స్త్రీలు మరియు ఇంట్లో సువార్త నేర్చుకొనుట
ఇంట్లో సువార్త నేర్చుకోవడానికి గొప్ప ప్రాధాన్యతనివ్వాలనే ఆయన ఆలోచనలో మీరేవిధంగా ప్రముఖ పాత్ర పోషిస్తారనడానికి మీ పరిపూర్ణమైన మాదిరి రక్షకుడే.
నా ప్రియమైన సహోదరీలారా, మిమ్మల్ని కలుసుకోవడం అద్భుతం. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో ఇది ఉత్సాహపూర్వకమైన సమయం. ప్రభువు తాను వాగ్దానం చేసినట్లుగా తన సంఘంపై జ్ఞానాన్ని క్రుమ్మరిస్తున్నారు.
ఆయన చెప్పింది మీకు గుర్తుందా: “ప్రవహించే నీరు ఎంతకాలం మురికిగా ఉండగలదు? ఏ శక్తి పరలోకాలను ఆపగలదు? ఒక మనిషి తన బలహీనమైన చేయి చాపి మిస్సోరి నది గమనాన్ని ఆపడం లేదా దాని ప్రవాహ దిశను మార్చడం అసాధ్యమైనట్లే, పరలోకం నుండి కడవరి-దిన పరిశుద్ధుల శిరస్సులపై జ్ఞానాన్ని క్రుమ్మరించడం నుండి సర్వశక్తిమంతుడిని ఎవ్వరూ ఆపలేరు.”1
ప్రస్తుతం ప్రభువు పంచుతున్న జ్ఞానంలో కొంతభాగం తన జనుల మీద వైజ్ఞానికంగా, మానసికంగా ఆయన క్రుమ్మరింపును వేగవంతం చేయుటతో సంబంధించియున్నది. ఆ అద్భుతమైన వేగవృద్ధిలో పరలోక తండ్రి కుమార్తెలు ప్రధాన పాత్ర పోషిస్తారని ఆయన స్పష్టం చేసారు. ఆ అద్భుతానికి ఒక నిదర్శనము, కుటుంబంలో మరియు ఇంట్లో సువార్త బోధనకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా తన ప్రవక్తను నడిపించుట.
“తన పరిశుద్ధుల మీద జ్ఞానాన్ని క్రుమ్మరించడంలో ప్రభువుకు సహాయపడేందుకు విశ్వాసముగల సహోదరీలను అది ప్రధాన వనరుగా ఎలా చేస్తుంది?” అని మీరడగవచ్చు. దానికి సమాధానం ప్రభువు, “కుటుంబం: ప్రపంచమునకు ఒక ప్రకటన” లో ఇచ్చారు. అందులో పదాలు మీకు గుర్తుండవచ్చు, కానీ ఈ ప్రేరేపిత మార్పులను ప్రభువు ముందుగానే చూసారని మీరు గ్రహిస్తారు మరియు క్రొత్త అర్థాన్ని చూస్తారు. ప్రకటనలో, “తమ పిల్లల పోషణలో తల్లులు ప్రధాన బాధ్యత వహిస్తారు,” 2 అని చెప్తూ కుటుంబంలో ప్రధాన సువార్త బోధకులుగా ఉండే బాధ్యతను ఆయన సహోదరీలకిచ్చారు. ఇది సువార్త సత్యము మరియు జ్ఞానముల పోషణను కలిపియున్నది.
ప్రకటన ఇలా కొనసాగుతుంది: “తల్లిదండ్రులు సమాన భాగస్వాములుగా ఒకరికొకరు సహాయపడే బాధ్యతను కలిగియున్నారు.”3 వారు సమాన భాగస్వాములు, ఆత్మీయ ఎదుగుదలలో మరియు జ్ఞానాన్ని సంపాదించడంలో వారి సామర్థ్యమందు సమానులు, కాబట్టి ఒకరికొకరు సహాయపడినప్పుడు ఏకమవుతారు. కలిసి ఉన్నతస్థానానికి వెళ్ళే తమ దైవిక గమ్యంలో వారు సమానులు. వాస్తవానికి, వారు ఒంటరిగా ఉన్నత స్థానానికి చేరలేరు.
