నిస్వార్థమైన సేవ యొక్క ఆనందము
మనము ప్రేమతో ఆయనకు, ఇతరులకు సేవ చేస్తామని మరియు సమస్త విషయములందు ఆయన చిత్తమును చేస్తామని మన పరలోకమందున్న తండ్రికి వాగ్దానము చేసాము.
గత సర్వసభ్య సమావేశము తరువాత, అనేకమంది అదే ప్రశ్నతో నన్ను సమీపించారు: “ఆ కుర్చీలు సౌకర్యంగా ఉన్నాయా?” నా జవాబు ప్రతీసారి ఒకేరీతిగా ఉన్నది: “మీరు మాట్లాడాల్సిన అవసరము లేకపోతే ఆ కుర్చీలు చాలా సౌకర్యంగా ఉంటాయి. అది నిజం, కదా? ఈ సమావేశములో నా కుర్చీ అంత సౌకర్యవంతంగా లేదు, కానీ ఈ సాయంత్రము మీతో మాట్లాడే దీవెన మరియు గౌరవము కొరకు నేను నిజంగా కృతజ్ఞురాలిని.
కొన్నిసార్లు మనము సేవ చేసినప్పుడు, వేర్వేరు పిలుపులలో సేవ చేసే అవకాశం కలుగుతుంది. కొన్ని చాలా సౌకర్యంగా ఉంటాయి మరియు కొన్ని ఉండవు, కానీ మనము ప్రేమతో ఆయనకు, ఇతరులకు సేవ చేస్తామని మరియు సమస్త విషయములందు ఆయన చిత్తమును చేస్తామని మన పరలోకమందున్న తండ్రికి వాగ్దానము చేసాము.
కొన్ని సంవత్సరాల క్రితం, “మీరు ‘దేవుని సేవకు పూనుకొన్నప్పుడు’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 4:2], మీరు శాశ్వతంగా గొప్ప ప్రయాణములో చేరుతున్నారని సంఘములోని యువత నేర్చుకున్నారు. మీరు దేవుని కార్యమును త్వరపరచుటలో సహాయపడుతున్నారు మరియు అది గొప్ప, సంతోషకరమైన, అద్భుతమైన అనుభవము.”1 ఏ వయస్సులో ఉన్నప్పటికీ---అది అందరికీ లభ్యమయ్యే ప్రయాణము---మరియు “నిబంధన బాట”2 గా మన ప్రియమైన ప్రవక్త చెప్పిన దాని వెంబడి మనల్ని తీసుకొనివెళ్లే ప్రయాణమది.
దురదృష్టవశాత్తు, మనము స్వార్థపూరితమైన ప్రపంచములో జీవిస్తున్నాము. అక్కడ జనులు నిరంతరము, “ఈ రోజు నేనెవరికి సహాయపడగలను?” లేక “నా పిలుపులో నేను ప్రభువుకు బాగా ఎలా సేవ చేయగలను?” లేక “నా సమస్తమును నేను ప్రభువుకు ఇస్తున్నానా?” అని అడగడానికి బదులుగా “దానివల్ల నాకేమి ప్రయోజనము కలుగుతుంది?” అని అడుగుతారు.
నా జీవితంలో నిస్వార్థమైన సేవకు గొప్ప మాదిరి సహోదరి విక్టోరియా ఆంటోనియెట్టి. అర్జెంటీనాలో నేను ఎదుగుచుండగా, విక్టోరియా నా శాఖలోని ప్రాథమిక బోధకురాళ్ళలో ఒకరు. ప్రతీ మంగళవారం సాయంత్రము, మేము ప్రాథమిక కొరకు సమావేశమైనప్పుడు, ఆమె మాకు ఒక చాక్లెట్ కేక్ తెచ్చేది. ప్రతీ ఒక్కరు కేక్‌ను ఇష్టపడేవారు---ప్రతీఒక్కరు, నేను తప్ప. నాకు చాక్లెట్ కేక్ అంటే అసహ్యము! ఆమె నాకివ్వడానికి ప్రయత్నించినప్పటికీ, నేను ఎప్పుడూ తిరస్కరించాను.
