2010–2019
క్రీస్తుయందు విశ్వాసములో దృఢముగాను, నిలకడగాను ఉండుట
అక్టోబర్ 2018


15:10

క్రీస్తుయందు విశ్వాసములో దృఢముగాను, నిలకడగాను ఉండుట

క్రీస్తుయందు విశ్వాసములో దృఢముగాను, నిలకడగాను ఉండడాన్ని కాపాడేందుకు యేసు క్రీస్తు సువార్త ఒకరి హృదయమును, ఆత్మను చొచ్చుకొనిపోవడం అవసరము.

పాత నిబంధన చరిత్రలో, కొంతకాలం ఇశ్రాయేలు సంతతి వారు యెహోవాతో తమ నిబంధనను గౌరవించి, ఆయనను ఆరాధించడం, మరికొంతకాలం ఆ నిబంధనను నిర్లక్ష్యం చేసి బయలు లేక విగ్రహాలను ఆరాధించడం గురించి మనం చదివాము.1

ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యంలో అహాబు పరిపాలనాకాలం విశ్వాసభ్రష్టత్వపు సమయాల్లో ఒకటి. ఒక సందర్భంలో, ఇశ్రాయేలు వారిని, అలాగే బయలు ప్రవక్తలు లేక యాజకులను కర్మెలు పర్వతము వద్ద సమకూర్చమని ఏలీయా ప్రవక్త అహాబు రాజుకు చెప్పెను. జనులు అక్కడ సమకూడినప్పుడు, ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి—“యెన్నాళ్ళమట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవత అయితే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.” 2 అప్పుడు ఏలీయా—తాను మరియు బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తునకలుగా చేసి, “క్రింద అగ్ని యేమియు వేయకుండనే” 3 దానిని తమతమ బలిపీఠములపై పెట్టిన కట్టెల మీద ఉంచెదమని చెప్పెను. తరువాత “మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని చెప్పగా జనులందరును—ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి.” 4

బయలు యాజకులు గట్టిగా కేకలు వేయుచు అగ్నిని క్రిందకు పంపమని ఉనికిలో లేని వారి దేవుడిని గంటల కొద్దీ పిలిచినప్పటికీ, అక్కడ “మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను,” 5 అని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏలీయా వంతు వచ్చినప్పుడు, అతడు క్రింద పడద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, కట్టెలను క్రమముగా పేర్చి, అర్పణను దానిపై ఉంచి, ఒకసారి కాదు కానీ మూడు మారులు దానిపై నీళ్ళు పోయమని చెప్పెను. అతడు లేక ఏ మనిషి యొక్క శక్తి దానిని అగ్ని పుట్టించలేదనుటలో సందేహం లేదు.

“అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థన చేసెను—యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. …

“అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ళను ఆరిపోచేసెను.

“అంతట జనులందరును దాని చూచి సాగిలపడి—యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి.” 6

నేడు ఏలీయా ఇలా చెప్పవచ్చు:

  • దేవుడు, మన పరలోకపు తండ్రి జీవించియుండవచ్చు, లేకపోవచ్చు, కానీ జీవించియుంటే ఆయనను ఆరాధించండి.

  • యేసు క్రీస్తు దేవుని కుమారుడు, మానవజాతి యొక్క పునరుత్థానము చెందిన విమోచకుడు కావచ్చు, లేక ఆయన కాకపోవచ్చు, కానీ ఆయన అయితే, ఆయనను అనుసరించండి.

  • మోర్మన్ గ్రంథము దేవుని వాక్యము కావచ్చు, లేక కాకపోవచ్చు, కానీ అది అయితే, “దానిని (అధ్యయనం చేసి) సూక్తులననుసరించి దేవునికి చేరువకండి.”7

  • 1820వ సంవత్సరపు ఆ వసంతకాల దినమున జోసెఫ్ స్మిత్ తండ్రి మరియు కుమారుని చూచి, వారితో మాట్లాడియుండవచ్చు, మాట్లాడియుండకపోవచ్చు, కానీ మాట్లాడినట్లయితే, ఏలీయా అను నేను అతనిపై దయచేసిన బంధించు తాళపు చెవులతో కలిపి ప్రవక్త మాటను అనుసరించండి.

