ఆధ్యాత్మిక గ్రహణం
జీవితపు కలవరములు స్వర్గపు కాంతికి గ్రహణం కానీయద్దు.
ఈ ఏడాది ఆగష్టు 21 న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని రెండు అరుదైన సంఘటనలు ఆకట్టుకున్నాయి. మొదటిది మన ప్రియ ప్రవక్తయైన అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ గారి 90 వ జన్మదిన వేడుక. ఆ సమయంలో, నేను పసిఫిక్ ప్రాంతంలో నిర్దేశించిన పనిలో ఉన్నాను, ఆస్ట్రేలియా, వనాటు, న్యూజిలాండ్, మరియు ఫ్రెంచ్ పాలినేషియాలోని పరిశుద్ధులు ఆయన వ్యక్తిగత మైలురాయిని మాత్రమే తెలుసుకుని ఆశ్చర్యపోలేదు, కానీ వారు దానిని జరుపుకోవడంలో ఆనందించారు. ఈ గొప్ప వ్యక్తి పట్ల వారి విశ్వాసం మరియు ప్రేమ యొక్క వెచ్చని భావాలను పంచుకోవడం నాఅదృష్టంగా భావిస్తున్నాను. కడవరి-దిన పరిశుద్ధులకు వారి ప్రవక్తతో ఉన్న అనుబంధమును చూడడమే ఒక ప్రేరేపణ.
వాస్తవానికి అధ్యక్షులు మాన్సన్, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలని కోరుకునేవారినిదృష్టిలో ఉంచుకొని ఉత్తమమైన పుట్టినరోజు బహుమతిని వివరించారు: “కష్టంలో ఉన్నవారిని లేదా అనారోగ్యులను లేదా ఒంటరివారిని కనుగొని, వారికోసం ఏదో ఒకటి చెయ్యండి. ఇదే నేను అడిగేది. “1 అధ్యక్షులు మాన్సన్, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు ఆమోదిస్తున్నాము.
సూర్య గ్రహణం
అదే రోజున జరిగిన మరో అరుదైన స్వర్గపు సంఘటన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షించిన సూర్య గ్రహణం. సంయుక్త రాష్ట్రాలంతటా ఈ విధమైన గ్రహణం 99 ఏళ్లలో మొదటిసారి ఏర్పడింది. 2 మీరెప్పుడైనా సూర్యగ్రహణాన్ని చూసారా? బహుశా నేను దీనిని మరింత వివరంగా వర్ణించగలను.
భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, సూర్యుని ఉపరితలం నుండి వచ్చే కాంతిని పూర్తిగా అది అడ్డుకొని సంపూర్ణ సూర్య గ్రహణం సంభవిస్తుంది. 3 ఇది జరుగగలదనే వాస్తవం నాకొక అద్భుతం. సూర్యుడిని ఒక సాధారణ సైకిల్ చక్రపు పరిమాణంలో ఊహించినట్లయితే, దానితో పోల్చినప్పుడు చంద్రుని పరిమాణం ఒక చిన్న గులకరాయి కన్నా తక్కువగా ఉంటుంది.
మన వెచ్చదనం, కాంతి మరియు జీవనమునకు ములమైనదానిని, అంత తక్కువ పరిమాణంలో వున్నది పూర్తిగా అడ్డుకోవడం ఎలా సాధ్యమయింది?
సూర్యుడు చంద్రుని కంటే 400 రెట్లు పెద్దది అయినప్పటికీ, భూమి నుండి 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉంది. 4 భూమి పైనుండి ఈ రేఖలో సూర్యుడు మరియు చంద్రుడు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. రెండు వరుసలు సరిగ్గా ఉన్నప్పుడు, చంద్రుడు మొత్తంగా సూర్యుడిని మూసేసినట్లుగా కనిపిస్తుంది. సంపూర్ణ గ్రహణం ఏర్పడ్డ ప్రాంతంలో ఉన్న మా స్నేహితులు మరియు కుటుంబసభ్యులు వెలుగు చీకటిగా మారడం, నక్షత్రాలు కనిపించడం మరియు పక్షులు పాడడం ఆపడం గురించి చెప్పారు. గ్రహణమప్పుడు ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల ఫారెన్ హీట్ (11 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువగా తగ్గిపోగలిగినందున గాలి చల్లబడింది. 5
గ్రహణాలు కొన్ని ప్రమాదాలను కూడా తీసుకొస్తాయని చెప్తూ వారు విస్మయం, ఆశ్చర్యం మరియు ఆందోళనను వ్యక్తపరిచారు. అయినప్పటికీ గ్రహణం సమయంలో శాశ్వత కంటి నష్టం లేదా “గ్రహణ అంధత్వం” నివారించడానికి వారు జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్ళను కాపాడుకునే ప్రత్యేక వడపోత కటకములతో కూడిన అద్దాలు ఉపయోగించడం ద్వారా కళ్ళకు హాని చేసే వాటినుండి వారు సురక్షితంగా ఉండగలిగారు.
