లేఖనములు
ఈథర్ 3


3వ అధ్యాయము

ప్రభువు పదహారు రాళ్ళను తాకినప్పుడు, జెరెడ్‌ యొక్క సహోదరుడు ఆయన వ్రేలును చూచును—క్రీస్తు తన ఆత్మీయ శరీరమును జెరెడ్‌ యొక్క సహోదరునికి చూపును—పరిపూర్ణ జ్ఞానము కలిగిన వారు తెర లోపలివి చూడకుండా నిరోధించబడలేరు—జెరెడీయ వృత్తాంతమును వెలుగులోనికి తెచ్చుటకు అనువాదక సాధనములు ఇవ్వబడినవి.

1 మరియు జెరెడ్‌ యొక్క సహోదరుడు, (ఇప్పుడు సిద్ధము చేయబడిన పడవల సంఖ్య ఎనిమిది) దాని అధిక ఎత్తును బట్టి షీలెమ్ కొండ అని పిలువబడిన ఒక కొండ యొద్దకు వెళ్ళి, ఒక బండ నుండి పదహారు చిన్న రాళ్ళను కరిగించెను; అవి తెల్లగా మరియు స్పష్టముగా, గాజువలే పారదర్శకముగా ఉండెను; అతడు వాటిని తన చేతులలో కొండ పైభాగమునకు తీసుకొనిపోయి, మరలా ఇట్లనుచూ ప్రభువుకు మొరపెట్టెను:

2 ఓ ప్రభువా, మేము వరదల చేత చుట్టుముట్టబడవలెనని నీవు చెప్పియున్నావు. ఇప్పుడు ఓ ప్రభువా, నీ యెదుట అతని బలహీనతను బట్టి నీ సేవకునితో కోపముగా ఉండకుము; ఏలయనగా, నీవు పరిశుద్ధుడవని, పరలోకములందు నివసించెదవని మరియు నీ యెదుట మేము అయోగ్యులమని మేమెరుగుదుము; పతనమును బట్టి మా స్వభావములు నిరంతరము చెడ్డవాయెను; అయినప్పటికీ ఓ ప్రభువా, మా కోరికలను బట్టి మేము నీ నుండి పొందునట్లు, మేము నీకు ప్రార్థన చేయవలెనని నీవు మాకు ఒక ఆజ్ఞను ఇచ్చియున్నావు.

3 ఓ ప్రభువా, మా దుర్నీతిని బట్టి నీవు మమ్ములను మొత్తియున్నావు, మమ్ములను తరిమివేసియున్నావు మరియు అనేక సంవత్సరముల పాటు మేము అరణ్యములో ఉంటిమి; అయినప్పటికీ, నీవు మా యెడల కనికరము కలిగియుంటివి. ఓ ప్రభువా, నాపై జాలి కలిగియుండి, ఈ నీ జనుల నుండి నీ కోపమును త్రిప్పివేసి, ఈ ఉగ్రమైన అగాధము గుండా అంధకారమందు వారు వెళ్ళుటకు అనుమతించకుము; కానీ, నేను బండ నుండి కరిగించిన ఈ రాళ్ళను చూడుము.

4 ఓ ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడవని, మనుష్యుని ప్రయోజనము కొరకు నీ చిత్తప్రకారము నీవు చేయగలవని నేనెరుగుదును; కావున ఓ ప్రభువా, నీ వ్రేలితో ఈ రాళ్ళను తాకి అవి చీకటిలో ప్రకాశించునట్లు వాటిని సిద్ధము చేయుము; మరియు సముద్రమును దాటునప్పుడు మేము వెలుగును కలిగియుండునట్లు, మేము సిద్ధము చేసిన పడవలలో అవి మా కొరకు ప్రకాశించును.

5 ఓ ప్రభువా, నీవు దీనిని చేయగలవు. మనుష్యుల గ్రహింపునకు చిన్నదిగా కనబడు గొప్ప శక్తిని చూపుటకు నీవు సమర్థుడవని మేమెరుగుదుము.

6 జెరెడ్‌ యొక్క సహోదరుడు ఈ మాటలు చెప్పినప్పుడు, ప్రభువు తన చేతిని ముందుకు చాపి ఒకదాని తరువాత ఒకటిగా ఆ రాళ్ళను తాకెను. జెరెడ్‌ యొక్క సహోదరుని కన్నుల నుండి తెర తొలగించబడగా, అతడు ప్రభువు యొక్క వ్రేలిని చూచెను; అది రక్త మాంసములు గల మనుష్యుని వ్రేలువలే ఉండెను; మరియు జెరెడ్‌ యొక్క సహోదరుడు ప్రభువు యెదుట నేలపై పడెను, ఏలయనగా అతడు భయముతో నింపబడెను.

