2010–2019
విధవరాలి హృదయము
అక్టోబర్ 2017


2:3

విధవరాలి హృదయము

విధవరాలి హృదయాన్ని కలిగియుండేందుకు కావలసిన దానిని మనము చేద్దాము, దాని ఫలితంగా ఏర్పడు అవసరాలను తీర్చు దీవెనల యందు నిజంగా ఆనందించుదాము.

నా వయోజన జీవితములో అధికభాగము పసిఫిక్ పరిశుద్ధుల మధ్య సేవచేయుట ద్వారా నేను గొప్ప దీవెనలను పొందాను. ఈ భక్తిగల పరిశుద్ధుల యొక్క విశ్వాసము, ప్రేమ, మరియు అద్భుతమైన త్యాగములు నన్ను ప్రేరేపణ, కృతజ్ఞత, మరియు సంతోషముతో నింపాయి. వారి కథలు మీ కథలవలె ఉంటాయి.

ఈ పరిశుద్ధులకు, రక్షకుడు పరీక్షించిన విధవరాలికి మధ్య చాలా పోలికలున్నట్లు నాకనిపించింది. “ఆయన కూర్చుండి, జన సమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి.

“ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ....

“ఆయన తన శిష్యులను పిలిచి --కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను:

“వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.” 1

ఆమె యొక్క రెండు కాసుల చందా కొంచెమైనప్పటికీ రక్షకునికి ఆమె బహుమానము గొప్ప విలువైనది, ఎందుచేతననగా ఆమె ఉన్నదంతా ఇచ్చింది. ఆ సమయములో, ఆమె బహుమానము ఆమె హృదయమును ఆయనకు చూపుట వలన రక్షకుడు ఆ విధవరాలిని పూర్తిగా తెలుసుకొన్నారు. ఆమె ప్రేమ, విశ్వాసము యొక్క గుణము మరియు లోతు ఎటువంటివనగా తన అవసరములు తీరుతాయని తెలుసుకొని ఆమె యిచ్చింది.

పసిఫిక్ లో జీవించు పరిశుద్ధులలో కూడా నేను అటువంటి గుణములను చూసాను. ఈ ద్వీపములలో ఒకదానిలో ఉన్నచిన్న గ్రామములో, వారికి బోధింపబడిన పాఠములు నిజమా అని ప్రభువును మనఃపూర్వకముగా అడుగుటకు ఒక ముసలాయన మరియు ఆయన భార్య మిషనరీల యొక్క ఆహ్వానమును అంగీకరించారు. ఈ క్రమములో, వారికి వచ్చిన జవాబు పునరుద్ధరించబడిన సువార్తను వారు అంగీకరించుటకు నడిపిస్తే, వారు చేయవలసిన ఒప్పగింపుల యొక్క ఫలితములను కూడా వారు ఆలోచించారు. సంఘము యొక్క వాస్తవికతను, మోర్మన్ గ్రంథము యొక్క ప్రామాణికతను తెలుసుకొనుటకు వారు ఉపవాస ప్రార్ధన చేసారు. వారి ప్రార్ధనలకు, “అవును! ఇది నిజము!” అని స్పష్టంగా స్థిరపరచబడిన జవాబు వచ్చింది.

ఈ సాక్ష్యమును పొందిన తర్వాత, వారు బాప్తీస్మము పొందుటకు ఎన్నుకొన్నారు. ఈ ఎన్నిక వలన వారి జీవితములలో దుష్ఫలితములు కలిగాయి. సువార్తనంగీకరించి బాప్తీస్మము పొందాలనే వారి నిర్ణయము అనేక విధాలుగా వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపింది. వారి ఉద్యోగములు పోయాయి, వారు సాంఘిక ప్రతిష్ఠను వదిలేసారు, ముఖ్యమైన స్నేహములు ముగిసిపోయాయి, మరియు కుటుంబము యొక్క సహకారము, ప్రేమ, మర్యాద తొలిగిపోయాయి. వ్యతిరేకదిశలో నడిచే స్నేహితులు మరియు ఇరుగుపొరుగు వారితో వికారమైన చూపులు ఇచ్చిపుచ్చుకొంటూ వారు ఇప్పుడు ప్రతి ఆదివారము సంఘమునకు నడిచి వెళ్తున్నారు.

