయుదును, అక్కడ పండ్లు కొరుకుట ఉండును.

9 మరలా మీ మేలు కొరకు అనేకులను నేను దర్శించి, వారి హృదయాలను మృదుపరచెదను, తద్వారా వారి యెదుట మీరు కనికరమును పొందెదరు, తద్వారా వారు సత్యము యొక్క వెలుగునొద్దకు వచ్చెదరు, అన్యజనులు సీయోనును ఉన్నతస్థితికి చేర్చుటకు లేదా పైకెత్తుటకు తరలివచ్చెదరు.

10 ఏలయనగా మీరు అనుకోని గడియలో నా దర్శన దినము వేగముగా వచ్చును; నా జనులకు భద్రత, వారిలో మిగిలిన వారికి ఆశ్రయము ఎక్కడ ఉండును?

11 భూలోక రాజులారా, మేల్కొనుడి! నా జనులకు, సీయోను కుమార్తెల మందిరమునకు సహాయము చేయుటకు మీ బంగారముతోను, మీ వెండితోను మీరు రండి, తరలిరండి.

12 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ ప్రకటన వ్రాయుటకు నా సేవకుడు రాబర్ట్ బి. థాంప్సన్ నీకు సహాయము చేయవలెను, ఏలయనగా నేను అతని యెడల మిక్కిలి ఆనందించుచున్నాను, అతడు నీతో ఉండవలెను;

13 కాబట్టి, అతడు నీ ఉపదేశమును వినవలెను, అనేకమైన దీవెనలతో అతడిని నేను దీవించెదను; ఇకనుండి అతడు అన్ని విషయములందు నమ్మకముగాను, యథార్థముగాను ఉండవలెను, నా యెదుట అతడు గొప్పవానిగానుండును;

14 కానీ అతని నుండి అతని గృహనిర్వాహకత్వమును నేను కోరుచున్నానని అతడు గుర్తుంచుకొనవలెను.

15 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన హైరం స్మిత్ ధన్యుడు; ఏలయనగా, అతని హృదయపు నిజాయితీ వలన, అతడు నా యెదుట సత్యమైన దానిని ప్రేమించుట వలన ప్రభువైన నేను అతడిని ప్రేమించుచున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

16 మరలా, నా సేవకుడైన జాన్ సి. బెన్నెట్ భూలోక రాజులకు, ప్రజలకు నా వాక్కును పంపుటలో నీకు సహాయపడవలెను, శ్రమకాలములో నా సేవకుడవైన జోసెఫ్ స్మిత్ అను నీ యెడల నమ్మకముగా ఉండవలెను; అతడు ఉపదేశమును పొందిన యెడల, అతని ప్రతిఫలమును కోల్పోడు.

17 మరియు తాను కలిగియున్న ప్రేమ వలన అతడు గొప్పవాడగును, ఏలయనగా దీనిని చేసిన యెడల అతడు నా వానిగా ఉండునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అతడు చేసిన కార్యమును నేను చూసియున్నాను, అతడు దానిని కొనసాగించిన యెడల నేను దానిని అంగీకరించెదను, దీవెనలతోను, గొప్ప మహిమతోను అతనికి నేను కిరీటము ధరింపజేసెదను.

18 మరలా నేను నీతో చెప్పునదేమనగా, నా సేవకుడైన లైమన్ వైట్ దీనమనస్సుతో సీయోనును గూర్చి ప్రకటించుటను కొనసాగించుచు, లోకము యెదుట నన్ను అంగీకరించుట నా చిత్తమైయున్నది; పక్షిరాజు రెక్కలపై నేను అతడిని మోయుదును; అతడు మహిమను, ఘనతను అతని కొరకు, నా కొరకు సంపాదించును.

19 అతడు తన కార్యమును ముగించిన తరువాత, ఈ సమయములో నాతోనున్న నా సేవకుడైన డేవిడ్ పేటన్, నా సేవకుడైన ఎడ్వర్డ్ ప్యాట్రిడ్జ్, మరియు అబ్రాహాము కుడిప్రక్కన కూర్చొను నా వృద్ధ సేవకుడైన జోసెఫ్ స్మిత్ సీ. వలె అతడిని కూడా నా యొద్దకు చేర్చుకొందును, అతడు ధన్యుడు, పరిశుద్ధుడు, ఏలయనగా అతడు నా వాడు.

20 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా సేవకుడైన జార్జ్ మిల్లర్ నిష్కపటముగానున్నాడు; అతని హృదయపు నిజాయితీ వలన అతనియెడల నమ్మకము కలిగియుండవచ్చును; నా సాక్ష్యము యెడల అతడు కలిగియున్న ప్రేమ వలన ప్రభువైన నేను అతని యెడల ప్రేమ కలిగియున్నాను.

21 కాబట్టి, నేను నీతో చెప్పునదేమనగా, నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ వలే అతని శిరస్సుపై బిషప్రిక్కు స్థానమును నేను ముద్రించియున్నాను, అతడు నా మందిరమునకు ఇవ్వబడు అర్పణలను పొంది, నా ప్రజలలో బీదల శిరస్సులపైన దీవెనలను నిర్వహించవచ్చునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడైన జార్జ్‌ను ఏ మనుష్యుడు తిరస్కరించకూడదు, ఏలయనగా అతడు నన్ను ఘనపరచును.

22 నా సేవకుడైన జార్జ్, నా సేవకుడైన లైమన్, నా సేవకుడైన జాన్ స్నైడర్, మరియు ఇతరులు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ వారికి చూపువిధముగా, వారికి చూపు స్థలములో నా నామమున ఒక గృహమును కట్టవలెను.

23 అది అతిథిగృహముగా నుండును, సుదూరమునుండి వచ్చు అపరిచితులు దానిలో ఆతిథ్యమును పొందెదరు; కాబట్టి అది మంచి గృహముగా ఉండవలెను, అన్నివిషయములలోను అంగీకారముగా ఉండవలెను, తద్వారా అలసిపోయిన యాత్రికుడు ప్రభువు వాక్యమును గ్రహించునప్పుడు ఆరోగ్యమును, భద్రతను పొందవచ్చును; సీయోను కొరకు నేను మూలరాయిని నియమించియున్నాను.

