2010–2019
స్వస్థపరచబడ గోరుచున్నావా?
అక్టోబర్ 2018


స్వస్థపరచబడ గోరుచున్నావా?

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన, మనము పశ్చాత్తాపపడి మన హృదయములను రక్షకునివైపు పూర్తిగా త్రిప్పిన యెడల ఆయన మనలను ఆత్మీయంగా స్వస్థపరచును.

తన మిషనుకు వెళ్ళిన కొన్ని నెలల తరువాత, మా చిన్న కుమారుడు ఒక రోజు అతని అనుచరునితో కలిసి అధ్యయనం పూర్తిచేయుచుండగా మా కుమారుని తలలో నెమ్మదిగా నొప్పి కలిగింది. అతడికి చాలా క్రొత్తగా అనిపించింది; మొదట ఆతని ఎడమ చెయ్యి స్వాధీనం తప్పింది. తరువాత అతని నాలుక స్పర్శ కోల్పోయింది. అతని ముఖంలో ఎడమ వైపు కండరాలు ముడుచుకొనడం మొదలయ్యింది. మాటలాడలేకపోతున్నాడు. ఎదో సరిగాలేదని అతడు ఎరుగును. కాని, అతనికి తెలియనిదేమిటంటే అతడి మెదడులో మూడు చోట్ల విపరేతమైన పక్షవాతము మధ్యలో ఉన్నాడు. అతని శరీరం పాక్షికంగా స్వాధీనంలో లేకపోయేసరికి భయం మొదలయ్యింది. పక్షవాత రోగికి ఎంత త్వరగా వైద్యం దొరికితే అంత బాగుగా కోలుకోగలరు. అతని మిషనరీ సహచరుడు సమయస్పూర్తితో వెంటనే 911 సహాయానికి ఫోన్ చేసిన తరువాత అతనికి యాజకత్వపు దీవెననిచ్చాడు. అద్బుతంగా, ఆ అంబులెన్సు కేవలం ఐదు నిమిషాల దూరంలోనే ఉన్నది.

మా కుమారుడు ఆసుపత్రికి వేగంగా తరలించబడిన వెంటనే వైద్య సిబ్బంది పరిస్థితిని పరిశీలించి మా కుమారునికి అవసరమైన ఒక మందు వేయుటకు వెంటనే నిర్ణయించారు, ఆవిధంగా మాకుమారుడు ఆ మందు ప్రభావము వలన కొంతకాలము పక్షవాతపు ప్రభావములను క్రమంగా, సమర్ధవంతంగా మార్చవచ్చు.1 అయినప్పటికినీ, మా కుమారునికి పక్షవాతము లేని యెడల ఆ మందు వలన, మెదడులో రక్తస్రావము వంటి తీవ్రమైన దుష్పరిణామాలను కలిగించవచ్చు. మా కుమారుడు ఎంపిక చేయవలసియున్నది. అతడు ఆ మందును తీసుకోవటానికి నిర్ణయించుకొనెను. పూర్తిగా నయం కావటానికి మరికొన్ని శస్త్ర చికిత్సలు, అనేక నెలలు అవసరము కాగా, చివరకు మా కుమారుడు తిరిగి వచ్చి, పక్షవాతం ప్రభావం తగ్గిన తరువాత మరల తన మిషనరీ సేవ పూర్తిచేశాడు.

మన పరలోక తండ్రి సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞాని. ఆయనకు మన శారీరక శ్రమలు తెలుసు., అనారోగ్యము, వ్యాధి, వృద్ధాప్యము, ప్రమాదాలు, లేక పుట్టుకతో సంక్రమించిన వైకల్యాల వలన కలిగే మన శారీరక బాధలు ఆయనకు తెలియును. మన మానసిక సమస్యలు, ఆందోళన, ఒంటరితనం, నిరాశ, లేక మానసిక వ్యాధి, ఆయనకు తెలిసేయున్నది. అన్యాయమును అనుభవించి లేక దూషించబడిన ప్రతిఒక్కరు ఆయనకు తెలుసును. ఆయనకు మన బలహీనతలు తెలియును మరియు మన మనోభావాలు మరియు మనం ఎదుర్కొనే శోధనలు ఆయనకు తెలియును

