2010–2019
తల్లిదండ్రులు మరియు పిల్లలు
అక్టోబర్ 2018


తల్లిదండ్రులు మరియు పిల్లలు

మన తండ్రి యొక్క గొప్ప సంతోషము యొక్క ప్రణాళిక మీరు ఎవరు మరియు మీ జీవితపు ఉద్దేశమును మీకు చెప్పును.

నా ప్రియమైన సహోదరీలారా, 8 ఏళ్ళు, ఆ పైబడిన వయస్సు గల సంఘ స్త్రీల కోసం ఈ క్రొత్త సర్వసభ్య సమావేశ భాగము ఏర్పాటు చేయడం ఎంత అద్భుతమైనది. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ నుండి ప్రేరేపించబడిన సందేశాన్ని మనం విన్నాము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి మార్గదర్శకత్వంలో పనిచేయటాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఆయన ప్రవచనాత్మక ప్రసంగము కోసం మేము ఎదురుచూస్తున్నాము.

పిల్లలు దేవుని నుండి మన అమూల్యమైన బహుమానము---మన నిత్య వృద్ధి. అయినప్పటికీ, ఎంతోమంది స్త్రీలు పిల్లల్ని కని, పెంచడానికి ఇష్టపడని సమయంలో మనం జీవిస్తున్నాము. అనేకమంది యౌవనులు భౌతిక అవసరాలు తీరేవరకు పెళ్ళిని ఆలస్యం చేస్తున్నారు. మన సంఘ సభ్యుల వివాహముల సగటు వయస్సు రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా పెరిగింది, మరియు మన సంఘ సభ్యుల జననాల సంఖ్య తగ్గుతోంది. సంయుక్త రాష్ట్రాలు, మరికొన్ని ఇతర దేశాలు వయస్సవుతున్న పెద్దవారిని చూసుకోవడానికి భవిష్యత్తులో యువత తక్కువవుతున్న సమస్యను ఎదుర్కొంటున్నాయి. 1 సంయుక్త రాష్ట్రాల్లో 40 శాతం కంటే పైగా జననాలు పెళ్ళికాని తల్లులకు కలుగుతున్నాయి. ఆ పిల్లలు దుర్భలమైనవారు. ఈ సామాజిక ధోరణులలో ప్రతీది మన తండ్రి యొక్క దైవిక రక్షణ ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

తల్లి కావడం వారి ఉన్నతమైన ప్రాధాన్యత, వారి అంతిమ ఆనందమని కడవరి-దిన పరిశుద్ధ స్త్రీలు గ్రహించారు. అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ ఇలా అన్నారు: “స్త్రీలు తమ గొప్ప నెరవేర్పును, గొప్ప సంతోషములో ఎక్కువ భాగము ఇంటిలోను, కుటుంబంలోను చూస్తారు. దేవుడు స్త్రీ లోపల ఎదైనా దైవత్వాన్ని నాటారు, అది దానికదే నిశ్శబ్ద మైన బలంలో, శుద్ధీకరణలో, సమాధానంలో, మంచితనంలో, సుగుణంలో, సత్యములో, ప్రేమలో వ్యక్తపరుస్తుంది. అసాధారణమైన ఈ సుగుణాలన్నీ తమ నిజమైన, అత్యంత సంతృప్తికరమైన వ్యక్తీకరణను మాతృత్వంలో కనుగొంటాయి.”

ఆయన కొనసాగించాడు, “తన పిల్లల్ని నీతిలో, సత్యములో పెంచి, పోషించి, బోధించి, జీవించి, ప్రోత్సహించడం కన్నా ఒక స్త్రీ ఎప్పటికీ చేయగల మిక్కిలి గొప్ప పని మరొకటి లేదు. ఆమె ఏమి చేసినప్పటికీ, దానితో పోల్చదగినది ఏదీ లేదు.”2

తల్లులారా, ప్రియమైన సహోదరీలారా, మీరు ఎవరో దాని కొరకు మరియు మా అందరి కోసం మీరు చేసే దానిని మేము ప్రేమిస్తున్నాము.