24 ఈ గృహము నా నామమున నిర్మించబడి దానికి నియమించబడిన నిర్వహణాధికారి అపవిత్రమైనదేదియు దానిలోనికి ప్రవేశించకుండునట్లు చేసినట్లైతే, అది ఆరోగ్యకరమైన నివాసముగానుండును. అది పరిశుద్ధముగా ఉండవలెను, లేనియెడల దేవుడైన మీ ప్రభువు దానిలో నివసించడు.

25 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సుదూరము నుండి నా పరిశుద్ధులందరు రావలెను.

26 వేగిరపడు దూతలను మీరు పంపుడి, ఎన్నుకోబడిన దూతలను పంపి వారితో ఈలాగు చెప్పుడి: మీ బంగారముతోను, మీ వెండితోను, మీ ప్రశస్థమైన రాళ్లతోను, మీ విలువైన ప్రాచీనకాల అవశేషములన్నింటితోను రండి; ప్రాచీనకాల అవశేషములను గూర్చి జ్ఞానము కలిగి, వచ్చుటకు ఇచ్ఛయించు వారందరు రావచ్చును, భూమి యొక్క విలువైన వృక్షములతో పాటు సరళ వృక్షములను, గొంజిచెట్లను, దేవదారు వృక్షములను తేవలెను;

27 ఇనుముతోను, రాగితోను, కంచుతోను, జింకుతోను, భూమి యొక్క విలువైన వస్తువులన్నిటితోను రావలెను; మహోన్నతుడు దానిలో నివాసము చేయుటకు నా నామమున ఒక మందిరమును కట్టవలెను.

28 ఆయన వచ్చి మీరు కోల్పోయిన దానిని లేదా ఆయన తీసుకొనిపోయిన దానిని, అనగా సంపూర్ణ యాజకత్వమును పునఃస్థాపించుటకు భూమిమీద ఏ స్థలమైనను లేదు.

29 వారు అనగా నా పరిశుద్ధులు మృతుల కొరకు బాప్తిస్మము పొందుటకు బాప్తిస్మపు తొట్టె భూమిమీద లేదు—

30 ఏలయనగా ఈ విధి నా మందిరమునకు చెందినది, మీ లేమిలో మీరు నా కొరకు మందిరమును నిర్మించలేని దినములలో తప్ప అది నాకు అంగీకారము కానేరదు.

31 కానీ నా కొరకు ఒక మందిరమును నిర్మించమని పరిశుద్ధులైన మీ అందరికి నేనాజ్ఞాపించుచున్నాను; నా కొరకు ఒక మందిరమును నిర్మించుటకు తగినంత సమయమును మీకనుగ్రహించుచున్నాను; ఈ సమయములో మీరిచ్చు బాప్తిస్మములు నాకు అంగీకారముగానుండును.

32 కానీ ఇదిగో, ఈ నియమితకాలము ముగిసిన తరువాత మీ మృతుల కొరకు మీరిచ్చు బాప్తిస్మము నాకు అంగీకారము కాదు; ఈ గడువు ముగిసిన తరువాత మీరు వీటిని చేయని యెడల, మీ మృతులతోపాటు ఒక సంఘముగా మీరు తిరస్కరించబడుదురని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

33 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మృతుల కొరకు బాప్తిస్మమిచ్చు విధిని కలిగియుండి దానికొరకే లోకము పునాది వేయబడక మునుపు స్థాపించబడిన ఒక మందిరమును నా కొరకు నిర్మించుటకు మీరు తగినంత సమయము కలిగియుండి, ఆవిధముగా చేయనియెడల, మీ మృతుల కొరకు మీరిచ్చు బాప్తిస్మములు నాకు అంగీకారము కావు;

34 ఏలయనగా దానిలోనే యాజకత్వపు తాళపుచెవులు నియమించబడును, తద్వారా ఘనతను మహిమను మీరు పొందెదరు.

35 ఈ నియమిత కాలము ముగిసిన తరువాత, దూరప్రాంతములలో ఉన్నవారి ద్వారా మృతుల కొరకు ఇవ్వబడు మీ బాప్తిస్మములు నాకు అంగీకారము కాదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

36 ఏలయనగా, మీ మృతుల కొరకు బాప్తిస్మమిచ్చు ప్రదేశములు సీయోనులో, దాని స్టేకులలో, యెరూషలేములో, ఆశ్రయదుర్గముగా ఉండుటకు నేను నియమించిన ఆ ప్రదేశములలో ఉండునట్లుగా నియమించబడినది.

37 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా నామమున మీరు నిర్మించిన మందిరములో నిర్వహించబడితే తప్ప, మీ ప్రక్షాళనములు ఏవిధముగా నాకు అంగీకారమగును?

38 ఏలయనగా, ఈ హేతువు వలన వారితో అరణ్యములో మోసుకొనిపోవుటకు ఒక మందిరమును అతడు నిర్మించవలెనని, లోకము రూపింపబడక మునుపు నుండి దాచబడియున్న ఆ విధులు బయలుపరచబడుటకు వాగ్దానదేశములో ఒక మందిరమును నిర్మించవలెనని మోషేను నేనాజ్ఞాపించితిని.

39 కాబట్టి నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మీ అభిషేకములు, మీ ప్రక్షాళనలు, మృతుల కొరకు మీ బాప్తిస్మములు, మీ వ్రతదినములు, లేవి కుమారులచేత చేయబడు మీ బలుల కొరకు అక్కడ మీరు సంభాషణలను, మీ కట్టడలు మరియు తీర్పులను పొందునట్లు మీ అత్యంత పరిశుద్ధ స్థలములలోని దర్శనముల కొరకు, సీయోను యొక్క పునాది, బయల్పాటుల ఆరంభము కొరకు ఆమె నివాసులందరి మహిమ, ఘనత, దీవెన కొరకు మీ జ్ఞాపకార్థములు నా పరిశుద్ధ గృహ విధుల వలన నియమించబడెను, దానిని ఎల్లప్పుడు నా నామమున నిర్మించవలెనని నా జనులు ఆజ్ఞాపించబడిరి.