ఇటువంటి కష్టమైన పరిస్థితులలో, సంఘమందు చేరాలనే వారి నిర్ణయం గురించి ఎలా భావిస్తున్నారని ఈ మంచి సహోదరుడు అడుగబడ్డాడు. అతని సరళమైన మరియు స్థిరమైన జవాబు, “అది నిజమే కదా? మా ఎన్నిక స్పష్టమైనది.”

కొత్తగా పరివర్తన చెందిన ఈ పరిశుద్ధులిద్దరు నిజముగా విధవరాలి హృదయమును కలిగియున్నారు. వారు, విధవరాలివలె “అంతా వేసారు”, వారి దగ్గర ఉన్నదంతా బుద్ధిపూర్వకముగా ఇచ్చారు. ఆ కష్ట సమయములలో, వారి నమ్మకముగల హృదయాలు మరియు శాశ్వతమైన విశ్వాసము యొక్క ఫలితముగా వారి భారములు తేలికపరచబడినవి. సహకారమిచ్చు మరియు సేవ చేయు సంఘసభ్యుల చేత వారు సహాయము చేయబడ్డారు మరియు చుట్టుకొనబడ్డారు, మరియు సంఘ పిలుపులలో వారి సేవ ద్వారా వారు వ్యక్తిగతముగా బలపరచబడ్డారు.

వారికి ఉన్నదంతా యిచ్చిన తరువాత, వారు నిత్యమైన కుటుంబముగా దేవాలయములో ముద్రవేయబడినప్పుడు వారికి గొప్పదైన దినము వచ్చింది. ఆల్మా యొక్క నాయకత్వము క్రింద పరివర్తన చెందిన వారికి ఆయన చేసినట్లుగా, “వారు తమ భారములను సునాయాసముగా భరించునట్లు ప్రభువు వారిని బలపరచెను మరియు వారు సంతోషముగాను, సహనముతోను ప్రభువు యొక్క చిత్తమంతటికి లోబడిరి.”2 ఆ విధంగా ఈ అద్భుతమైన జంటలో విధవరాలి హృదయము చూపబడినది.

విధవరాలి హృదయము స్పష్టముగా నిరూపించబడిన ఇంకొక అనుభవమును నన్ను పంచుకోనివ్వండి. సమోవా లో, మిషనరీలు సువార్తను ఉపదేశించుటకు అంగీకారము పొందుటకు మేము గ్రామ సలహామండళ్ళతో చాలా శ్రమపడి మాట్లాడతాము. మిషనరీలు సువార్తను ఉపదేశించుటకు చాలా సంవత్సరాలు అంగీకరించని గ్రామము యొక్క నాయకునితో కొన్నేళ్ళ క్రితం నేను సంభాషించాను. నేర్చుకొనుటకు ఆసక్తి ఉన్నవారికి, సువార్త మరియు దాని సిద్ధాంతములను మన సంఘపు మిషనరీలు బోధించుటకు ఆ గ్రామ ప్రధాన నాయకుడు అనుమతి యిచ్చిన కొన్నాళ్ళ తరువాత నా సంభాషణ జరిగింది.

చాలా ఏళ్ళ తరువాత, ఇటువంటి అద్భుతమైన మార్పు జరగడానికి, ఆ ప్రధాన నాయకుడు ఇటువంటి కార్యమును చేయడానికి గల కారణమును తెలుసుకోవాలని నాకు ఆసక్తి కలిగింది. దీని గురించి ఆ నాయకుడిని అడిగినప్పుడు ఇది ఆయన జవాబు, “ఒక మనిషి కొంత కాలము అంధకారములో నివశించగలడు, కాని అతడు వెలుగులోకి రావాలనే కోరిక ఏదో ఒక సమయములో వస్తుంది.”