సాదృశ్యము (పోలిక)
చాలా చిన్న చంద్రుడు, అద్భుతమైన సూర్యుడి కాంతి మరియు వెచ్చదనం నిరోధించినట్లుగా, రోజువారీ జీవితాల్లో మనము ఎదుర్కొనే చిన్న మరియు సమస్యాత్మకమైన అడ్డంకులు అతి దగ్గరగా వచ్చేందుకు మనం అనుమతించినప్పుడు ఆధ్యాత్మిక గ్రహణం సంభవిస్తుంది—అవి యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త వెలుగు యొక్క గొప్పదనాన్ని, ప్రకాశాన్ని మరియు వెచ్చదనాన్ని నిలిపివేస్తాయి.
ఎల్డర్ నీల్ ఎ. మాక్స్వెల్ ఇలాంటి సారూప్యతను మరింత మెరుగ్గా చెప్పారు: “మనిషి యొక్క బొటనవ్రేలు వలె చిన్నది కూడా, కంటికి చాలా దగ్గరగా ఉంచబడినప్పుడు చాలా పెద్ద సూర్యుడిని చూడకుండా ఆపగలదు, సూర్యుడు అక్కడే ఉన్నప్పటికీ కూడా. అంధత్వాన్ని మనిషి తనకుతానుగా తెచ్చుకుంటాడు. మనము ఇతర విషయాలను అతిదగ్గరగా తీసుకొని, వాటికి ప్రాధాన్యతనివ్వడం ద్వారా మన పరలోక దృశ్యాన్ని గ్రహించలేకున్నాము”6
స్పష్టంగా, మనలో ఏ ఒక్కరూ పరలోక దృశ్యాన్నిఉద్దేశపూర్వకంగా గ్రహించరాదని లేదా మన జీవితాలలో ఆధ్యాత్మిక గ్రహణం ఏర్పడాలని కోరుకోరు. శాశ్వత ఆధ్యాత్మిక నష్టాన్ని కలిగించకుండా ఆధ్యాత్మిక గ్రహణాలను నివారించడంలో మనకు సహాయపడే కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
సువార్త కళ్ళద్దాలు: సువార్త దృష్టినికొనసాగించండి
సూర్య గ్రహణం చూచునప్పుడు కంటి హాని లేదా గ్రహణ అంధత్వం నుండి వీక్షకులను రక్షించడానికి ఉపయోగించే ప్రత్యేక కళ్లద్దాల గురించి నేను చెప్పడం గుర్తుందా? ఆత్మ యొక్క రక్షించే మృదువైన అద్దాల ద్వారా ఒక ఆధ్యాత్మిక గ్రహణం చూస్తే ఆత్మ ఒక సువార్త దృష్టిని అందిస్తుంది, ఆ విధంగా మనం ఆధ్యాత్మిక అంధత్వం నుండి రక్షణ పొందుతాం.
కొన్ని ఉదాహరణలు చూద్దాం. మన హృదయాలలో ప్రవక్తల మాటలను మరియు పరిశుద్దాత్మను మనసలహాదారునిగా కలిగియుండి, ఆధ్యాత్మిక గ్రహణపు హానిని తప్పించుకుంటూ మనము “సువార్త అద్దాల” ద్వారా పాక్షికంగా నిరోధించబడిన పరలోక కాంతిని చూడవచ్చు.