40 నా జనులకు దానియందు నా విధులను నేను బయలుపరచునట్లు ఈ మందిరము నా నామమున నిర్మించబడవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;

41 ఏలయనగా లోకము పునాది వేయబడక మునుపు నుండి మరుగుపరచబడిన సంగతులను, కాలముల సంపూర్ణ యుగమునకు సంబంధించిన సంగతులను నా సంఘమునకు బయలుపరచుట సముచితమైనదిగా నేను యెంచుచున్నాను.

42 ఈ మందిరమునకు సంబంధించిన అన్ని సంగతులను, దాని యాజకత్వమును, అది ఏ స్థలములో నిర్మించబడవలెనో అనునది నా సేవకుడైన జోసెఫ్‌కు నేను చూపెదను.

43 మీరు నిర్మించవలెనని తలంచిన స్థలములోనే దానిని నిర్మించవలెను, ఎందుకనగా దానిని నిర్మించవలెనని నేను మీ కొరకు ఎన్నుకొనిన స్థలము అదియే.

44 మీ పూర్ణ బలముతో మీరు పనిచేసిన యెడల, పరిశుద్ధపరచబడునట్లు నేను ఆ స్థలమును ప్రతిష్ఠించెదను.

45 నా జనులు నా స్వరమును, నా జనులను నడిపించుటకు నేను నియమించియున్న నా సేవకుల స్వరమును ఆలకించిన యెడల, ఇదిగో నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారి స్థలము నుండి వారు కదలకయుందురు.

46 కానీ వారు నా స్వరమును గాని, నేను నియమించిన ఈ మనుష్యుల స్వరమును గాని ఆలకించని యెడల వారు దీవించబడరు, ఎందుకనగా వారు నా పరిశుద్ధ స్థలములను, నా పరిశుద్ధ విధులను, నియమావళి పత్రములను, నేను వారికిచ్చు నా పరిశుద్ధ వాక్యములను అపవిత్రపరిచెదరు.

47 మీరు నా నామమున ఒక మందిరమును నిర్మించి, నేను సెలవిచ్చు సంగతులను చేయని యెడల, నేను చేయు ప్రమాణమునైనను, నా నుండి మీరు ఆపేక్షించు వాగ్దానములనైనను నేను నెరవేర్చనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

48 ఏలయనగా మీ కార్యముల వలన, మీ మూర్ఖత్వము వలన, నా యెదుట మీరు చేయు మీ హేయకార్యములన్నింటి వలన దీవెనలకు బదులు శాపములను, ఉగ్రతను, కోపమును, తీర్పులను మీ శిరస్సులపైకి తెచ్చుకొందురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

49 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మనుష్యకుమారులలో ఎవరికైనను నా నామమున ఒక పనిచేయమని నేనొక ఆజ్ఞనిచ్చిన తరువాత, వారి పూర్ణ శక్తితో, వారికి కలిగియున్న వాటన్నిటితో ఆ మనుష్యకుమారులు ఆ కార్యమును చేయుటకు వెళ్ళి, ఆగిపోక శ్రద్ధతో పనిచేయుచున్నప్పుడు వారి శత్రువులు వారిమీదకు వచ్చి ఆ పని చేయకుండా వారిని ఆటంకపరచిన యెడల, ఇదిగో, మనుష్యకుమారుల చేతులనుండి ఇక ఎంతమాత్రము నేను ఆ పనిని కోరను, కానీ వారి అర్పణలు అంగీకరించుట నా చిత్తమైయున్నది.

50 నా కార్యమును ఆటంకపరచి, నా పరిశుద్ధ చట్టములను, ఆజ్ఞలను అతిక్రమించి, పాపము చేసి, పశ్చాత్తాపపడక, నన్ను ద్వేషించు వారిని మూడు నాలుగు తరముల వరకు నేను శిక్షించెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

51 కాబట్టి, ఈ కారణము వలన జాక్సన్ కౌంటీ, మిస్సోరిలో నా నామమున ఒక పట్టణమును, ఒక మందిరమును నిర్మించమని నేను ఆజ్ఞాపించిన వారి అర్పణలను అంగీకరించితినని, వారి శత్రువుల వలన వారు ఆటంకపరచబడిరని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

52 వారు పశ్చత్తాపపడక, నన్ను ద్వేషించునంతవరకు, మూడు నాలుగు తరముల వరకు వారిపైకి తీర్పును, ఉగ్రతను, కోపమును, ఏడ్పును, రోదనయు, పండ్లు కొరుకుటయు రప్పించెదనని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

53 ఒక పని చేయమని ఆజ్ఞాపించబడి, వారి శత్రువుల హింస వలన ఆటంకపరచబడిన వారందరిని గూర్చి మీకు ఓదార్పు కలుగుటకు దీనిని మీకొక మాదిరిగా ఇచ్చుచున్నాను.

54 ఏలయనగా నేను మీ దేవుడైన ప్రభువును, మిస్సోరి ప్రదేశములో చంపబడిన హృదయశుద్ధి గల మీ సహోదరులందరిని రక్షించెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

55 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను మీకాజ్ఞాపించిన ఏ విషయములోనైనా మీరు నమ్మకముగా ఉందురని నా యెదుట నిరూపించుకొనునట్లు, తద్వారా నేను మిమ్ములను దీవించి, మీకు ఘనత, అమర్త్యత్వము, నిత్యజీవమును కిరీటముగా ఇచ్చుటకు ఈ ప్రదేశమందు నా నామమున ఒక మందిరమును నిర్మించమని మిమ్ములను మరలా ఆజ్ఞాపించుచున్నాను.

56 ఇప్పుడు అపరిచితులకు ఆతిథ్యమిచ్చుటకు నిర్మించమని నేను మీకాజ్ఞాపించిన నా అతిథిగృహమును గూర్చి నేను చెప్పునదేమనగా, దానికి నా పేరు పెట్టవలెను, నా సేవకుడైన జోసెఫ్ మరియు అతని కుటుంబమునకు తరతరములకు దానిలో స్థలమియ్యవలెను.

57 ఏలయనగా ఈ అభిషేకమును అతని శిరస్సుపై నేనుంచితిని, తద్వారా అతని దీవెన, అతని తరువాత అతని సంతానము యొక్క శిరస్సులపై ఉంచబడును.