మర్త్యత్వ కాలంలో, మనము చెడుకు బదులుగా మంచిని ఎన్నుకుంటామా అని పరీక్షింపబడతాము. ఆయన ఆజ్ఞలకు పాటించువారు, “ఎన్నడునూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో”2ఆయనతో జీవిస్తారు.ఆయన వలే అగుటకు మన పురోభివృద్ధిలో మనకు సహాయపడుటకు పరలోక తండ్రి యేసు క్రీస్తునకు సమస్త శక్తిని జ్ఞానమును అనుగ్రహించెను. క్రీస్తు స్వస్థపరచలేని శారీరక, మానసిక, ఆత్మీయ రుగ్మత ఏదీ లేదు.3

రక్షకుని యొక్క ఇహలోక పరిచర్య నుండి, యేసు క్రీస్తు తన దైవిక శక్తిని ఉపయోగించి శారీరకంగా బాధించబడుచున్న అనేకులను స్వస్థపరచినటువంటి అద్భుతమైన సంఘటనలను లేఖనములు జ్ఞాపకం చేస్తున్నాయి.

38 సంవత్సరాలుగా క్షీణింపచేయు వ్యాధిని సహించిన ఒక వ్యక్తి యొక్క కథను యోహాను సువార్త జ్ఞాపకం చేస్తున్నది.

“అతడు పడియుండుట యేసు చూచినప్పుడు, ఆ స్థితిలో అతడు చాలా కాలముగా యున్నాడని గ్రహించి, ఆయన వానితో, స్వస్థపరచబడ గోరుచున్నావా?” అని అనెను.

మిక్కిలి అవసరమైన సమయంలో నాకు సహాయము చేయుటకు నాకు సమీపంలో ఎవరును లేరని నిస్సత్తువగల ఆ మనుష్యుడు ఆయనకు ప్రత్యుత్తరమిచ్చెను.

“యేసు అతనితో, లేచి, నీ పడకనెత్తుకొని నడువుము అనెను.

“మరియు వెంటనే ఆ మనుష్యుడు స్వస్థపరచబడి, తన పడక నెత్తుకొని నడిచెను.”4

ఈ మనుష్యుడు ఎంత కాలము సహాయము లేకుండా బాధను అనుభవించాడో (38 సంవత్సరములు), రక్షకుని ప్రమేయముతో ఎంత త్వరగా అతనికి స్వస్థత కలిగిందో, దయచేసి ఈ రెండు సంగతులను ఒక దానితో నొకటి పోల్చి గమనించండి. “వెనువెంటనే” స్వస్థత కలిగింది.

మరొక సందర్భంలో, ఒక స్త్రీ రక్త స్రావముతో 12 సంవత్సరములు బాధపడి, తన జీవనమంతా వైద్యులపై ఖర్చు చేసెను, … ఆమె అయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకెను. వెంటనే ఆమె యొక్క రక్త స్రావము [ఆగిపోయెను]. …

“మరియు యేసు వారితో, ఎవరో నన్ను తాకియున్నారు: ఎందుకనగా శక్తి నాలో నుండి వెడలియున్నదని నేను గ్రహించియున్నాను అని చెప్పెను.

“మరియు ఆ స్త్రీ తాను చేసినది దాచబడలేదని గ్రహించి, . . . ఆమె ఆయనకు ప్రజలందరి ముందు తాను ఏ విధంగా . . . వెనువెంటనే స్వస్థపరచబడినదో ప్రకటించెను.”5

