6వ అధ్యాయము
నీతిమంతులైన లేమనీయులు, దుష్టులైన నీఫైయులకు బోధించెదరు—ఇరువురు శాంతి మరియు సమృద్ధి యొక్క యుగమందు వర్ధిల్లుదురు—పాపమునకు కర్తయైన లూసిఫరు, దుష్టులు మరియు గాడియాంటన్ దొంగల హృదయములను హత్య మరియు దుష్టత్వమునకు పురిగొల్పును—దొంగలు నీఫైయుల ప్రభుత్వమును స్వాధీనము చేసుకొందురు. సుమారు క్రీ. పూ. 29–23 సం.
1 న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది రెండవ సంవత్సరము ముగిసినప్పుడు ఈ క్రియలన్నియు జరిగియుండెను మరియు లేమనీయులలో అధిక భాగము నీతిమంతులైన జనులైరి, ఎంతగాననగా విశ్వాసమందు వారి దృఢత్వము మరియు నిలకడను బట్టి, వారి నీతి నీఫైయుల నీతిని మించెను.
2 ఏలయనగా నీఫైయులలో అనేకులు కఠినపరచబడి, పశ్చాత్తాపపడక మిక్కిలి దుష్టులైయుండిరి, ఎంతగాననగా వారు దేవుని వాక్యమును, వారి మధ్య వచ్చిన సమస్త బోధను, ప్రవచనమును తిరస్కరించిరి.
3 అయినప్పటికీ లేమనీయుల పరివర్తనను బట్టి, వారి మధ్య స్థాపించబడిన దేవుని సంఘమును బట్టి సంఘమందలి జనులు గొప్ప సంతోషము కలిగియుండిరి. వారు ఒకరితోనొకరు సహవాసము చేసి, ఒకరితోనొకరు ఆనందించి, గొప్ప సంతోషము కలిగియుండిరి.
4 లేమనీయులలో అనేకులు జరహేమ్ల దేశములోనికి వచ్చి, వారి పరివర్తన యొక్క విధమును నీఫై జనులకు తెలియజేసిరి మరియు విశ్వాసము కలిగియుండమని, పశ్చాత్తాపపడమని వారికి ఉద్బోధించిరి.
5 వారిలో అనేకులు మిక్కిలి వినయముతో దేవుని యొక్క మరియు గొఱ్ఱెపిల్ల యొక్క వినయముగల అనుచరులగునట్లు చేయుచూ అనేకులు గొప్ప శక్తి మరియు అధికారముతో బోధించిరి.
6 లేమనీయులలో అనేకులు ఉత్తరము వైపునున్న దేశములోనికి వెళ్ళిరి; నీఫై మరియు లీహై కూడా జనులకు బోధించుటకు ఉత్తరము వైపునున్న దేశములోనికి వెళ్ళిరి. ఆ విధముగా అరువది మూడవ సంవత్సరము ముగిసెను.
7 మరియు దేశమంతటా సమాధానముండెను, ఎంతగాననగా దేశము యొక్క ఏ భాగములోనికైనను, నీఫైయుల మధ్యకు లేదా లేమనీయుల మధ్యకు నీఫైయులు వెళ్ళిరి.
8 లేమనీయులు కూడా వారు కోరిన చోటుకు, లేమనీయుల మధ్యకు లేదా నీఫైయుల మధ్యకు వెళ్ళిరి; ఆ విధముగా వారు తమ కోరికను బట్టి కొనుటకు, అమ్ముటకు మరియు లాభము సంపాదించుటకు ఒకరితోనొకరు స్వతంత్ర లావాదేవీలు కలిగియుండిరి.
9 లేమనీయులు, నీఫైయులు ఇరువురు మిక్కిలి ధనవంతులైరి; దక్షిణ దేశమందు మరియు ఉత్తర దేశమందు వారు బంగారము, వెండి, అన్ని రకముల విలువైన లోహములను మిక్కిలి సమృద్ధిగా కలిగియుండిరి.
10 ఇప్పుడు దక్షిణ దేశము లీహై అని పిలువబడెను మరియు ఉత్తర దేశము ములెక్ అని పిలువబడెను, అది సిద్కియా యొక్క కుమారుని బట్టియైయుండెను; ఏలయనగా ప్రభువు ఉత్తర దేశములోనికి ములెక్‌ను, దక్షిణ దేశములోనికి లీహైని తీసుకువచ్చెను.
