మన విశ్వాసపు చలిమంట
దానిని వెదకి, అనుమతించి, దాన్ని కొరకు జీవించాలని ప్రయత్నించే వారికి విశ్వాసపు ఆరంభము కొన్నిసార్లు క్రమంగా వస్తుంది లేదా తిరిగి రాగలదు.
ప్రియమైన సహోదర సహోదరీలారా, మన పూర్ణ హృదయము, మనస్సు మరియు బలముతో ఇంటిలోను సంఘములోను క్రొత్త మరియు పరిశుద్ధ విధానాల్లో1 జీవించమని మనల్ని ఆహ్వానిస్తున్న అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు మన సంఘ నాయకుల ద్వారా నిరంతర బయల్పాటును పరలోకము నుండి పొందడం ఎంత అద్భుతం కాదా?
మీరు సిద్ధపడిలేనట్లు లేక తగనట్లు భావించినప్పటికీ దానిని ప్రయత్నించడం వలన దీవించబడినదేదైనా చేయడానికి మీకెప్పుడైనా అవకాశం కలిగిందా?
నాకు కలిగింది. ఒక ఉదాహరణ ఇక్కడున్నది.
కొన్నేళ్ళక్రితం, పన్నెండుమంది అపొస్తలుల కూటమిలో ఒక సభ్యులైన ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్, “గారిట్, నాతో పాటు రంగులు వేస్తావా?” అని ఆహ్వానించారు.
గమనించడానికి, సృష్టించడానికి చిత్రకళ తనకు సహాయపడిందని ఎల్డర్ స్కాట్ చెప్పారు. ఆయనిలా వ్రాసారు: “ఫలితాలు మితముగా ఉన్నప్పటికీ, సృజనాత్మకంగా ఉండేందుకు ప్రయత్నించు. . . . సృజనాత్మకత జీవితం పట్ల, దేవుడు మనకిచ్చిన వాటిపట్ల కృతజ్ఞతా భావాన్ని పెంపొందించగలదు. . . . తెలివిగా ఎంచుకున్నట్లయితే, దానికి ఎంతో సమయం పట్టదు.”2
“సృష్టించుటకు, నిర్మించుటకు—తన పిల్లలు ఆయనలా కావాలని ఆశించే సృష్టికర్త ప్రేమతో పాటు,”3 “ప్రేమ యొక్క భావన” చేత తన కళాత్మక ఆలోచనలు ప్రేరేపించబడతాయని అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ వివరిస్తున్నారు. అధ్యక్షులు ఐరింగ్ యొక్క సృజనాత్మక క్రియలు “సాక్ష్యము మరియు విశ్వాసంపై ప్రత్యేకమైన, ఆత్మీయ దృష్టికోణాన్ని అందిస్తాయి.”4
అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ గారి కళాఖండాలు ఒక ప్రాథమిక సువార్త సందేశాన్ని వర్ణిస్తాయి: “పరలోకాలు, భూమి, వాటిలో ఉన్న సమస్తమును సృష్టించింది దేవుడే, దైవికంగా ఏర్పాటు చేయబడిన ఆ సృష్టికి ప్రకృతి అంతా సాక్ష్యమిస్తుంది. ప్రకృతి, విజ్ఞానం మరియు యేసు క్రీస్తు సువార్తల మధ్య పూర్తి సామరస్యం ఉంది.” 5
“అన్ని వస్తువులు ఒక దేవుడున్నాడని సూచించుచున్నవని”6 ఆల్మా సాక్ష్యమిచ్చాడు. “ఒక పక్షి పాటను నేను విన్నప్పుడు లేక నీలి, నీలి ఆకాశాన్ని చూసినప్పుడు, . . . పరలోక తండ్రి నాకోసం సృష్టించిన ఈ అందమైన లోకంలో జీవిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను,”7 అని మన ప్రాథమిక పిల్లలు పాడతారు. “ఎగరగలిగే పక్షులన్నీ దేవునిలో కొంతభాగాన్ని తమలో కలిగివుంటాయి. . . . నెబ్యులా అనేది నక్షత్రాల యొక్క చీమల పుట్ట. . . . సూర్యుడి నుండి అతి చిన్న పురుగు వరకు ఈ ప్రపంచంలోని జీవులు మరియు వస్తువుల మధ్య గల అద్భుతమైన సంబంధాలను”8 రచయిత విక్టర్ హ్యుగో కొనియాడతారు.