అయన పరిచర్య అంతటా, క్రీస్తు తనకు భౌతిక శరీరముపై అధికారము కలదని బోధించెను. మన శారీరక రుగ్మతలకు క్రీస్తు యొక్క స్వస్థత ఏ సమయంలో లభించునో మన అదుపు చేయలేము. స్వస్థత ఆయన యొక్క చిత్తము మరియు ఆయన జ్ఞానమును బట్టి జరుగును. లేఖనములలో, కొందరు దశాబ్దాలపాటు మరి కొందరు తమ జీవితకాలమంతయు బాధననుభవించిరి. ఇహపరమైన బాధలు మనలను పవిత్రపరచి మనకు దేవునిపై నమ్మికను, లోతుగా నాటును. కాని, మనము క్రీస్తును మన జీవితాలలో చేర్చుకున్నప్పుడు ఆయన ఎల్లప్పుడు మనలను ఆత్మీయంగా బలపరచును, ఆవిధంగా మన భారములను సహించుటకు మనము గొప్ప సామర్ధ్యమును కలిగియుంటాము.

చివరిగా, ప్రతీ శారీరక బాధ, రుగ్మత, లేక లోపము పునరుత్థానమునందు స్వస్థపరచబడునని మనము ఎరుగుదుము. అది సర్వ మానవాళికి యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా కలుగు బహుమానము. 6

యేసు క్రీస్తు మన శరీరముల కంటే ఎక్కువగా స్వస్థపరచగలడు. అదేవిధంగా ఆయన మన ఆత్మలను స్వస్థపరచును. లేఖనమంతటా, క్రీస్తు ఏ విధంగా బలహీనమైన ఆత్మ కలవారికి సహాయము చేసి వారిని స్వస్థపరచెనో మనము నేర్చుకొనగలము.7 ఈ అనుభవములను మనము ధ్యానించినప్పుడు మనలను ఆశీర్వదించుటకు రక్షకునికి గల శక్తియందు మన నిరీక్షణ, విశ్వాసము అధికమగును. యేసు క్రీస్తు మన హృదయములను మార్చగలడు, మనము అనుభవించు అన్యాయములు లేక దూషణ యొక్క ప్రభావము నుండి మనల్ని స్వస్థపరచగలడు, నష్టము మరియు హృదయవేదనను భరించుటకు మన సామర్ధ్యమును బలపరచి, మనలను మానసికంగా స్వస్థపరచుచు, మన జీవితముల శ్రమలను భరించుటకు మనకు సహాయపడుటకు మనకు శాంతిని తెచ్చును.

మనము పాపము చేసినపుడు కూడా క్రీస్తు మనలను స్వస్థపరచగలడు. మనము బుద్ధిపూర్వకంగా దేవుని ఆజ్ఞలలో ఒక్కటి మీరినపుడు మనము పాపము చేయుచున్నాము. 8 మనము పాపము చేసినపుడు, మన ఆత్మలు అపవిత్రమగును. అపవిత్రమైనదేదియు దేవుని సన్నిధిలో నివసించలేదు9 “పాపమునుండి పవిత్రపరచబడుట ఆత్మీయంగా స్వస్థపరచబడుట.” 10

తండ్రియైన దేవునికి మనము పాపము చేస్తామని తెలుసు, కాని ఆయన మనము పాపము నుండి విమోచింపబడుటకు మార్గమును సిద్ధపరచెను. ఎల్డర్ లిన్ జి. రాబ్బిన్స్ బోధించారు: “పశ్చాత్తాపము అనునది మనము పడిపోయే ఘటనలో [దేవుని యొక్క] ప్రత్యమ్నాయ ప్రణాళిక కాదు. మనం తప్పు చేస్తామని తెలిసి, పశ్చాత్తాపము ఆయన ప్రణాళిక.” 11 మనము పాపము చేసినపుడు, చెడు నుండి మంచిని ఎన్నుకొను అవకాశము మనము కలిగియున్నాము. పాపము చేసిన తరువాత, మనము పశ్చాత్తాపపడినప్పుడు మనం మంచిని ఎన్నుకొంటాము. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చత్త త్యాగము ద్వారా, మనం పశ్చాత్తాపపడినట్లైతే, మన పాపముల నుండి విమోచింపబడి, దేవుని సన్నిధికి తిరిగి తేబడతాము. ఆత్మీయ స్వస్థత ఒకవైపునుండి కలిగేది కాదు--దానికి రక్షకుని విమోచన శక్తి మరియు పాపము చేసిన వారి వైపునుండి మనఃపూర్వకమైన పశ్చాత్తాపము అవసరము. పశ్చాత్తాపపడుటకు ఎంచుకోనివారు, క్రీస్తు ఇవ్వబోవు స్వస్థతను వారు నిరాకరిస్తున్నారు. వారికి, ఏవిధమైన విమోచన చెయ్యబడలేనట్లుగా ఉండును. 12