ఈ మధ్య జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు ఇలా ప్రకటించారు: “ ఏది నిజమని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు (మొరోనై 10:5 చూడుము). ఎవరిని క్షేమంగా నమ్మగలమని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. స్వంత బయల్పాటు ద్వారా, మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని, జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్తయని, ఇది ప్రభువు యొక్క సంఘమని మీ స్వంత సాక్ష్యాన్ని మీరు పొందగలరు. ఇతరులు ఏం చెప్పినా, చేసినా, ఏది సత్యమని మీ మనస్సుకు, హృదయమునకు తెలుపబడిన సాక్ష్యాన్ని ఎవ్వరూ ఎప్పటికీ తీసివేయలేరు.” 8

ఆయన జ్ఞానమును వెదకిన వారందరికి దేవుడు “ధారాళముగా దయచేయునని,”9 వాగ్దానము చేసినప్పుడు యాకోబు ఒక హెచ్చరిక కూడా చేసాడు:

“అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

“అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక,

“ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.”10

మరొక ప్రక్క నిలకడకు పరిపూర్ణమైన మాదిరి మన రక్షకుడు. ఆయనిలా అన్నారు, “తండ్రి కిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.”11 రక్షకుని వలే స్థిరముగా మరియు దృఢముగా ఉన్న లేఖనాలలోని పురుషులు, మరియు స్త్రీలను గూర్చి ఈ వివరణలను పరిశీలించుము.

వారు “సత్యమైన విశ్వాసమునకు పరివర్తన చెందిరి; వారు దానినుండి వెడలిపోరు. ఏలయనగా వారు దృఢముగాను, నిలకడగాను, నిశ్చలముగానుండి ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుటకు పూర్ణ శ్రద్ధతో ఇష్ఠపడిరి.”12

“వారి మనస్సులు దృఢమైనవి, మరియు వారు వారి నమ్మకమును దేవునియందు నిరంతరము ఉంచుచున్నారు.” 13

“ఇదిగో మీకు మీరే ఇది ఎరిగియున్నారు, ఏలయనగా మీరు దానిని చూచియున్నారు, వారిలో ఎంతమంది సత్యము యొక్క జ్ఞానమునకు తేబడియున్నారో వారందరు విశ్వాసమందు మరియు వారు స్వతంత్రులుగా చేయబడిన ఆ విషయమందు దృఢముగాను, నిలకడగాను ఉన్నారు.”14

“వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.”15

క్రీస్తు యందు విశ్వాసములో దీర్ఘకాలం దృఢంగా, నిలకడగా ఉండేందుకు యేసు క్రీస్తు సువార్త ఒకరి హృదయమును, మనస్సును చొచ్చుకొనిపోవుట అవసరము, అనగా సువార్త ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలలో ఒకటిగా మాత్రమే ఉండకుండా, వారి జీవితము, స్వభావము యొక్క అతి ముఖ్య ప్రాధాన్యతగా ఉండాలి. ప్రభువు ఇలా చెప్పారు:

“నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

“నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.

“… మీరు నా జనులైయుందురు, నేను మీ దేవుడనైయుందును.”16

మన బాప్తీస్మమప్పుడు, దేవాలయ విధులలో మనము చేసే నిబంధన ఇదే. కానీ కొందరు ఇంకా తమ జీవితాలలో యేసు క్రీస్తు సువార్తను సంపూర్ణంగా పొందలేదు. అయినప్పటికీ పౌలు చెప్పినట్లుగా, వారు “బాప్తీస్మము వలన (క్రీస్తు) తో కూడ పాతిపెట్టబడిరి,” వారింకను “క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో … , అలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనవలెనను” భాగాన్ని మరచిపోతున్నారు.17 సువార్త ఇంకను వారిని నిర్వచించలేదు. వారింకను క్రీస్తుయందు కేంద్రీకరించుకొనలేదు. వారనుసరించు సిద్ధాంతాలు మరియు ఆజ్ఞల గురించి, సంఘములో వారు ఎక్కడ, ఎప్పుడు సేవ చేస్తారనే దాని గురించి వారు ఎంచుకుంటారు. దానికి విరుద్ధంగా, “నిబంధన ప్రకారము ఏర్పరచబడిన వారు” 18 ఎవరైతే ఖచ్ఛితంగా తమ నిబంధనలను పాటిస్తారో వారు మోసగించబడరు మరియు క్రీస్తు యందు విశ్వాసములో దృఢంగా నిలుస్తారు.