ఒకరోజు ఆమె మిగిలిన పిల్లలకు చాక్లెట్ కేక్ ఇచ్చిన తరువాత, నేను ఆమెను అడిగాను, “ఆరెంజ్ లేక వెనిల్లా వంటి---వేరే రుచిగల కేకును మీరెందుకు తీసుకురారు?”
కాస్త నవ్విన తరువాత, ఆమె నన్ను అడిగింది, “నీవు ఎందుకు చిన్న ముక్క రుచి చూడవు? ఈ కేక్ ప్రత్యేకమైన పదార్థముతో తయారు చేయబడింది, నువ్వు రుచి చూస్తే, అది నీకు తప్పక నచ్చుతుందని నేను మాటిస్తున్నాను!”
నేను చుట్టూ చూసాను, ప్రతీ ఒక్కరు కేక్‌ను ఆనందించటం చూసి నేను ఆశ్చర్యపడ్డాను. కాస్త రుచి చూడటానికి నేను ప్రయత్నించాను. ఏమి జరిగిందో ఊహిస్తారా అది నాకు నచ్చింది! చాక్లెట్ కేక్ నాకు నచ్చడం అదే మొదటిసారి.
చాలా సంవత్సరాల తరువాత వరకు, సహోదరి ఆంటోనియెట్టి చాక్లెట్ కేక్‌లో రహస్య పదార్థమేమిటో నేను తెలుసుకోలేకపోయాను. నా పిల్లలు, నేను మా అమ్మను చూడడానికి ప్రతీ వారము వెళ్తాము. అలా ఒకసారి వెళ్ళినప్పుడు అమ్మ, నేను చాక్లెట్ కేక్ తింటున్నాము, మొదటిసారి ఆ కేక్‌ను ఎలా ఇష్టపడ్డానో ఆమెకు చెప్పాను. అప్పుడు ఆమె మిగిలిన కథ చెప్పి నాకు జ్ఞానోదయం కలిగించింది.
“చూడు, క్రిస్,” “విక్టోరియా మరియు ఆమె కుటుంబము డబ్బు గలవారు కాదు. ప్రతీవారము ఆమె ప్రాథమికకు తన నలుగురు పిల్లలను తీసుకొనివెళ్ళడానికి బస్సుకు డబ్బు చెల్లించాలో లేక తన ప్రాథమిక తరగతి కొరకు చాక్లెట్ కేక్ చేయడానికి పదార్థాలను కొనాలో ఎన్నుకోవాల్సి ఉండేది. ఆమె బస్సుకు బదులుగా చాక్లెట్ కేక్‌ను ఎల్లప్పుడు ఎన్నుకొనేది, వాతావరణాన్ని లక్ష్యపెట్టకుండా ఆమె మరియు ఆమె పిల్లలు ఒక్కోవైపు రెండు మైళ్లు (3 కిమీ) కంటే ఎక్కువ దూరము నడిచేవారు,” అని అమ్మ చెప్పింది.
ఆ రోజు నేను ఆమె చాక్లెట్ కేక్ విలువ తెలుసుకున్నాను. ముఖ్యముగా, నేను విక్టోరియా కేక్‌లో రహస్య పదార్థమును తెలుసుకున్నాను. అది ఆమె సేవ చేసిన వారిపట్ల గల ప్రేమేనని మరియు మా తరఫున ఆమె నిస్వార్థమైన త్యాగమని నేను తెలుసుకున్నాను.
విక్టోరియా కేక్ గురించి ఆలోచించడం, దేవాలయ ఖజానా వైపు ఆయన నడిచినప్పుడు, ప్రభువు తన శిష్యులకు బోధించిన సనాతనమైన పాఠములో నిస్వార్థమైన త్యాగమును జ్ఞాపకము చేసుకోవడానికి నాకు సహాయపడింది.ఆ కథ మీకు తెలుసు. ఎల్డర్ జేమ్స్ ఈ. టాల్మేజ్ - అక్కడ 13 పెట్టెలున్నాయని, “మరియు వాటిలో పెట్టెలపై వ్రాతల ద్వారా సూచించబడిన (వేర్వేరు) ఉద్దేశ్యముల కొరకు జనులు వారి కానుకలను పెట్టెలో వేసేవారని” బోధించారు. వేర్వేరు రకాల జనులు నిలబడిన దాతల వరుసలను యేసు గమనించారు. కొందరు తమ విరాళాలు చూడబడాలని, గమనించబడాలని మరియు వాటి కొరకు పొగడబడాలని ఆశిస్తూ, “వెండి, బంగారము అధిక మొత్తములో” వేయగా మిగిలిన వారు “నిజాయితీగల ఉద్దేశము” తో తమ బహుమతులను ఇచ్చారు.