2015 లో “నా సహోదరీలకు అభ్యర్థన,” అనే శీర్షికగల తన ముఖ్య ప్రసంగంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు:

“పరిశుద్ధ నిబంధనలు చేసి, వాటిని పాటించే స్త్రీలు, దేవుని శక్తి మరియు అధికారముతో మాట్లాడగల స్త్రీలు లేకుండా దేవుని రాజ్యము సంపూర్ణం కాదు, కాలేదు!

“నేడు. . . తమ విశ్వాసం ద్వారా ముఖ్యమైన పనులు జరిగేలా ఎలా చేయాలో తెలిసిన స్త్రీలు మనకు కావాలి, మరియు పాపంతో నిండిన ఈ లోకంలో నైతికతను, కుటుంబాలను కాపాడే ధైర్యం గల స్త్రీలు కావాలి. ఉన్నతస్థితి వైపు నిబంధన బాట గుండా దేవుని పిల్లల్ని కాపాడేందుకు అంకితమైన స్త్రీలు మనకవసరము; వ్యక్తిగత బయల్పాటును పొందడమెలాగో తెలిసిన స్త్రీలు, దేవాలయ ఎండోమెంటు యొక్క శక్తిని, సమాధానాన్ని గ్రహించే వారు; పిల్లల్ని, కుటుంబాలను కాపాడి, బలపరిచేందుకు పరలోకపు శక్తులను ఎలా పిలవాలో తెలిసిన స్త్రీలు; నిర్భయంగా బోధించే స్త్రీలు మనకు అవసరము.”3

ఈ ప్రేరేపించబడిన బోధనలన్నీ “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” పై ఆధారపడియున్నవి మరియు దానిలో ఆయన ఈ భూమిని సృష్టించక ముందు సృష్టికర్త యొక్క ప్రణాళికకు కేంద్రమైన సిద్ధాంతము మరియు అభ్యాసాలను పునఃస్థాపించబడిన ఈ సంఘము తిరిగి ధృవీకరించింది.

ఇప్పుడు ఈ శ్రోతలలోని యువతతో నేను మాట్లాడతాను. నా ప్రియమైన యువ సహోదరీలారా, పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సువార్త యొక్క జ్ఞానము కలిగియున్నందున మీరు ప్రత్యేకమైన వారు. మీ జ్ఞానము మీరు ఎదిగేటప్పుడు వచ్చే కష్టాలను సహించడానికి, జయించడానికి సాధ్యం చేస్తుంది. చిన్న వయస్సు నుండే, మీరు ప్రాజెక్టులలో, కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అవి మీ వ్రాతను, మాట్లాడుటను, ప్రణాళిక చేయుట వంటి ప్రతిభలను అభివృద్ధి చేసాయి మీరు బాధ్యతగల ప్రవర్తనను మరియు అబద్ధమాడడం, మోసగించుట, దొంగిలించడం, లేక మద్యము లేక మత్తుమందులను ఉపయోగించు శోధనలను ఎలా ఎదిరించాలో నేర్చుకున్నారు.

అమెరికా టీనేజర్లు మరియు మతముపై ఉత్తర కరోలీనా విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో మీ ప్రత్యేకత గుర్తించబడింది. “Mormon Teens Cope Best: Study Finds They Top Peers at Handling Adolescence” (వయస్సుతో వచ్చే ఒత్తిడులను తట్టుకోవడంలో తోటివారికన్నా మోర్మన్ యువత మెరుగ్గా ఉన్నారు) అనే పేరుతో Charlotte Observer వ్యాసం. “ప్రమాదకర ప్రవర్తలను తప్పించుకోవడం, బాగా చదువుట, భవిష్యత్తు గురించి అనుకూల వైఖరి కలిగియుండటం” లో మోర్మనులు మెరుగ్గా ఉన్నారని ఈ వ్యాసము ముగించింది. “దాదాపు మేము పరిశీలించిన ప్రతి విభాగంలో, ఒక స్పష్టమైన మాదిరి ఉన్నది: మోర్మనులు ముందున్నారు,”4 అని అధ్యయనంలో మన యువతలో ఎక్కువమందిని ఇంటర్యూ చేసిన ఒక పరిశోధకుడు చెప్పారు.