58 భూలోక వంశములను గూర్చి నేను అబ్రాహాముకు సెలవిచ్చిన విధముగానే నా సేవకుడైన జోసెఫ్‌కు నేను సెలవిచ్చుచున్నాను: నీయందును, నీ సంతానమునందును భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడును.

59 కాబట్టి నా సేవకుడైన జోసెఫ్, అతని తరువాత అతని సంతానము తరతరములకు, యుగయుగములకు ఆ గృహములో స్థలమును కలిగియుండవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

60 ఆ గృహము నావూ గృహముగా పిలువబడవలెను; నరుని ఆహ్లాదకరమైన నివాసస్థలముగా, సీయోను యొక్క మహిమను, దాని మూలరాయి యొక్క మహిమను అతడు గ్రహించునట్లు సోలిపోయిన యాత్రికునికి విశ్రాంతి స్థలముగా అది ఉండవలెను;

61 తద్వారా ప్రఖ్యాతిగల చెట్లుగాను, దాని ప్రాకారములపైన కావలివారిగాను ఉండుటకు నేనేర్పరచిన వారినుండి అతడు కూడా ఉపదేశమును పొందును.

62 ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన జార్జ్ మిల్లర్, నా సేవకుడైన లైమన్ వైట్, నా సేవకుడైన జాన్ స్నైడర్, నా సేవకుడైన పీటర్ హాస్ తమనుతాము వ్యవస్థీకరించుకొని, ఆ గృహ నిర్మాణము కొరకు వారిలో ఒకరిని వారి వర్గానికి అధ్యక్షునిగా నియమించవలెను.

63 ఆ గృహ నిర్మాణమునకు మూలధనమును పొందుటకు ఒక రాజ్యాంగమును వారు ఏర్పరచవలెను.

64 ఆ గృహములో మూలధనము యొక్క ఒక భాగము కొరకు యాభై డాలర్లకంటె తక్కువ స్వీకరించకూడదు, ఆ గృహములో భాగము కొరకు ఏ ఒక్కని నుండైనా పదిహేను వేల డాలర్లు స్వీకరించుటకు వారు అనుమతించబడవలెను.

65 కానీ ఏ ఒక్కని నుండైనా ఒక భాగము కొరకు పదిహేను వేల డాలర్లకంటే ఎక్కువ స్వీకరించుటకు వారు అనుమతించబడకూడదు.

66 ఆ గృహములో ఏ ఒక్కని నుండైనా మూలధనము యొక్క ఒక భాగము కొరకు యాభై డాలర్లలోపు స్వీకరించుటకు వారు అనుమతించబడకూడదు.

67 భాగస్వామ్యమును పొందు సమయములో అతడు వారికి మూలధనమును చెల్లిస్తే తప్ప, ఈ గృహములో హక్కుదారునిగా ఏ మనుష్యుడిని స్వీకరించుటకు వారు అనుమతించబడకూడదు;

68 అతడు చెల్లించు ద్రవ్యమునకు సమానముగా ఆ గృహములో అతడు భాగస్వామ్యమును పొందును; కానీ అతడు ఏమియు చెల్లించనిచో, ఆ గృహములో ఎట్టి భాగస్వామ్యమును పొందకూడదు.

69 ఎవరైనను వారికి మూలధనమును చెల్లించినచో, అది అతనికి, అతని తరువాత తరతరములకు ఆ గృహములో భాగస్వామ్యముగానుండును, అతడు, అతని వారసులు ఆ భాగస్వామ్యమును నిలుపుకున్నంత వరకు తమ స్వంతచిత్తము, స్వంతచర్య వలన వారి చేతులలోనుండి దానిని అమ్మివేయక లేదా భాగస్వామ్యమును ఇచ్చివేయక, నా చిత్తమును నెరవేర్చిన యెడల అది వారికే నుండునని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

70 నా సేవకుడైన జార్జ్ మిల్లర్, నా సేవకుడైన లైమన్ వైట్, నా సేవకుడైన జాన్ స్నైడర్, నా సేవకుడైన పీటర్ హాస్, ధనరూపములోనైనను, లేదా ధనమునకు సరిసమానమైన ఆస్థిరూపములోనైనను మూలధనమును పొందినయెడల, ఆ మూలధనములో ఏ భాగమైనను ఆ గృహమునకు తప్ప మరి దేనికిని వినియోగించకూడదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

71 వారు ఆ మూలధనములో భాగమును భాగస్వామి అనుమతి లేకుండా ఏ ఇతర స్థలములోనైనా వినియోగించి, ఆ గృహములో కాక ఇతర స్థలములో వారు వినియోగించిన మూలధనమునకు నాలుగింతలు తిరిగి చెల్లించని యెడల వారు శపింపబడి, వారున్న స్థానము నుండి తొలగించబడుదురని దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు; ఏలయనగా నేను ప్రభువును, దేవుడనైన నేను ఈ విషయములలో వెక్కిరింపబడలేను.

72 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన జోసెఫ్ ఆ గృహనిర్మాణము కొరకు అతనికి మేలైనదిగా తోచిన దానినిబట్టి వారికి మూలధనమును చెల్లించవలెను; కానీ నా సేవకుడైన జోసెఫ్, లేదా ఇతరులు ఎవరైనను ఆ గృహమునందు పదిహేను వేల డాలర్ల కంటే ఎక్కువ, యాభై డాలర్లకంటే తక్కువ చెల్లించకూడదు.

73 వారి కొరకు నా చిత్తమును తెలుసుకొనగోరువారు ఇతరులు కూడా ఉన్నారు, ఏలయనగా దానిని గూర్చి వారు నన్ను అడిగియున్నారు.

74 కాబట్టి, నా సేవకుడైన విన్సన్ నైట్‌ను గూర్చి నేను చెప్పునదేమనగా, అతడు నా చిత్తమును చేయగోరిని యెడల అతని కొరకును, అతని తరువాత తరమునకు, తరతరములకు ఆ గృహములో మూలధనమును పెట్టవలెను.

