నిత్య సంగతులు
వినయ౦గా మనము ఎవరో, మన కొరకు దేవుని ఉద్దేశ్యమేమిటో తెలుసుకోవడ౦ ఎ౦తో ఆవశ్యకమైనది.
బ్రిటీష్ మిషనులో యువకుడిగా ఉన్నప్పటినుండి, నేను బ్రిటీష్ హాస్యాన్ని ఆనందించాను. కొన్నిసార్లు అది జీవితంలో స్వీయ నింద, నిరాడంబరమైన, వినయపూర్వకమైన విధానం ద్వారా వర్గీకరించబడుతుంది. వేసవి ఎలా చిత్రీకరించబడిందో అనేది దీనికి ఒక ఉదాహరణ. బ్రిటీష్ వేసవికాలాలు చాలా చిన్నవి మరియు అనూహ్యమైనవి. “నేను బ్రిటీష్ వేసవిని ప్రేమించాను. ఇది సంవత్సరంలో నా అభిమాన రోజు”1 అని ఒక రచయిత పరిహాసంగా చెప్పాడు. నా అభిమాన బ్రిటీష్ వ్యంగ చిత్రంలో ఒక పాత్ర, ఉదయకాలాన ఆలస్యముగా నిద్ర లేచి తన కుక్కలతో ఇలా చెప్పింది, “ఓహ్!! మనము ఎక్కువ సేపు పడుకున్నాము అనుకుంటా, వేసవిని కోల్పోయాము.”2
ఈ సుందరమైన భూమిపై మన జీవితానికి ఈ హాస్యంలో ఒక సారూప్యత ఉంది. మన అమూల్యమైన మర్త్య ఉనికి చాలా తక్కువ సమయమని లేఖనాలలో స్పష్టంగా ఉన్నది. నిత్యదృష్టితో చూచినట్లైతే, ఈ భూమి మీద మన జీవితం అనేది ఒక బ్రిటీష్ వేసవిలాంటిది.3
కొన్నిసార్లు మనిషి యొక్క ఉద్దేశ్యం మరియు అతని ఉనికి అనేవి చాలా అణకువ కలిగిన పదాలతో వివరించబడ్డాయి. ప్రవక్త అయిన మోషే పెరిగిన వాతావరణాన్ని కొందరు ఈ రోజులలో విశేష నేపథ్యము కలిగిన చోటు అంటారు. గొప్ప వెలగల ముత్యములో నమోదు చేయబడినట్లుగా ప్రభువు, తన ప్రవచనాత్మక నియామకం కోసం మోషేను సిద్ధం చేస్తున్నప్పుడు, అతనికి క్లుప్తంగా ప్రపంచాన్ని మరియు మనుష్యులందరి యొక్క సృష్టిని గూర్చి వివరించారు.4 “ఇప్పుడు. . . నరుడు వట్టివాడు, ఈ విషయమును నేనెన్నడూ తలంచలేదు”, 5 అని మోషే ఆశ్చర్యపోయాడు.
తదనుగుణంగా దేవుడు, మోషే అనుభవించిన భిన్నమైన భావాలకు సంబంధించి తన నిజమైన ఉద్దేశ్యాన్ని ఇలా ప్రకటించారు: “మనిషికి అమర్త్యత్వాన్ని, నిత్యజీవితాన్ని తీసుకురావడమే నా కార్యము మరియు మహిమయైయున్నది.”6
దేవుని ముందు మనమందరము సమానమే. ఆయన సిద్ధాంతము చాలా స్పష్టంగా ఉన్నది. మోర్మన్ గ్రంథములో మనము ఇలా చదువుతాము, “నల్లవాడు మరియు తెల్లవాడు, దాసుడు మరియు స్వతంత్రుడు, పురుషుడు మరియు స్త్రీ అందరూ దేవునికి సమానమే.”7 ఆ ప్రకారమే అందరూ కూడా ప్రభువు దగ్గరకు రావాలని ఆహ్వానించబడ్డారు.8
తండ్రి యొక్క ప్రణాళికలో ఎవరైతే జాతి, లింగ, జాతీయత, భాష, లేదా ఆర్థిక పరిస్థితుల వంటి లక్షణాల మూలంగా ఆధిపత్యం కోరుకుంటారో వారు నైతికంగా తప్పు చేస్తున్నారు మరియు వారు తండ్రి యొక్క పిల్లలందరి కొరకు ప్రభువు యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని గ్రహించలేదు.9