కాబట్టి మనము సువార్త అద్దాలను ఎలా ధరించాలి? కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి: ప్రతి వారం మనము ప్రభురాత్రి భోజనమును తీసుకోవాలని ప్రభువు కోరుతున్నారని మరియు లేఖన అధ్యయనము, అనుదిన ప్రార్థన చేయాలని ఆయన కోరుతున్నారనీ మన సువార్త అద్దాలు మనకు తెలియజేస్తాయి. మనమలా చేయరాదని సాతాను శోధిస్తాడని కూడా అవి మనకు తెలియజేస్తాయి. పరధ్యానం, ప్రాపంచిక ప్రలోభాల ద్వారా మన స్వాతంత్ర్యాన్నితీసివేయడమే అతని ఉద్దేశమని మనమెరుగుదుము. యోబు యొక్క దినాలలో కూడా, ఆధ్యాత్మిక గ్రహాణాన్ని అనుభవించిన కొందరు ఇలా వివరించారు: “పగటివేళ వారికి అంధకారము తారసిల్లును, రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమున వారు తడువులాడుదురు.” 7
సహోదర సహోదరీలారా, నేను “సువార్త అద్దాలద్వారా” చూడటం గురించి మాట్లాడేటప్పుడు, మనము ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి తిరస్కరించమని లేదా అపవాది మనముందుంచిన దుర్మార్గపు ఉచ్చులను గుర్తించవద్దని నేను సలహా ఇవ్వటం లేదని దయచేసి తెలుసుకోండి. నేను తెర ధరించడం గురించి మాట్లాడటం లేదు- కాని సరిగ్గా దానికి వ్యతిరేకమైనది చెప్తున్నాను. మనము సవాళ్ళను సువార్త యొక్క అద్దాల గుండా చూడాలని చెప్తున్నాను. ఎల్డర్ డాల్లిన్ హెచ్. ఓక్స్ దీనిని ఇలా గమనించారు, “అర్థవంతమైన సంబంధంలో సంబంధిత సమాచారాన్నంతటినీ చూడగల సామర్థ్యమే దృష్టి.” 8 సువార్త దృక్పథం మన దృష్టిని పూర్తి నిత్యమార్గంలో విస్తరింప చేస్తుంది
మీరు సువార్త అద్దాలు పెట్టుకున్నప్పుడు, మీ ప్రాధాన్యతలు, మీ సమస్యలు, మీ శోధనలు మరియు మీ పొరపాట్లను గురించి మీరు ఆలోచించే విధానంలో మీ నిశితదృష్టి హెచ్చింపబడడాన్ని గమనిస్తారు. మీరు ప్రకాశవంతమైన వెలుగును చూస్తారు, దానిని మీరు అవి లేకుండా చూడలేరు.
హాస్యాస్పదంగా, మన జీవితాల్లో ఆధ్యాత్మిక గ్రహణాన్ని కలిగించేది ప్రతికూలమైనది మాత్రమే కాదు. తరచు మనల్ని మనం అంకితం చేసిన ప్రశంసనీయమైన లేదా సానుకూల ప్రయత్నాలు కూడా అతి దగ్గరగా తీసుకోబడినప్పుడు అవి సువార్త వెలుగును కప్పివేసి చీకటిని తీసుకొస్తాయి. ఈ ప్రమాదాలు లేదా పరధ్యానాలు విద్య మరియు అభివృద్ధి, శక్తి మరియు ప్రభావం, ఆశయం, ప్రతిభ, బహుమతులను కూడా కలిగి ఉండవచ్చు.
అధ్యక్షులు డిటర్ ఎఫ్. ఉక్డార్ఫ్, “ఏ సుగుణమునైనా తీవ్రస్థాయికి తీసుకెళ్ళినప్పుడు అది చెడుగా మారునని... అక్కడ మైలురాళ్ళు తిరుగలిరాళ్ళుగా మరియు ఆశయాలు నిరంతర సమస్యలుగా మారి మన మెడకు చుట్టుకునే పరిస్థితి వస్తుందని” బోధించారు . 9
మన సొంత ఆధ్యాత్మిక గ్రహణాలను విడిచిపెట్టుటకు ఉత్ప్రేరకాలుగా మారగల ఉదాహరణలను అతి వివరంగా నన్ను తెలియజేయనివ్వండి.
సాంఘిక ప్రసార మాధ్యమం
కొన్ని నెలల క్రితం, నేను బి వై యు మహిళల సమావేశంలో మాట్లాడాను. 10 సాంఘిక ప్రసార మాధ్యమాలతో సహా సాంకేతిక పరిజ్ఞానం “ప్రతిజనము, వంశము, భాష మరియు ప్రజలందరికీ ఒక రక్షకుడి జ్ఞానాన్ని విస్తరించడానికి ఏవిధంగా సహాయపడుతుందో” వివరించాను. 11 వీటిలో LDS.org మరియు Mormon.org వంటి సంఘ వెబ్ సైట్లు; సువార్త గ్రంథాలయము, మోర్మన్ ఛానెల్, LDS పనిముట్లు మరియు కుటుంబ వృక్షము వంటి మొబైల్ అనువర్తనాలు; ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మరియు పింటరెస్ట్ వంటి సాంఘిక ప్రసార మాధ్యమ వేదికలున్నాయి. ఈ పద్ధతులు వందల లక్షల likes, shares, views, retweets, మరియు pins ను సృష్టించాయి. కుటుంబం, స్నేహితులు మరియు సహచరులతో సువార్తను పంచుకోవడంలో చాలా సమర్థవంతంగా మరియు సఫలమైనవిగా మారాయి.
