2010–2019
రండి, ప్రవక్త యొక్క స్వరమును వినుడి
అక్టోబర్ 2018


12:18

రండి, ప్రవక్త యొక్క స్వరమును వినుడి

మన జీవితాలలో జీవిస్తున్న ప్రవక్తల స్వరాన్ని వినుట, పాటించుటను సాధనం చేయుట పటిష్ఠపరచినప్పుడు, మనం వాగ్ధానం చేయబడిన నిత్యదీవెనలను పొందుతాము.

యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ అధ్యక్షుడిని గూర్చి మాట్లాడుతూ, ప్రభువు ఇలా ప్రకటించారు:

“మరలా, ప్రధాన యాజకత్వ కార్యాలయము యొక్క అధ్యక్షుని బాధ్యత యేమనగా, సంఘమంతటిపైన అధ్యక్షత్వము వహించుటకు, మరియు మోషేను పోలి ఉండుటకు---

“…అవును, సంఘము యొక్క ప్రధానిపైన ఆయన ప్రోక్షించు దేవుని వరములన్నింటిని కలిగియుండి దీర్ఘదర్శిగా, బయల్పాటుదారునిగా, అనువాదకునిగా, ప్రవక్తగా నుండుట” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:91–92; వివరణ చేర్చబడింది).

దేవుడు తన ప్రవక్తలపైన ఉంచే వరములలో కొన్నిటిని చూడ్డానికి నేను దీవించబడ్డాను. అటువంటి పరిశుద్ధమైన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవచ్చా? నా ప్రస్తుత పిలుపుకు ముందు, రాబోయే దేవాలయాల స్థలాలను గుర్తించుటలో, సిపారసు చేయుటలో నేను సహాయపడేవాడిని. సెప్టెంబరు 11, 2001 తర్వాత, అమెరికా సరిహద్దులను దాటుట ఎక్కువగా నియత్రించబడింది. ఫలితంగా, వెంకూవర్, కెనడా నుండి సియాటల్ వాషింగ్టన్ దేవాలయానికి వెళ్లు సరిహద్దు దాటటానికి అనేకమంది సంఘ సభ్యులకు రెండు నుండి మూడు గంటలు సమయం పట్టేది. అప్పటి సంఘాధ్యక్షులు, అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ వెంకూవర్ లో ఒక దేవాలయాన్ని నిర్మిస్తే అది సంఘ సభ్యులను దీవిస్తుందని సలహానిచ్చారు. ఒక స్థలాన్ని వెదకడానికి అనుమతించబడింది, మరియు సంఘం యొక్క స్వంత స్థలాలను పరీక్షించిన తరువాత, సంఘానికి చెందని ఇతర స్థలాలను కూడా పరిశోధించాం.

ట్రాన్స్-కెనడా రహదారి ప్రక్కనే మతపరమైన జోనులో ఒక సుందరమైన స్థలము కనుగొనబడింది. ఆ స్థలం చక్కటి ప్రవేశాన్ని కలిగియుండి, సుందరమైన కెనడియన్ దేవదారు వృక్షాలతో, ప్రాముఖ్యమైన ప్రదేశంలో అక్కడ తిరిగే వేలాదిమంది వాహనచోదకులకు కనపడేలా ఉంది.

మేము స్థలాన్ని దాని చిత్రపటాలు, పటాలతో సహా నెలవారి దేవాలయ స్థలాల సమితి సమావేశములో నివేదించాం. అధ్యక్షులు హింక్లీ దానిని కాంట్రాక్టు క్రింద తీసుకొని అవసరమైన అధ్యయనాలు పూర్తి చేయటానికి అనుమతించారు. ఆ సంవత్సరం డిశంబరులో, సమితికి మేము అధ్యయనాలు పూర్తయ్యాయని నివేదించి, కొనుగోలు చేయుటకు అమోదించమని మేము కోరాము. మా నివేదికను చూచినప్పుడు, అధ్యక్షులు హింక్లీ, “నేను ఆ స్థలాన్ని చూడాలని భావిస్తున్నాను” అని అన్నారు.