“అనేకమంది మధ్య, ఒక బీద విధవరాలు వచ్చి . . . కానుకల పెట్టెలో కాసులు అనబడే రెండు ఇత్తడి నాణెములు వేసింది; ఆమె కానుక అమెరికా డబ్బులలో సగము సెంటు కంటే తక్కువ మొత్తము. ప్రభువు తన శిష్యులను పిలిచి, పేదరికంలో ఉన్న విధవరాలి వైపు మరియు ఆమె చర్యపట్ల వారి ఆసక్తిని మరల్చి ఇలా అన్నారు: ‘వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవమంతయు వేసెనని చెప్పెను’ [మార్కు 12:43– 44].”3
విధవరాలు తన కాలములోని సమాజములో గమనింపదగిన స్థానమును కలిగిలేదు. వాస్తవానికి ఆమె ఎదైన ఎక్కువ ముఖ్యమైనది కలిగియున్నది: ఆమె ఉద్దేశములు శుద్ధమైనవి, మరియు ఆమె తనకు కలిగిన సమస్తమును ఇచ్చింది. బహుశా ఆమె ఇతరుల కంటే తక్కువ ఇచ్చింది, ఇతరులకంటే ఎక్కువగా, ఇతరుల కంటే భిన్నంగా ఇచ్చింది. కొందరి కళ్లలలో, ఆమె ఇచ్చినది అతి స్వల్పమైనది, కానీ “హృదయపు ఆలోచనలు మరియు ఉద్దేశములను గ్రహించు,” 4 రక్షకుని కన్నులలో ఆమెకు గల సమస్తమును ఇచ్చివేసెను.
సహోదరిలారా, మనము దాచకుండా ప్రభువుకు మన సమస్తమును ఇచ్చివేస్తున్నామా? ప్రభువును ప్రేమించుటకు మరియు ఆయన ఆజ్ఞలు పాటించుట క్రొత్త తరము నేర్చుకొనునట్లు మన సమయము మరియు ప్రతిభలను మనము త్యాగము చేస్తున్నామా? మనము మన చుట్టూ ఉన్నవారికి, మనకు నియమింపబడిన వారికి శ్రద్ధ, జాగ్రత్తతో, మరొక విధాలుగా ఉపయోగించగల సమయమును మరియు బలమును త్యాగము చేస్తూ పరిచర్య చేస్తున్నామా? దేవునిని ప్రేమించి, మరియు ఆయన పిల్లలను ప్రేమించుమనే రెండు గొప్ప ఆజ్ఞలను మనము జీవిస్తున్నామా? 5 తరచుగా ఆ ప్రేమ సేవగా ప్రత్యక్షపరచబడింది.
అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు: “మన రక్షకుడు నిస్వార్థమైన సేవలో తనను తాను త్యాగము చేసారు. ఇతరులకు సేవ చేయడానికి మన స్వార్థపూరిత ఆసక్తులను వదిలివేయడం ద్వారా మనలో ప్రతిఒక్కరం తనను వెంబడించాలని ఆయన బోధించారు.”