దురదృష్టవశాత్తు, ఈ రోజులలో దాదాపు సమాజంలోని ప్రతి భాగంలో దేవుని పట్ల వినయము మరియు జవాబుదారీతనం తక్కువ చేయబడుతూ, స్వయం-ప్రాముఖ్యత మరియు అహంకారం ప్రదర్శించబడడాన్ని మనము చూస్తున్నాము. సమాజంలో చాలామందికి సాధారణ సత్యాలు అర్థం కావు మరియు మనం ఈ భూమిపై ఎందుకు ఉన్నామో అర్థం కాదు. నిజమైన వినయము అనేది మన కొరకు ప్రభువు యొక్క ఉద్దేశ్యాన్ని సాధించడానికి అవసరము, మరియు అది అరుదుగా కనబడుతుంది.10
లేఖనాలలో ఉదహరించబడిన విధంగా క్రీస్తు యొక్క వినయము, నీతి, స్వభావము మరియు జ్ఞానము యొక్క గొప్పతనమును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రోజువారీ ప్రాతిపదికన క్రీస్తు వంటి లక్షణాలు మరియు స్వభావాలు, ముఖ్యంగా వినయము అనే లక్షణము గురించి నిరంతరాయంగా కృషి చేయాల్సిన అవసరాన్ని తక్కువగా అంచనా వేయడము మూర్ఖత్వమవుతుంది.11
ఈ జీవితం సాపేక్షంగా చిన్నగా ఉన్నప్పటికీ, అది చాలా ముఖ్యమైనది అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. మోర్మన్ గ్రంథంలో ఆల్మా యొక్క మిషనరీ సహచరుడైన అమ్యులెక్ ఇలా అన్నాడు, “ఈ జీవితము దేవుని కలుసుకొనుటకుమనుష్యులు సిద్ధపడు సమయమైయున్నది. అవును, ఇదిగో ఈ జీవితము యొక్క దినము మనుష్యులు వారి పనులు చేయు దినము.”12 నా వ్యంగ చిత్రంలో పాత్రలాగా, ఈ జీవితమంతా నిద్రపోవాలని మనము కోరుకోము.
రక్షకుని వినయము మరియు మానవజాతి కొరకు త్యాగముల మాదిరి చరిత్రలో అత్యంత లోతైన సంఘటన. దేవత్వము యొక్క సభ్యునిగా రక్షకుడు, ఒక సాధారణమైన శిశువుగా భూమిపైకి రావడానికి మరియు తన ఉనికిని ఆరంభించడానికి సమ్మతించారు, అందులో తన సహోదర సహోదరీలకు బోధించడం, స్వస్థపరచడం, చివరికి గెత్సేమనేలో మరియు సిలువమీద తన ప్రాయశ్చిత్తాఃన్ని పరిపూర్ణము చేయడానికి వర్ణించలేని నొప్పిని భరించడం వంటివి ఉన్నాయి. క్రీస్తు ప్రేమ మరియు వినయం యొక్క ఈ చర్యను ఆయన నమ్రతగా పిలుస్తారు.13 దేవుడు సృష్టించిన లేదా సృష్టించబోయే ప్రతి మనిషి గురించి రక్షకుడు ఈ త్యాగాన్ని చేసారు.
మన పరలోకపు తండ్రి తన పిల్లలను నిరుత్సాహపరచాలని లేదా సిలెస్టియల్ మహిమాన్వేషణలో వారిని వదిలివేయాలని కానీ కోరుకోరు. మనము నిజంగా తండ్రియైన దేవుడు మరియు కుమారుడైన క్రీస్తు ఎవరో, మన పక్షాన వారు ఏమి చేసారో ఆలోచిస్తే, ఆ ఆలోచన మనల్ని భక్తితో, ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో మరియు వినయంతో నింపుతుంది.