తరువాత ఆ నెలలో క్రిస్టమస్ అయిన రెండు రోజుల తర్వాత, అధ్యక్షులు హింక్లీ; అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్; దేవాలయ శిల్పి బిల్ విలియమ్స్‌తో మేము వెంకోవర్‌కు బయల్దేరాం. మేము అక్కడి స్టేకు అధ్యక్షుడు పాల్ క్రిస్టెన్సన్ చేత కలుసుకొనబడ్డాము, అతడు ఆ స్థలం వద్దకు మమ్మల్ని తీసుకెళ్లాడు. ఆరోజు వాతావరణం కొంచెం తేమగా, మంచుతో ఉంది, కానీ అధ్యక్షులు హింక్లీ కారులోంచి వేగంగా దిగి, ఆ స్థలమంతా నడవడం ఆరంభించారు.

ఆ స్థలంలో కొంచెం సమయం గడిపిన తర్వాత, అధ్యక్షులు హింక్లీతో నేను పరిశీలించబడిన ఇతర స్థలాలను చూస్తారా అని అడిగాను. ఆయన అవును, వాటిని చూడ్డానికి ఇష్టపడుతున్నాను అన్నారు. మీరు చూడండి, ఇతర స్థలాలను చూడ్డం వలన, మేము వాటి సుగుణాలను సరిపోల్చగలిగాము.

మేము ఇతర స్థలాలను చూస్తూ వెంకోవర్ చుట్టూ తిరిగి, ముందు చూసిన స్థలానికే వచ్చాం. అధ్యక్షులు హింక్లీ “ఇది సుందరమైన స్థలం” అని అన్నారు. అప్పుడు ఆయన, “మనం పావు మైలు (0.4 కి.మీ) దూరంలోనున్న సంఘ సొంత సమావేశ గృహానికి వెళదామా?” అని అడిగారు.

“తప్పకుండా, అధ్యక్షా” అని మేము సమాధానమిచ్చాం.

మేమంతా కార్లలలో దగ్గరలోని సమావేశ గృహానికి వెళ్లాం. అక్కడకు చేరుకుంటున్నప్పుడు, అధ్యక్షులు హింక్లీ, “ఇక్కడ ఎడమవైపుకు తిరగండి” అన్నారు. మేము మలుపు తిరిగి, సూచించబడినట్లుగా ఆ వీధిలో వెళ్లాము. ఆ వీధి కొంచెం ఎత్తుగా అవడం మొదలైంది.

కారు ఎత్తు పైకి చేరినప్పుడు, అధ్యక్షులు హింక్లీ “కారు ఆపండి, కారు ఆపండి” అన్నారు. ఆయన అప్పుడు కుడివైపునున్న స్థలాన్ని చూపిస్తూ, “ఈ స్థలం విషయమేమిటి? ఇక్కడే దేవాలయం వస్తుంది. ఇక్కడే ప్రభువు దేవాలయం రావాలని కోరుతున్నారు. మీరు దీన్ని సంపాదించగలరా? ” అని అన్నారు.

ఆ స్థలాన్ని మేము చూడలేదు. అది ముఖ్య మార్గానికి చాలా దూరంగా ఉంది, మరియు అది అమ్మకానికి పెట్టబడలేదు. మాకు దాని గురించి తెలియదని మేము చెప్పిన తర్వాత, అధ్యక్షులు హింక్లీ ఆ స్థలాన్ని చూపిస్తూ, “ఇక్కడే దేవాలయం వస్తుంది” అని మరలా చెప్పారు. కొద్ది నిమిషాలు అక్కడ గడిపిన తర్వాత గృహానికి తిరిగి వెళ్లటానికి విమానాశ్రయానికి బయలుదేరాం.

మరుసటి రోజు, సహోదరుడు విలియమ్స్, నేను అధ్యక్షులు హింక్లీ కార్యాలయానికి పిలవబడ్డాం. ఆయన ఒక కాగితంపై ప్రతీదానిని గీసారు: రోడ్డులను, సమావేశ గృహాన్ని, ఎడమవైపుకు తిరిగిన చోటును,x మార్కును దేవాలయ గుర్తుగా వ్రాసి ప్రణాళికలను గీసారు. ఆయన మేము ఏమి కనుగొన్నామని అడిగారు. మేము ఆయనతో అంతకన్నా కష్టమైన స్థలాన్ని ఆయన ఎన్నుకోలేరని చెప్పాము. అది ఒకరు కెనడా, మరొకరు భారతదేశం, మరొకరు చైనా దేశస్థులైన ముగ్గురికి చెందినది! మరియు అది అవసరమైన మతపరమైన జోనులో లేదు.