11 ఈ రెండు దేశములలో అన్ని రకముల బంగారము, వెండి మరియు ప్రతివిధమైన ప్రశస్థ ఖనిజములుండెను; మరియు అన్ని రకములైన ఖనిజములతో పని చేసి, వాటిని శుద్ధి చేసే నేర్పుగల పనివారు కూడా ఉండిరి; ఆ విధముగా వారు ధనవంతులైరి.
12 వారు ఉత్తర దేశమందు, దక్షిణ దేశమందు సమృద్ధిగా ధాన్యము పెంచిరి; వారు ఉత్తర దేశమందు, దక్షిణ దేశమందు మిక్కిలిగా వర్థిల్లిరి. వారు దేశమందు వృద్ధిచెంది, అత్యంత బలముగా ఎదిగిరి. వారు అనేక మందలను, గుంపులను మరియు క్రొవ్విన గొఱ్ఱె పిల్లలనేకమును పెంచిరి.
13 వారి స్త్రీలు పనిచేసి, నూలును వడికి, వారి దిగంబరత్వమును కప్పుకొనుటకు ప్రతి విధమైన వస్త్రమును, సన్నని పేనిన నార వస్త్రమును నేసిరి. ఆ విధముగా అరువది నాలుగవ సంవత్సరము సమాధానమందు గడిచిపోయెను.
14 అరువది అయిదవ సంవత్సరమందు గొప్ప సంతోషము, సమాధానము, రాబోవు దానిని గూర్చిన అధిక బోధ మరియు అనేక ప్రవచనములను వారు కలిగియుండిరి. ఆ విధముగా అరువది అయిదవ సంవత్సరము ముగిసెను.
15 న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది ఆరవ సంవత్సరమందు, సిజోరమ్ న్యాయపీఠముపై కూర్చొనియుండగా గుర్తుతెలియని హస్తము ద్వారా అతడు హత్య చేయబడెను. అదే సంవత్సరమందు అతని స్థానములో జనుల చేత నియమించబడిన అతని కుమారుడు కూడా హత్య చేయబడెను. ఆ విధముగా అరువది ఆరవ సంవత్సరము ముగిసెను.
16 అరువది ఏడవ సంవత్సరము యొక్క ప్రారంభమందు జనులు మరలా మిక్కిలి దుర్మార్గులవసాగిరి.
17 ఏలయనగా ప్రభువు వారిని లోకము యొక్క సంపదలతో ఇంతకాలము ఆశీర్వదించగా వారు కోపమునకు, యుద్ధములకు లేదా రక్తపాతమునకు పురిగొల్పబడలేదు; కావున వారు తమ హృదయములను వారి సంపదలపై ఉంచనారంభించిరి; వారు ఒకరి కంటే ఒకరు గొప్పవారగునట్లు లాభము పొందవలెనని కోరుట మొదలుపెట్టిరి; కావున వారు లాభము పొందునట్లు రహస్యముగా హత్యలు చేయుట, దొంగిలించుట మరియు దోచుకొనుట ప్రారంభించిరి.
18 ఆ హంతకులు, దోపిడీదారులు కిష్‌క్యుమెన్ మరియు గాడియాంటన్ చేత ఏర్పాటు చేయబడిన ముఠా అయ్యుండిరి. నీఫైయుల మధ్య కూడా గాడియాంటన్ యొక్క ముఠావారు అనేకులుండిరి. కానీ లేమనీయులలో అధిక దుర్మార్గులైన వారి మధ్య వారు ఎక్కువగా ఉండిరి. వారు గాడియాంటన్ దొంగలని, హంతకులని పిలువబడిరి.
19 న్యాయపీఠముపై ఉండగా ప్రధాన న్యాయాధిపతి సిజోరమ్‌ను, అతని కుమారుడిని హత్య చేసినది వారే; మరియు వారు కనుగొనబడలేదు.
20 ఇప్పుడు వారి మధ్య దొంగలున్నారని లేమనీయులు కనుగొనినప్పుడు వారు మిక్కిలి దుఃఖముతోనుండిరి; వారిని భూముఖము పైనుండి నాశనము చేయుటకు వారి శక్తి యందున్న ప్రతి సాధనమును వారు ఉపయోగించిరి.