ఒక రకంగా సామాజిక ప్రేరేపణ చేత సువార్త ఆచారాల్లో అన్యమస్కంగా పాల్గొనడం లేదా మరొక రకంగా దేవుని చిత్తం జరిగించడానికి క్రీస్తు వంటి నిబద్ధత చేత పూర్తిగా ప్రేరేపించబడడం, ఈ రెండింటి మధ్య మనలో చాలామంది ఈ క్షణమందు ఊగిసలాడుతుంటారు. ఈ ప్రయాణంలో ఎక్కడో యేసు క్రీస్తు సువార్త యొక్క మంచి వార్త మన హృదయాలలోకి ప్రవేశించి, మన ప్రధాన ప్రేరేపణగా మారుతుంది. అది ఒక్క క్షణంలో జరుగకపోవచ్చు, కానీ మనమందరం దీవెనకరమైన ఆ స్థితివైపు సాగిపోతుండాలి.

ఇది సవాళ్ళతో కూడుకున్నది, కానీ మనం “శ్రమల కొలిమిలో” 19 శుద్ధిచేయబడుతున్నట్లు కనుగొనబడినప్పుడు దృఢంగా, నిలకడగా ఉండేందుకు ఆవశ్యకమైనది. ఇది మర్త్యత్వంలో మనందరికి ఎప్పుడో ఒకప్పుడు జరిగేదే. దేవుడు లేకుండా ఈ అంధకారానుభవాలు నిరాశ, నిస్పృహలకు, పగకు దారితీస్తాయి. దేవుని ద్వారా బాధకు ప్రతిగా ఓదార్పు, సంక్షోభానికి ప్రతిగా శాంతి, దుఃఖమునకు ప్రతిగా నిరీక్షణ కలుగుతాయి. క్రీస్తుయందు విశ్వాసములో దృఢంగా నిలిచియుండడం ఆయన ఆమోదించు కృపను, సహకారాన్ని అందిస్తుంది.20 ఆయన కష్టమైన విషయాలను దీవెనగా మారుస్తారు. యెషయా మాటలలో చెప్పాలంటే, “బూడిదకు ప్రతిగా పూదండ.” 21

స్వతహాగా నాకు తెలిసిన మూడు ఉదాహరణలను నేను చెప్తాను:

ఒకామె వైద్య సహాయం, యాజకత్వ దీవెనలు, ఉపవాసము, ప్రార్థనలు ఉన్నప్పటికీ పట్టువీడని బలహీనపరిచే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నది. అయినప్పటికీ, ప్రార్థన యొక్క శక్తియందు ఆమె విశ్వాసము మరియు ఆమె కొరకు దేవుని ప్రేమ యొక్క వాస్తవికత ఏ మాత్రము తగ్గలేదు. సంఘంలో పిలవబడిన విధంగా సేవ చేస్తూ, తన భర్తకు తోడుగా ఉంటూ, తన చిన్న కుటుంబాన్ని చూసుకుంటూ, వీలైనంతగా చిరునవ్వు నవ్వుతూ ఆమె రోజు రోజుకి (కొన్నిసార్లు గంట గంటకి) ముందుకు సాగుతోంది. తన స్వంత శ్రమలచేత శుద్ధిచేయబడి ఆమె ఇతరులపట్ల ఎక్కువ కనికరమును కలిగియున్నది మరియు ఇతరులకు పరిచర్య చేయడంలో తరచు ఆమె తననుతాను మరచిపోతుంది. ఆమె నిలకడగా కొనసాగుతున్నది మరియు జనులు ఆమెతో ఉండేందుకు సంతోషపడుతున్నారు.