75 బీదలు, అవసరతలోనున్న వారి సంక్షేమము కొరకు జనుల మధ్య దీర్ఘముగా, బిగ్గరగా అతని స్వరమెత్తవలెను; అతడు విఫలము కాకూడదు, లేదా అతని హృదయము కలవరపడకూడదు; అతని అర్పణలను నేను అంగీకరించెదను, అవి నాకు కయీను యొక్క అర్పణలవలె ఉండవు, ఏలయనగా అతడు నా వానిగా ఉండునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

76 అతని కుటుంబము సంతోషించి, శ్రమనుండి తమ హృదయములను త్రిప్పుకొనవలెను; అతడిని నేను ఎన్నుకొని, అభిషేకించితిని, అతని గృహము నడుమ అతడు ఘనపరచబడును, ఏలయనగా అతని పాపములన్నింటిని నేను క్షమించియున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.

77 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన హైరం, అతనికి మేలైనదిగా తోచిన దానిని బట్టి తరతరములకు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకు ఆ గృహమునందు మూలధనమును చెల్లించవలెను.

78 నా సేవకుడైన ఐసాక్ గాలండ్ ఆ గృహములో మూలధనమును పెట్టవలెను; ఏలయనగా, ప్రభువైన నేను అతడు చేసిన కార్యమును బట్టి అతడిని ప్రేమించెదను, అతని పాపములన్నింటిని క్షమించెదను; కాబట్టి, తరతరములకు ఆ గృహమునందు ఆసక్తిగల వానిగా అతడు స్మరణలోనికి తేబడవలెను.

79 నా సేవకుడైన ఐసాక్ గాలాండ్ మీ మధ్య నియమించబడవలెను, వారికి నా సేవకుడైన జోసెఫ్ చూపు కార్యమును సాధించుటకు నా సేవకుడైన హైరం తో వెళ్ళుటకు నా సేవకుడైన విలియం మార్క్స్ చేత నియమించబడి, అతని వలన దీవించబడవలెను, మరియు వారు అధికముగా దీవించబడుదురు.

80 నా సేవకుడైన విలియం మార్క్స్, అతనికి మేలైనదిగా తోచిన దానిని బట్టి తరతరములకు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకు ఆ గృహమునందు మూలధనమును చెల్లించవలెను.

81 నా సేవకుడైన హెన్రీ జి. షెర్వుడ్, అతనికి మేలైనదిగా తోచిన దానిని బట్టి తరతరములకు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకు ఆ గృహమునందు మూలధనమును చెల్లించవలెను.

82 నా సేవకుడైన విలియం లా ఆ గృహమునందు తరతరములకు, అతని కొరకు, అతని తరువాత అతని సంతానము కొరకు మూలధనమును చెల్లించవలెను.

83 అతడు నా చిత్తమును చేయగోరిన యెడల, తూర్పు ప్రాంతములకు అనగా కర్ట్లాండ్‌కు తన కుటుంబమును తీసుకొనివెళ్ళకూడదు; అయినప్పటికీ, ప్రభువైన నేను కర్ట్లాండ్‌ను కట్టెదను, కానీ దాని నివాసులకు నేను కఠిన శిక్షను సిద్ధపరచియున్నాను.

84 నా సేవకుడైన ఆల్మన్ బాబిట్ గూర్చి, అనేక సంగతులను బట్టి నేను సంతోషించుట లేదు; ఇదిగో, నేను నియమించిన అనగా నా సంఘ అధ్యక్షత్వము యొక్క ఉపదేశమునకు బదులు, అతని ఉపదేశమును స్థిరపరచుటకు అతడు కోరుచున్నాడు; నా జనులు మ్రొక్కుటకు అతడు బంగారు దూడను నిలబెట్టుచున్నాడు.

85 నా ఆజ్ఞలను గైకొనుటకు ప్రయత్నించుచు ఇక్కడికి వచ్చిన ఏ మనుష్యుడును ఈ ప్రదేశము నుండి వెళ్ళకూడదు.

86 వారు ఇక్కడ జీవించిన యెడల, నా కొరకు జీవించవలెను; వారు మరణించిన యెడల, నా కొరకే మరణించవలెను; ఏలయనగా వారి పనులన్నింటి నుండి ఇక్కడ వారు విశ్రాంతి పొంది, వారి కార్యములను కొనసాగింతురు.

87 కాబట్టి, నా సేవకుడైన విలియం నా యందు నమ్మికయుంచవలెను, దేశములో ఉన్న రోగము వలన అతని కుటుంబమును గూర్చి భయపడుట మానవలెను. మీరు నన్ను ప్రేమించిన యెడల, నా ఆజ్ఞలను గైకొందురు; దేశమందున్న రోగము మీకు మహిమకరముగా మారును.

88 నా సేవకుడైన విలియం బిగ్గరగా, గొప్ప సంతోషముతో నా ఆత్మచేత కదిలింపబడగా నా నిత్యసువార్తను వార్సా వాసులకు, కార్తేజ్ వాసులకు, బర్లింగ్టన్ వాసులకు, అంతేకాక మాడిసన్ వాసులకు ప్రకటించవలెను, మరిన్ని సూచనల కొరకు నా సర్వసభ్య సమావేశము వరకు శ్రద్ధతోను, సహనముతోను వేచియుండవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

89 అతడు నా చిత్తమును చేయవలెనన్న ఇకనుండి నా సేవకుడైన జోసెఫ్ ఉపదేశములను ఆలకించవలెను, అతనికి గల ఆసక్తితో బీదల సంక్షేమమును బలపరచవలెను, భూలోక నివాసులకు నా పరిశుద్ధ వాక్యపు నూతన అనువాదమును ప్రచురించవలెను.

90 అతడు దీనిని చేసిన యెడల విస్తారమైన దీవెనలతో అతడిని నేను దీవించెదను, తద్వారా అతడు విడువబడడు లేదా అతని సంతానము రొట్టెకొరకు భిక్షమెత్తుకొనుచు కనబడరు.

91 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన హైరం గదిలో నా సేవకుడైన విలియం, నా సేవకుడైన జోసెఫ్‌కు సలహాదారునిగా నిర్దేశించబడి, నియమించబడి, అభిషేకించబడవలెను, తద్వారా నా సేవకుడైన హైరం యాజకత్వము మరియు గోత్రజనక స్థానమును పొందవచ్చును, అది దీవెన వలన, హక్కు వలన అతని తండ్రిచేత అతనికి నిర్దేశించబడినది;

92 తద్వారా ఇకమీదట నా జనులందరి శిరస్సులపైన గోత్రజనక దీవెనలనిచ్చు తాళపుచెవులను అతడు కలిగియుండవచ్చును,

93 అతడు ఎవరిని దీవించునో అతడు దీవించబడును, ఎవరిని శపించునో అతడు శపింపబడును; భూలోకమందు అతడు దేనిని బంధించునో అది పరలోకములో బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పునో అది పరలోకమందును విప్పబడును.