7 జెరెడ్‌ యొక్క సహోదరుడు నేలపై పడియుండెనని చూచి, ప్రభువు అతనితో ఇట్లనెను: లెమ్ము, నీవెందుకు పడియుంటివి?

8 మరియు అతడు ప్రభువుతో ఇట్లనెను: నేను ప్రభువు యొక్క వ్రేలును చూచితిని, ఆయన నన్ను మొత్తునేమోయని భయపడితిని; ఏలయనగా, ప్రభువు రక్త మాంసములు కలిగియుండెనని నేనెరుగకపోతిని.

9 అప్పుడు ప్రభువు అతనితో ఇట్లనెను: నేను మర్త్య శరీరముతో జన్మించెదనని నీ విశ్వాసమును బట్టి నీవు చూచియుంటివి; నీ వలె గొప్ప విశ్వాసముతో ఏ మనుష్యుడూ నా యెదుటకు వచ్చియుండలేదు; అట్లు కాని యెడల, నీవు నా వ్రేలును చూడగలిగేవాడవు కావు. నీవు దీనికంటే అధికము చూచియున్నావా?

10 చూడలేదు; ప్రభువా, నిన్ను నాకు కనబరచుకొనుము అని అతడు జవాబిచ్చెను.

11 మరియు ప్రభువు అతనితో—నేను చెప్పబోవు మాటలను నీవు నమ్ముచున్నావా? అనెను.

12 అప్పుడతడు—ప్రభువా, నీవు సత్యము పలికెదవని నేనెరుగుదును, ఏలయనగా నీవు సత్య దేవుడవు మరియు అబద్ధమాడలేవని సమాధానమిచ్చెను.

13 అతడు ఈ మాటలు చెప్పినప్పుడు, ప్రభువు తననుతాను అతనికి కనబరచుకొని ఇట్లనెను: నీవు ఈ సంగతులను ఎరిగియున్నందున, నీవు పతనము నుండి విమోచింపబడితివి; కావున, నీవు నా సన్నిధిలోనికి తిరిగి తీసుకొని రాబడితివి; కావున, నన్ను నేను నీకు కనబరచుకొనుచున్నాను.

14 ఇదిగో, నా జనులను విమోచించుటకు లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధపరచబడిన వాడను నేనే. నేనే యేసు క్రీస్తును. నేనే తండ్రిని మరియు కుమారుడను. నా వలన సమస్త మానవజాతి జీవము, అనగా నిత్యజీవము కలిగియుందురు; నా నామముపై విశ్వాసముంచు వారు కూడా కలిగియుందురు. మరియు వారు, నా కుమారులు కుమార్తెలగుదురు.

15 నేను సృష్టించిన మనుష్యునికి నేనెన్నడూ నన్ను కనబరచుకొనలేదు, ఏలయనగా నీవు విశ్వసించినట్లుగా ఎన్నడూ ఏ మనుష్యుడూ నా యందు విశ్వసించలేదు. నీవు నా స్వరూపమందు సృష్టించబడియున్నావని చూచుచున్నావా? అవును, మనుష్యులందరు ఆదియందు నా స్వరూపమందు సృష్టించబడిరి.

16 ఇదిగో, నీవు ఇప్పుడు చూచుచున్న ఈ శరీరము నా ఆత్మ యొక్క శరీరము; మనుష్యుడిని నేను నా ఆత్మ యొక్క శరీరమును పోలి సృష్టించియున్నాను; ఆత్మలో ఉన్నట్లుగా నేను నీకు కనబడుచున్నట్లే, శరీరమందు నేను నా జనులకు కనిపించెదను.

17 ఇప్పుడు వ్రాయబడిన ఈ సంగతుల యొక్క పూర్తి వృత్తాంతమును నేను చేయలేకపోతినని మొరోనై అను నేను చెప్పితిని. కావున, ఆయన నీఫైయులకు తననుతాను కనబరచుకొన్నట్లుగా, అదే శరీరము యొక్క పోలికలో మరియు మాదిరి చొప్పున యేసు ఈ మనుష్యునికి తననుతాను ఆత్మలో కనబరచుకొనెనని చెప్పుట నాకు చాలును.