అయితే, ఐక్యతగల సమాన అనుబంధంలో, అందరు తప్పక పొందవలసిన అతిముఖ్య పోషకమైన పరలోకం నుండి వచ్చే సత్యము యొక్క జ్ఞానముతో పోషించే ప్రధాన బాధ్యతను దేవుని కుమార్తె ఎందుకు పొందింది? నాకు తెలిసినంతవరకు, ఈ లోకంలో కుటుంబాలు సృష్టించబడినప్పటి నుండి ప్రభువు విధానం అదే అయ్యున్నది.
ఉదాహరణకు, వారు దేవుని ఆజ్ఞలన్నీ పాటించి, ఒక కుటుంబాన్ని ఏర్పరచాలంటే ఆదాము తెలివినిచ్చు వృక్షఫలమును తినాల్సినవసరమున్నదని జ్ఞానాన్ని పొందింది హవ్వ. అది ముందుగా హవ్వకే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆదాము మీద జ్ఞానము క్రుమ్మరించబడినప్పుడు ఆదాము హవ్వలు పూర్తి ఐక్యమత్యముతో ఉన్నారు.
స్త్రీలకున్న పోషించు బహుమానాలను ప్రభువు ఏవిధంగా ఉపయోగించుకున్నారనేందుకు మరొక ఉదాహరణ, హీలమన్ కుమారులను ఆయన బలపరచిన విధానం. ఆ కథను చదువుతూ, నేను సైన్యంలో సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు ధైర్యం చెప్తున్న మా అమ్మ మాటలు గుర్తుచేసుకున్నప్పుడు నేను భావోద్వేగానికి గురవుతాను.
హీలమన్ వ్రాసాడు:
“వారు సందేహించని యెడల దేవుడు వారిని విడిపించునని వారి తల్లులచేత వారు బోధింపబడిరి.
“మరియు ఇట్లనుచు వారి తల్లుల మాటలను వారు నాకు తిరిగి చెప్పిరి: మా తల్లులు దానినెరుగుదురని మేము సందేహించము.”4
కుటుంబంలో పోషించే ప్రధాన బాధ్యతను విశ్వాసముగల సహోదరీలకివ్వడంలో ప్రభువు ఉద్దేశమేమిటో నాకు తెలియనప్పటికీ, అది ప్రేమించే మీ సామర్థ్యానికి సంబంధించినదై యుంటుందని నేను నమ్ముతున్నాను. మీ స్వంత అవసరాలకంటే ఎక్కువగా ఇతరులవి గుర్తించడానికి ఎంతో ప్రేమ కావాలి. మీరు పోషించే వ్యక్తిపట్ల గల క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ అది. పోషకులుగా ఎంచుకోబడిన వ్యక్తులు యేసు క్రీస్తు యొక్క ప్రాయఃశ్చిత్త ప్రభావాలకు యోగ్యులైనప్పుడు వారి నుండి ఆ దాతృత్వపు భావన వస్తుంది. మా స్వంత అమ్మ ఉదాహరణగా నిలిచిన, ఉపశమన సమాజ ప్రతిజ్ఞయైన “దాతృత్వము ఎన్నటికీ విఫలము కాదు,” అనునది నాకు స్ఫూర్తినిస్తుంది.
దేవుని కుమార్తైలుగా, మీరు ఇతరుల అవసరాలను గుర్తించి, ప్రేమించగల సహజసిద్ధమైన గొప్ప సామర్థ్యమును కలిగియున్నారు. అది ఆత్మ యొక్క గుసగుసలను మీరు త్వరగా గ్రహించేలా చేస్తుంది. అప్పుడు జనులను పోషించుటకు మీరు ఆలోచించే దానిని, చెప్పే దానిని, చేసే క్రియలను ఆత్మ నడిపించగలదు, ఆ విధంగా వారిపైన ప్రభువు జ్ఞానాన్ని, సత్యాన్ని, ధైర్యాన్ని క్రుమ్మరించగలరు.