ఎదిగే క్రమంలో వచ్చే కష్టాలను మీరెందుకు బాగా ఎదుర్కోగలరు? యువతులారా, ఎందుకనగా మీరు మన పరలోకపు తండ్రి యొక్క గొప్ప సంతోష ప్రణాళికను గ్రహించారు. ఆ ప్రణాళిక మీరెవరో, మీ జీవితపు ఉద్దేశమేమిటో మీకు తెలుపును. ఆ గ్రహింపు గల యువత సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు మరియు సరైన దానిని ఎంపిక చేయటంలో ముందుంటారు. ఎదిగే క్రమంలో వచ్చే కష్టాలన్నిటినీ జయించడంలో మీరు ప్రభువు యొక్క సహాయాన్ని కలిగియుండగలరని మీకు తెలుసు.

మీరు అత్యంత ప్రభావవంతులుగా ఉండడానికి గల మరో కారణం, మీరు మిమ్మల్ని ప్రేమించే పరలోకపు తండ్రి యొక్క పిల్లలని మీరు గ్రహించడమే. మన గొప్ప కీర్తన, “Dearest Children, God is Near You” (ప్రియమైన పిల్లలారా, దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు ) తో మీకు పరిచయమున్నదని నేను అనుకుంటున్నాను. మనమందరము పాడి, విశ్వసించిన మొదటి చరణమిది:

ప్రియమైన పిల్లలారా, దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు,

రాత్రి, పగలు మిమ్మల్ని కావలికాయుచున్నాడు,

మిమ్మల్ని తన స్వంతము చేసుకొని, దీవించేందుకు సంతోషిస్తాడు,

మీరు సరైనది చేయడానికి ప్రయత్నించినట్లైతే.5

ఆ చరణంలో రెండు బోధనలున్నాయి: మొదటిది, మన పరలోకపు తండ్రి మనకు దగ్గరగా ఉండి రాత్రి, పగలు మనల్ని కావలి కాయుచున్నారు. దానిగురించి ఆలోచించండి! దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు, మనల్ని కావలి కాయుచున్నాడు. రెండవది, ఆయన మనము “సరైనది చేయడానికి ప్రయాసపడినప్పుడు,” మనల్ని దీవించడానికి ఆయన సంతోషిస్తున్నారు. మన ఆందోళనలు మరియు కష్టాల మధ్య ఎటువంటి ఓదార్పు!

అవును, యువతులారా, మీరు ధన్యులు, మీరు అద్భుతమైనవారు, కానీ పరలోకపు తండ్రి యొక్క పిల్లలందరి వలే “సరైనది చేయడానికి ప్రయాసపడుటకు” అవససరతను మీరు కలిగియున్నారు.

ఇక్కడ అనేక భిన్నమైన విషయాల మీద నేను మీకు సలహా ఇవ్వగలను, కానీ రెండు మాత్రమే మాట్లాడుటకు నేను ఎన్నుకున్నాను.

నా మొదటి సలహా సెల్‌ఫోన్లుకు సంబంధించినది. సంయుక్త రాష్ట్రాలలోని యువతలో సగానికి పైగా ఎక్కువ సమయం వారి సెల్‌ఫోన్లతో గడుపుతారని ఈ మధ్య దేశవ్యాప్త సర్వే ఒకటి కనుగొన్నది. వారు తమ సెల్‌ఫోన్ల నుండి దూరంగా వేరు చేయబడినప్పుడు ఆందోళన చెందినట్లు 40 శాతం కన్నా ఎక్కువమంది చెప్పారు.6 ఇది అబ్బాయిలలో కంటే అమ్మాయిలలో చాలా సాధారణమైనది. నా యువ సహోదరీలారా—మరియు పెద్దవారైన స్త్రీలు కూడా—మీరు సెల్‌ఫోన్ల వినియోగాన్ని, వాటిపై ఆధారపడే తత్వాన్ని పరిమితం చేసినట్లైతే, అది మీ జీవితాలను దీవిస్తుంది.