18 ఆయన నీఫైయులకు పరిచర్య చేసినట్లుగానే అతనికి కూడా పరిచర్య చేసెను; మరియు ప్రభువు అతనికి చూపిన అనేక గొప్ప కార్యములను బట్టి ఆయన దేవుడని ఈ మనుష్యుడు తెలుసుకొనుటకై ఇదంతయు జరిగెను.

19 మరియు ఈ మనుష్యుని యొక్క జ్ఞానమును బట్టి, తెర లోపలివి చూచుట నుండి ఈ మనుష్యుడు నిరోధించబడలేకపోయెను; అతడు యేసు యొక్క వ్రేలును చూచెను; అతడు చూచినపుడు భయముతో పడిపోయెను; ఏలయనగా, అది ప్రభువు యొక్క వ్రేలు అని అతడు ఎరిగియుండెను; అతడికి ఇక విశ్వాసముతో పనిలేకపోయెను, ఏలయనగా నిస్సందేహముగా అతడు ఎరిగియుండెను.

20 అందువలన దేవుని గూర్చి ఈ పరిపూర్ణ జ్ఞానము కలిగియుండి, అతడు తెర లోపలివి చూడకుండా నిరోధించబడలేకపోయెను; కావున, అతడు యేసును చూచెను మరియు ఆయన అతనికి పరిచర్య చేసెను.

21 ఇప్పుడు ప్రభువు జెరెడ్‌ యొక్క సహోదరునితో ఇట్లు చెప్పెను: ఇదిగో, నేను శరీరమందు నా నామమును మహిమపరచు సమయము వచ్చువరకు, నీవు కనిన మరియు వినిన ఈ సంగతులు లోకమునకు తెలియుటకు నీవు అనుమతించకూడదు; అందువలన నీవు కనిన మరియు వినిన సంగతులను భద్రపరచుకొనవలెను మరియు దానిని ఏ మనుష్యునికి చూపరాదు.

22 నీవు నా యొద్దకు వచ్చునప్పుడు, ఎవరూ వాటికి అర్థము చెప్పలేకుండునట్లు నీవు వాటిని వ్రాసి ముద్ర వేయవలెను; ఏలయనగా, చదువబడలేనట్టి భాషలో నీవు వాటిని వ్రాయవలెను.

23 ఇదిగో, ఈ రెండు రాళ్ళను నేను నీకు ఇచ్చెదను మరియు నీవు వ్రాయబోవు సంగతులతోపాటు వాటిని కూడా నీవు ముద్రవేయవలెను.

24 ఏలయనగా, నీవు వ్రాయబోవు భాషను నేను తారుమారు చేసియున్నాను; అందువలన నా యుక్తకాలమందు ఈ రాళ్ళు, నీవు వ్రాయబోవు ఈ సంగతులను మనుష్యుల కన్నులకు స్పష్టము చేయునట్లు నేను చేసెదను.

25 ప్రభువు ఈ మాటలను చెప్పినప్పుడు, ఆయన జెరెడ్‌ యొక్క సహోదరునికి భూమిపై ఇంతకుముందు ఉండిన మరియు ఉండబోవు నివాసులందరిని కూడా చూపెను; భూదిగంతముల వరకు ఉన్నవారి నుండి అతని దృష్టిని ఆయన నిలిపియుంచలేదు.

26 ఏలయనగా, అతనికి అన్ని సంగతులను ఆయన చూపగలడని, అతడు ఆయన యందు విశ్వసించిన యెడల—అది అతనికి చూపబడునని గతములో ఆయన అతనితో చెప్పియుండెను; కావున, ప్రభువు అతని నుండి ఏదియు నిలిపియుంచలేకపోయెను, ఏలయనగా ప్రభువు అతనికి అన్నిసంగతులు చూపగలడని అతడు ఎరిగియుండెను.

27 మరియు ప్రభువు అతనితో ఇట్లు చెప్పెను: ఈ సంగతులను వ్రాసి, ముద్రవేయుము; నా యుక్తకాలమందు నేను వాటిని నరుల సంతానమునకు చూపెదను.

28 మరియు అతడు అందుకొనిన రెండు రాళ్ళను ముద్రవేయవలెనని, ప్రభువు వాటిని నరుల సంతానమునకు చూపు వరకు వాటిని చూపరాదని ప్రభువు అతడిని ఆజ్ఞాపించెను.