తన సంఘమును స్థాపించుటలో ప్రభువుకు సహాయపడుటకు వినయము ఆవశ్యకము
ఆల్మా తన రోజులలో ఒక ప్రశ్న అడిగారు, అది ఈనాటికి కూడా వర్తిస్తుంది: “మీరు హృదయం యొక్క మార్పును అనుభవించిన యెడల మరియు విమోచించు ప్రేమ గీతమును పాడవలెనని మీకనిపించిన యెడల,నేను అడుగుచున్నాను, ఇప్పుడు మీరు ఆలాగున భావించగలరా?”14 “ఈ సమయమున మరణించుటకు మీరు పిలువబడిన యెడల. . . మీ యందు మీరు తగినంతగా తగ్గింపు కలిగియున్నారని మీరు చెప్పగలరా?” అని ఆల్మా కొనసాగించారు.15
చిన్నవాడగు ఆల్మా గురించి నేను చదివిన ప్రతిసారీ, అతడు దేవుని వాక్యమును ప్రకటించుటకు రాష్ట్ర నాయకుడిగా తన పాత్రను విడిచిపెట్టడం16 అనేది నన్ను బాగా ఆకట్టుకుంది. ఆల్మా స్పష్టంగా తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తు గురించి గొప్ప సాక్ష్యం కలిగియుండి, పూర్తిగా మరియు మర్మము లేకుండా వారికి జవాబుదారిగా భావించారు. ఆయన సరైన ప్రాధాన్యతలను కలిగి ఉన్నారు, తన స్థితిని మరియు స్థానాన్ని వదిలివేయడానికి కావలసిన వినయాన్ని కలిగి ఉన్నారు, ఎందుకంటే దేవునికి సేవ చేయడము చాలా ప్రాముఖ్యమైనదని ఆయన గ్రహించారు.
సంఘమును స్థాపించడంలో సహాయం చేయడానికి మన జీవితాల్లో తగినంత వినయం కలిగి ఉండటం ప్రత్యేకించి విలువైనది. సంఘ చరిత్రలో ఒక ఉదాహరణ దీనిని తెలియజేస్తుంది. జూన్ 1837 లో, కర్ట్లాండ్ దేవాలయంలోఉండగా, “ఇంగ్లాండుకు ... సువార్తను తీసుకువెళ్ళడానికి ... మరియు ఆ దేశానికి రక్షణ ద్వారాన్ని తెరవడానికి”17 అపొస్తలుడైన హీబర్ సి. కింబల్ గారిని పిలవాలని ప్రవక్త జోసెఫ్ ప్రేరేపించబడ్డారు. అపొస్తలుడైన ఓర్సన్ హైడ్ మరియు కొద్దిమంది ఇతరులు ఆయనతో పాటుగా వెళ్ళడానికి నియమించబడ్డారు. ఎల్డర్ కింబల్ గారి స్పందన గమనార్హమైనది. “అలాంటి ఒక ముఖ్యమైన మిషనుకు నియమించబడుతున్నానన్న ఆలోచన నేను భరించగల దాని కంటే ఎక్కువగా ఉంది. ... నా మీద ఉంచబడిన భారం కింద మునిగిపోవడానికి దాదాపు నేను సిద్ధంగా ఉన్నాను.”18 అయినప్పటికీ, ఆయన సంపూర్ణ విశ్వాసం, నిబద్ధత మరియు వినయంతో ఈ మిషనును చేపట్టారు.
కొన్నిసార్లు వినయం అనేది మనము తగమని భావించినప్పటికీ పిలుపును అంగీకరించడమే. కొన్నిసార్లు వినయం అనేది మరింత గొప్ప పని చేయడానికి మనకు సామర్థ్యం ఉందని భావించినప్పటికీ, అప్పగించిన దానిని విశ్వాసముతో చేయడమే. మనము ఎక్కడ సేవ చేస్తున్నామని కాదు గాని ఎంత విశ్వాసముతో సేవ చేస్తున్నామనేది ముఖ్యమని వినయస్థులైన నాయకులు మాటలతో మరియు మాదిరితో నిరూపించారు.19 కొన్నిసార్లు వినయం అనేది మన నాయకులు లేదా ఇతర సభ్యులు మనల్ని బాధపెట్టారని భావించినప్పుడు, ఆ నొచ్చిన భావాలను అధిగమించడమే.