21 కానీ సాతాను నీఫైయులలో అధిక సంఖ్యాకుల హృదయములను పురిగొల్పెను, ఎంతగాననగా ఆ దొంగల ముఠాలతో వారు కలిసిపోయిరి మరియు వారు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉంచబడినను వారు ఒకని నొకడు రక్షించి కాపాడుదురని, వారి హత్యలు, దోపిడీలు, దొంగతనముల నిమిత్తము వారు బాధపడరాదని, వారితో నిబంధనలు మరియు ప్రమాణములు చేసిరి.
22 వారు తమ ఆనవాళ్ళను, వారి రహస్య ఆనవాళ్ళను, రహస్య మాటలను కలిగియుండిరి; మరియు అతని సహోదరుడు ఎట్టి దుర్మార్గము చేసినను అతడు, అతని సహోదరుని చేత లేదా ఈ నిబంధన చేసిన ముఠాకు చెందిన వాని చేత గాయపరచబడకుండునట్లు నిబంధనలో ప్రవేశించిన ఒక సహోదరుడిని గుర్తించుటకే వారు దీనిని చేసిరి.
23 ఆ విధముగా వారి దేశ చట్టములకు, వారి దేవుని చట్టములకు వ్యతిరేకముగా వారు హత్య చేసి, దోచుకొని, దొంగిలించి, జారత్వములు మరియు సమస్త విధమైన దుర్మార్గములను చేయగలిగిరి.
24 మరియు వారి ముఠాకు చెందిన వారిలో ఎవరైనా వారి దుర్మార్గములను, హేయక్రియలను గూర్చి లోకమునకు తెలియజేసిన యెడల విచారణ చేయబడవలెను, అయితే వారి దేశ చట్టములను బట్టి కాదు, కానీ గాడియాంటన్ మరియు కిష్‌క్యుమెన్ చేత ఇవ్వబడిన వారి దుర్మార్గపు చట్టములను బట్టియే చేయబడవలెను.
25 ఈ రహస్య ప్రమాణములు మరియు నిబంధనలు లోకములోనికి వెళ్ళరాదని ఆల్మా తన కుమారుడిని ఆజ్ఞాపించెను, లేనియెడల జనులను నాశనము చేయుటకు అవి ఒక సాధనముగా ఉండును.
26 ఇప్పుడు హీలమన్‌కు అప్పగించబడిన గ్రంథముల నుండి ఈ రహస్య ప్రమాణములు మరియు నిబంధనలు గాడియాంటన్‌కు రాలేదు; కానీ నిషేధించబడిన ఫలమును భుజించుటకు మన మొదటి తల్లిదండ్రులను శోధించిన ఆ జీవి ద్వారానే అవి గాడియాంటన్ యొక్క హృదయమందు రేపబడెను.
27 తన సహోదరుడు హేబెలును హత్యచేసిన యెడల, అది లోకమునకు తెలియబడదని కయీనుతో కుట్ర చేసినది ఆ జీవియే. ఆ సమయము నుండి అతడు కయీను మరియు అతని అనుచరులతో కుట్రచేసెను.
28 పరలోకమునకు వెళ్ళగలుగునట్లు తగినంత ఎత్తుగా ఒక గోపురమును నిర్మించవలెనని జనుల హృదయములలో రేపినది ఆ జీవియే. ఆ గోపురము నుండి ఈ దేశములోనికి వచ్చిన జనులను నడిపించినది ఆ జీవియే; జనులను సంపూర్ణ నాశనమునకు మరియు నిత్య నరకమునకు ఈడ్చు వరకు దేశము యొక్క ముఖమంతటిపై అంధకారమును, హేయక్రియలన్నిటిని వ్యాపింపజేసినది అతడే.
29 అంధకార క్రియను, రహస్య హత్యలను ఇంకనూ కొనసాగించమని గాడియాంటన్ హృదయమందు రేపినది ఆ జీవియే; మానవుడు పుట్టినప్పటి నుండి ఈ సమయము వరకు దానిని ముందుకు తెచ్చినది అతడే.