అది మనల్ని తిరిగి ఎల్డర్ స్కాట్ ఆహ్వానానికి సూచిస్తుంది.
“ఎల్డర్ స్కాట్,” “నేను ఎక్కువ గమనించేవానిగా, సృజనాత్మకంగా ఉండాలని కోరుతున్నాను. అలల్లాంటి మబ్బులు, నీరు, ఆకాశం యొక్క ప్రతి రంగుతో పరలోకపు తండ్రి చిత్రించడాన్ని ఊహించుటకు నేను పులకరిస్తున్నానని” జవాబిచ్చాను. “కానీ”—సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత—“ఎల్డర్ స్కాట్,” “నాకు రంగులు వేయడం రాదు. నాకు నేర్పించాలని ప్రయత్నించడం వలన మీకు విసుగు కలుగుతుందేమోనని నేను చింతిస్తున్నాను,” అన్నాను.
ఎల్డర్ స్కాట్ చిరునవ్వు నవ్వి, మేము కలుసుకోవడానికి ఏర్పాటు చేసారు. నియమించబడిన రోజున, ఆయన కాగితము, రంగులు, కుంచెలు సిద్ధం చేసారు. ఆయన కొన్ని ఆకారాలు గీసి, రంగులు వేయడంలో నాకు సహాయపడ్డారు.
సూర్యాస్తమయాన చలిమంట అనే పేరుగల అందమైన ఆయన రంగుల చిత్రాన్ని మేము ఒక మాదిరిగా ఉపయోగించాము. మేము రంగులు వేస్తున్నప్పుడు, మేము విశ్వాసం గురించి—చలిమంట యొక్క వెలుగును, వెచ్చదనాన్ని చూసినప్పుడు, మనమేవిధంగా అంధకారాన్ని, అనిశ్చితిని ఎలా వదిలేస్తాము—కొన్నిసార్లు సుదీర్ఘమైన, ఒంటరి రాత్రుల్లో, మన విశ్వాసపు చలిమంట మనకేవిధంగా నిరీక్షణను, హామీనిస్తుందో మాట్లాడుకున్నాము. మన శ్రమలు అంతమయ్యే సమయం వస్తుంది. మన విశ్వాసపు చలిమంట—మన జీవితంలో దేవుని మంచితనం మరియు మృదు కనికరములలో విశ్వాసపు వారసత్వము, మన జ్ఞాపకాలు, అనుభవాలు—శ్రమల గుండా మనల్ని బలపరుస్తాయి.
దానిని వెదకి, అనుమతించి, దాన్ని సాధించాలని ప్రయత్నించే వారికి విశ్వాసపు ఆరంభము మరియు శ్రమల నుండి ఉపశమనము అనేది కొన్నిసార్లు క్రమంగా వస్తుంది లేదా తిరిగి రాగలదు. దానిని కోరి, వెదకినప్పుడు, మనము ఓపిగా ఉండి, దేవుని ఆజ్ఞలకు విధేయులైనప్పుడు, దేవుని యొక్క కృప, స్వస్థత, మరియు నిబంధనలను అంగీకరించుటకు సిద్ధపడినప్పుడు, వెలుగు వస్తుంది.