ఈ సుగుణాలు మరియు సాంకేతికతలను తగిన విధంగా సద్వినియోగించుకున్నప్పటికీ, వాటితో ముడిపడిన ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాటికి చాలా దగ్గరైనప్పుడు, సాధ్యమైనంతగా అవి ఆధ్యాత్మిక గ్రహణంలో మనల్ని పెట్టవచ్చు మరియు సువార్త ప్రకాశాన్ని, వెచ్చదనాన్ని నిరోధించవచ్చు.
సాంఘిక ప్రసార మాధ్యమము, మొబైల్ అనువర్తనాలు, మరియు ఆటల యొక్క ఉపయోగం భిన్నంగా ఉంటుంది, అవి చాలా సమయాన్న తీసుకుంటాయి మరియు ముఖాముఖి ప్రతిస్పందనలను తగ్గించగలవు. వ్యక్తిగత సంభాషణ కోల్పోవడం అనేది వివాహ సంబందాలను ప్రభావితం చేయగలదు, విలువైన ఆధ్యాత్మిక అభ్యాసాల స్థానాన్ని తీసుకోగలదు మరియు ప్రత్యేకించి యువతరంలో సామాజిక నైపుణ్యాల అభివృద్ధిని అడ్డుకోగలదు
సాంఘిక ప్రసార మాధ్యమాలకు సంబంధించిన రెండు అదనపు నష్టాలు, అసంపూర్ణ వాస్తవికత మరియు బలహీనపరిచే పోలికలు.
సాంఘిక ప్రసార మాధ్యమాల్లో పెట్టబడిన అనేక చిత్రాలు (అన్నీ కాకపోయినా) చాలా ఉత్తమముగా జీవిస్తున్నట్లు చిత్రీకరిస్తాయి -- తరచుగా అది అవాస్తవం. మనము అందంగావున్న గృహాలంకరణలు, అద్భుతమైనయాత్రా స్థలాలు, నవ్వుతూవున్న స్వీయచిత్రాలు, విస్తృతమైన ఆహారపు తయారీ, మరియు అసాధ్యమనిపించు శరీర చిత్రాలను చూసియున్నాము.
ఇక్కడ ఉదాహరణకు, మీరు ఎవరో ఒకరి సాంఘిక మాధ్యమ ఖాతాలో వారి చిత్రం చూసారు. అయినప్పటికీ, వాస్తవానికి నిజ జీవితంలో ఏమి జరుగుతుందో ఆ పూర్తి చిత్రాన్ని అది అందజేయలేదు.
ఇతరులతో మన ఉనికిని మనము పోల్చుకున్నప్పుడు, మంచిగా-కూర్చి, సంపూర్ణముగా రూపాంతరం చెందిన వారి జీవితాలు సాంఘిక ప్రసార మాధ్యమంలో ప్రాతినిధ్యం వహిస్తుంటాయి, అవి మనలో కొన్నిసార్లు నిరుత్సాహం, అసూయ, మరియు జీవితాన్ని కోల్పోతున్నామనే వైఫల్య భావాలను మిగుల్చుతాయి.
స్వతహాగా అనేక చిత్రాలు పంచుకున్న ఒక వ్యక్తి పరిహాసానికి ఇలా అన్నారు, “మీరు వాటిని పంచుకోకపోతే సంతోషంగా ఉండడంలో అర్థమేముంది?” 12
సహోదరి బోన్ని ఎల్. ఆస్కర్సన్ ఈ ఉదయం గుర్తుచేసినట్లుగా, జీవితంలో విజయమనేది ఎన్ని లైకులు లేదా ఎంతమంది ప్రసార మాధ్యమ స్నేహితులు లేదా అనుచరులు ఉన్నారనే దాని ద్వారా రాదు. ఏదేమైనప్పటికీ, అది ఇతరులతో అర్థవంతంగా అనుసంధానించడంద్వారా మరియు వారి జీవితాలలో వెలుగును జోడించడం ద్వారా వస్తుంది.