పశ్చాత్తాపపడుటకు కోరు ఇతరులకు నేను ఉపదేశించునపుడు, నాకు ఆశ్చర్యము కలిగించిన విషయం ఏదనగా పాపములో జీవించు మనుష్యులకు సరియైన నిర్ణయాలు తీసుకొనుట కష్టముగా ఉండును. పరిశుద్ధాత్మ వారిని విడిచిపెట్టును, మరియు వారు దేవునికి దగ్గరగా తెచ్చు ఎంపికలు చేయుటకు తరచుగా కష్టపడతారు. వారు నెలలు లేక సంవత్సరాల తరబడి తమ పాపముల యొక్క పర్యవసానమును బట్టి సిగ్గుతోనూ, భయముతోను పోరాడుతూ ఉంటారు. వారు మారలేరని, వారికి క్షమాపణ లేదని వారు భావిస్తారు. వారి పాపములను ఒప్పుకుంటే తమకు ప్రియమైన వారు వారిని ప్రేమించుట మానివేస్తారని, వదలి వేస్తారని వారి భయమును తరచూ వారు పంచుకొనుట నేను విన్నాను. ఈ విధమైన ఆలోచనలను అనుసరించే వారు మౌనంగా ఉండటానికి తీర్మానిస్తారు మరియు వారి పశ్చాత్తాపమును వాయిదా వేస్తారు. వారిని ప్రేమించేవారిని బాధపెట్టకుండుటకు వారు తమ పాపములను ఒప్పుకోకుండుటయే మంచిదని వారు తప్పుగా భావిస్తారు. ఈ జీవితంలో పాపాలు ఒప్పుకొనడం కంటే తరువాతి జీవితంలో బాధపడటమే మంచిదని వారి భావన. సహోదర సహోదరీలారా, పశ్చాత్తాపమును వాయిదా వేయుట ఎప్పటికి ఒక మంచి ఆలోచన కాదు. యేసు క్రీస్తునందు మన విశ్వాసమును బట్టి వెంటనే మనము అమలు చేయకుండా మనలను ఆటంకపరచుటకు అపవాది తరచుగా భయమును ఉపయోగించును.

ప్రేమించిన వారు పాపపు ప్రవర్తన గురించి నిజము ఎదురైనప్పుడు వారు లోతుగా గాయపడవచ్చును, నిజాయితీగా పశ్చాత్తాపపడు పాపికి మార్చుకొనుటకు మరియు దేవునితో సమాధానపడుటకు సహాయపడుటకు వారు తరచుగా కోరతారు. వాస్తవానికి, పాపి తన పాపములను ఒప్పుకొనినప్పుడు, వారిని ప్రేమించేవారు చుట్టూ నిలిచి వారి పాపములు విడిచిపెట్టుటకు సహాయపడినప్పుడు వారిలో ఆత్మీయ స్వస్థత వేగవంతము చేయబడును. యేసు క్రీస్తు పాపమునకు అమాయకంగా బలైన బాధితులను స్వస్థపరచుటకును వారు తనవైపు తిరిగినపుడు వారిని రక్షించుటకు కూడా శక్తిగలవాడు.13

ఎల్డర్ బోయిడ్ కే. పాకర్ వివరించారు: “మనం తప్పులు చేసినప్పుడు మరియు పాపము చేసినప్పుడు మన ఆత్మలు నష్టపోతాయి. కాని, మన మర్త్య శారీరాల వలే కాకుండా పశ్చాత్తాప ప్రక్రియ పూర్తి అయినప్పుడు, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము వలన ఎటువంటి మచ్చలేకుండా స్వస్థపరచబడగలము. ఆ వాగ్దానము: ‘చూడుడి, ఎవడైతే తన పాపముల గూర్చి పశ్చాత్తాపపడునో అతడు క్షమింపబడును, ప్రభువునైన నేను వాటిని ఎన్నటికి జ్ఞాపకముంచుకొనను.’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42].”14