“మంచిది, మీ సర్వశక్తులా ప్రయత్నించండి” అని ఆయన అన్నారు.

అప్పుడు అద్భుతాలు జరిగాయి. కొన్ని నెలలలోనే ఆ స్థలాన్ని మేము కొన్నాం, లేంగ్లే, బ్రిటిష్ కొలంబియా నగరం అక్కడ దేవాలయం నిర్మించడానికి అనుమతించింది.

 వెంకూవర్ బ్రిటీష్ కొలంబియా దేవాలయం

ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సహోదరుడు విలియమ్స్, నేను భూవాణిజ్యంలో, దేవాలయ రూపకల్పనలో అధికారిక విధ్యను, అనేక సంవత్సరాల అనుభవాన్ని కలిగియున్నామని, అధ్యక్షులు హింక్లీ అలాంటి అధికారిక శిక్షణ కలిగిలేరని గుర్తించి వినయుణ్ణి అయ్యాను; కానీ ఆయన దానికంటే గొప్పదైన ప్రవచనాత్మక దీర్ఘదర్శిత్వ వరమును కలిగియున్నారు. ఆయన దేవుని ఆలయం ఎక్కడ నిర్మించబడాలో చూడగలిగారు.

ప్రభువు ఈ యుగంలోని మొదటి పరిశుద్ధులకు దేవాలయం నిర్మించమని ఆజ్ఞాపించినప్పుడు, ఆయన ప్రకటించెను:

“కాని వారికి నేను చూపించు విధానము ననుసరించి నా నామము కొరకు వారు ఒక మందిరమును నిర్మించవలెను.

“నా జనులు వారికి నేను చూపించు విధానము ననుసరించి దానిని నిర్మించని యెడల … , వారి చేతులయందు దానిని నేను అంగీకరించను.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 115:14–15).

ఆ మొదటి పరిశుద్ధులకు చేసినట్లుగా, ఈ దినమున మనతో కూడా మన దినములో దేవుని రాజ్యం ఏవిధంగా నడిపించబడాలో ప్రభువు సంఘ అధ్యక్షునికి బయల్పరిచారు, మరియు బయల్పరుచుట కొనసాగిస్తారు. మరియు వ్యక్తిగత స్థాయిలో, మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాలను ఏ విధంగా నడిపించుకోవాలనే దానికి మార్గదర్శకత్వాన్ని అందించి, అదేవిధంగా మన ప్రవర్తన ప్రభువుకు అంగీకరించబడేలా ఆయన నడిపింపును ఇస్తారు.

ఏప్రిల్ 2013 లో, ప్రతీ దేవాలయపు పునాదులు దాని మీదకు రాబోయే తుఫానులను, విపత్తులను తట్టుకొనేలా వాటిని చేయుటకు తీసుకునే సిద్ధపరచుటలో చేర్చబడిన ప్రయత్నాలను గూర్చి నేను మాట్లాడాను. కానీ పునాది ఒక ప్రారంభం మాత్రమే. ముందే రూపొందించిన మాదిరుల ప్రకారం దేవాలయం అనేక నిర్మాణ చట్రాలతో కలిపి కట్టబడిన సముదాయం. మన జీవితాలు దేవాలయాలు కావాలంటే, ప్రభువుచేత బోధించబడినట్లుగా మనం కట్టబడుటకు ప్రయత్నించాలి (1 కొరింథీయులు 3:16–17 చూడుము), మనలను మనం సహేతుకంగా “మన జీవితాలను మనోహరంగా, మహోన్నతంగా, మరియు ప్రపంచపు తుఫానులను నిరోధించుకోడానికి బదులుగా ఏ నిర్మాణ చట్రాలను వాటివాటి స్థానాలలో ఉంచాలి?” అని ప్రశ్నించుకోవాలి.