నా మాటలు వింటున్న సహోదరీలలో ప్రతిఒక్కరు మీ జీవితపు ప్రయాణంలో ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నారు. కొందరు మొదటిసారి ప్రధాన స్త్రీల సమావేశానికి వచ్చిన అమ్మాయిలు. కొందరు దేవుడు కోరినట్లుగా పోషకులయ్యేందుకు సిద్ధపడుతున్న యువతులు. కొందరు ఇంకా పిల్లలు లేని క్రొత్తగా పెళ్ళయిన వారు, మరికొందరు ఒకరు లేక ఎక్కువ మంది పిల్లలున్న యౌవన తల్లులు. కొందరు టీనేజీ పిల్లలున్న తల్లులు, మరికొందరు మిషను సేవలో ఉన్న పిల్లలు గలవారు. విశ్వాసములో బలహీనులై, ఇంటికి దూరమైన పిల్లలున్న వారు కొందరు. విశ్వాసముగల సహవాసి లేక ఒంటరిగా ఉన్నవారు కొందరు. కొందరు అమ్మమ్మలు, నానమ్మలు.
మీ పరిస్థితులు ఏవైనప్పటికీ, భవిష్యత్తులోనైనా సరే మీరు ఈ లోకంలో లేదా ఆత్మలోకంలో దేవుని కుటుంబంలో మరియు మీ స్వంత కుటుంబంలో భాగస్థులు---ముఖ్య భాగస్థులు. యేసు క్రీస్తు యందు మీకు గల విశ్వాసంతో, మీ ప్రేమతో ఆయన మరియు మీ కుటుంబ సభ్యులలో వీలైనంతమందిని పోషించుట దేవుని నుండి మీకు గల బాధ్యత.
ఎవరిని, ఎప్పుడు, ఎలా పోషించాలన్నది తెలుసుకోవడమే మీకున్న సాధారణమైన సమస్య. మీకు ప్రభువు యొక్క సహాయము అవసరం. ఆయన ఇతరుల హృదయాలను ఎరుగును, మరియు మీ పోషణను అంగీకరించడానికి వారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో ఆయనకు తెలుసు. విశ్వాసముగల మీ ప్రార్థనే మీ విజయానికి ముఖ్యమైనది. ఆయన నడిపింపు మీద మీరు ఆధారపడవచ్చు.
“మనం పొందుతామని నమ్ముతూ, విశ్వాసంతో ఆయన నామమున తండ్రిని అడిగినట్లయితే, అవసరమైన విషయాలన్నింటిని ప్రత్యక్షపరిచే పరిశుద్ధాత్మను మనం కలిగియుంటామని.” ఆయన ప్రోత్సహించారు. 5
ప్రార్థనకు అదనంగా, లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయడం పోషించుటకు మీ ఎదుగుతున్న శక్తిలో భాగమవుతుంది. వాగ్దానమిక్కడుంది: “మనం ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచించనవసరం లేదని ప్రభువు చెప్పారు. జీవపు మాటలను నిరంతరం మన మనస్సులో నిధులుగా ఏర్పరచుకోవాలి, మరియు అవసరమైనప్పుడు ఆ భాగము మనకు ఇవ్వబడుతుంది.”6
కాబట్టి ప్రార్థనకు, అధ్యయనానికి, ఆత్మీయ విషయాలపై ధ్యానించడానికి మీరు అధిక సమయం కేటాయించాలి. సత్యము యొక్క జ్ఞానము మీపైన క్రుమ్మరించబడుతుంది, మీ కుటుంబంలో మీ పోషణ శక్తి అధికమవుతుంది.
