2010–2019
ముగ్గురు సహోదరిలు
అక్టోబర్ 2017


ముగ్గురు సహోదరీలు

మన శిష్యత్వమునకు మనమే బాధ్యులము, మరియు అది-- ఏ విషయములోనైనా ఇతరులు మనల్ని ఏవిధంగా పరిగణిస్తారో అనేదానితో దానికి సంబంధము లేదు.

ప్రియమైన స్నేహితురాళ్లు, ప్రియమైన సహోదరిలారా, ప్రపంచవ్యాప్త సహోదరీల సభతో సర్వసభ్య సమావేశము ప్రారంభించుట ప్రాముఖ్యమైనది, అద్భుతమైనది: అన్ని వయస్సులు, పూర్వపరాలు, జాతీయతలు, భాషలు కలిగిన సహోదరీలు ప్రభువైన యేసు క్రీస్తు యెడల ప్రేమ విశ్వాసములతో ఐక్యమగుటను ఊహించండి.

మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్‌ను మేము ఇటీవల కలిసినప్పుడు, ప్రభువును ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో మాకు వ్యక్తంచేసారు. అధ్యక్షులు మాన్సన్ మీ ప్రేమ, మీ ప్రార్థనలు మరియ ప్రభువు యెడల మీరు కలిగియున్న భక్తికి చాలా కృతజ్ఞత కలిగియున్నారని నాకు తెలియును.

చాలా కాలం క్రితం, సుదూర ప్రాంతములో ముగ్గురు సహోదరీలుగల ఒక కుటుంబము నివసించెను.

మొదటి సహోదరి విచారముగా ఉండెను. తనలో ఏదీ సరిగాలేదని ఆమె భావించింది. ఆమె మాట్లాడినప్పుడు, ఆమె మాటలు మొరటుగా ఉండి, ప్రజలు నవ్వేవారు. ఎవరైనా ఆమెను విమర్శించి లేదా దేనికైనా ఆహ్వానించడం “మరిచిపోతే” ఆమె సిగ్గుపడి, అక్కడినుండి వెళ్లి ఒక రహస్య స్థలమును కనుగొని, చిరునవ్వు కరువై జీవితమెందుకు ఇంత విషాదకరముగా ఉన్నదని అక్కడ విచారముతో నిట్టూర్చును.

రెండవ సహోదరి కోపిష్టి. ఆమె తెలివిగలదని తనలో తాను అనుకొనెను కాని పాఠశాలలో జరిగే పరీక్షలలో ఎల్లప్పుడు వేరొకరు ఎక్కువ మార్కులు తెచ్చుకొనేవారు. తనకు తాను తమాషాగా, అందముగా, మనోహరముగా, ఆకర్షణీయముగా ఉంటుందని అనుకొనేది. కాని అక్కడ ఎల్లప్పుడు వేరొకరు మరింత తమాషాగా, అందంగా, మనోహరముగా, ఆకర్షణీయంగా ఉన్నట్లు కనిపించేవారు.

ఆమె దేనిలోను ప్రథమ స్థానములో వచ్చేదికాదు మరియు దానిని ఆమె సహించలేకపోయింది. జీవితము ఈవిధంగా ఉండకూడదు కదా!

కొన్నిసార్లు ఆమె ఇతరులతో గొడవపడేది మరియు ఏదో ఒక కారణంతో కోపపడడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించేది.

ఇది ఆమెను ఇతరులు ఇష్టపడేలా లేదా ప్రజాదరణపొందేలా చెయ్యలేదనుకోండి. కొన్నిసార్లు ఆమె తన పండ్లుకొరుకుతు, పిడికిలి బిగించి, “జీవితము చాలా పక్షపాతి!” అని అనుకొన్నది.

