లేఖనములు
హీలమన్ 4


4వ అధ్యాయము

నీఫైయులలోని అసమ్మతీయులు మరియు లేమనీయులు సైన్యములను కలుపుకొని జరహేమ్ల దేశమును స్వాధీనపరచుకొందురు—నీఫైయుల ఓటములు వారి దుష్టత్వమును బట్టి వచ్చును—సంఘము క్షీణించును మరియు జనులు లేమనీయుల వలే బలహీనమగుదురు. సుమారు క్రీ. పూ. 38–30 సం.

1 ఏబది నాలుగవ సంవత్సరములో సంఘమందు అనేక విభేధములుండెను మరియు అధిక రక్తపాతము జరుగునంతగా జనుల మధ్య ఒక వివాదముండెను.

2 తిరుగుబాటు చేసినవారు సంహరింపబడిరి మరియు దేశము నుండి బయటకు తరుమబడిరి, వారు లేమనీయుల రాజు వద్దకు వెళ్ళిరి.

3 నీఫైయులతో యుద్ధము చేయుటకు వారు లేమనీయులను పురిగొల్పుటకు ప్రయత్నించిరి; కానీ లేమనీయులు ఎంతగా భయపడిరనగా, వారు ఆ అసమ్మతీయుల మాటలు ఆలకించలేదు.

4 కానీ న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఏబది ఆరవ సంవత్సరమందు నీఫైయుల నుండి లేమనీయుల యొద్దకు వెళ్ళిన అసమ్మతీయులుండిరి; నీఫైయులకు వ్యతిరేకముగా వారిని కోపమునకు పురిగొల్పుట యందు వారు ఆ ఇతరులతోపాటు కలిసి విజయము సాధించిరి; వారందరు ఆ సంవత్సరము యుద్ధమునకు సిద్ధపడుచుండిరి.

5 ఏబది ఏడవ సంవత్సరమందు వారు నీఫైయులతో యుద్ధము చేయుటకు వచ్చిరి మరియు వారు మారణకాండ మొదలుపెట్టిరి; ఎంతగాననగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఏబది ఎనిమిదవ సంవత్సరమందు వారు జరహేమ్ల దేశము యొక్క స్వాధీనమును మరియు సమృద్ధిదేశమునకు దగ్గరగా ఉన్న దేశము వరకు సమస్త దేశములను సంపాదించుట యందు విజయము పొందిరి.

6 నీఫైయులు మరియు మొరోనైహా యొక్క సైన్యములు సమృద్ధిదేశములోనికి తరుమబడిరి;

7 లేమనీయుల నుండి రక్షణ కొరకు పశ్చిమ సముద్రము నుండి తూర్పునకు వారు కోటలు కట్టుకొనిరి; ఒక నీఫైయుడు ఒక దినము ప్రయాణించునంత దూరము వరకు ఉత్తర దేశమును కాపాడుకొనుటకు వారు కోటలుకట్టి, దారిగుండా వారి సైన్యములను కావలియుంచిరి.

8 ఆ విధముగా నీఫైయులలోని ఆ అసమ్మతీయులు లేమనీయుల యొక్క బహు సంఖ్యాకమెన సైన్యము సహాయముతో దక్షిణము వైపు దేశమందున్న నీఫైయుల యొక్క స్వాధీనములన్నిటినీ సంపాదించియుండిరి. ఇవన్నియు న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఏబది ఎనిమిదవ మరియు తొమ్మిదవ సంవత్సరములందు చేయబడెను.

9 న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరవైయవ సంవత్సరమందు మొరోనైహా తన సైన్యములతో దేశము యొక్క అనేక భాగములను సంపాదించుట యందు విజయము పొందెను; అనగా, లేమనీయులు స్వాధీనపరచుకొనిన అనేక పట్టణములను వారు తిరిగి సంపాదించిరి.

10 న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది ఒకటవ సంవత్సరమందు వారు తమ సమస్త స్వాధీనములలో సగము వరకు తిరిగి సంపాదించుట యందు విజయము పొందిరి.

11 ఇప్పుడు వారి మధ్య దుష్టత్వము, హేయక్రియలు లేని యెడల, నీఫైయుల మధ్య ఈ అధిక నష్టము మరియు గొప్ప సంహారము జరిగియుండేవి కావు; మరియు దేవుని సంఘమునకు చెందినట్లు చెప్పుకొన్న వారి మధ్య కూడా ఇవి ఉండెను.

12 అది వారి హృదయ గర్వమును బట్టి, అపారమైన సంపదలను బట్టియైయుండెను, అనగా పేదలను పీడించుట, ఆకలిగొనిన వారి నుండి వారి ఆహారమును ఉపసంహరించుట, దిగంబరుల నుండి వారి వస్త్రమును ఉపసంహరించుట, వినయముగల వారి సహోదరులను చెంపపై కొట్టుట, పవిత్రమైన దానిని ఎగతాళి చేయుట, ప్రవచనాత్మను బయల్పాటు ఆత్మను తిరస్కరించుట, హత్య చేయుట, దోచుకొనుట, అబద్ధమాడుట, దొంగిలించుట, వ్యభిచారము చేయుట, గొప్పవివాదములను రేపుట మరియు నీఫై దేశములోనున్న లేమనీయుల మధ్యకు దూరముగా పారిపోవుటను బట్టియైయుండెను—

13 వారి ఈ గొప్ప దుష్టత్వము మరియు వారి స్వశక్తి యందు వారి అతిశయమును బట్టి, వారి స్వశక్తి యందు వారు విడువబడిరి; కావున వారు వర్థిల్లలేదు, కానీ బాధింపబడి, కొట్టబడి, దాదాపుగా వారి సమస్త దేశముల స్వాధీనమును పోగొట్టుకొను వరకు లేమనీయుల యెదుట తరుమబడిరి.