ఆ ప్రధాన నాయకుడు, గ్రామములో అంగీకరించినప్పుడు విధవరాలి హృదయమును నిరూపించెను --- ఆ హృదయము, నిజము యొక్క వెచ్చదనము మరియు వెలుగు బయల్పరచబడినప్పుడు మెత్తబడుతుంది. ఇతరులు దీవింపబడుటకు ఈ నాయకుడు సంప్రదాయములను వదులుకొనుటకు, ప్రతికూలతను ఎదుర్కొనుటకు మరియు స్థిరముగా నిలబడుటకు ఇష్టపడ్డాడు. సంప్రదాయము, సంస్కృతి మరియు వ్యక్తిగతమైన శక్తి గురించి ఆలోచించకుండా, ఈ నాయకుని హృదయము ఆయన జనుల యొక్క సంక్షేమము మరియు ఆనందముపై కేంద్రీకరించబడింది. “రక్షకుని ఉదాహరణను మనము అనుసరించినప్పుడు, ఇతరుల జీవితములలో వెలుగుగా ఉండుటకు మనకు అవకాశముండునని”3 అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ గారు మనకు బోధించిన దానితో సమ్మతిస్తూ ఆయన ఆ ఆలోచనలను లక్ష్యపెట్టలేదు.

చివరిగా, పసిఫిక్ పరిశుద్ధుల మధ్య లోతుగా మరియు ఆత్మీయముగా నా మనసులో నిలిచిన మరియొక అనుభవమును నన్ను మీతో పంచుకోనియ్యండి. కొన్నేళ్ళ క్రితం, అమెరికన్ సమోవాలో ఒక క్రొత్త వార్డులో నేను బిషప్పు యొక్క సలహాదారునిగా ఉన్నాను. రైతులు, కేనరీ పనివారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబములతో కలిపి మేము తొంబై తొమ్మిది (99) మంది సభ్యులము. 1977 లో సమోవాలో దేవాలయము నిర్మించబడబోతున్నదని ప్రథమ అధ్యక్షత్వము ప్రకటించినప్పుడు, మేమంతా సంతోషమును మరియు కృతజ్ఞతలను తెలియజేసాము. ఆ కాలములో అమెరికన్ సమోవా నుండి దేవాలయమునకు వెళ్ళుటకు, హవాయి లేక న్యూజిలాండ్ కి ప్రయాణము చేయవలసి వచ్చేది. ఈ ఖరీదైన ప్రయాణమును చాలామంది విశ్వాసులైన సంఘ సభ్యులు భరించ లేకపోయేవారు.

ఈ సమయములో, దేవాలయ నిర్మాణమునకు సహాయముచేయుటకు సభ్యులందరూ భవన నిర్మాణనిధికి విరాళమిచ్చుటకు ప్రోత్సహించబడ్డారు. దీని ప్రకారము, వారు ఎంత ఇవ్వగలరో అని ప్రార్ధన చేసి ఆలోచించమని మా బిషుప్రిక్కు వార్డు సభ్యులను అడిగారు. కుటుంబములు కలిసి వారి విరాళములు ఇచ్చుటకు ఒక తేదీ నిశ్చయించబడినది. తరువాత ఈ విరాళములన్నిటిని రహస్యముగా లెక్కపెట్టినప్పుడు, అద్భుతమైన మా వార్డు సభ్యుల యొక్క విశ్వాసము మరియు విశాల హృదయము చేత మా బిషుప్రిక్కు మనస్సు కరిగించబడింది.

ప్రతి కుటుంబమును మరియు వారి పరిస్థితులనుఎరిగియుండి, ఆశ్చర్యము, మర్యాద, మరియు వినయము యొక్క దృఢమైన, శాశ్వతమైన జ్ఞానమును నేను అనుభవించాను. అన్నివిధాలా ఇవి, సమోవాలో ప్రభువు యొక్క పవిత్రమైన దేవాలయ నిర్మాణము యొక్క వాగ్దానము చేయబడిన దీవెన యందు ఆనందముతో, “వారికున్నంతలో” నుండి ఇష్టపూర్వకముగా ఇవ్వబడిన ఆధునిక-దిన విధవరాలి కాసులు. ఈ కుటుంబములు, వారి అవసరాలు తీర్చబడతాయనే విశ్వాసముతో వారు ఇవ్వగలిగినదంతా ప్రభువుకు సమర్పించారు. వారి బహుమానము వారి విధవరాలి హృదయములను విశదపరచింది. ఇచ్చినవారందరూ ఇష్టపూర్వకముగా మరియు ఆనందముగా ఇచ్చారు, ఎందుకనగా వారిలోవున్న విధవరాలి హృదయము విశ్వాసము యొక్క కన్నుతో వారి కుటుంబములకు, సమోవా మరియు అమెరికన్ సమోవా యొక్క జనులందరికి తరతరాల వరకు దొరికే గొప్ప దీవెనలు చూడగలిగింది. వారు సమర్పించిన కానుకలను, వారి విధవరాలి కాసులను ప్రభువు ఎరిగియున్నారని, అంగీకరించారని నాకు తెలుసు.