తరువాత ఆ మూడవ సహోదరి ఉండెను. తన విచారము, కోపిష్టి సహోదరీల వలే కాక, ఆమె--చక్కగా, సంతోషముగా ఉండెను. అది ఆమె తన సహోదరీల కంటే అధిక తెలివితేటలు, ఎక్కువ అందము లేదా ఎక్కువ సామర్థ్యముల వలన కాదు. జనులు కొన్నిసార్లు ఆమెను కూడా లక్ష్యపెట్టేవారు కాదు. ఆమె ధరించే వాటిగురించి, ఆమె చెప్పేవాటి గురించి అపహాస్యము చేసేవారు. జనులు కొన్నిసార్లు ఆమె గురించి చులకనగా మాట్లాడేవారు. కాని అవేవి తనను ఎక్కువ బాధపెట్టుటకు ఆమె అనుమతించలేదు.

ఈ సహోదరికి పాడటం అంటే ఇష్టం. ఆమె చక్కగా పాడలేదు మరియు జనులు దానిగురించి నవ్వారు కాని అది ఆమెను ఆపలేకపోయింది. “ఇతరులు, వారి అభిప్రాయాలు నన్ను పాడకుండా చెయ్యడానికి నేను అనుమతించను!” అని ఆమె అనేది.

ఆమె పాడటం కొనసాగించిన కారణం తన మొదటి సహోదరిని విచారముగా మరియు రెండవ సహోదరిని పిచ్చిదానిగా చేసింది.

అనేక సంవత్సారాలు గడిచాయి, చివరకు ప్రతి సహోదరి ఈ భూమిమీద తన జీవితపు అంతమునకు చేరుకుంది.

ఈ జీవితములో నిరాశలకు కొదవలేదని పదే పదే కనుగొన్న మొదటి సహోదరి, చివరకు విచారముతో మరణించింది.

అయిష్టపడుటకు ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొన్న రెండవ సహోదరి, కోపముతో మరణించింది.

మూడవ సహోదరి తన పాటను తన పూర్ణ శక్తితో పాడుచు, తన ముఖముపైన ఆత్మవిశ్వాసము గల చిరునవ్వుతో గడిపి, ఆనందముగా మరణించింది.

ఈ కథలోని ముగ్గురు సహోదరీలవలె జీవితము ఎప్పుడూ ఇంత సరళముగా, జనులు ఇంత సాధారణంగాను, మార్పులేకుండా ఉండకపోవచ్చు. కాని విపరీతమైన ఈ ఉదాహరణలు మన గురించి మనకు ఎదోఒకటి బోధించగలదు. మనలో అనేకులవలే మీరుంటే, ఒక్కరు, ఇద్దరు లేదా బహుశా ఈ ముగ్గురు సహోదరీలలో మీలో కొంత భాగాన్ని మీరు గుర్తించి ఉండవచ్చును. ఒక్కొక్కరిని మనం దగ్గరగా పరిశీలిద్దాము.

బాధితురాలు

ప్రతిచర్య చూపించబడిన ఎవరో ఒకరివలె- మొదటి సహోదరి, తనకు తాను ఒక బాధితురాలిగా అనుకొన్నది.1 ఆమెకు ఒకదాని తరువాత మరొకటి జరుగుతూ ఉండడం వలన ఆమెను దుఃఖమునకు గురిచేసినట్లుగా అనిపించింది. జీవితము గురించి ఇటువంటి వైఖరి కలిగియుండటం వలన, ఆమె ఏవిధంగా భావించి, ప్రవర్తించిందో వాటివిషయమై ఇతరులకు అధికారమిచ్చుచుండెను. మనం ఆవిధంగా చేస్తే, మనం ప్రతీ అభిప్రాయమనే గాలిలో కొట్టుకొనిపోతాము-మరియు సామాజిక మాంధ్యము ఎల్లపుడు ఉన్న ఈ దినములో, ఆ గాలులు పెనుతుఫాను తీవ్రతతో వీస్తాయి.