1837, జూలై 23న ప్రవక్త జోసెఫ్ పన్నెండుమంది కోరము అధ్యక్షుడైన థామస్ బి. మార్ష్ ను కలిసారు. అతనిని సంప్రదించకుండానే ఇంగ్లండుకు వెళ్లమని పన్నెండు మంది సభ్యులలో ఇద్దరు సభ్యులను ప్రవక్త పిలిచారని ఎల్డర్ మార్ష్ స్పష్టంగా విసుగుచూపారు. జోసెఫ్, ఎల్డర్ మార్ష్ ను కలుసుకున్నప్పుడు నొచ్చుకున్న భావాలు పక్కన పెట్టబడ్డాయి, మరియు ప్రవక్త ఒక అద్భుతమైన బయల్పాటును అందుకున్నారు. ఇప్పుడు అదిసిద్ధాంతము మరియు నిబంధనల యొక్క 112 వ ప్రకరణముగా ఉంది.20 అది వినయం మరియు మిషనరీ పనికి సంబంధించి పరలోకము నుండి నమ్మశక్యంకాని నడిపింపును ఇస్తుంది. అందులో 10 వ వచనము ఇలా చెప్తుంది, “నిన్ను నీవు తగ్గించుకొనుము; నీ దేవుడైన ప్రభువు చేయి పట్టుకొని నిన్ను నడిపించును, నీ ప్రార్థనలకు సమాధానమిచ్చును.”21
ఎల్డర్ కింబల్, హైడ్ మరియు జాన్ గుడ్సన్ లు వినయంతో నిండియుండి, సరిగ్గా ఇంగ్లాండులోని ప్రిస్టన్ లో ఉన్న వాక్స్హాల్ సంఘ భవనంలో యేసుక్రీస్తు సువార్త యొక్క పునరుద్ధరణను ప్రకటించుచున్న అదే రోజున ఈ బయల్పాటు ఇవ్వబడింది. 22 ఈ యుగములో ఉత్తర అమెరికా వెలుపల మిషనరీలు పునరుద్ధరించబడిన సువార్తను ప్రకటించడం ఇదే మొదటిసారి. వారి మిషనరీ కృషి ఫలితముగా వెంటనే పరివర్తన బాప్తీస్మములు జరిగాయి మరియు అది అనేక మంది విశ్వాసులైన సభ్యులవైపు నడిపించింది.23
బయల్పాటులోని తర్వాతి భాగాలు మన కాలంలో మిషనరీ ప్రయత్నానికి దారి చూపుతున్నాయి. “ఆయన నామమందు మనము పంపు వారెవరైనను, మనము వారిని పంపు ఏ జనముకైనను ఆయన రాజ్యపు ద్వారమును తెరచుటకు శక్తిని కలిగియుందురు---వారు ఆయన యెదుట తగ్గించుకొని, ఆయన వాక్యమునకు లోబడియుండి, ఆయన ఆత్మ స్వరమును ఆలకించునంత వరకు కలిగియుందురు,”24 అని అందులో చెప్పబడింది.
ఈ అద్భుతమైన మిషనరీ కృషిలో ముఖ్యభాగమైన వినయము, ప్రభువు తన సంఘాన్ని విశేషరీతిలో స్థాపించడానికి వీలుకల్పించింది.
అభినందించదగిన విషయమేమనగా, నేడు సంఘంలో దీనిని మనము నిరంతరం చూస్తున్నాము. పెరుగుతున్న తరంతో పాటు సభ్యులు, మిషను సేవ చేయడానికి తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు మరియు విద్య, ఉపాధిలను వాయిదా వేస్తున్నారు. చాలామంది సీనియర్ (పెద్దవాళ్ళు) సభ్యులు ఉపాధిని విడిచిపెట్టి, వారు పిలువబడిన స్థానంలో దేవుడికి సేవచేయడానికి ఇతర త్యాగాలు చేస్తున్నారు. ఆయన ఉద్దేశ్యాలను నెరవేర్చకుండా మనల్ని దారి మళ్లించే ఎటువంటి వ్యక్తిగత విషయాలను మనము అనుమతించము.25 సంఘ సేవకు వినయం అవసరం. పిలువబడిన విధంగా మనముమన పూర్ణశక్తి, మనస్సు, బలంతో వినయంగా సేవచేస్తాము. సంఘము యొక్క ప్రతి స్థాయిలో, వినయమనే క్రీస్తు లక్షణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
దేవుని కలుసుకొనుటకు వ్యక్తులను సిద్ధపరచుటకు సహాయపడుటలో నిరంతర వినయము ఆవశ్యకము
ప్రభువును గౌరవించి, ఆయన చిత్తానికి26 లోబడియుండాలనే లక్ష్యానికి గతంలో మాదిరిగా నేటి సమాజంలో విలువివ్వడం లేదు. ఇతర విశ్వాసాలకు చెందిన కొందరు క్రైస్తవ నేతలు, మనము క్రైస్తవ ప్రపంచానంతర లోకంలో జీవిస్తున్నాము అని నమ్ముతున్నారు.27
ఎన్నో తరాల వరకు, వినయమనే మతాధారిత సుగుణము మరియు నిరాడంబరత, పరిహాసము అనే సామాజిక సుగుణాలు ప్రధానమైన ప్రమాణంగా ఉన్నాయి.
