7వ అధ్యాయము
ఓరిహా నీతియందు పరిపాలించును—బలవంతపు ఆక్రమణ, కలహముల మధ్య షూలే మరియు కొహోర్ యొక్క శత్రు రాజ్యములు స్థాపించబడెను—జనుల దుష్టత్వము మరియు విగ్రహారాధనను ప్రవక్తలు ఖండించెదరు, అప్పుడు వారు పశ్చాత్తాపపడెదరు.
1 దేశమందు ఓరిహా తన దినములన్నిటిలో నీతియందు తీర్పుతీర్చెను మరియు అతని దినములు మిక్కిలి అధికముగా ఉండెను.
2 అతడు కుమారులను, కుమార్తెలను కనెను; అతడు ముప్పది ఒకటి మందిని కనెను, వారిలో ఇరువది ముగ్గురు కుమారులుండిరి.
3 అతడు తన ముసలితనమందు కిబ్‌ను కూడా కనెను. మరియు కిబ్, అతని స్థానములో పరిపాలించెను; కిబ్, కొరిహోర్‌ను కనెను.
4 కొరిహోర్ ముప్పది రెండు సంవత్సరముల వాడైనప్పుడు, అతడు తన తండ్రికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి, నీహోర్ దేశమందు నివసించెను; అతడు కుమారులను, కుమార్తెలను కనెను; వారు మిక్కిలి సుందరముగా అయిరి, అందువలన కొరిహోర్ అనేకులను తన వైపు ఆకర్షించెను.
5 అతడు ఒక సైన్యమును సమకూర్చినప్పుడు, అతడు రాజు నివసించిన మోరొన్ దేశమునకు వచ్చి, అతడిని బందీగా తీసుకొనెను; వారు దాస్యములోనికి తీసుకొని రాబడుదురు అని చెప్పిన జెరెడ్ యొక్క సహోదరుని మాటను అది నెరవేర్చెను.
6 ఇప్పుడు రాజు నివసించిన మోరొన్ దేశము, నీఫైయుల చేత నిర్జనము అని పిలువబడిన దేశమునకు సమీపముగా ఉండెను.
7 కిబ్ మిక్కిలి వృద్ధుడగు వరకు అతడు మరియు అతని జనులు అతని కుమారుడైన కొరిహోర్ క్రింద దాస్యమందు నివసించిరి; అయినప్పటికీ అతడు ఇంకను దాస్యములో ఉండగా, కిబ్ తన ముసలితనమందు షూలేను కనెను.
8 షూలే తన సహోదరునితో కోపముగా ఉండెను; మరియు షూలే బలముగా పెరిగి, పెద్దవాడై శక్తిమంతుడాయెను; అతడు తీర్పుతీర్చుటలో కూడా శక్తిమంతుడాయెను.
9 అందువలన అతడు ఎఫ్రాయిము కొండకు వచ్చి, తనతో తీసుకొనిపోయిన వారి కొరకు కొండను కరిగించి ఉక్కు ఖడ్గములను చేసెను; వారికి ఖడ్గములు ధరింపజేసిన తరువాత, అతడు నీహోర్ పట్టణమునకు తిరిగి వెళ్ళి తన సహోదరుడైన కొరిహోర్‌తో యుద్ధము చేసెను; దాని ద్వారా అతడు రాజ్యమును సంపాదించి, దానిని తన తండ్రి కిబ్‌కు పునస్థాపించెను.
10 ఇప్పుడు షూలే చేసిన సంగతిని బట్టి, అతని తండ్రి అతనికి రాజ్యమునిచ్చెను; కావున, అతడు తన తండ్రి స్థానములో పరిపాలించసాగెను.
11 అతడు నీతియందు తీర్పుతీర్చెను; మరియు జనులు అధిక సంఖ్యాకులైనందున, అతడు తన రాజ్యమును భూముఖముపై వ్యాపింపజేసెను.
12 షూలే కూడా అనేకమంది కుమారులను, కుమార్తెలను కనెను.
13 ఇప్పుడు కొరిహోర్ తాను చేసిన అనేక కీడులను గూర్చి పశ్చాత్తాపపడెను; అందువలన షూలే అతనికి తన రాజ్యమందు అధికారమునిచ్చెను.
14 కొరిహోర్ అనేకమంది కుమారులను, కుమార్తెలను కలిగియుండెను. మరియు కొరిహోర్ యొక్క కుమారులలో నోవహు అను పేరుగల వాడొకడు ఉండెను.