ప్రియమైన సహోదరిలారా, మీగురించి, లేక మీ సంతోషము గురించి పట్టించుకోనీ ఎవరో ఒకరికి లేదా ఏదో గుంపునకు మీ సంతోషమును మీరెందుకు అప్పగించాలి?

ఇతరులు మీ గురించి ఏమని చెప్పుచున్నారో అని మదన పడుచున్నట్లైతే, ఈ విరుగుడును మీకు సలహా ఇవ్వనా: మీరెవరో గుర్తుచేసుకోండి. మీరు దేవుని రాజ్యము యొక్క రాజగృహమునకు చెందినవారు, లోకాన్నంతటిని ఏలుచున్న పరలోకపు తల్లిదండ్రులకు కుమార్తెలు.

దేవుని యొక్క ఆత్మీయ డిఎన్ఏను మీరు కలిగియున్నారు. మీ ఆత్మీయ సృష్టినుండి ఉద్భవించిన ప్రత్యేకమైన వరములను మీరు కలిగియున్నారు మరియు అవి మీ పూర్వమర్త్య జీవితము యొక్క విస్తార నిడివిలో అభివృద్ధి చెందాయి. కరుణగల, నిత్యుడైన మన పరలోకపు తండ్రి యొక్క బిడ్డవు నీవు, ఆయన సైన్యములకు అధిపతి, విశ్వమును సృష్టించి, అనంత విశ్వములో గిరగిర తిరుగుచున్న నక్షత్రములను వ్యాపింపజేసి, గ్రహాలను వాటి నియమిత కక్ష్యలలో ఉంచెను.

మీరు ఆయన హస్తములలో ఉన్నారు.

మిక్కలి శ్రేష్టమైన హస్తములు.

ప్రేమగల హస్తములు.

సంరక్షించే హస్తములు.

మీ గురించి ఎవరేమి చెప్పినా, దానిని మార్చలేదు. మీ గురించి దేవుడు చెప్పిన దానితో పోలిస్తే వారి మాటలు అర్థరహితమైనవి.

మీరు ఆయన ప్రశస్తమైన బిడ్డ.

ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.

నువ్వు తడబడినప్పుడు, ఆయన నుండి ప్రక్కకు తిరిగినప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు తప్పిపోయినట్లు, విడిచిపెట్టబడినట్లు లేదా మరిచిపోబడినట్లు భావిస్తే--భయపడవద్దు. మంచి గొఱ్ఱెల కాపరి నిన్ను కనుగొనును. ఆయన నిన్ను తన భుజములపైన ఎత్తుకొనును. ఆయన నిన్ను ఇంటికి తీసుకొని వెళ్లును.2

ప్రియమైన సహోదరిలారా, దయచేసి ఈ దివ్యమైన సత్యములు మీ హృదయాలలో లోతుగా నాటుకొననియ్యుడి. అప్పుడు విచారములేకుండా ఉండుటకు అనేక కారణాలు ఉన్నాయని మీరు కనుగొందురు, ఏలయనగా నెరవేర్చుటకు మీరు నిత్య గమ్యమును కలిగియున్నారు.

లోకము యొక్క ప్రియ రక్షకుడు తన ప్రాణమును ఇచ్చెను తద్వారా ఆ గమ్యమును మీరు నిజము చేయుటకు ఎన్నుకొందురు. ఆయన వలన, మీరు నిత్యమహిమతో మిమ్మును మీరు అలంకరించుకొనగలరు.

ద్వేషకురాలు

రెండవ సహోదరి లోకముపైన కోపముగా ఉండెను. తన విచారకరమైన సహోదరి వలె, తన జీవితములోని సమస్యలు ఇతరుల వలన కలిగినవని ఆమె భావించింది. ఆమె తన కుటుంబాన్ని, తన స్నేహితులను, తన పైఅధికారిని, తోటి పనివారిని, రక్షకభటులను, పొరుగువారిని, సంఘ నాయకులను, ప్రస్తుత నాగరిక శైలులను, సూర్యుని అగ్నిజ్వాలల తీవ్రతను, సరళమైన దురదృష్టాన్ని కూడా నిందించింది. ఆమె వారందరితో వాగ్వివాదానికి దిగేది.