నేటి ప్రపంచంలో గర్వము, స్వలాభాపేక్ష మరియు “ప్రామాణికత్వము” అనేవాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది, ఇది కొన్నిసార్లు అసలైన వినయం తక్కువ కావడానికి దారితీస్తుంది. ఈనాడు ఆనందం కోసం గల నైతిక విలువలలో ఇవి ఉన్నాయని కొందరు సూచించారు: “వాస్తవముగా, దృఢంగా, ఉత్పాదకంగా ఉండండి---అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులపై ఆధారపడవద్దు ... ఎందుకంటే మీ తలరాత... మీ చేతుల్లోనే ఉంది.” 28
లేఖనాలు వేరే విధానం గురించి వాదిస్తున్నాయి. మనము యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలని అవి సూచిస్తున్నాయి. దీని కొరకు దేవునికి జవాబుదారిగా ఉండు శక్తివంతమైన అనుభూతిని, జీవితం పట్ల వినయపూర్వకమైన విధానాన్ని ఏర్పరచుకోవడం అవసరము. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునికి శత్రువైయున్నాడని రాజైన బెంజిమెన్ బోధించారు మరియు “పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు” మనము లోబడి ఉండాలని ప్రోత్సహించారు. ఇతర విషయాలతోపాటు, “విధేయత, సాత్వీకత, వినయము, సహనము కలిగి ప్రేమతో నిండి ఉండడం”29 దీనికి అవసరమని ఆయన వివరించారు.
కొందరు ప్రామాణికమైనటువంటి వాటిని ప్రకృతి సంబంధియైన మనిషి యొక్క ఉత్సవంగా దుర్వినియోగపరుస్తారు మరియు అవి వినయం, దయ, క్షమాభిక్ష, క్షమాపణ, నాగరికతకు వ్యతిరేకంగా ఉన్నాయి. క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రవర్తనకు సాకుగా ఉండడానికి ప్రామాణికతను ఉపయోగించకుండా, దేవుని పిల్లలుగా మన వ్యక్తిగత ప్రత్యేకతను మనము ఉత్సవంగా జరుపుకోవచ్చు.
వినయం కోసం మన అన్వేషణలో, ఆధునిక అంతర్జాలం అహంకారాన్ని తప్పించుకోవడానికి సవాళ్లను సృష్టిస్తుంది. దానికి రెండు ఉదాహరణలు, ఒకటి ఇతరులను తనవైపు ఆకర్షించడానికి హద్దుమీరి ప్రవర్తించడం లేదా సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఆటవిక వ్రాతల ద్వారా ఇతరులపై దాడి చేయడం. ఇంకొకటి “వినయము గల బడాయికోరు.” అనగా “నిరాడంబరంగా లేదా స్వీయ-తిరస్కారంగా కనిపించే వ్యాఖ్య (లేదా చిత్రము) అని చెప్పవచ్చు, దీని అసలు ఉద్దేశం, ఒకరు గర్వపడుతున్న వాటిపట్ల ఇతరులను ఆకర్షించడం.”30 లోకము యొక్క వ్యర్థమైన విషయాలను గూర్చి నొక్కి చెప్తూ, ప్రవక్తలు ఎల్లప్పుడూ గర్వం గురించి హెచ్చరించారు.31
పౌర సంభాషణ యొక్క విస్తృత క్షీణత కూడా ఆందోళన కలిగించేదే. మనం అంగీకరించని అనేక ఎంపికలను మనము గౌరవించడమనేది కర్తృత్వమనే నిత్య సూత్రానికి అవసరము. సంఘర్షణ మరియు వివాదం అనేవి ఇప్పుడు “సాధారణ మర్యాద సరిహద్దుల” ను32 తరచుగా భంగపరుస్తున్నాయి. మనకు మరింత నిరాడంబరత మరియు వినయము అవసరం.