“హృదయము యొక్క పూర్ణ ఉద్దేశముతో,”15 పశ్చాత్తాపపడినపుడు, “గొప్ప విమోచన ప్రణాళిక వెంటనే మన జీవితాలలో అమలు జరుపబడును.” 16 రక్షకుడు మనలను స్వస్థపరచును.

పక్షవాతమునకు గురైన మా కుమారునికి మిషను ప్రాంతములో త్వరగా సహాయపడిన ఆ మిషనరీ సహవాసి, మరియు ఆ వైద్య నిపుణులు, సమయస్పూర్తిగా త్వరగా చేసారు. మా కుమారుడు పక్షవాతమును వెనుకకు మళ్ళించే మందును కోరుకున్నాడు. జీవితాంతము అంగవైకల్యము కలిగించగల పక్షవాతము వెనుకకు మళ్ళించబడినది. అదే విధంగా, మనము ఎంత త్వరగా పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తమును మన జీవితాలలోనికి అంగీకరిస్తామో, అంత త్వరగా మనము పాపము యొక్క ప్రభావముల నుండి స్వస్థత పొందుతాము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ ఆహ్వానమిచ్చారు: “మీరు దారి తప్పి అడుగు వేసిన యెడల, . . . నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను . . . దయచేసి తిరిగి రండి. మీ చింతలు ఏవైనప్పటికినీ, మీ సవాళ్ళు ఏవైనా సరే, ప్రభువు సంఘములో ఇక్కడ మీకు స్థానం కలదు. నిబంధన బాటకు తిరిగి వచ్చుటకు మీ క్రియల ద్వారా మీరు, మరియు మీ ముందు తరాలలో పుట్టబోవు సంతానము కూడ ఆశీర్వదించబడును.”17

మన ఆత్మీయ స్వస్థత కొరకు మన రక్షకుడు చూపిన నియమాలకు సమర్పించుకొనవలసిన అవసరమున్నది. మనము ఆలస్యము చేయరాదు! మనము ఈ రోజే అమలు చేయాలి. ఆత్మీయ పక్షవాతము మీ నిత్య పురోభివృద్ధిని ఆటంకపరచకుండునట్లు త్వరపడండి. నేను మాట్లాడుచున్నపుడు, మీలో ఎవరైనా పశ్చాత్తాపపడి మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ అడగవలసిన అవసరమును భావించిన యెడల, వెంటనే చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఏమి చేశారో వారికి చెప్పండి. క్షమాపణ కొరకు వారిని అడుగుము. మీరు దేవాలయ యోగ్యతను భంగపరచే పాపం చేసిన యెడల, మీ బిషప్పును ఈరోజే సంప్రదించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆలస్యం చెయ్యవద్దు.

నా సహోదర, సహోదరీలారా, దేవుడు మన ప్రియమైన పరలోక తండ్రి. ఆయన సమస్త అధికారమును, జ్ఞానమును తన ప్రియమైన కుమారుడగు యేసు క్రీస్తుకు అనుగ్రహించెను. ఆయన వలన, సమస్త మానవాళి ఒకరోజు ప్రతి శారీరక రుగ్మత నుండి శాశ్వతంగా స్వస్థత పొందుతారు. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము వలన, మనము పశ్చాత్తాపపడుటకు కోరుకొని మన హృదయములను పూర్తిగా ఆయన తట్టు త్రిప్పుకొనిన యెడల ఆయన మనలను ఆత్మీయంగా స్వస్థపరచును. ఆ స్వస్థత వెంటనే ప్రారంభము కావచ్చు. కోరుకొనుట మీ దగును. మనము స్వస్థపరచబడదామా?