మేము రంగులు వేయడం మొదలుపెట్టినప్పుడు, ఎల్డర్ స్కాట్ ప్రోత్సహించారు, “గారిట్, కేవలం ఒక్క పాఠం నేర్చుకొని కూడా నువ్వు దాచుకొని, గుర్తుంచుకోవాలనుకొనేలా ఏదో ఒకటి చిత్రిస్తావు.” ఎల్డర్ స్కాట్ సరిగ్గా చెప్పారు. రంగులేయడంలో ఎల్డర్ స్కాట్ నాకు సహాయం చేసిన మన చలిమంట చిత్రాన్ని నేను భద్రంగా ఉంచుకున్నాను. నా కళాత్మక సామర్థ్యం అప్పటికి ఇప్పటికి పరిమితమైనదే, కానీ మన విశ్వాసపు చలిమంట యొక్క జ్ఞాపకం మనల్ని ఐదు విధాలుగా ప్రోత్సహించగలదు.
మొదటిది, పరిపూర్ణమైన సృజనాత్మకతలో ఆనందాన్ని కనుగొనడానికి మన విశ్వాసపు చలిమంట మనల్ని ప్రోత్సహించగలదు.
విలువైన క్రొత్త విషయాలను ఊహించడంలో, నేర్చుకోవడంలో, చేయడంలో ఆనందమున్నది. పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుయందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని అధికం చేసుకున్నప్పుడు ఇది ప్రత్యేకంగా నిజమగును. మనల్ని మనం రక్షించుకొనేంతగా మనల్ని మనం ప్రేమించలేము. కానీ, మనల్ని మనం ప్రేమించి, తెలుసుకొనే దానికంటే ఎక్కువగా పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తారు మరియు మనల్ని ఎరిగియున్నారు. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక9 మనము ప్రభువు యందు నమ్మకముంచగలము.
ఎప్పుడైనా ఎవరైనా ఒకరి పుట్టినరోజు విందుకు మీరు మాత్రమే ఆహ్వానించబడకుండా ఉన్నారా?
జట్టులు ఎంపిక చేయబడినప్పుడు, ఎప్పుడైనా మీరు మాత్రమే చివరగా ఎంచుకోబడ్డారా లేక ఎంచుకోబడకుండా ఉన్నారా?
ఒక పాఠశాల పరీక్షకు, ఒక ఉద్యోగ ఇంటర్యూకు, మీరెంతగానో కోరుకున్న అవకాశానికి సిద్ధపడి---మీరెప్పుడైనా విఫలమైనట్లు భావించారా?
ఏ కారణాల వలన అయినా విజయవంతం కాని ఒక అనుబంధము కోసం మీరెప్పుడైనా ప్రార్థించారా?
మీరెప్పుడైనా దీర్ఘకాల వ్యాధి బారిన పడ్డారా, భాగస్వామి చేత వదిలివేయబడ్డారా, కుటుంబం కోసం వేదనను అనుభవించారా?
మన రక్షకుడు మన పరిస్థితులను ఎరుగును. దేవుడిచ్చిన కర్తృత్వాన్ని సాధనచేసి, మన సామర్థ్యాలన్నిటిని వినయము మరియు విశ్వాసమందు నిమగ్నం చేసినప్పుడు, జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి, ఆనందాలను కలిగియుండుటకు మన రక్షకుడైన యేసు క్రీస్తు మనకు సహాయపడగలరు. ఆయన నిబంధన బాటను అనుసరించినప్పుడు, మనల్ని దీవించడానికి ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలకు లోబడడం ద్వారా కూడా విశ్వాసం వస్తుంది.
అనిశ్చయముగా, ఒంటరిగా, విసుగ్గా, కోపంగా, విఫలమైనట్లుగా, నిరాశగా లేక దేవుడు మరియు పునఃస్థాపించబడిన ఆయన సంఘము నుండి వేరు చేయబడినట్లుగా మనము భావించియుండి లేక భావించినప్పుడు, మరల ఆయన నిబంధన బాటలోకి రావడానికి అదనపు ప్రయత్నము, విశ్వాసము అవసరం కావచ్చు. కానీ, అది అర్హమైనది! దయచేసి రండి, లేక ప్రభువైన యేసు క్రీస్తు వద్దకు మరలా రండి! భౌతిక లేక ఆత్మీయ మరణ బంధకాల కంటే దేవుని ప్రేమ బలమైనది.10 మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తఃము అనంతమైనది, నిత్యమైనది. మనలో ప్రతి ఒక్కరు సందేహపడవచ్చు, విఫలం కావచ్చు. ఒకసారి మనం దారి తప్పవచ్చు. మనం ఎక్కడున్నా, ఏం చేసినా, తిరిగి రాలేని పరిస్థితి అనేది లేదని ప్రేమగా దేవుడు హామీ ఇస్తున్నారు. మనల్ని హత్తుకొనేందుకు ఆయన సిద్ధంగా ఎదురుచూస్తున్నాడు.11
రెండవది, క్రొత్తగా, ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన ఆత్మ చేత నింపబడిన విధానాల్లో పరిచర్య చేయడానికి మన విశ్వాసపు చలిమంట మనల్ని ప్రోత్సహించగలదు.