నా రెండవ సలహా ఇంకా ముఖ్యమైనది. ఇతరులపట్ల దయ కలిగియుండుము. మన యువతలో చాలామంది ఇప్పటికే దయతో మెలుగుతున్నారు. కొన్ని సామాజిక వర్గాల్లోని కొన్ని యువ సమూహాలు మనందరికి మార్గం చూపాయి. ప్రేమ మరియు సహాయం అవసరమైన వారిపట్ల మన యువత యొక్క దయగల చర్యల చేత మనము ప్రేరేపించబడ్డాము. అనేక విధాలుగా మీరు ఆ సహాయాన్ని అందిస్తారు, మరియు ఒకరినొకరిపట్ల ఆ ప్రేమను చూపిస్తారు. అందరూ మీ మాదిరిని అనుసరించాలని మేము కోరుతున్నాము.

అదే సమయంలో, నిర్దయగా ఉండేందుకు సాతాను మనందరినీ శోధస్తాడని మనకు తెలుసు, మరియు పిల్లలు మరియు యువత మధ్య కూడా దీనికి అనేక మాదిరిలున్నాయి. పట్టువీడని నిర్దయ అనేది బెదిరింపు, ఇతరులను ఏడ్పించడానికి లేక తిరస్కరించటానికి ఒక బృందంగా ఏర్పడడం లేదా సమకూడడం వంటి రకరకాల పేర్లతో పిలువబడుతుంది. ఈ మాదిరులు సహవాసులు లేక స్నేహితులకు ఉద్దేశపూర్వకంగా బాధను కలిగిస్తాయి. నా యువ సహోదరీలారా, మనము ఇతరుల పట్ల క్రూరంగా లేక నీచంగా వ్యవహరించడం ప్రభువుకు సంతోషాన్ని కలిగించదు.

ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ యూటాలో, శరణార్థిగా ఉన్న ఒక యువకుడు నాకు తెలుసు, తన మాతృభాష మాట్లాడుట కలిపి, భిన్నంగా ఉన్నందుకు అతడు ఆటపట్టించబడ్డాడు. అతడు ప్రతిఘటించే వరకు ప్రత్యేక యువ సమూహముచేత రెచ్చగొట్టబడుట ద్వారా అతడు హింసించబడ్డాడు, ఎంతగా అనగా దాని ఫలితంగా అతని బహిష్కరణ గురించి ఆలోచిస్తూ 70 రోజులకు పైగా అతన్ని చెరసాలలో ఉంచారు. ఈ యువ సమూహాన్ని రెచ్చగొట్టినదేమిటో నాకు తెలియదు, వారిలో చాలామంది మీలాగే కడవరి-దిన పరిశుద్ధులు, కానీ దేవుని పిల్లల్లో ఒకరికి జరిగిన విషాదభరితమైన అనుభవం మరియు వ్యయంలో వారి నీచత్వపు ప్రభావాన్ని నేను చూడగలిగాను. నిర్దయగల స్వల్పమైన క్రియలు నాశనకరమైన పర్యవసానములను కలిగియుండగలవు.

నేను ఆ వృత్తాంతాన్ని వినినప్పుడు, దానిని ఇటీవలి ప్రపంచవ్యాప్త యౌవనుల భక్తి కార్యక్రమంలో మన ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్ గారు చెప్పిన దానితో పోల్చాను. ఇశ్రాయేలును సమకూర్చుటలో సహాయపడమని మిమ్మల్ని మరియు యువత మొత్తాన్ని అడుగుతూ, “భిన్నంగా ఉండండి; లోకము నుండి ప్రత్యేకంగా ఉండండి. మీరు లోకమునకు వెలుగైయుండవలెనని మీకును నాకును తెలుసు. కావున, మీరు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులవలె కనిపించాలి, వినిపించాలి, ప్రవర్తించాలి మరియు దుస్తులు ధరించాలని ఆయన చెప్పారు.”7

మిమ్మల్ని చేరమని అధ్యక్షులు నెల్సన్ గారు ఆహ్వానించిన యువ సైన్యం ఒకరితో ఒకరు నీచంగా ప్రవర్తించరు. వారు సమీపించమని, ప్రేమించమని, ఇతరుల గురించి ఆలోచించమని, ఎవరైనా మనకు తప్పు చేసారని మనము భావించినప్పుడు మరొక చెంప కూడా త్రిప్పమను రక్షకుని బోధనను అనుసరిస్తారు.