ఈ ప్రశ్నకు జవాబును మనము మోర్మన్ గ్రంథంలో కనుగొనగలం. మోర్మన్ గ్రంథం గూర్చి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ అన్నారు: “నేను సహోదరులకు భూమిపైనున్న మరే గ్రంథం కన్నా మోర్మన్ గ్రంథం అత్యంత ఖచ్చితమైనదని, మన మతానికి ప్రధాన రాయని, ఒకడు ఇతర గ్రంథాల కన్నా దీని సూక్తులననుసరించి నడచుకొనిన యెడల దేవునికి చేరువగునని చెప్పుచున్నాను” (మోర్మన్ గ్రంథపు పీఠిక). మోర్మన్ గ్రంథపు పీఠికలో, ఎవరైతే పరిశుద్ధాత్మ నుండి మోర్మన్ గ్రంథం దేవుని వాక్యమను సాక్ష్యన్ని పొందుతారో, వారు అదే శక్తి ద్వారా యేసుక్రీస్తు లోక రక్షకుడని, జోసెఫ్ స్మిత్ ఆయన యొక్క బయల్పాటుదారుడని, వునస్థాపన యొక్క ప్రవక్త అని, యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘం భూమిపై తిరిగి స్థాపించబడిన ప్రభువు యొక్క రాజ్యమని మనం తెలుసుకోగలమని బోధించబడ్డాం.

అప్పుడు ఇవి మన వ్యక్తిగత విశ్వాసం, సాక్ష్యాల యొక్క కొన్ని ప్రాముఖ్యమైన నిర్మాణచట్రములు:

  1. యేసుక్రీస్తు లోకము యొక్క రక్షకుడు.

  2. మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమైయున్నది.

  3. యేసుక్రీస్తు యొక్క కడవరిదిన పరిశుద్ధుల సంఘము భూమిపై దేవుని రాజ్యమైయున్నది.

  4. జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త, మనం జీవిస్తున్న ప్రవక్తలను ఈనాడు భూమిపై కలిగియున్నాము.

కొద్ది నెలలుగా, అధ్యక్షులు నెల్సన్ అపోస్తలుడిగా పిలవబడినప్పటినుండి ఆయన మాట్లాడిన ప్రతీ సర్వసభ్యసమావేశ ప్రసంగాన్ని నేను విన్నాను. ఈ అభ్యాసము నా జీవితమును మార్చివేసింది. 34 సంవత్సరాలుగా అధ్యక్షులు నెల్సన్ పోగుజేసిన జ్ఞానం నేను చదివి, ధ్యానించినప్పుడు, ఆయన బోధనలనుండి స్పష్టమైన, నిలకడగల ఇతివృత్తాలను వెలువడినవి. ఈ ప్రతి ఒక్క ఇతివృత్తములు ఇప్పుడే ప్రస్తావించబడిన నిర్మాణ చట్రములతో జోడించబడును లేదా మన వ్యక్తిగత దేవాలయాల కొరకు మరొక ముఖ్యమైన నిర్మాణ చట్రమగును. వాటిలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం; పశ్చాత్తాపం, పాపముల పరిహారము నిమిత్తమై బాప్తీస్మం; పరిశుద్ధాత్మ యొక్క వరం; మృతుల యొక్క విమోచన, దేవాలయ కార్యము; సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట; ముగింపు మనస్సులో ఉంచుకొని ప్రారంభించుట; నిబంధన బాటలో నిలిచియుండుట ఉన్నవి. అధ్యక్షులు నెల్సన్ వాటన్నింటి గూర్చి సమస్త ప్రేమ, భక్తితో మాట్లాడారు.

సంఘానికి మరియు మన జీవితాలకు ప్రధాన మూలరాయి, నిర్మాణచట్రము యేసుక్రీస్తే. ఇది ఆయన సంఘం. అధ్యక్షులు నెల్సన్ ఆయన ప్రవక్త. అధ్యక్షులు నెల్సన్ బోధనలు యేసుక్రీస్తు జీవితాన్ని, గుణాన్ని మన ప్రయోజనం కొరకు బయలుపరచి, సాక్ష్యమిస్తాయి. రక్షకుని యొక్క స్వభావం, ఆయన మిషను గూర్చి ఆయన ప్రేమతో, యెరిగిన జ్ఞానంతో మాట్లాడతారు. ఆయన తాను సేవ చేసిన జీవిస్తున్న ప్రవక్తలు – సంఘ అధ్యక్షుల – దైవిక పిలుపును గూర్చి తరచూ గంభీరమైన సాక్ష్యాన్ని కూడా చెప్పారు.