అటువంటి పరిచర్య అద్భుతాలను, నిబంధనకు సంబంధించిన దీవెనలను తెస్తుంది—అక్కడ మనం దేవుని ప్రేమను అనుభవిస్తాము మరియు ఆ ఆత్మలో ఇతరులకు పరిచర్య చేయాలని కోరతాము.
కొంత కాలం క్రితం, సహోదరి గాంగ్ మరియు నాకు ఒక తండ్రితోను, విశ్వాసియైన యాజకత్వ సహోదరుని చేత దీవించబడిన కుటుంబంతోను పరిచయమేర్పడింది, ఆ సహోదరుడు తన బిషప్పు వద్దకు వచ్చి, ఆ తండ్రికి గృహ బోధనా సహవాసిగా ఉండవచ్చా అని (యాజకత్వ సహోదరుడు) అడిగాడు. తండ్రి చైతన్యముగా లేడు, మరియు గృహ బోధనయందు ఆసక్తి కలిగిలేడు. కానీ, తండ్రి మనస్సు మారినప్పుడు, అతడు మరియు ఆ యాజకత్వ సహోదరుడు “తమకు” అప్పగించిన కుటుంబాలను సందదర్శించసాగారు. అలా ఒకసారి సందర్శించిన తర్వాత, తనకైతానుగా కూడా సంఘానికి రాని ఆయన భార్య——తన భర్తను ఆ రోజు ఎలా గడిచిందని అడిగింది. “నేనేదో భావించియుండవచ్చు” అని తండ్రి ఒప్పుకున్నాడు—తర్వాత బీరు తెచ్చుకోవడానికి వంటగదిలోకి వెళ్ళాడు. 12
కానీ ఒకదాని తర్వాత ఒకటి అనుభవమయ్యింది: ఆత్మీయ అనుభవాలు, పరిచర్య సేవ, మారుతున్న హృదయాలు, దేవాలయ సిద్ధపాటు తరగతి, సంఘానికి రావడం, పరిశుద్ధ దేవాలయంలో కుటుంబంగా బంధింపబడుట. తమ తల్లిదండ్రుల పట్ల మరియు ఇతరులను ప్రేమించి, పరిచర్య చేయడానికి వారి తండ్రితో స్నేహితునిగా మరియు సహవాసిగా ఉండేందుకు వచ్చిన పరిచర్య చేయు సహోదరుని పట్ల వారి పిల్లలు, మనుమలు ఎంత కృతజ్ఞత కలిగియుంటారో ఊహించండి.
విశ్వాసపు చలిమంట యొక్క మూడవ ప్రోత్సాహము: మన పూర్ణ హృదయాలు, ఆత్మలతో ప్రభువును, ఇతరులను మనం ప్రేమించినప్పుడు సృజనాత్మక సువార్త యొక్క ఆనందము, దీవెనలు వస్తాయి.
మన ప్రయత్నాలన్నిటిని ప్రేమ మరియు సేవ యొక్క బలిపీఠము పైన ఉంచమని లేఖనాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణశక్తితోను “నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనని” పాతనిబంధనలో ద్వితీయోపదేశకాండము మనకు చెప్తుంది.13 “మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, . . . ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, . . . ఆయన ఆజ్ఞలను గైకొనుచు, . . . ఆయనను హత్తుకొని, . . . ఆయనను సేవించుమని” 14 యెహోషువ ప్రేరేపించాడు.