చెడు వ్యక్తి అని ఆమె తన గురించి అనుకోలేదు. దానికి బదులు ఆమె తనను తాను సమర్దించుకొనుచున్నానని ఆమె భావించింది. ఆమె నమ్మిన వారందరు స్వార్ధము, అనవసరమైన వాటిపైన దృష్టిపెట్టడం మరియు ద్వేషముచేత ప్రేరేపించబడ్డారు. దానికి విరుద్ధముగా ఆమె-న్యాయము, చిత్తశుద్ధి మరియు ప్రేమ వంటి మంచి ఉద్దేశములచేత ప్రేరేపించబడింది.

దురదృష్టవశాత్తు, ఆ కోపిష్ఠి సహోదరి యొక్క ఆలోచనా విధానము సర్వసామాన్యమైనది. ఇటీవల జరిగిన అధ్యయనములో అది గమనించబడింది, అది విరోధ సమూహముల మధ్య వివాదమును పరిశోధించింది. ఆ అధ్యయనములో, తూర్పు మధ్యస్త ప్రదేశములో పాలస్తీనీయులు మరియు ఇశ్రాయేలీయులను, సంయుక్త రాష్ట్రాలలో రిపబ్లికన్లు మరియు డిమోక్రట్లను పరిశోధకులు ఇంటర్వూ చేసారు. “ఇరువైపులా తమ సమూహము ద్వేషము కంటే ప్రేమ వలనే ప్రేరేపించబడ్డారని భావించారు, కాని వారి విరోధ సమూహము ఎందుకు వివాదములో పాల్గొన్నారని అడిగినప్పుడు, ద్వేషమే వారి ప్రేరేపణకు కారకమని [వారు] [ఇతర] సమూహమును వేలెత్తి చూపించారు.”3

మరొక విధంగా చెప్పాలంటే, ప్రతి సమూహము తమను తాము “మంచివారు” అని-న్యాయము, దయ, విశ్వాసముగలవారిగా తలంచారు. దానికి వ్యతిరేకంగా, వారి విరోధ సమూహమును, “చెడ్డవారు” అని-అజ్ఞానులు, నిజాయితీ లేనివారు, చెడ్డవారిగా కూడా చూసారు.

నేను పుట్టిన సంవత్సరములో, ప్రపంచము భయంకరమైన యుద్ధములో మునిగియుంది, అది బాధాకరమైన దుఃఖాన్ని, దహించివేసే వేదనను కలిగించింది. ఈ యుద్ధము నా దేశానికి చెందిన ప్రజల సమూహము చేత మొదలు పెట్టబడింది-జనులు ఎవరైతే నిర్దిష్టమైన ఇతర సమూహములను చెడ్డవారిగా కనుగొని, వారి యెడల ద్వేషమును ప్రోత్సాహించారు.

వారికి నచ్చనివారిని వారు నిశ్శబ్ధపరిచారు. వారిని అవమానపరచి, చెడ్డవారిగా వారిపైన ముద్రవేసారు. వారు నీచమైనవారని-మనుష్యులకంటే తక్కువ వారని పరిగణించారు. ఒక ప్రజాసమూహమును మీరు అవమానపరిస్తే, వారికి విరోధముగా హింసాత్మకమైన మాటలు, క్రియలు న్యాయమైనవిగా ఎంచే అవకాశమున్నది.

ఈ వైఖరుల వలన 20వ శతాబ్ధములో జర్మనీలో ఏమి జరిగిందో ఆలోచించుటకు నేను భయంతో వణుకుతాను.

ఎవరైనా మనల్ని వ్యతిరేకించినా లేదా విభేదించినా, వారిలో ఏదో లోపమున్నదని మనం అనుకొనుటకు శోధించబడతాము. అక్కడనుండి వారి మాటలు, క్రియలకు నీచమైన ఉద్దేశాలను జతచేయడానికి ఒక్కమెట్టు చాలు.