ఆయన ఇలా కొనసాగించారు:
“ఇతరుల సేవలో మనల్ని మనం కోల్పోయే పరిచయమైన మాదిరి . . . తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు చేసే త్యాగము. ప్రతీ బిడ్డను కని, పెంచడానికి తల్లులు బాధను అనుభవిస్తారు మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలను, సౌకర్యాలను కోల్పోతారు. కుటుంబానికి సహకారమివ్వడానికి తండ్రులు వారి జీవితాలను, ప్రాధాన్యతలను సర్దుబాటు చేస్తారు. …
“… వికాలాంగులైన కుటుంబ సభ్యులు మరియు వృద్ధులైన తల్లిదండ్రుల కొరకు శ్రద్ధ తీసుకొను వారియందు కూడా మేము ఆనందిస్తున్నాము. ఈ సేవలలో ఏవీ నాకేం ప్రయోజనము వస్తుందని అడగవు. వీటన్నిటికి నిస్వార్థమైన సేవ కోసం వ్యక్తిగత సౌకర్యాన్ని ప్రక్కన పెట్టడం అవసరము. …
“మనము పొందే దానికొరకు కాదు, కానీ మనమిచ్చే దాని కొరకు సేవ చేసినప్పుడు ఇవన్నీ మనము సంతోషముగా ఉన్నామని, ఎక్కువగా నెరవేర్చామనే నిత్య సూత్రాన్ని వివరిస్తాయి.
“ఇతరులకు నిస్వార్థమైన సేవ చేయడంలో మనల్ని మనం కోల్పోవడానికి అవసరమైన త్యాగాలను చేయడం ద్వారా ఆయనను వెంబడించమని మన రక్షకుడు మనకు బోధిస్తున్నారు.”6
అదేవిధంగా అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా బోధించారు, “బహుశా మన బోధకుని మనము ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు, ‘మీకెన్ని పదవులున్నాయి?’ అని కాకుండా, ‘మీరు ఎంతమందికి సహాయపడ్డారు?’ అని మనము అడుగబడతాము. వాస్తవానికి, ఆయన జనులకు సేవ చేయడం ద్వారా ఆయనను సేవించేంత వరకు మీరు ఎప్పటికీ ప్రభువును ప్రేమించలేరు.”7
మరొక మాటలలో, సహోదరీలారా, మనము సౌకర్యవంతమైన కుర్చీలలో కూర్చున్నామా లేక వెనుక వరుసలో తుప్పు పట్టిన మడత కుర్చీపై సమావేశమంతా కూర్చోవడానికి ప్రయాసపడుతున్నామా అన్నది ముఖ్యము కాదు. అవసరమైతే, ఏడుస్తున్న బిడ్డను ఓదార్చడానికి హాలులోనికి వెళ్ళడం కూడా ముఖ్యం కాదు. మనము సేవ చేయాలనే కోరికతో వచ్చామా, మనము పరిచర్య చేయువారిని గమనించి, వారిని సంతోషంగా పలకరించామా, మన మడత కుర్చీల వరుసలో ఉన్నవారిని పరిచయం చేసుకున్నామా---వారికి పరిచర్య చేయడానికి మనము నియమించబడనప్పటికీ, స్నేహముతో మనము సమీపిస్తున్నామా అన్నదే ముఖ్యమైనది. మనము చేసే సమస్తము ప్రేమ మరియు త్యాగముతో జతపరచబడిన సేవ అనే ప్రత్యేకమైన పదార్థముతో చేయాలన్నది నిశ్చయముగా ముఖ్యమైనది.
ఒక విజయవంతమైన లేక సమర్పించుకోబడిన ప్రాథమిక బోధకురాలిగా ఉండేందుకు మనము ఒక చాక్లెట్ కేక్ చేయనవసరం లేదని నేను తెలుసుకున్నాను, ఎందుకంటే అది కేక్‌కు సంబంధించినది కాదు. ఆ పని వెనుకగల ప్రేమకు సంబంధించినది.
ఆ ప్రేమ త్యాగము ద్వారా ---ఒక బోధకుని త్యాగము మరియు దేవుని కుమారుని యొక్క అంతిమ మరియు నిత్య త్యాగము ద్వారా ఇంకా పరిశుద్ధమైనదిగా చేయబడిందని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను! నేను ఆయనను ప్రేమిస్తున్నాను మరియు ఆయన చేసినట్లుగా ప్రేమించి, పరిచర్య చేయడానికి స్వార్థపూరితమైన కోరికలను విడిచిపెట్టాలని కోరుతున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.