ఇంకా బాగా ఎలా పోషించాలో నేర్చుకోవడంలో మీ అభివృద్ధి నిదానించినట్లు అప్పుడప్పుడు మీకనిపించవచ్చు. సహించడానికి విశ్వాసము అవసరం. ఆయన ఇలా ప్రోత్సహిస్తున్నారు:
“కాబట్టి, మంచిని చేయడంలో మనం అలసిపోకూడదు, ఎందుకంటే మనం ఒక గొప్ప కార్యానికి పునాదులు వేస్తున్నాము. గొప్పవన్నీ సాధారణ విషయాలనుండే సంభవిస్తాయి.
“ఇదిగో, ఆయనకు సమ్మతించు హృదయము, మనస్సు కావాలని మరియు సమ్మతించి లోబడువారు ఈ అంత్యదినములలో సీయోను యొక్క మేలును పొందుతారని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు చెప్పారు.”7
ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండడం, పోషించమనే ప్రభువు యొక్క ఆహ్వానాన్ని మీరు అంగీకరించారు అనేందుకు నిదర్శనము. నేటిరాత్రి ఇక్కడ అతి చిన్నవారి విషయంలో కూడా అది నిజం. మీ కుటుంబంలో ఎవరిని పోషించాలో మీరు తెలుసుకోగలరు. యదార్థమైన హృదయంతో మీరు ప్రార్థించినట్లయితే, ఒక పేరు లేదా ముఖము మీ మనస్సులోనికి వస్తుంది. ఏం చేయాలో లేదా ఏం మాట్లాడాలో తెలుసుకోవడానికి మీరు ప్రార్థించినట్లయితే, సమాధానాన్ని మీరు భావిస్తారు. మీరు లోబడిన ప్రతిసారీ, పోషించడానికి మీ శక్తి పెరుగుతుంది. మీ స్వంత పిల్లల్ని పోషించే రోజు కోసం మీరు సిద్ధపడుతుంటారు.
పోషణకు స్పందించని కొడుకు లేదా కూతురిని ఏవిధంగా పోషించాలో తెలుసుకోవడానికి టీనేజెర్ల తల్లులు ప్రార్థించవచ్చు. మీ పిల్లలకు అవసరమైన మరియు వారు అంగీకరించగల ఆత్మీయ ప్రభావమును చూపగల వారిని తెలుసుకొనుటకు మీరు ప్రార్థించవచ్చు. ఆందోళన చెందుతున్న తల్లుల అటువంటి హృదయపూర్వక ప్రార్థనలను దేవుడు విని, జవాబిస్తారు మరియు సహాయాన్ని అందిస్తారు.
అలాగే, ఈరాత్రి ఇక్కడున్న ఒక అమ్మమ్మ తన పిల్లలు, మనవలతో ఎదుర్కొన్న సమస్యలు మరియు కష్టముల చేత బాధపడుతుండవచ్చు. లేఖనాలలో ఉన్న కుటుంబాల అనుభవాల నుండి మీరు ధైర్యము తెచ్చుకొని, నడిపింపు పొందవచ్చు.
ఆదాము హవ్వల కాలం నుండి, తండ్రియైన ఇశ్రాయేలు నుండి, మోర్మన్ గ్రంథములోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ఒక పాఠం నేర్పబడింది: ఎప్పటికీ ప్రేమించడం ఆపకండి.
తన పరలోక తండ్రి యొక్క అవిధేయులైన ఆత్మ పిల్లలను ఆయన పోషించినప్పుడు రక్షకుని ప్రోత్సాహకరమైన మాదిరిని మనము కలిగియున్నాము. వాళ్ళు, మనము బాధ కలిగించినప్పటికీ, రక్షకుని బాహువు ఇంకను చాపబడియున్నది. 8 పోషించడానికి ఆయన విఫలయత్నం చేసిన తన ఆత్మీయ సహోదరీ సహోదరుల గురించి 3 నీఫైలో ఆయన ఇలా చెప్పారు: “ఓ జనులారా. . . ఇశ్రాయేలు వంశస్థులైన వారలారా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొనునట్లు ఎన్నిసార్లు నేను మిమ్ములను చేర్చుకొని, మిమ్ములను పోషించితిని.”9
జీవితపు ప్రయాణంలోని ప్రతి దశలో, ప్రతి కుటుంబ పరిస్థితిలో, ప్రతి సంప్రదాయంలోనున్న సహోదరీలందరికి, ఇంట్లో సువార్త నేర్చుకోవడానికి గొప్ప ప్రాధాన్యతనివ్వాలనే ఆయన ఆలోచనలో మీరేవిధంగా ప్రముఖ పాత్ర పోషిస్తారనడానికి మీ పరిపూర్ణమైన మాదిరి రక్షకుడే.