అసంపూర్ణ వాస్తవికతను చూపేవి మరియు బలహీనపరిచే పోలికలకు దారితీసే చిత్రాలను చూసినప్పుడు మరింత వాస్తవంగా ఉండడాన్ని, మరింత హాస్యాన్ని కనుగొనడాన్ని మరియు తక్కువ నిరుత్సాహపడడాన్ని మనము నేర్చుకోగలమని ఆశిద్దాం.
పోల్చడమనేది స్పష్టంగా మన కాలపు సంకేతం కాదు, గతంలో కూడా ఉంది. అపొస్తలుడైన పౌలు తన కాలములోని ప్రజలను ఇలా హెచ్చరించాడు, “వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నిక చేసికొని యొకరితో నొకరు సరిచూచుకొనుచున్నందున, గ్రహింపులేక యున్నారు.” 13
సాంకేతిక పరిజ్ఞానంతో చాలా ఉపయుక్తమైన మరియు ప్రేరేపిత ఉపయోగాలు ఉన్నందున, మనల్నిమనము అసంపూర్ణమైన కృత్రిమ వ్యక్తులుగా చిత్రించుటకు బదులుగా నేర్పించడానికి, ప్రేరేపించడానికి, అభివృద్ధిచేసేందుకు మరియు అత్యుత్తమముగా మారుటకు ఇతరులను ప్రోత్సహించడానికి దీనిని ఉపయోగించుదాము. ఎదుగుతున్న తరానికి సాంకేతిక పరిజ్ఞానం యొక్క నీతిపరమైన ఉపయోగాన్ని నేర్పుదాం మరియు చేసి చూపుదాం, దాని సంబంధిత ప్రమాదాలు మరియు వినాశకర వినియోగం గురించి హెచ్చరిద్దాం. సువార్త దృష్టితో సాంఘిక ప్రసార మాధ్యమాలను చూడడం వల్ల అవి మన జీవితాల్లో ఆధ్యాత్మిక గ్రహణమును నిరోధించగలవు.
గర్వము
ఇప్పుడు గర్వములాంటి పాత-అడ్డంకులను చూద్దాం. గర్వమనేది వినయానికిఅనగా “ప్రభువు యొక్క చిత్తానికి ఇష్టపూర్వకంగా లోబడుటకు” వ్యతిరేకంగా ఉంటుంది. 14 గర్వంగా ఉన్నప్పుడు, ప్రభువుతో సహా ఇతరులను గౌరవించకుండా మనల్ని మనమే గౌరవించుకుంటాము. గర్వము తరచుగా పోటీపడుతుంది; అధికంగా పొందాలని కోరుకునేలా చేస్తుంది మరియు ఇతరులకంటె మనం మెరుగైనవారిగా వున్నామని చూపిస్తుంది. గర్వము తరచుగా కోపం మరియు ద్వేషం యొక్క భావాలకు దారితీస్తుంది; ఇది పగ తీర్చుకోవడానికి లేదా క్షమాపణను నిలిపివేయడానికి కారణమవుతుంది. అయితే గర్వము, వినయమనే క్రీస్తు యొక్క లక్షణమందు మ్రింగివేయబడగలదు.
బంధుత్వములు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మరియు ప్రియమైనవారితో-భార్య మరియు భర్తల మధ్య-వినయంతో పోషించబడతాయి మరియు గర్వంతో ఆటంకపరచబడతాయి.
అనేక సంవత్సరాల క్రితం, ఒక పెద్ద సంస్థ కార్యనిర్వాహణాధికారి ఒకరు తన సంస్థ గురించి మాట్లాడడానికి నన్ను పిలిచారు, వారి పోటీదారులలో ఒకరు దానిని కొనుగోలు చేసారు. అతను మరియు అనేక ఇతర ప్రధాన కార్యాలయ సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోవచ్చని చాలా ఆందోళన చెందారు. కొనుగోలు చేసిన సంస్థలో ఉన్నతహోదాలో ఉన్నవారితో నాకు బాగా పరిచయం వున్నదని తెలుసుకున్నప్పుడు, అతడు తనను పరిచయం చేయమని, తన తరఫున ఒక బలమైన సూచనను ఇవ్వమని మరియు వారితో సమావేశానికి ఏర్పాటు చేయమని అడిగాడు. తర్వాత అతను ఇలా చెప్తూ ముగించాడు: “వారు ఏమి చెప్తారో మీకు తెలుసా? ‘సాత్వీకులు నశించెదరు!’”