మనం ఎల్లప్పుడు న్యాయమువైపు నిలబడాలి మరియు ఆ హేతువు కొరకు కొన్నిసార్లు మన స్వరములెత్తాలి. ఐనప్పటికీ, కోపముతోనో లేదా మన హృదయాలలో ద్వేషముతోనో ఆవిధంగా చేస్తే- ఇతరులను గాయపరచుటకు, అవమానించుటకు లేదా మౌనపరచుటకు మనం వారిని దూషిస్తే-దానిని మనం నీతియందు చేయకపోయే అవకాశాలు ఉన్నాయి.

రక్షకుడు మనకు ఏమి బోధించారు?

“నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి.

“మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి:”4

ఇది రక్షకుని మార్గము, లోకములో ఎంతో కోపమును, ద్వేషమును, విభజనను, హింసను సృష్టించే అడ్డంకులను ఛేదించే మొదటి మెట్టు ఇదే.

“అవును,” “నా శత్రువులు నన్ను ప్రేమించుటకు సమ్మతిస్తే మాత్రమే-నా శత్రువులను నేను ప్రేమించుటకు సమ్మతిస్తాను” అని మీరు అనవచ్చు.

కాని ఇది నిజంగా ముఖ్యము కాదు, అవునా? మన శిష్యత్వమునకు మనమే బాధ్యులము, మరియు ఏ విషయములోనైనా ఇతరులు మనల్ని ఏవిధంగా పరిగణిస్తారో అనేదానితో దానికి ఏ సంబంధము లేదు. వారు బదులుగా అర్థము చేసుకొని, దాతృత్వము కలిగి ఉంటారని మనం ఖచ్చితముగా ఆశిస్తాము, కాని వారియెడల మన ప్రేమ, మన యెడల వారికున్న భావాలకు స్వతంత్రముగా ఉన్నది.

ఒకవేళ మన శత్రువులను ప్రేమించాలన్న మన ప్రయత్నాలు వారి హృదయాలను శాంతింపజేసి, మంచి చేయుటకు వారిని ప్రభావితము చేయవచ్చును. ఒకవేళ ప్రభావితం చేయకపోవచ్చును. కాని యేసు క్రీస్తును వెంబడించుటకు మన నిబద్ధతను అది మార్చదు.

కాబట్టి, యేసు క్రీస్తు సంఘ సభ్యులుగా మనం మన శత్రువులను ప్రేమిస్తాము.

కోపాన్ని లేదా ద్వేషాన్ని మనం జయిస్తాము.

దేవుని పిల్లలందరి యెడల ప్రేమతో మన హృదయాలను నింపుకుంటాము.

“[మనల్ని] ద్వేషముతో ఉపయోగించుకొని, [మనల్ని] హింసించే” 5 వారితో సహా-ఇతరులను దీవించి, పరిచర్య చేయుటకు వారిని మనం సమీపిస్తాము.

యథార్థమైన శిష్యురాలు

మూడవ సహోదరి యేసు క్రీస్తు యొక్క యథార్ధమైన శిష్యురాలిని సూచిస్తుంది. చేయుటకు అతి కష్టమైనదానిని ఆమె చేసింది-అవమానకర సమయములో కూడా ఆమె దేవుని నమ్మింది. ఆమె చుట్టూ హేళన, క్రూరభావాలు ఉన్నప్పటికి, ఏదోవిధంగా ఆమె తన విశ్వాసాన్ని, నిరీక్షణను కాపాడుకుంది. ఆమె పరిస్థితులు సంతోషంగా ఉండటం వలన కాదు, కాని సంతోషంగా ఉండటం వలన- ఆమె సంతోషముగా జీవించింది.