మీ కుటుంబంలోని కార్యక్రమాల్లో, ఆచారాల్లో చేసే మార్పుల్లో మీ స్వాభావికమైన దాతృత్వపు భావనను మీరు తెస్తారు. అది గొప్ప ఆత్మీయవృద్ధిని తెస్తుంది. కుటుంబ సభ్యులతో మరియు వారి కొరకు మీరు ప్రార్థించినప్పుడు, వారి కొరకు మీ ప్రేమను, రక్షకుని ప్రేమను మీరనుభవిస్తారు. మీరు ఆశించినట్లుగా అది మరింతగా మీ ఆత్మీయ బహుమానమవుతుంది. మీరు గొప్ప విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, మీ కుటుంబ సభ్యులు దానిని అనుభూతి చెందుతారు.
లేఖనాలను బిగ్గరగా చదవడానికి కుటుంబము కూడినప్పుడు, మీరిదివరకే వాటిని చదివి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవటానికి ప్రార్థించియుంటారు. మీ మనస్సుకు జ్ఞానము కలిగించే ఆత్మ కొరకు ప్రార్థించే క్షణాలను మీరు కనుగొనియుంటారు. అప్పుడు, చదవడానికి మీ వంతు వచ్చినప్పుడు, దేవుని పట్ల, ఆయన వాక్యము పట్ల మీకు గల ప్రేమను కుటుంబ సభ్యులు అనుభూతిచెందుతారు. వారు ఆయనచేత, ఆయన ఆత్మ చేత పోషింపబడతారు.
మీరు ప్రార్థించి, ప్రణాళిక చేసినట్లయితే ఎటువంటి కుటుంబ కూడికలోనైనా అదేవిధమైన క్రుమ్మరింపు రాగలదు. దానికి ప్రయత్నము, సమయము అవసరము, కానీ అది అద్భుతాలను తెచ్చును. నా చిన్నప్పుడు మా అమ్మ నేర్పిన పాఠమొకటి నాకు గుర్తుంది. అపొస్తలుడైన పౌలు యొక్క ప్రయాణాలపై ఆమె తయారు చేసిన రంగురంగుల భౌగోళిక పటం నాకింకా స్పష్టంగా గుర్తుంది. దాన్ని చేయడానికి ఆమెకు సమయం, శక్తి ఎలా వచ్చాయోనని నేను ఆశ్చర్యపోతుంటాను. విశ్వాసుడైన ఆ అపొస్తలుని పట్ల ఆమెకు గల ప్రేమచేత నేటికీ నేను దీవించబడుతున్నాను.
ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘంలో మీ కుటుంబాల పైన సత్యము యొక్క క్రుమ్మరింపు నందు మీ వంతు చేయడానికి మీలో ప్రతిఒక్కరు మార్గాలను కనుగొంటారు. ప్రత్యేకమైన మీ తోడ్పాటును కనుగొనడానికి మీలో ప్రతిఒక్కరు ప్రార్థించి, అధ్యయనం చేసి, ధ్యానించగలరు. కానీ ఇది నాకు తెలుసు: మీలో ప్రతిఒక్కరు దేవుని కుమారులతో సమాన బాధ్యత ఇవ్వబడి, సువార్త నేర్చుకొనుట మరియు జీవించే అద్భుతంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు, అది ఇశ్రాయేలు సమకూడికను వేగవంతం చేస్తుంది మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమకరమైన రాక కొరకు దేవుని యొక్క కుటుంబాన్ని సిద్ధపరచును. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.