15 నోవహు, షూలే రాజుకు మరియు అతని తండ్రి కొరిహోర్‌కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి, అతని సహోదరుడైన కొహోర్‌ను, అతని సహోదరులందరిని మరియు జనులలో అనేకులను కూడా తనవైపు ఆకర్షించెను.
16 అతడు షూలే రాజుతో యుద్ధము చేసి, వారి ప్రథమ స్వాస్థ్యమైన దేశమును పొందెను; మరియు దేశము యొక్క ఆ భాగముపై అతడు రాజు ఆయెను.
17 మరలా అతడు షూలే రాజుతో యుద్ధము చేసి, అతడిని పట్టుకొని, మోరొన్‌లోనికి బందీగా తీసుకొనిపోయెను.
18 అతడు అతడిని చంపబోవుచుండగా షూలే యొక్క కుమారులు రాత్రియందు ప్రాకుచూ నోవహు ఇంటిలోనికి ప్రవేశించి, అతడిని సంహరించి, చెరసాల ద్వారమును విరుగగొట్టి వారి తండ్రిని బయటకు తెచ్చిరి మరియు అతడిని, అతని స్వంత రాజ్యమందు అతని సింహాసనముపై కూర్చుండబెట్టిరి.
19 అందువలన, నోవహు కుమారుడు అతనికి బదులుగా అతని రాజ్యమును నిర్మించెను; అయినప్పటికీ, వారికమీదట షూలే రాజుపైన అధికారము పొందలేదు; షూలే రాజు యొక్క పరిపాలన క్రింద ఉన్న జనులు మిక్కిలిగా వర్థిల్లి, గొప్పగా ఎదిగిరి.
20 ఇప్పుడు దేశము విభజింపబడెను; అక్కడ రెండు రాజ్యములు ఉండెను, షూలే యొక్క రాజ్యము మరియు నోవహు కుమారుడైన కొహోర్ యొక్క రాజ్యము.
21 నోవహు కుమారుడైన కొహోర్ తన జనులు షూలేతో యుద్ధము చేయునట్లు చేసెను; దానిలో షూలే వారిని కొట్టివేసి, కొహోర్‌ను సంహరించెను.
22 ఇప్పుడు కొహోర్ ఒక కుమారుడిని కలిగియుండెను, అతడు నిమ్రోదు అని పిలువబడెను; నిమ్రోదు, కొహోర్ యొక్క రాజ్యమును షూలేకు ఇచ్చివేసెను; మరియు అతడు షూలే దృష్టిలో అనుగ్రహము సంపాదించెను; అందువలన, షూలే అతనిపై గొప్ప అనుగ్రహములను దయచేసెను; మరియు షూలే యొక్క రాజ్యమందు అతడు తన కోరికల ప్రకారము చేసెను.
23 షూలే యొక్క పరిపాలనలో జనుల మధ్య ప్రవక్తలు కూడా వచ్చిరి, వారు ప్రభువు నుండి పంపబడిరి; జనుల యొక్క దుష్టత్వము మరియు విగ్రహారాధన దేశముపై శాపమును తెచ్చుచున్నదని, వారు పశ్చాత్తాపపడని యెడల వారు నాశనము చేయబడుదురని వారు ప్రవచించిరి.
24 మరియు జనులు ప్రవక్తలకు వ్యతిరేకముగా దూషించి, వారిని ఎగతాళి చేసిరి. ఇప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకముగా దూషించిన వారందరిని షూలే రాజు తీర్పుతీర్చెను.
25 అతడు దేశమంతటా ఒక చట్టమును చేసెను, అది ప్రవక్తలకు వారు కోరిన చోటుకు పోవునట్లు శక్తినిచ్చెను; మరియు ఈ హేతువు చేత జనులు పశ్చాత్తాపమునకు తేబడిరి.
26 జనులు తమ దుష్టత్వము, విగ్రహారాధనల విషయమై పశ్చాత్తాపపడినందున ప్రభువు వారిని విడిచిపెట్టెను; మరలా వారు దేశమందు వర్థిల్లసాగిరి. మరియు షూలే తన ముసలితనమందు కుమారులను, కుమార్తెలను కనెను.
27 ఇకపై షూలే యొక్క దినములలో యుద్ధములు లేకుండెను; మరియు ఆ గొప్ప అగాధము మీదుగా వాగ్దానదేశములోనికి వారిని తెచ్చుటలో అతని పితరుల కొరకు ప్రభువు చేసిన గొప్ప సంగతులను అతడు జ్ఞాపకము చేసుకొనెను; అందువలన అతడు, తన దినములన్నిటా నీతియందు తీర్పుతీర్చెను.