లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 74


74వ ప్రకరణము

1830లో, న్యూయార్క్‌లోని వెయిన్ కౌంటీలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కివ్వబడిన బయల్పాటు. సంఘము స్థాపించబడకముందే, బాప్తిస్మము యొక్క సరైన విధానము గురించి అడుగబడిన ప్రశ్నలు, ఆ అంశము గురించి సమాధానముల కొరకు వెదకుటకు ప్రవక్తను నడిపించెను. ఈ బయల్పాటు 1 కొరింథీయులు 7:14కు వివరణ అని జోసెఫ్ స్మిత్ చరిత్ర తెలుపుచున్నది, ఈ వాక్యము శిశువుల బాప్తిస్మమును సమర్థించుటకు తరచూ ఉపయోగించబడినది.

1–5, తన కాలమందు పౌలు, మోషే ధర్మశాస్త్రమును పాటించవద్దని సంఘమునకు ఉపదేశించును; 6–7, చిన్నపిల్లలు పరిశుద్ధులు, ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధపరచబడుదురు.

1 ఏలయనగా అవిశ్వాసియైన భర్త, భార్యను బట్టి పరిశుద్ధపరచబడును మరియు అవిశ్వాసురాలైన భార్య, భర్తను బట్టి పరిశుద్ధపరచబడును; లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, కానీ ఇప్పుడైతే వారు పవిత్రులు.

2 అపొస్తలుల దినములలో సున్నతి చట్టము యేసు క్రీస్తు సువార్తను నమ్మని యూదులందరి మధ్యనున్నది.

3 సున్నతి చట్టమును గూర్చి ప్రజల మధ్య గొప్ప వివాదము రేగెను, ఏలయనగా అవిశ్వాసియైన భర్త తన పిల్లలు సున్నతి పొంది, మోషే ధర్మశాస్త్రమునకు లోబడియుండవలెనని వాంఛించెను, కానీ ఆ ధర్మశాస్త్రము ఇదివరకే నెరవేర్చబడెను.

4 మరియు పిల్లలు మోషే ధర్మశాస్త్రమునకు లోబడియుండుట వలన, వారి పితరుల ఆచారములను ఆలకించి, యేసు క్రీస్తు సువార్తను నమ్మలేదు, అందును బట్టి వారు అపవిత్రులయ్యిరి.

5 కాబట్టి, ఈ హేతువు చేత అపొస్తలుడు ప్రభువునుండి కాక తనంతట తానుగా వారికి ఒక ఆజ్ఞనిచ్చుచు సంఘమునకు ఇలా వ్రాసెను: మోషే ధర్మశాస్త్రము వారి మధ్యనుండి తొలగిపోతేగాని విశ్వాసియైనవాడు, అవిశ్వాసితో కలవకూడదు,

6 తద్వారా వారి పిల్లలు సున్నతి లేకయుందురు; చిన్న పిల్లలు అపవిత్రులని యూదుల మధ్యనున్న ఆ ఆచారము గతించిపోవును;

7 కానీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా పవిత్రపరచబడుట వలన చిన్న పిల్లలు పరిశుద్ధులు; ఇదియే లేఖనముల అర్థము.