మనము స్వస్థపరచబడునట్లు, యేసు క్రీస్తు మూల్యమును చెల్లించియున్నాడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. కానీ, మనము ఆయన అనుగ్రహించు స్వస్థతా ఔషధమును తీసుకొనుటకు ఎన్నుకోవాలి. ఈరోజే దానిని తీసుకోండి. ఆలస్యం చెయ్యవద్దు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. ఆ మందును టిపిఎ (టిష్యు ప్లాస్మినోజెన్ యాక్తివేటర్) అని పిలుస్తారు.

  2. మోషైయా 2:41.

  3. మత్తయి 4:24 చూడుము. క్రీస్తు “నానావిధములైన రోగములు” “ వేదనలచేత పీడింపబడిన వ్యాధి గ్రస్తులు,” “దయ్యముపట్టిన వారిని”, “చాంద్రరోగులను,” “పక్షవాయువు గలవారిని” స్వస్థపరచెను.

  4. యోహాను 5:5 – 9 చూడుము; వివరణ చేర్చబడింది.

  5. లూకా 8:43 – 47 చూడుము; వివరణ చేర్చబడింది.

  6. ఆల్మా 40:23; హీలమన్ 14:17 చూడుము

  7. లూకా 5:20, 23–25;చూడుము; మరియు జోసెఫ్ స్మిత్ అనువాదము, లూకా 5: 23 (లూకా 5: 23, ) కూడా చూడుము: “రోగిని లేవనెత్తి నడిపించుట కంటే పాపములు క్షమించడానికి ఎక్కువ శక్తి కావలెనా?”

  8. 1 యోహాను 3:4. చూడుము.

  9. 3 నీఫై 27:19 చూడుము.

  10. The Gospel of Jesus Christ,” Preach My Gospel: A Guide to Missionary Service, rev. ed. (2018), lds.org/manual/missionary.

  11. Lynn G. Robbins, “Until Seventy Times Seven,” Liahona, May 2018, 22.

  12. మోషైయ 16:5 చూడుము.

  13. అనేక సందర్భాలలో, వ్యక్తులు త్వరిత గతిని స్వస్థపడడం నేను చూచాను, కుటుంబ సభ్యులందరూ నీతి నియమాలను, నమ్మకాన్ని ఉల్లంఘించిన ఒకరి చుట్టూ చేరి, స్వస్థత కొరకు రక్షకుని వైపు పూర్తిగా తిరుగుటకు వారికి సహాయము చేయుట వలన స్వస్థత వేగంగా చేకూరుట నేను ప్రత్యక్షంగా చూచాను. నిజంగా పశ్చాత్తాపపడిన వ్యక్తి నిజాయితీగా మార్పు కోరిన యెడల, సహాయం చేయు కుటుంబ సభ్యులు సువార్త పఠనంలోను, ప్రార్ధనలోను, క్రీస్తును పోలిన సేవతో పాపిని మార్చడమే కాకుండా తమలో కూడా స్వస్థత వేగంగా చేకూరడం గ్రహించగలరు. తగినప్పుడు, అమాయకమైన బాధితులు కూడా, తమకు దేవాలయ యోగ్యత కలిగియున్నచో నీతితప్పిన పాపికి దేనిని అధ్యయనము చేయాలి, ఎలా సేవ చేయాలి, పశ్చాత్తాపపడు ఆత్మ మారుటకు ఎలా సహాయపడి, బలపరచాలో మరియు యేసు క్రీస్తు యొక్క విమోచించు శక్తి నుండి ప్రయోజనము పొందుటకు కుటుంబ సభ్యులను ఎలా చేర్చాలో పరలోక తండ్రి నడిపింపును వెదకుట ద్వారా సహాయపడవచ్చు.

  14. Boyd K. Packer, “The Plan of Happiness,” Liahona, May 2015, 28.

  15. 3 నీఫై 18:32.

  16. ఆల్మా 34:31; వివరణ చేర్చబడింది.

  17. Russell M. Nelson, “As We Go Forward Together,” Liahona, Apr. 2018, 7.

ముద్రించు