“మీరు ఒకనికంటే మరియొకడు మేలని అనుకొనుచు,” “దేవుని యొక్క పరిశుద్ధ క్రమమును బట్టి నడుచుచున్న” వినయస్థులను హింసించుచు, “మీ హృదయముల యొక్క గర్వమందు ఎత్తబడుట” గురించి ఆల్మా హెచ్చరించుచున్నాడు.33
నేను వినయస్థులైన అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజల మధ్య నిజమైన మంచితనాన్ని మరియు దేవునికి జవాబుదారిగా ఉండడాన్ని కనుగొన్నాను. “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు”34 అని చెప్పిన పాత నిబంధన ప్రవక్త మీకాతో వారిలో చాలా మంది ఏకీభవించారు.
మనం నిజంగా వినయస్థులమైతే, మనం క్షమాపణ కోసం ప్రార్థిస్తాము, ఇతరులను క్షమిస్తాము. మనం ఎంత తరచుగా పశ్చాత్తాపము పొందుతామో అంతగా ప్రభువు మన అతిక్రమములను క్షమిస్తారని మోషేలో ఆల్మా చెప్పడాన్ని మనం చదువుతాము.35 మరోప్రక్క, ప్రభువు యొక్క ప్రార్థనలో సూచించినట్లుగా,36 మనము ఇతరుల అతిక్రమములను క్షమించకపోతే, మనం శిక్షించబడతాము.37 యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తఃము కారణంగా మన పశ్చాత్తాపం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. మనకు వ్యతిరేకంగా అతిక్రమము చేసినవారిని మనము క్షమించనప్పుడు, రక్షకుని ప్రాయశ్చిత్తఃమును మనము నిరాకరించిన వారవుతాము. పగ తీర్చుకోవడం, క్షమాపణను నిరాకరించడం, మన బంధాలను వినయంగా క్రీస్తు పద్దతిలో సమీపించకపోవడం అనేవి నిజంగా మనలను శిక్షావిధికి తీసుకువస్తాయి. పగ తీర్చుకోవడం అనేది మన ఆత్మలకు ఒక విషం లాంటిది.38
అన్ని విధాలైన అహంకారాన్ని గూర్చి నన్ను కూడా హెచ్చరించనివ్వండి. ప్రభువు, ప్రవక్త మొరోనై ద్వారా గర్విష్ఠులు మరియు వినయస్థుల మధ్య విరోధాన్ని ఇలా వివరించారు: “మూర్ఖులు ఎగతాళి చేయుదురు; కానీ వారు దుఃఖించెదరు. మరియు సాత్వీకులకు నా కృప చాలును.” ప్రభువు ఇంకా ఇలా ప్రకటించారు, “వారు తగ్గించుకొనునట్లు నేను మనుష్యులకు బలహీనతనిచ్చెదను; నా యెదుట తమను తగ్గించుకొను మనుష్యులందరి కొరకు నా కృప చాలును. ఏలయనగా, నా యెదుట వారు తమను తగ్గించుకొని, నా యందు విశ్వసించిన యెడల, అప్పుడు నేను బలహీనమైన సంగతులను వారి కొరకు బలమైనవిగా చేయుదును.”39
మన జీవితాలలో గల అనేక ఆశీర్వాదాలు మరియు దైవిక సహాయం కోసం కృతజ్ఞతతో ఉండడం కూడా వినయమే. వినయం అనేది గొప్పగా గుర్తించదగిన విజయము కాదు లేదా ఏదైనా ప్రధాన సవాలును అధిగమించడం కాదు. అది ఆధ్యాత్మిక బలానికి చిహ్నంగా ఉంది. అది, ప్రతి రోజు మరియు ప్రతి గంట ప్రభువు పైన మనము ఆధారపడగలమనే నిశ్శబ్ద విశ్వాసము కలిగియుండి ఆయనను సేవించడం మరియు ఆయన ఉద్దేశ్యాలను సాధించడం. ఈ వివాదాత్మక ప్రపంచంలో మనము ప్రతిరోజూ నిజమైన వినయం కోసం నిరంతరం కృషి చేయాలని నా ప్రార్థన. ఒక అభిమాన పద్యము దానిని ఈ విధంగావివరిస్తుంది:
గొప్పతనపు పరీక్షే మార్గము
ఒకరు నిత్య సంగతులను కలుసుకొందురు.40
రక్షకుడు, ఆయన ప్రాయశ్చిత్తఃము మరియు ప్రతిరోజు వినయంగా ఆయనకు సేవ చేయడం యొక్క అధిక ప్రాధాన్యత గురించి నేను ఖచ్చితమైన సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామమున, ఆమేన్.