30 అతడే సమస్త పాపమునకు కర్త. అతడు తన అంధకార క్రియలను, రహస్య హత్యలను కొనసాగించును మరియు నరుల సంతానము యొక్క హృదయములపై అతడు పట్టు సంపాదించిన విధమును బట్టి, వారి కుట్రలు, ప్రమాణములు, నిబంధనలు మరియు భయంకరమైన వారి దుర్మార్గపు ప్రణాళికలను తరతరములకు అందించును.
31 ఇప్పుడు అతడు నీఫైయుల హృదయములపై గొప్ప పట్టును సంపాదించియుండెను; ఎంతగాననగా వారు మిక్కిలి దుర్మార్గులైరి; వారిలో అధిక భాగము నీతి మార్గమునుండి తొలగిపోయి, దేవుని ఆజ్ఞలను వారి పాదముల క్రింద త్రొక్కివేసిరి మరియు వారి స్వంత మార్గములకు తిరిగి, వారి కొరకు వారి బంగారముతో, వెండితో విగ్రహములు చేసుకొనిరి.
32 కొద్ది సంవత్సరముల కాలములోనే ఈ దుర్ణీతులన్నియు వారిపై వచ్చెను, ఎంతగాననగా దానిలో అధిక భాగము నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది ఏడవ సంవత్సరమందు వారిపై వచ్చియుండెను.
33 నీతిమంతులు బహుగా దుఃఖించి, విలపించునట్లు అరువది ఎనిమిదవ సంవత్సరమందు కూడా వారి దుర్ణీతుల యందు వారు వృద్ధి చెందిరి.
34 ఆ విధముగా నీఫైయులు విశ్వాసమందు క్షీణించి, దుష్టత్వమందు, హేయక్రియలందు వృద్ధిచెందుచుండగా, లేమనీయులు వారి దేవుని జ్ఞానమందు మిక్కిలిగా ఎదగనారంభించిరని మనము చూచుచున్నాము; వారు ఆయన చట్టములను, ఆజ్ఞలను పాటించి, ఆయన యెదుట సత్యమందు, నీతియందు నడవనారంభించిరి.
35 ఆ విధముగా వారి దుష్టత్వము మరియు హృదయకాఠిన్యమును బట్టి, ప్రభువు యొక్క ఆత్మ నీఫైయుల నుండి ఉపసంహరించుకొనుట మొదలుపెట్టెనని మనము చూచుచున్నాము.
36 ఆ విధముగా ఆయన మాటలను సులువుగా విశ్వసించుటకు వారి సమ్మతిని బట్టి, ప్రభువు లేమనీయులపై తన ఆత్మను క్రుమ్మరించుట మొదలుపెట్టెనని మనము చూచుచున్నాము.
37 మరియు లేమనీయులు గాడియాంటన్ దొంగల ముఠాను వేటాడిరి; వారిలో అధిక దుర్మార్గులైన వారి మధ్య దేవుని వాక్యమును వారు బోధించిరి, ఎంతగాననగా ఈ దొంగల ముఠా లేమనీయుల మధ్య నుండి పూర్తిగా నాశనము చేయబడెను.
38 మరోవైపు దానికి విరుద్ధముగా వారిలో అధిక దుర్మార్గులైన వారితో మొదలుపెట్టి, నీఫైయుల దేశమంతటా వారు వ్యాపించు వరకు నీఫైయులు వారి క్రియల యందు విశ్వాసముంచి, వారి దోపుడుసొమ్ములో భాగము పొంది, వారి రహస్య హత్యలు, కూడికలందు వారితో చేరు వరకు నీతిమంతులలో అనేకులను చెడగొట్టి, వారిని వృద్ధిచేసి, వారికి సహాయము చేసిరి.
39 ఆ విధముగా వారు ప్రభుత్వము యొక్క పూర్తి నిర్వహణను సంపాదించిరి, ఎంతగాననగా పేదలను, సాత్వీకులను మరియు దేవుని యొక్క వినయము గల అనుచరులను తమ పాదముల క్రింద త్రొక్కి, కొట్టి, బాధించి, వారి నుండి తమ సహాయమును ఉపసంహరించిరి.
40 ఆ విధముగా వారు ఒక భయంకరమైన స్థితిలో ఉన్నారని మరియు నిత్య నాశనమునకు పరిపక్వమగుచున్నారని మనము చూచుచున్నాము.
41 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది ఎనిమిదవ సంవత్సరము ముగిసెను.