94 ఈ సమయము నుండి ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, నా సంఘమునకు బయల్పాటుదారునిగా నా సేవకుడైన జోసెఫ్‌ వలె నేనతనిని నియమించుచున్నాను;

95 తద్వారా అతడు నా సేవకుడైన జోసెఫ్‌తో పొందికగా పనిచేయవచ్చును; అతడు నా సేవకుడైన జోసెఫ్ నుండి ఉపదేశమును పొందవలెను, అతడు దేవుడిని అడిగి, పొందడానికి కావలసిన తాళపుచెవులను జోసెఫ్ అతనికి చూపును, ఒకప్పుడు నా సేవకుడైన ఆలీవర్ కౌడరీకి ఇవ్వబడినట్టి దీవెన, మహిమ, ఘనత, యాజకత్వము, యాజకత్వ దీవెనలను అతడు కిరీటముగా పొందవచ్చును.

96 నా సేవకుడైన హైరం స్మిత్, అతనికి నేను చూపు సంగతులకు సాక్ష్యమిచ్చును, తద్వారా తరతరములకు, యుగయుగములకు అతని పేరు ఘనమైనదిగా స్మరణలోనికి తేబడును.

97 నా సేవకుడైన విలియం లా తాళపుచెవులను పొందవలెను, వాటి ద్వారా అతడు దీవెనలను అడిగి, పొందవచ్చును; అతడు నా యెదుట దీనమనస్సు కలిగి, కపటములేక ఉండవలెను, అతడు నా ఆత్మను అనగా ఆదరణకర్తను పొందును, అది అన్ని సంగతుల యొక్క సత్యమును అతనికి ప్రత్యక్షపరచును, ఆ గడియలోనే అతడు ఏమి చెప్పవలెనో అది అతడికి ఇచ్చును.

98 అతని వలన ఈ సూచకక్రియలు కనబడును—అతడు రోగులను స్వస్థపరచును, దయ్యములను వెళ్ళగొట్టును, మరణకరమైన విషమును అతనికి ఇచ్చువారినుండి అతడు విడిపించబడును;

99 విష సర్పములు తన మడమపై కాటువేయజాలని త్రోవలలో అతడు నడిపింపబడును, పక్షిరాజు రెక్కలపై ఎగురునట్లు అతడు తన ఆలోచనల యొక్క ఊహలలో తేలును.

100 అతడు మృతులను లేపుట నా చిత్తమైన యెడల, అతడు తన స్వరమును ఉపసంహరించుకొనకూడదు.

101 కాబట్టి, నా సేవకుడైన విలియం తాళక, సంతోషముతోను, ఆనందముతోను, నిరంతరము తన సింహాసనముమీద ఆసీనుడైయున్న ఆయనకు హోసన్నా అని పలుకుచు గట్టి స్వరముతో మొరపెట్టవలెను.

102 ఇదిగో, నేను మీకు సెలవిచ్చుచున్నాను, నా సేవకుడైన విలియం, నా సేవకుడైన హైరం కొరకు, కేవలము వారికొరకే నేనొక కార్యమును కలిగియున్నాను; నా సేవకుడైన జోసెఫ్ ఇంటి యొద్ద ఉండవలెను, ఏలయనగా అతడు అవసరము. మిగిలిన వాటిని ఇకమీదట నేను మీకు చూపెదను. అలాగే జరుగును గాక. ఆమేన్.

103 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన సిడ్నీ నన్ను సేవించి, నా సేవకుడైన జోసెఫ్‌కు సలహాదారునిగా ఉండగోరిన యెడల, అతడు లేచి, తన పిలుపు యొక్క స్థానములో నిలబడి, నా యెదుట దీనమనస్సు కలిగియుండవలెను.

104 అంగీకారయోగ్యమైన అర్పణను, సాక్ష్యములను నాకతడు సమర్పించి, నా జనులతో ఉండిన యెడల, ఇదిగో నేను, దేవుడైన మీ ప్రభువును, స్వస్థపడునట్లు అతడిని స్వస్థపరచెదను; మరలా అతడు పర్వతములమీద తన స్వరమెత్తి, నా యెదుట బదులు మాట్లాడువానిగా ఉండవలెను.

105 అతడు వచ్చి, నా సేవకుడైన జోసెఫ్ నివసించు ఇంటి సమీపములో తన కుటుంబమును స్థిరపరచవలెను.

106 అతని ప్రయాణములన్నింటిలో బూర ధ్వని వలే తన స్వరమెత్తి, భూలోక నివాసులందరిని రాబోవు ఉగ్రత నుండి పారిపొమ్మని హెచ్చరించవలెను.

107 ఇంతకుముందు నేను మీకు సెలవిచ్చిన విధముగా, భూలోక రాజులకు గంభీర ప్రకటన చేయుటలో అతడు నా సేవకుడైన జోసెఫ్‌కు సహాయపడవలెను, నా సేవకుడైన విలియం లా కూడా నా సేవకుడైన జోసెఫ్‌కు సహాయపడవలెను.

108 నా సేవకుడైన సిడ్నీ నా చిత్తము నెరవేర్చగోరిన యెడల, తూర్పు ప్రదేశములవైపు తన కుటుంబమును తీసుకొని వెళ్ళకూడదు, కానీ నేను సెలవిచ్చిన ప్రకారము వారి నివాసస్థలమును అతడు మార్చవలెను.

109 ఇదిగో, నేను మీకు నియమించిన పట్టణము అనగా నావూ పట్టణమునకు బయట అతడు భద్రతను, ఆశ్రయమును పొందుట నా చిత్తము కాదు.

110 ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అతడు నా స్వరమును ఆలకించిన యెడల, అతనికది మేలుకరముగానుండును. అలాగే జరుగును గాక. ఆమేన్.