వ్యతిరేకత లేకుండా మనమెవరము ఈ జీవితపు ప్రయాణమును కొనసాగించలేము. మనల్ని ప్రక్కకు నెట్టుటకు ప్రయత్నించే అనేక బలాలు ఉండగా, విశ్వాసులకు వాగ్దానము చెయ్యబడిన మహిమకరమైన సంతోషము పైన ఏవిధంగా మన దృష్టిని సారించగలము?

వేల సంవత్సరాల క్రితం ఒక ప్రవక్తకు కలిగిన కలలో సమాధానమును కనుగొనగలమని నేను నమ్ముచున్నాను. ఆ ప్రవక్త పేరు లీహై, ఆయన కల మోర్మన్ గ్రంథములో నమోదు చేయబడింది.

తన కలలో, లీహై ఒక విశాలమైన మైదానమును చూసెను-దానిలో ఒక అద్భుతమైన చెట్టు, అందముగా, వర్ణనాతీతముగా ఉండెను. గొప్ప జన సమూహములు ఆ చెట్టువైపు ప్రయాణించడం ఆయన చూసెను. దానియొక్క మహిమకరమైన ఫలాన్ని రుచి చూడాలని వారు అనుకున్నారు. అది వారికి గొప్ప సంతోషమును, నిరంతర శాంతిని ఇస్తుందని వారు భావించారు మరియు నమ్మారు.

ఆ చెట్టువైపుకు నడిపించే ఇరుకైన మార్గము కలదు, దాని ప్రక్కన ఒక ఇనుప దండము కలదు, అది వారు ఆ మార్గములో నిలిచి ఉండుటకు సహాయపడింది. కాని అక్కడ చీకటి యొక్క పొగమంచు ఆ మార్గము మరియు ఆ చెట్టు యెడల వారి కనుదృష్టిని మూసివేసింది. అంతకంటే ప్రమాదకరమైనది బహుశా సమీపములో నున్న పెద్దది, విశాలమైన భవనము నుండి వచ్చుచున్న గట్టినవ్వు, హేళన. విభ్రాంతికరమైన విషయమేమిటంటే, ఆ చెట్టు దగ్గరకు వెళ్లి, దాని అద్భుతమైన ఫలమును తిన్నవారిలో కొందరిని కూడా ఆ హేళన సిగ్గుపడి, దారితప్పిపోవుటకు ఒప్పించింది. 6

ఒకవేళ ఆ చెట్టు ఒకప్పుడు వారు ఊహించనంత అందంగా లేదని వారు సందేహించడం మొదలుపెట్టి ఉండవచ్చును. ఒకవేళ వారు అనుభూతిచెందిన దాని యొక్క యదార్థతను వారు ప్రశ్నించుటకు మొదలు పెట్టి ఉండవచ్చును.

వారు ఆ చెట్టునుండి దూరంగా వెళ్లిపోతే, జీవితము సులభముగా ఉంటుందని వారు అనుకొని ఉండవచ్చు. వారు ఇక ఎంతమాత్రము హేళన చేయబడి లేదా అపహాస్యము చేయబడకుండా ఉండవచ్చును.

నిజానికి, వారిని హేళన చేయుచున్నజనులు చాలా సంతోషముగాను, ఉల్లాసముగాను ఉన్న జనులవలె కనిపించారు. కాబట్టి, ఒకవేళ వారు ఆ చెట్టును విడిచిపెడితే, ఆ గొప్ప విశాలమైన భవనములోని జనసమూహములోనికి ఆహ్వానించబడి, వారి వివేచన, తెలివితేటలు, బుద్ధికుశలతలకు చప్పట్లు కొట్టబడునేమో.