సంఘములో ఎదిగి, పూర్తి-కాల మిషనరీగా సేవ చేసి, చక్కటి అమ్మాయిని పెళ్ళిచేసుకున్న ఒక వ్యక్తి తన తోబుట్టువులలో కొందరు సంఘం గురించి, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ గురించి విమర్శించడం మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యపోయాడు. కొంతకాలం తర్వాత వాళ్ళు సంఘాన్ని వదిలివేసి, అతనితో కూడా అలాగే చేయించడానికి ప్రయత్నించారు. తరచు ఇటువంటి సందర్భాలలో జరిగినట్లుగా, వాళ్ళు విమర్శకులు చేసిన వీడియోలు, వ్యాసాలు, అంకాత్మక శ్రవ్య శ్రేణులతో అతన్ని పట్టువదలకుండా ముట్టడి చేసారు. వారిలో చాలామంది అసంతృప్తిగల మాజీ సంఘ సభ్యులు. అతని తోబుట్టువులు అతడు అవివేకియని, తప్పుదారి పట్టించబడ్డాడని చెప్తూ అతని విశ్వాసాన్ని హేళన చేసారు. వాళ్ళు చెప్పే మాటలకు అతని దగ్గర సమాధానాలు లేవు. నిర్దయగల వ్యతిరేకత క్రింద అతని విశ్వాసం సన్నగిల్లసాగింది. సంఘానికి వెళ్ళడం మానేయాలా అని అతను ఆలోచించసాగాడు. తన భార్యతో మాట్లాడాడు. తాను నమ్మినవారితో మాట్లాడాడు. ప్రార్థించాడు. మనశ్శాంతిలేని ఆ సమయంలో ధ్యానిస్తుండగా, పరిశుద్ధాత్మను అనుభవించిన మరియు ఆత్మచేత సత్యము యొక్క సాక్ష్యాన్ని పొందిన సందర్భాలను గుర్తుచేసుకున్నాడు. “నాతో నేను నిజాయితీగా ఉంటే, ఒకటికంటే ఎక్కువసార్లు ఆత్మ నన్ను తాకిందని, ఆత్మ యొక్క సాక్ష్యము నిజమని నేను ఒప్పుకొని తీరాలి,” అని అతడు ముగించాడు. అతడు క్రొత్తదిగా చేయబడిన సంతోషాన్ని, సమాధానముగల భావనను కలిగియున్నాడు, అది అతని భార్యా పిల్లలచేత పంచుకోబడింది.

తమ జీవితాల్లో నిలకడగా, సంతోషంగా సహోదరుల సలహాను పాటించిన ఒక భార్యాభర్తలు పిల్లలు పుట్టక బాధపడుతుండేవారు. ఎంతోమంది వైద్యులను సంప్రదించి, చాలా డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత కొంతకాలానికి వారు ఒక కుమారునితో దీవించబడ్డారు. కానీ ఒక సంవత్సరం కావస్తుండగా ఎవరి తప్పు లేకుండా జరిగిన ప్రమాదానికి బలైన ఆ బిడ్డ మెదడు బాగా దెబ్బతిని, పాక్షిక అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. అతడికి మంచి వైద్య సదుపాయం అందింది, కానీ ముందుముందు ఏం జరుగుతుందో వైద్యులు చెప్పలేకపోయారు. ఈ లోకంలోకి తీసుకురావడానికి ఈ దంపతులు ఎంతగానో ప్రయత్నించి, ప్రార్థించిన ఆ బిడ్డ ఒకరకంగా దూరమైపోయాడు, మళ్ళీ అతడు వారి దగ్గరికి తిరిగి వస్తాడో లేదో తెలియదు. వారి ఇతర బాధ్యతలతోపాటు ఇప్పుడు వారు తమ బిడ్డ యొక్క క్లిష్టమైన అవసరాలు తీర్చడానికి శ్రమిస్తున్నారు. ఈ అత్యంత కష్టతరమైన సందర్భంలో వారు ప్రభువు వైపు తిరిగారు. ఆయన నుండి వారు పొందే “అనుదిన ఆహారము” మీద వారు ఆధారపడ్డారు. దయగల స్నేహితులు, కుటుంబము చేత వారు సహాయం చేయబడ్డారు మరియు యాజకత్వ దీవెనల చేత బలపరచబడ్డారు. మరొక విధంగా ఇది సాధ్యమయ్యే దానికంటే వారు ఒకరికొకరు దగ్గరయ్యారు, బహుశా వారి ఐక్యత ఇప్పుడు మరింత లోతుగా, మరింత సంపూర్ణంగా మారింది, మరొక విధంగా ఇది సాధ్యం కాకపోయి ఉండవచ్చు.