అతని వ్యాఖ్యానం హాస్యాస్పదంగా కంటే ఎక్కువగా ఉందని నేను తెలుసుకున్నాను. నాకు ఆ ఎగతాళి అర్థమయింది. కానీ దానిలో అతనికి ఉపయోగపడే ముఖ్యమైన సూత్రం ఉందని నేను భావించాను. నేను ప్రత్యుత్తరమిచ్చాను, “వాస్తవానికి, వారు చెప్పింది అది కాదు. నిజానికి, దానికి పూర్తి వ్యతిరేకమైనది. ‘సాత్వీకులు …భూలోకమును స్వతంత్రించుకొందురు’ 15 అని వారు చెప్పారు.”
సంఘములో నా అనుభవంలో, అలాగే నా వృత్తి జీవితమంతా, నాకు తెలిసిన గొప్ప, అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో చాలా మంది బాగా సాత్వీకులు మరియు వినయంగలవారు.
వినయము మరియు సాత్వీకతకు దగ్గర సంబంధముంది. “హృదయమందు సాత్వీకులు మరియు దీనులు తప్ప ఎవడును దేవుని యెదుట అంగీకరించబడడు” 16 అని మనము జ్ఞాపకముంచుకోవాలి.
మనము వినయమనే సుగుణమును అవలంబించుట ద్వారా గర్వమనే ఆధ్యాత్మిక గ్రహణమును తప్పించుకోవడానికి ప్రయత్నిస్తామని నేను ప్రార్థిస్తున్నాను.
ముగింపు
ముగింపులో, సూర్య గ్రహణం నిజానికి ప్రకృతి యొక్క అద్భుతమైన దృగ్విషయం, ఈ సమయంలో సూర్యుని యొక్క సౌందర్యం, వెచ్చదనం మరియు కాంతి పూర్తిగా అతిచిన్న వస్తువుతో కప్పబడి చీకటి మరియు చల్లదనాన్ని కలిగిస్తుంది.
అలాంటి అద్భుతం ఒక ఆధ్యాత్మిక భావనతో పునరుత్పాదకమవుతుంది, లేకపోతే చిన్నవైన మరియు అనవసర విషయాలపై దృష్టి సారించినప్పుడు అవి యేసుక్రీస్తు సువార్త యొక్క సౌందర్యము, వెచ్చదనం మరియు స్వర్గపు వెలుగును అడ్డుకొని దాని స్థానంలో చల్లని చీకటిని భర్తీ చేస్తాయి.
సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడే ప్రాంతాల వారి చూపును రక్షించడానికి తయారుచేయబడిన కళ్ళజోళ్ళు శాశ్వత హానిని మరియు అంధత్వాన్ని కూడా నివారించగలవు. 17 సువార్త సూత్రాలు మరియు నియమాల యొక్క జ్ఞానం మరియు సాక్ష్యంతో కూడిన “సువార్త అద్దాలు” సువార్త దృక్పథాన్ని అందిస్తాయి, అది ఆధ్యాత్మిక గ్రహణం ఎదుర్కొన్న వారికి అదేమాదిరిగా గొప్ప ఆత్మీయ రక్షణను, స్పష్టతను అందించగలదు.
మీ జీవితంలో ఏదైనా సువార్త యొక్క ఆనందం మరియు వెలుగును అడ్డగిస్తున్నట్టుగా మీరు కనుగొంటే, దానిని సువార్త దృష్టితో చూడమని నేను ఆహ్వానిస్తున్నాను. సువార్త అద్దాల ద్వారా చూడండి మరియు జీవితంలో అనవసరమైన, అసంభవమైన విషయాలు గొప్ప సంతోష ప్రణాళిక పట్ల మీ నిత్య దృష్టిని చీకటి చేసేందుకు అనుమతించకుండా అప్రమత్తంగా ఉండండి. క్లుప్తంగా, జీవితపు కలవరములు స్వర్గపు కాంతికి గ్రహణం కానీయద్దు.
సాక్ష్యము
మన సువార్త వెలుగు యొక్క దృష్టిని ఎటువంటి అడ్డంకి అడ్డుకున్నప్పటికీ, అక్కడ ఇంకా వెలుగు ఉంటుందని సాక్ష్యమిస్తున్నాను. వెచ్చదనం, సత్యం మరియు ప్రకాశం యొక్క మూలం యేసుక్రీస్తు సువార్త. నేను ప్రేమగల పరలోకపు తండ్రిని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును, మన రక్షకుడిగా, విమోచకుడిగా ఆయన పాత్రను గురించి సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.