111 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన ఆమోస్ డేవీస్, ఆతిథ్యము కొరకు ఒక గృహమును అనగా నావూ గృహమును నిర్మించుటకు నేను నియమించిన వారికి మూలధనమును చెల్లించవలెను.

112 అతనికి ఆసక్తి ఉన్నయెడల దీనినతడు చేయవలెను; నా సేవకుడైన జోసెఫ్ ఇచ్చు ఉపదేశములను అతడు వినవలెను, మనుష్యుల నమ్మకమును పొందునట్లు తన స్వహస్తములతో పనిచేయవలెను.

113 అతడు తనకు అప్పగించిన వాటన్నిటిని, అవును, కొన్ని విషయములలోనైనా నమ్మకస్తునిగా నిరూపించుకొనిన యెడల, అనేకమైన వాటిమీద అతడు అధికారిగా నియమించబడును;

114 కాబట్టి, అతడు హెచ్చింపబడునట్లు తననుతాను తగ్గించుకొనవలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.

115 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన రాబర్ట్ డి. ఫాస్టర్ నా స్వరమునకు లోబడిన యెడల, వివిధ సమయాలలో అతనికి ద్వారము తెరువబడును గనుక, అతనితో చేసుకొనిన ఒప్పందము ప్రకారము నా సేవకుడైన జోసెఫ్‌నకు ఒక గృహమును నిర్మించవలెను.

116 అతడు చేసిన మూర్ఖపు క్రియలన్నింటి నిమిత్తము అతడు పశ్చాత్తాపపడవలెను, దాతృత్వమనే వస్త్రమును అతడు ధరించవలెను; కీడు చేయుట మాని, అతని కఠినమైన మాటలను ప్రక్కనపెట్టవలెను;

117 అతని కొరకు, అతని తరువాత తరమునకు, తరతరముల కొరకు నావూ గృహము యొక్క సమూహము చేతికి మూలధనమును చెల్లించవలెను;

118 నా సేవకులైన జోసెఫ్, హైరం, విలియం లా సీయోను పునాదిని వేయుటకు నేను పిలిచియున్న అధికారుల ఉపదేశములను ఆలకించవలెను; మరియు నిరంతరము అతనికి మేలు కలుగును. అలాగే జరుగును గాక. ఆమేన్.

119 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒకడు మోర్మన్ గ్రంథమును, నేను మీకిచ్చిన బయల్పాటులను విశ్వసించితేనే తప్ప, నావూ గృహము యొక్క సమూహమునకు ఏ మనుష్యుడును మూలధనమును చెల్లించకూడదని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు;

120 ఏలయనగా దీనికి మించునది ఏదైనా దుష్టుని నుండే వచ్చును, దానితో దీవెనలు కాక శాపములు వచ్చునని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అలాగే జరుగును గాక. ఆమేన్.

121 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నావూ గృహపు సమూహము నావూ గృహమును నిర్మించుటలో వారు చేసిన పనికి సరియైన జీతము పొందవలెను; వారి జీతము వారు తమలో తాము ఒప్పందము చేసుకొనిన ప్రకారము, దానికి తగిన విలువ ప్రకారము ఉండవలెను.

122 మూలధనమును చెల్లించు ప్రతి మనుష్యుడు అవసరమైనచో వారి సహాయము కొరకు వారి జీతములో భాగమును భరించవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; లేనియెడల, వారు చేయు పనులు ఆ గృహములో మూలధనముగా వారికి లెక్కించబడును. అలాగే జరుగును గాక. ఆమేన్.

123 నా యాజకత్వమునకు చెందిన అధికారులైన మీకు నేనిప్పుడు తెలుపునదేమనగా, దాని తాళపుచెవులను అనగా మెల్కీసెదెకు క్రమముననుసరించు యాజకత్వమును మీరు కలిగియుండవచ్చును, అది నా అద్వితీయ కుమారుని క్రమము ననుసరించి యున్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

124 నా సంఘము యొక్క ముద్రవేయబడు దీవెనలు అనగా పరిశుద్ధాత్మ వాగ్దానము కలిగియుండి, దానివలన విమోచన దినము కొరకు మీరు ముద్రవేయబడి, తద్వారా మీకు కలుగు శోధన గడియలో మీరు పడిపోకయుండవలెనని మీకు గోత్రజనకునిగా ఉండుటకు మొదట హైరం స్మిత్‌ను నేను మీకిచ్చుచున్నాను.

125 నా సంఘమంతటికి అధ్యక్షత్వము వహించు పెద్దగా, అనువాదకునిగా, బయల్పాటుదారునిగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగానుండుటకు నా సేవకుడైన జోసెఫ్‌ను నేను మీకిచ్చుచున్నాను.

126 నేనతనికి నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్, నా సేవకుడైన విలియం లా అనువారిని సలహాదారులుగా ఇచ్చుచున్నాను, తద్వారా వారు సంఘమంతటికి బయల్పాటులు పొందుటకు ప్రథమ అధ్యక్షత్వమును, ఒక సమూహమును ఏర్పరిచెదరు.

127 ప్రయాణించు పన్నెండుమంది సలహామండలికి అధ్యక్షునిగా ఉండమని నా సేవకుడైన బ్రిగమ్ యంగ్ అను నీకు తెలుపుచున్నాను;

128 ఆ పన్నెండుమంది భూమి యొక్క నలుమూలల నా రాజ్యమును నెలకొల్పుటకు, తరువాత ప్రతి ప్రాణికి నా వాక్యమును పంపుటకు తాళపుచెవులు కలిగియున్నారు.