1837, జూలై 23న అప్పటి పన్నెండుమంది అపొస్తలుల కూటమి అధ్యక్షులైన థామస్ బి. మార్ష్ గారికి ప్రభువు ఒక బయల్పాటునిచ్చారు. అందులో క్రింది విషయాలున్నాయి:

“నీ పన్నెండు మంది సహోదరుల కొరకు ప్రార్థించుము. నా నామము నిమిత్తము వారిని తీవ్రముగా మందలించుము, వారి పాపములన్నింటి నిమిత్తము వారు మందలించబడవలెను, నా నామము కొరకు నీవు నా యెదుట విశ్వాసముగా నుండుము.

“వారి శోధనలు, అధిక శ్రమ తరువాత, ఇదిగో, ప్రభువైన నేను వారిని సమీపించెదను, వారు తమ హృదయాలను కఠినపరచుకొనక, నాకు వ్యతిరేకముగా తమ మెడలను బిరుసుగా చేసుకొనని యెడల, వారు పరివర్తన చెందుతారు, మరియు నేను వారిని స్వస్థపరిచెదను.”22

ఈ వచనాలలో చెప్పబడిన సూత్రాలు మనందరికి వర్తిస్తాయని నేను నమ్ముతున్నాను. మనం అనుభవించే శోధనలు, శ్రమలతోపాటు ప్రభువు విధించే పరీక్షలు మనల్ని పూర్తి పరివర్తన మరియు స్వస్థతవైపు నడిపించగలవు. కానీ ఆయనకు వ్యతిరేకంగా మనం మన హృదయాలను కఠినపరచుకొనక, మన మెడలను బిరుసు చేసుకొనకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఏమి జరిగినప్పటికినీ, మనం దృఢంగా, నిలకడగా ఉన్నట్లయితే ఆయన పేతురుతో, “నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము,”23 అని చెప్పినప్పుడు రక్షకుడు ఉద్దేశించిన పరివర్తనను, రద్దు చేయబడలేని సంపూర్ణ పరివర్తనను మనం సాధిస్తాము. మనల్ని పరిశుద్ధపరుస్తూ, పాపముతో గాయపరచబడిన మన ఆత్మలను శుద్ధిచేసి, పవిత్రపరచడమే వాగ్దానమివ్వబడిన స్వస్థత.

“కూరగాయలు తిను; అది నీకు మంచిది,” అనే మన తల్లుల సలహా నాకు గుర్తుకు వస్తోంది. మన తల్లులు చెప్పేది నిజము, విశ్వాసములో నిలకడగా ఉండే సందర్భంలో, “కూరగాయలు తినడం” అనగా నిరంతరం ప్రార్థించడం, రోజూ లేఖనాలను విందారగించడం, సంఘంలో సేవ చేయడం, ఆరాధించడం, ప్రతీవారం యోగ్యులుగా సంస్కారములో పాలుపొందడం, మీ పొరుగువారిని ప్రేమించడం మరియు ప్రతిరోజు దేవునికి విధేయత చూపుతూ మీ సిలువనెత్తుకోవడం. 24

క్రీస్తుయందు విశ్వాసములో దృఢంగా, నిలకడగా ఉండేవారికి ఇప్పుడు మరియు తర్వాత కలుగబోవు మంచి విషయాలను గూర్చి వాగ్దానమును ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోండి. “నిత్యజీవము మరియు పరిశుద్ధుల సంతోషమును జ్ఞాపకముంచుకోండి.” 25 “ఓ, హృదయమందు శుద్ధులైన మీరందరూ మీ తలలను పైకెత్తుడి, దేవుని యొక్క ప్రీతికరమైన వాక్యమును అందుకొనుడి, ఆయన ప్రేమపై విందారగించుడి; ఏలయనగా, మీ మనస్సులు స్థిరముగా నుండిన యెడల శాశ్వతముగా మీరట్లు చేయగలరు.”26 యేసు క్రీస్తు నామమున, ఆమేన్.