మీలో చాలామంది పుట్టినప్పుడు, ఒక సర్వసభ్య సమావేశ ప్రసంగంలో అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ గారు, “సువార్తను జీవించడానికి ప్రయత్నిస్తున్న అందమైన యువతులను” అభినందించారు. నేను మిమ్మల్ని ఏ విధంగా వర్ణించాలని భావిస్తున్నానో అలాగే ఆయన వారిని వర్ణించారు:

“వారు ఒకరిపట్ల ఒకరు ఉదారముగా ఉన్నారు. వారు ఒకరినొకరు బలపరచాలని కోరారు. వారు తమ తల్లిదండ్రులకు, వారు పెరిగిన గృహాలకు వన్నె తెచ్చారు. వారు స్త్రీత్వాన్ని సమీపిస్తున్నారు మరియు వారినిప్పుడు ప్రేరేపించిన ఆదర్శాలను వారి జీవితములంతటా పాటిస్తారు.”8

యువతులారా, మన ప్రపంచానికి మీ మంచితనము, ప్రేమ కావాలని దేవుని సేవకుడిగా నేను మీతో చెప్పుచున్నాను. ఒకరినొకరిపట్ల దయతో మెలగండి. మనము ఒకరినొకరు ప్రేమించాలని, మనము ఆదరించబడాలని కోరుకున్నట్లుగా ఇతరులను ఆదరించమని యేసు మనకు బోధించారు. మనం దయతో మెలగడానికి ప్రయాసపడినప్పుడు, ఆయనకు, ప్రేమగల ఆయన ప్రభావానికి మనం దగ్గరవుతాము.

నా ప్రియమైన సహోదరీలారా, మీరు వ్యక్తిగతంగానైనా లేక సమూహముగానైనా---ఏవిధమైన నీచత్వము లేదా అల్పమైన వాటిలో పాల్గొన్నట్లైతే --- ఇప్పుడే మారడానికి మరియు ఇతరులు మారేలా ప్రోత్సహించడానికి తీర్మానించండి. అదే నా సలహా, మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సేవకునిగా నేను దానిని మీకిస్తున్నాను, ఎందుకంటే ఈ ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడమని ఆయన ఆత్మ నన్ను ప్రేరేపించింది. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనము ఒకరినొకరము ప్రేమించమని బోధించిన, మన రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. మనము ఆవిధంగా చేయాలని నేను యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. See Sara Berg, “Nation’s Latest Challenge: Too Few Children,” AMA Wire, June 18, 2018, wire.ama-assn.org.

  2. Teachings of Gordon B. Hinckley (1997), 387, 390; see also M. Russell Ballard, “Mothers and Daughters,” Liahona, May 2010, 18 (in Daughters in My Kingdom: The History and Work of Relief Society [2011], 156).

  3. Russell M. Nelson, “A Plea to My Sisters,” Liahona, Nov. 2015, 96; see also Russell M. Nelson, “Children of the Covenant,” Ensign, May 1995, 33.

  4. The study was published by the Oxford University Press as Christian Smith and Melinda Lundquist Denton, Soul Searching: The Religious and Spiritual Lives of American Teenagers (2005).

  5. “Dearest Children, God Is Near You,” Hymns, no. 96.

  6. See “In Our Opinion: You Don’t Need to Be Captured by Screen Time,” Deseret News, Aug. 31, 2018, deseretnews.com.

  7. Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), 8, HopeofIsrael.lds.org.

  8. Gordon B. Hinckley, “The Need for Greater Kindness,” Liahona, May 2006, 60–61.

ముద్రించు