ఇప్పుడు, ఈరోజు, భూమిపైనున్న ప్రభువు యొక్క జీవిస్తున్న ప్రవక్తగా ఆయనను ఆమోదించుట మనకివ్వబడిన ప్రత్యేకావకాశం. మన అంగీకారము మరియు సహకారమును ప్రత్యక్షపరచుటకు మనం సంఘాధికారులను ఆమోదించుటకు మన హస్తాలను మూలమట్టాకారంలో పైకి లేపే దైవిక మాదిరికి అలవాటుపడియున్నాం. దీనిని మనం కొన్ని నిమిషాల ముందే చేసాం. కానీ నిజమైన ఆమోదం ఈ భౌతిక చిహ్నమును మించినది. సిద్ధాంతము మరియు నిబంధనలు 107:22 లో వివరించినట్లుగా, ప్రథమ అధ్యక్షత్వము “సంఘము యొక్క నమ్మకము, విశ్వాసము ప్రార్థనలచేత బలపరచబడాలి.” మనం ఆయన మాటలందు నమ్మకముంచే విధానాన్ని అభివృద్ధి చేసుకొని, వాటి ప్రకారము చేసే విశ్వాసాన్ని కలిగియుండి, ఆయనపై ప్రభువు యొక్క నిరంతర దీవెనలకై ప్రార్థించినప్పుడు ఆయనను జీవిస్తున్న ప్రవక్తగా పూర్తిగా, నిజంగా ఆమోదించగలం.

నేను అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గూర్చి ఆలోచించినప్పుడు, రక్షకుడు చెప్పినట్లుగా “ఇదిగో నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా జనులు నా స్వరమును, నా జనులను నడిపించుటకు నేను నియమించియున్న నా సేవకుల స్వరమును ఆలకించిన యెడల, ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారి స్థలము నుండి వారు కదలకయుందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 124:45) అను ఆయన మాటలలోని ఓదార్పును అనుభవిస్తాను.

జీవిస్తున్న ప్రవక్తలను వినుట, లక్ష్యముంచుట మన జీవితాలలో అధికమైన, ఇంకా జీవితాన్ని మార్చగలిగే పర్యవసానాన్ని కలిగియుంటాయి. మనం బలపరచబడతాం. మనం మరింత నిశ్చయతను, ధైర్యాన్ని పొందుతాం. మనం ప్రభువు వాక్కును వింటాం. మనం దేవుని ప్రేమను అనుభవిస్తాం. మన జీవితాలను ఉద్ధేశ్యంతో ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకుంటాం.

నేను అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను, మరియు ఇతరులు ఎవరైతే ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారులుగా పిలవబడ్డారో వారిని ప్రేమిస్తున్నాను, ఆమోదిస్తున్నాను. ఆయన తన శిరస్సుపై ప్రభువు క్రుమ్మరించిన వరములను కలిగియున్నారని సాక్ష్యమిస్తున్నాను, మనము మన జీవితాలలో జీవిస్తున్న ప్రవక్తల స్వరాన్ని విని, లక్ష్యముంచుటను సాధన చేయుట పటిష్ఠపరచినప్పుడు, మన జీవితాలు మన కొరకు ప్రభువు యొక్క దైవిక నమూనా ప్రకారం నిర్మించబడతాయి, మరియు మనం నిత్యదీవెనలను పొందుతామని సాక్ష్యమిస్తున్నాను. ఆహ్వానం అందరికీ ఇవ్వబడింది. రండి, ప్రవక్త యొక్క స్వరమును వినుడి; అవును, క్రీస్తునొద్దకు వచ్చి జీవించుము. యేసుక్రీస్తు నామంలో ముగిస్తున్నాను, ఆమేన్.