2వ అధ్యాయము
హీలమన్ కుమారుడైన హీలమన్ ప్రధాన న్యాయాధిపతి అగును—కిష్‌క్యుమెన్ ముఠాకు గాడియాంటన్ నాయకత్వము వహించును—హీలమన్ యొక్క సేవకుడు కిష్‌క్యుమెన్‌ను సంహరించును మరియు గాడియాంటన్ ముఠా అరణ్యములోనికి పారిపోవును. సుమారు క్రీ. పూ. 50–49 సం.
1 న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది రెండవ సంవత్సరమందు నీఫైయులు మరియు లేమనీయుల మధ్య మొరోనైహా సమాధానమును పునఃస్థాపించిన తరువాత, న్యాయపీఠమును అధిష్టించుటకు అక్కడ ఎవరూ లేకుండెను; కావున న్యాయపీఠమును ఎవరు అధిష్టించవలెనను దానిని గూర్చి జనుల మధ్య మరలా వివాదము మొదలాయెను.
2 మరియు హీలమన్ కుమారుడైన హీలమన్ జనుల యొక్క స్వరము చేత న్యాయపీఠమును అధిరోహించుటకు నియమింపబడెను.
3 కానీ పహోరన్‌ను హత్య చేసిన కిష్‌క్యుమెన్, హీలమన్‌ను కూడా నాశనము చేయుటకు వేచియుండెను; మరియు తన దుష్టత్వమును ఎవరూ ఎరుగరాదని ఒక నిబంధనలోనికి ప్రవేశించిన అతని ముఠా చేత అతడు సమర్థించబడెను.
4 ఏలయనగా హత్య మరియు దొంగతనము యొక్క రహస్య కార్యమును కొనసాగించుటకు తన మాటలలో, కుయుక్తులలో మిక్కిలి నేర్పరియైన గాడియాంటన్ అను వాడొకడు అక్కడుండెను; కావున అతడు కిష్‌క్యుమెన్ ముఠాకు నాయకుడాయెను.
5 వారతనికి న్యాయపీఠము అప్పగించిన యెడల, వారు జనులపై శక్తిని, అధికారమును కలిగియుండునట్లు అతని ముఠాకు చెందిన వారికి అతడు అనుగ్రహించునని అతడు వారితో, కిష్‌క్యుమెన్‌తో ఇచ్ఛకపుమాటలు మాట్లాడెను; అందువలన కిష్‌క్యుమెన్, హీలమన్‌ను నాశనము చేయజూచెను.
6 మరియు హీలమన్‌ను నాశనము చేయుటకు న్యాయపీఠము వైపు అతడు వెళ్ళగా, ఇదిగో హీలమన్ యొక్క సేవకులలో ఒకడు రాత్రి యందు వెలుపల ఉండినవాడై, హీలమన్‌ను నాశనము చేయుటకు ఈ ముఠా ద్వారా వేయబడిన ఆ ప్రణాళికలను గూర్చిన సమాచారమును మారువేషము ద్వారా సంపాదించియుండి—
7 అతడు కిష్‌క్యుమెన్‌ను కలుసుకొని, అతనికి ఒక సూచననిచ్చెను; కావున తాను హీలమన్‌ను హత్య చేయగలుగునట్లు న్యాయపీఠము వద్దకు నడిపించవలెనని కోరుచూ కిష్‌క్యుమెన్ తన ఉద్దేశ్యమును అతనికి తెలియజేసెను.
8 మరియు హీలమన్ యొక్క సేవకుడు కిష్‌క్యుమెన్ ఆలోచనలను, హత్యచేయుటకు అతని ఉద్దేశ్యమును మరియు హత్యచేయుటకు, దొంగిలించుటకు, అధికారము సంపాదించుటకు (ఇది వారి రహస్య ప్రణాళిక మరియు వారి కూడిక అయ్యుండెను) అతని ముఠాకు చెందిన వారందరి ఉద్దేశ్యమును ఎరిగినప్పుడు, హీలమన్ యొక్క సేవకుడు—మనము న్యాయపీఠము యొద్దకు వెళ్ళుదమని కిష్‌క్యుమెన్‌తో చెప్పెను.
9 ఇప్పుడిది కిష్‌క్యుమెన్‌ను మిక్కిలి సంతోషపరచెను, ఏలయనగా అతడు తన ప్రణాళికను నేరవేర్చుకొనగలడని అతడు తలంచెను; కానీ వారు న్యాయపీఠము యొద్దకు వెళ్ళుచుండగా, హీలమన్ యొక్క సేవకుడు కిష్‌క్యుమెన్‌ను హృదయమందు పొడిచెను, అతడు మూలుగకుండా చచ్చిపడెను. మరియు అతడు పరుగెత్తుకొని వెళ్ళి, తాను చూచి, విని, చేసిన క్రియలన్నిటినీ హీలమన్‌కు చెప్పెను.
10 అంతట వారు చట్టమును బట్టి శిక్షించబడునట్లు బందిపోటులు మరియు రహస్యహంతకుల యొక్క ఈ ముఠాను పట్టుకొనుటకు హీలమన్ జనులను పంపెను.
11 కానీ కిష్‌క్యుమెన్ తిరిగి రాలేదని గాడియాంటన్ కనుగొనినప్పుడు, తాను నాశనము చేయబడుదునేమోనని అతడు భయపడెను; కావున తన ముఠా అతడిని వెంబడించునట్లు అతడు చేసెను. వారు దేశము నుండి బయటకు, అరణ్యములోనికి ఒక రహస్య మార్గము గుండా ప్రయాణించిరి; ఆ విధముగా వారిని పట్టుకొనుటకు హీలమన్ జనులను పంపినప్పుడు వారెక్కడా కనుగొనబడలేదు.
12 ఈ గాడియాంటన్‌ను గూర్చి ఎక్కువగా ఇకపై చెప్పబడును. ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది రెండవ సంవత్సరము ముగిసెను.
13 మరియు ఈ గ్రంథము యొక్క అంతమందు వినాశనమునకు, అనగా దాదాపు నీఫై జనుల యొక్క సంపూర్ణ నాశనమునకు ఈ గాడియాంటన్ కారణమని మీరు చూచెదరు.
14 అయితే నా ఉద్దేశ్యము హీలమన్ గ్రంథము యొక్క అంతమని కాదు, కానీ నేను వ్రాసిన సమస్త వృత్తాంతమును నేను దేనినుండి తీసుకొంటినో ఆ నీఫై గ్రంథము యొక్క అంతమని నా ఉద్దేశ్యము.