తన రెండు కాసులు ఇచ్చిన విధవరాలి హృదయము, త్యాగములు చేస్తూ, కష్టమును, హింసను, నిరాకరణను భరిస్తూ మరియు నానావిధములైన బాధలను భరిస్తూ, సర్వము ఇచ్చే హృదయము. ఆ విధవరాలి హృదయము నిజము యొక్క వెలుగును గ్రహించును, అనుభవించును మరియు తెలుసుకొనును, ఆ నిజమును హత్తుకొనుటకు దేనినైనా ఇచ్చును. అటువంటి వెలుగును చూచుటకు మరియు అటువంటి నిత్యమైన సంతోషమును పొందుటకు, ఆ హృదయము ఇతరులకు సహాయము చేయును. చివరిగా విధవరాలి హృదయము, భూమిపై దేవుని రాజ్యమును నిర్మించుటకు తనకి ఉన్నదంతా ఇచ్చుటకు ఇష్టపడుట చేత వర్ణించబడింది.

విధవరాలి హృదయాన్ని కలిగియుండేందుకు కావలసిన దానిని చేయుటలో మనము ప్రపంచమంతటా వున్న పరిశుద్ధులుగా ఏకమవుదాము, దాని ఫలితంగా ఏర్పడు అవసరాలను తీర్చు దీవెనల యందు నిజంగా ఆనందించుదాము. మన భారములను భరించు మనస్సు కలిగి, కావలసిన త్యాగములను చేయుటకు మరియు ఇచ్చుటకు, చేయుటకు చిత్తము కలిగి యుండాలని మనందరి కొరకు నా ప్రార్థన. ప్రభువు మీ అవసరాలు తీర్చకుండా వదిలివేయరని నేను వాగ్దానమిస్తున్నాను. విధవరాలి హృదయము కృతజ్ఞతతో నిండినది, ఎందుకనగా రక్షకుడు “వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించినవాడు గాను ఉండెను,” 4 కావున మనము ఆ “చేదు పాత్ర”5 నుండి త్రాగనక్కరలేదు. మనకి బలహీనతలు, లోపములు ఉన్నాయి కనుక, మన కొరకు గ్రుచ్చబడిన ఆయన చేతులను ఆయన నిరంతరము మనకందిస్తారు. ఆయన యొక్క సువార్త వెలుగులోకి వచ్చుటకు, ఆయనను హత్తుకొనుటకు మనము ఇష్టపడి, మన “అవసరములను” తీర్చుటకు ఆయనను అనుమతించినట్లయితే, ఆయన మనల్ని పైకి ఎత్తెదరు.

ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరియు అనుచరులవలె మనము గొప్ప ప్రేమను పంచుకోగలమని నేను సాక్ష్యమిస్తున్నాను. అధ్యక్షులు థామస్  ఎస్ మాన్సన్ గారిని ఈ భూమిపై దేవుని యొక్క ప్రవక్తగా నేను ఆమోదిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. మోర్మన్ గ్రంథము లోకమునకు యేసు క్రీస్తు యొక్క మరియొక సాక్ష్యము, దానిని చదవమని మరియు మీ కొరకు దాని సందేశమును కనుగొనమని నేను మిమ్మల్నందరిని ఆహ్వానిస్తున్నాను. ఆయన సన్నిధికి రమ్మని ప్రభువు ఇచ్చిన ఆహ్వానమును అంగీకరించిన వారందరూ శాంతి, ప్రేమ మరియు వెలుగును కనుగొనెదరు. యేసుక్రీస్తు మనకు గొప్ప మాదిరి మరియు విమోచకుడు. యేసుక్రీస్తు మరియు ఆయన యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తఃము యొక్క అద్భుతము ద్వారా మాత్రమే మనము నిత్యజీవితమును పొందగలము. దీనికి యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.