129 వారు హీబర్ సి. కింబల్, పార్లీ పి. ప్రాట్, ఓర్సన్ ప్రాట్, ఓర్సన్ హైడ్, విలియం స్మిత్, జాన్ టేలర్, జాన్ ఈ. పేజ్, విల్ఫర్డ్ ఉడ్రఫ్, విల్లార్డ్ రిఛర్డ్స్, జార్జ్ ఏ. స్మిత్;

130 డేవిడ్ పేటన్‌ను నా యొద్దకు తీసుకొనియున్నాను; ఇదిగో, అతని నుండి ఈ యాజకత్వమును ఏ మనుష్యుడును తీసుకొనలేడు; కానీ, ఈ పిలుపునకే మరియొకడు నియమించబడవచ్చునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

131 మరలా నేను మీకు సెలవిచ్చుచున్నాను, సీయోనుకు మూలరాయిగా ఉండుటకు ఒక ఉన్నత సలహామండలిని నేను మీకిచ్చుచున్నాను—

132 వారెవరనగా, సామ్యుల్ బెంట్, హెన్రి జి. షెర్వుడ్, జార్జ్ డబ్ల్యు. హార్రిస్, చార్ల్స్ సి. రిచ్, థామస్ గ్రోవర్, న్యూయెల్ నైట్, డేవిడ్ డార్ట్, డన్బార్ విల్సన్, డేవిడ్ ఫుల్మర్, ఆల్ఫస్ కట్లర్, విలియం హన్టిన్గ్ టన్—సీమోర్ బ్రన్సన్‌ను నా యొద్దకు నేను తీసుకొనియున్నాను; అతని యాజకత్వమును ఏ మనుష్యుడును తీసుకొనలేడు, కానీ అతనికి బదులు మరియొకరు ఆ యాజకత్వమునకే నియమించబడవచ్చును; నా సేవకుడైన ఆరన్ జాన్సన్, అతనికి బదులు ఈ పిలుపులో నియమించబడవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

133 మరలా, ప్రధాన యాజకుల సమూహమునకు అధ్యక్షునిగా ఉండుటకు డాన్ సి. స్మిత్‌ను నేను మీకిచ్చుచున్నాను;

134 అన్నివైపులా విస్తరించియున్న వివిధ స్టేకులకు అధ్యక్షులు లేదా ఒక ప్రదేశములో ఉండు అధ్యక్షులుగా నియమించబడువారు అర్హత పొందు నిమిత్తము ఆ విధి నియమించబడినది;

135 వారు నిశ్చయించుకొనిన యెడల ప్రయాణించవచ్చును, కానీ ఒక ప్రదేశములో ఉండు అధ్యక్షులుగా నియమించబడుట మంచిది; వారి పిలుపు యొక్క స్థానము ఇదియేనని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

136 వారు నా సంఘ ప్రధాన యాజకుల సమూహమునకు అధ్యక్షత్వము వహించుటకు అమాస లైమన్, నోవా ప్యాకర్డ్‌లను అతనికి సలహాదారులుగా నేనిచ్చుచున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

137 మరలా నేను చెప్పునదేమనగా, జాన్ ఏ. హిక్స్, శామ్యుయెల్ విలియమ్స్, జెస్సీ బేకర్ మీకు పెద్దల సమూహముపైన అధ్యక్షత్వము వహించు యాజకత్వమును ఇచ్చుచున్నాను, ఆ సమూహము ఒక ప్రదేశములో పరిచర్య చేయువారి కొరకు ఏర్పరచబడినది; అయినప్పటికీ వారు ప్రయాణము చేయవచ్చును, కానీ వారు ఒక ప్రదేశములో పరిచర్య చేయువారుగా నా సంఘములో నియమించబడిరని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

138 మరలా, జోసెఫ్ యంగ్, జోషియ బటర్ఫీల్డ్, డానియేల్ మైల్స్, హెన్రి హెర్రిమాన్, జీర పుల్సిఫర్, లీవై హెన్కాక్, జేమ్స్ ఫాస్టర్, డెబ్బది సమూహముపై అధ్యక్షత్వము వహించవలెనని నేను మీకు తెలుపుచున్నాను;

139 ఆ సమూహము పర్యటించు పెద్దలు సర్వలోకములో నా నామమునకు సాక్ష్యము చెప్పుట కొరకు ఏర్పరచబడినది, పర్యటించు ఉన్నత సలహామండలి ఎక్కడైనా ఉన్నచో, నా అపొస్తలులు నా యెదుట మార్గము సిద్ధపరచుటకు వారిని పంపవలెను.

140 ఈ సమూహమునకు పెద్దల సమూహమునకు మధ్య వ్యత్యాసమేమనగా, ఒకటి నిరంతరము ప్రయాణము చేయవలెను, ఇంకొకటి వేర్వేరు సమయాలలో సంఘములలో అధ్యక్షత్వము వహించవలెను; ఒకదానికి వేర్వేరు సమయాలలో అధ్యక్షత్వము వహించే బాధ్యత కలదు, మరియొక దానికి అధ్యక్షత్వము వహించే బాధ్యత లేదని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

141 మరలా నేను మీతో చెప్పునదేమనగా, విన్సన్ నైట్, సామ్యుయెల్ హెచ్. స్మిత్, షడ్రక్ రౌండీ దానిని అంగీకరించిన యెడల అతనికి బిషప్రిక్కు పైన అధ్యక్షత్వము వహించుటకు నేను అధికారము ఇచ్చియున్నాను; చెప్పబడిన బిషప్రిక్కును గూర్చిన జ్ఞానము సిద్ధాంతము మరియు నిబంధనలలో ఇవ్వబడియున్నది.

142 మరలా నేను చెప్పునదేమనగా, సామ్యుయెల్ రాల్ఫ్ అతని సలహాదారులను, యాజకుల అధ్యక్షుడు, అతని సలహాదారులను, బోధకుల అధ్యక్షుడు, అతని సలహాదారులను, అంతేకాక స్టేకు అధ్యక్షుడు, అతని సలహాదారులను నేను మీకిచ్చుచున్నాను.

143 సహాయము, పరిపాలన కొరకు, పరిచర్య ధర్మము జరుగుటకు, నా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పై స్థానములను, వాటి తాళపుచెవులను నేను మీకు ఇచ్చియున్నాను.

144 నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా ఈ స్థానములన్నింటిని మీరు భర్తీచేసి, నేను ప్రస్తావించిన ఆ పేర్లను ఆమోదించవలెను లేదా నా సర్వసభ్య సమావేశములో వారిని ఆమోదించకూడదు;

145 మీరు నా నామమున దీనిని నిర్మించునప్పుడు, నా మందిరములో ఈ స్థానములన్నింటికి గదులను సిద్ధపరచవలెనని మీ దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అలాగే జరుగును గాక. ఆమేన్.