త్రోవలో నిలువుము

ప్రియమైన సహోదరిలారా, ప్రియమైన స్నేహితులారా, ఇనుప దండమును గట్టిగాపట్టుకొని, రక్షణవైపు స్థిరముగా నడుచుట మీకు కష్టముగా అనిపించినప్పుడు; ఇతరుల యొక్క అపహాస్యము, హేళన చాలా ధైర్యముగా కనిపించి, మీరు తడబడేలా చేసినట్లైతే; జవాబులు ఇవ్వబడని ప్రశ్నలు, ఇంకా అర్థముకాని సిద్ధాంతముల గురించి మీరు కలవరపడితే; నిరాశల వలన మీరు విచారమును కలిగియుంటే, లీహై కలను మీరు జ్ఞాపకము చేసుకోవాలని నేను అర్ధిస్తున్నాను.

త్రోవలో నిలువుము!

దేవుని వాక్యమైన-ఇనుపదండమును మీరు ఎప్పటికి విడిచిపెట్టవద్దు!

దేవుని ప్రేమలో పాలుపంచుకొన్నందుకు ఎవరైనా మిమ్మల్ని సిగ్గుపడేలా చేయుటకు ప్రయత్నిస్తే, వారిని పట్టించుకోవద్దు.

మీరు దేవుని బిడ్డ అని మరచిపోవద్దు; గొప్ప దీవెనలు దాచిపెట్టబడి ఉన్నాయి; ఆయన చిత్తాన్ని చెయ్యడం మీరు నేర్చుకుంటే, మీరు మరొకసారి ఆయనతో జీవిస్తారు!7

లోకము చేసే పొగడ్త మరియు అంగీకారభావమనే వాగ్దానాలు ఆధారపడలేనివి, అసత్యమైనవి మరియు అసంతృప్తికరమైనవి. దేవుని వాగ్దానాలు- ఇప్పటికి, ఎప్పటికి నిశ్చయమైనవి, సత్యమైనవి మరియు సంతోషకరమైనవి.

మతము, విశ్వాసములను ఉన్నత వైఖరితో పరిగణించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడం వలన కలిగే ఫలముతో ఆ గొప్ప విశాలమైన భవనము ప్రతిపాదించేది ఏదీ పోల్చదగినది కాదు.

నిజంగా, “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.”8

యేసు క్రీస్తు యొక్క సువార్తలో శిష్యత్వమునకు దారి సంతోషానికి మార్గమని నాకు నేను నేర్చుకున్నాను. అది భద్రతకు, శాంతికి మార్గము. అది సత్యమునకు మార్గము.

పరిశుద్ధాత్మ యొక్క వరము మరియు శక్తిచేత, మీయంతట మీరు దీనిని నేర్చుకోగలరని నేను సాక్ష్యమిస్తున్నాను.

ఈలోపు, ఆ దారి మీకు కష్టముగా మారితే, సంఘములో మన అద్భుతమైన సంస్థలైన-ప్రాథమిక, యువతులు, ఉపశమన సమాజములలో మీరు ఆశ్రయమును, బలమును పొందుతారని నేను ఆశిస్తున్నాను. అవి మార్గములో విశ్రాంతి స్థలాలవలె ఉన్నాయి, ముందున్న ప్రయాణానికి మీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని అక్కడ మీరు తిరిగి నూతన పరుచుకోవచ్చును. అవి సురక్షితమైన గృహము అక్కడ మీరు ఒక అనుబంధ భావాన్ని భావించి, మీ సహోదరీలు, తోటి శిష్యురాళ్ళనుండి ప్రోత్సాహాన్ని పొందవచ్చును.

ప్రాథమికలో మీరు నేర్చుకొన్న సంగతులు, ఒక యువతిగా మీరు నేర్చుకొను అదనపు సత్యాలకు మిమ్మల్ని సిద్ధపరుస్తాయి. మీ యువతుల తరగతులలో మీరు నడిచే శిష్యత్వపు దారి ఉపశమన సమాజములో సహవాసానికి, సహోదరి భావమునకు నడిపిస్తుంది. మార్గము వెంబడి వేయు ప్రతి అడుగుతో, జాలి, దాతృత్వము, సేవా కార్యముల ద్వారా ఇతరుల కొరకు మీకున్న ప్రేమను ప్రదర్శించుటకు మీకు అదనపు అవకాశాలు ఇవ్వబడతాయి.