14 కానీ వారి దుర్నీతిని బట్టి, జనులకు మొరోనైహా అనేక వాక్యములను బోధించెను, హీలమన్‌ కుమారులైన నీఫై మరియు లీహై కూడా జనులకు అనేక వాక్యములు బోధించిరి, ముఖ్యముగా వారి దుర్ణీతులు మరియు వారి పాపముల విషయమై వారు పశ్చాత్తాపపడని యెడల, వారికి జరుగబోవు దానిని గూర్చి అనేక వాక్యములు ప్రవచించిరి.

15 అంతట వారు పశ్చాత్తాపపడిరి మరియు వారెంతగా పశ్చాత్తాపపడిరో అంతగా వారు వర్థిల్లసాగిరి.

16 ఏలయనగా వారు పశ్చాత్తాపపడిరని మొరోనైహా చూచినప్పుడు వారి సంపదలో సగమును, వారి దేశములన్నిటిలో సగమును వారు సంపాదించు వరకు అతడు వారిని స్థలము నుండి స్థలమునకు, పట్టణము నుండి పట్టణమునకు నడిపించుటకు ధైర్యము చేసెను.

17 ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది ఒకటవ సంవత్సరము ముగిసెను.

18 మరియు న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది రెండవ సంవత్సరమందు మొరోనైహా ఇక ఏ మాత్రము లేమనీయులపై స్వాధీనములు సంపాదించలేకపోయెను.

19 కావున వారు తమ దేశములలో మిగిలిన వాటిని సంపాదించవలెనన్న ప్రణాళికను వదిలివేసిరి, ఏలయనగా లేమనీయులు అసంఖ్యాకముగా ఉన్నందున వారిపై ఎక్కువ అధికారము సంపాదించుట నీఫైయులకు అసాధ్యమాయెను; అందువలన మొరోనైహా తాను స్వాధీనపరచుకొనిన ఆ భాగములను నిలుపుకొనుటలో తన సైన్యములన్నిటినీ ఉపయోగించెను.

20 మరియు లేమనీయులు అధిక సంఖ్యాకులైయున్నందున వారు జయింపబడి, త్రొక్కివేయబడి, సంహరింపబడి, నాశనము చేయబడుదురేమోయని నీఫైయులు అధికముగా భయపడిరి.

21 వారు ఆల్మా ప్రవచనములను, మోషైయ మాటలను కూడా జ్ఞాపకము చేసుకొనసాగిరి; వారు మెడబిరుసు జనులని మరియు దేవుని ఆజ్ఞలను పనికిరానివిగా యెంచిరని వారు చూచిరి.

22 మోషైయ చట్టములను లేదా జనులకు ఇవ్వమని ప్రభువు అతడిని ఆజ్ఞాపించిన దానిని వారు మార్చివేసి, వారి పాదముల క్రింద త్రొక్కివేసిరని, వారి చట్టములు చెరుపబడినవని, వారు దుష్టులైరని, ఎంతగాననగా వారు లేమనీయుల వలే దుష్టులైయున్నారని కూడా వారు చూచిరి.

23 వారి దుర్నీతిని బట్టి సంఘము క్షీణించసాగెను; వారు ప్రవచనాత్మ, బయల్పాటు ఆత్మ యందు సంశయించుట మొదలు పెట్టిరి మరియు దేవుని న్యాయతీర్పులను వారు తప్పించుకోలేకపోయిరి.

24 వారు తమ సహోదరులైన లేమనీయులవలే బలహీనులైరని, ప్రభువు యొక్క ఆత్మ ఇక ఏ మాత్రము వారిని కాపాడలేదని వారు చూచిరి; ప్రభువు యొక్క ఆత్మ అపరిశుద్ధమైన ఆలయములలో నివసించదు, కనుక అది వారి నుండి ఉపసంహరించుకొనెను—

25 కావున ప్రభువు వారిని తన అద్భుతమైన, సాటిలేని శక్తి ద్వారా కాపాడుట మానెను, ఏలయనగా వారు అవిశ్వాసము మరియు భయంకరమైన దుర్మార్గపు స్థితిలోనికి పడిపోయిరి; లేమనీయులు వారి కంటే బహు సంఖ్యాకులని మరియు ప్రభువైన వారి దేవుడిని హత్తుకొనని యెడల వారు తప్పక నశించిపోవుదురని వారు చూచిరి.

26 ఏలయనగా లేమనీయులు వారితో సమానమైన బలము కలిగియున్నారని, ఒక లేమనీయుని బలము ఒక నీఫైయుని బలముతో సమానముగా ఉందని వారు చూచిరి. ఆ విధముగా వారు ఈ గొప్ప అతిక్రమములో పడిరి; ఆ విధముగా వారి అతిక్రమమును బట్టి, కొద్ది సంవత్సరముల కాలములోనే వారు బలహీనులైయుండిరి.