ఈ శిష్యత్వపు మార్గమును ఎన్నుకొనుట మనకు చెప్పలేని సంతోషానికి, సంతృప్తికి దారితీస్తుంది.

అది సులువుగా ఉండదు. దానికి మీకున్న దానిలో శ్రేష్టమైనది -మీ మేధస్సు, సృజనాత్మకత, విశ్వాసము, నిష్కపటము, బలము, పట్టుదల మరియు ప్రేమ అవసరము. కాని ఒకరోజు మీరు చేసిన ప్రయత్నాలను వెనుదిరిగి చూసి, మీరు బలంగా ఉండి, నమ్మకముగా ఉండి, దారినుండి తొలగిపోనందుకు ఎంతో కృతజ్ఞతను కలిగియుంటారు.

ముందుకు సాగండి

జీవితములో చాలా విషయాలు మీ అదుపులో ఉండకపోవచ్చు. కాని చివరకు, మార్గములో మీ గమ్యాన్ని, మీ అనుభవాలలో చాలావాటిని ఎంచుకొనుటకు మీరు శక్తిని కలిగి ఉంటారు. అది చాలావరకు మీ సామర్థ్యాల వలన కాదు, మీ ఎంపికల వలన మీ జీవితములో మార్పును తెస్తుంది.9

మీ పరిస్థితులు మీకు విచారాన్ని కలిగించుటను మీరు అనుమతించలేరు.

మీకు కోపాన్ని తెప్పించడానికి వాటిని మీరు అనుమతించలేరు.

నీవు దేవుని కుమార్తెవు గనుక నీవు సంతోషించవచ్చును. దేవుని కరుణలోను, యేసు క్రీస్తు యొక్క ప్రేమలోను నీవు ఆనందాన్ని కనుగొనగలవు.

నీవు ఆనందముగా ఉండవచ్చు.

దేవుని యొక్క విస్తారమైన, అపరిమితమైన మంచితనానికి మీ హృదయాలను కృతజ్ఞతతో నింపుకోమని మీకు విజ్ఞప్తిచేస్తున్నాను. నా ప్రియమైన సహోదరిలారా, మీరు దీనిని చెయ్యగలరు! జీవ వృక్షమువైపు ముందుకు సాగుటకు మీరు ఎన్నుకుంటారని నా ఆత్మయొక్క పూర్ణ ఆప్యాయతతో నేను ప్రార్థిస్తున్నాను. ఈ లోకానికి యేసు క్రీస్తు సువార్త మరియు ఆయన సంఘము తీసుకొనివచ్చు అద్భుతాలయందు, దేవుని ప్రేమయందు ఆనందించుచు, మీ స్వరమెత్తి, మీ జీవితమును మహిమకరమైన స్వరసమ్మేళనముగా చేసుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను.

నిజమైన శిష్యత్వము యొక్క పాట కొంతమందికి అపశృతిగా లేదా కొంచెం గట్టిగా వినిపించవచ్చును. ఆదినుండి కూడా ఆవిధముగా ఉండెను.

కాని మన పరలోక తండ్రికి, ఆయనను ప్రేమించి, ఘనపరిచే వారికి-అది అత్యంత అమూల్యమైన పాట-దేవునికి, తోటివానికి విమోచించే ప్రేమ మరియు సేవ యొక్క మనోహరమైన, పవిత్రపరచు పాట. 10

శిష్యత్వపు మహిమకరమైన త్రోవలో ప్రతిరోజు సంతోషముగా నడుస్తూ, దేవుని కుమార్తెగా ఆనందముతో వర్ధిల్లుటకు మీరు బలాన్ని కనుగొంటారని ప్రభువు యొక్క అపొస్తలునిగా నేను నా దీవెనను మీకు ఇస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.

ముద్రించు