క్రొత్త నిబంధనలో, మన రక్షకుడు రెండు గొప్ప ఆజ్ఞలను వివరించారు: “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను ప్రేమింపవలెను, . . . నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.”15
మోర్మన్ గ్రంథములో: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధనలో రాజైన బెంజిమెన్ “తన శరీరము యొక్క సంపూర్ణ బలముతోను, తన సంపూర్ణ ఆత్మ యొక్క సామర్థ్యముతోను” పనిచేసి, దేశమందు శాంతిని నెలకొల్పాడు. 16 ప్రతి మిషనరీకి తెలిసినట్లుగా, సిద్ధాంతము మరియు నిబంధనలులో, “మన పూర్ణ హృదయము, బలము, మనస్సు మరియు శక్తితో”17 ఆయనను సేవించమని ప్రభువు మనల్ని అడుగుతున్నారు. పరిశుద్ధులు జాక్సన్ కౌంటీలో ప్రవేశించినప్పుడు, “నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ బలము, మనస్సు మరియు శక్తితోను ప్రేమించుచు యేసు క్రీస్తు నామములో మీరు ఆయనను సేవించుట ద్వారా సబ్బాతును పరిశుద్ధముగా ఆచరించవలెనని ప్రభువు వారిని ఆజ్ఞాపించారు.”18
దేవునిని, మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడానికి ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానాలను వెదికేందుకు మరియు మన హృదయాలలో, మన ఇళ్ళలో, సంఘములో పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యందు మన విశ్వాసాన్ని బలపరచుకొనేందుకు మన పూర్ణాత్మలను అంకితం చేయమనే ఆహ్వానమందు మనం ఆనందిస్తున్నాము.
నాల్గవది, విశ్వాసాన్ని, ఆత్మీయతను బలపరిచే నీతివంతమైన జీవనానికి క్రమమైన విధానాలను స్థాపించడానికి విశ్వాసపు చలిమంట మనల్ని ప్రోత్సహిస్తుంది.
ఈ పరిశుద్ధ అలవాట్లు, నీతివంతమైన దినచర్యలు లేక ప్రార్థనాపూర్వక మాదిరులలో ప్రార్థన; లేఖన అధ్యయనము; ఉపవాసము; మన రక్షకుని జ్ఞాపకముంచుకోవడం; సంస్కారపు విధి ద్వారా నిబంధనలు; మిషనరీ, దేవాలయము, కుటుంబ చరిత్ర మరియు ఇతర సేవల ద్వారా సువార్త దీవెనలను పంచుకోవడం; ఆలోచనాపూర్వకమైన స్వంత దినచర్య పుస్తకాన్ని వ్రాయడం, మొదలైనవి ఉన్నాయి.
నీతివంతమైన పద్ధతులు, ఆత్మీయ ఆపేక్షలు కలిసినప్పుడు, కాలము మరియు నిత్యత్వములు ఒక్కటవుతాయి. క్రమమైన మత ఆచరణలు మనల్ని మన పరలోక తండ్రికి మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తుకు దగ్గర చేసినప్పుడు ఆత్మీయ వెలుగు మరియు జీవము వస్తాయి. మనము చట్టము యొక్క ఆత్మను, అక్షరాన్ని ప్రేమించినప్పుడు నిత్యత్వపు విషయాలు పరలోకము నుండి మంచువలె మన ఆత్మలపై కురుస్తాయి.19 అనుదిన విధేయత మరియు సేదదీర్చు జీవజలముతో, మనము అనుదిన సవాళ్ళను ఎదుర్కొనే బలాన్ని, జవాబులను, విశ్వాసాన్ని మరియు సువార్త దృష్టికోణము, సహనము, ఆనందముతో అవకాశాలను కనుగొంటాము.
ఐదవది, దేవుని ప్రేమించడానికి, ఆయనను కలుసుకొనుటకు మనకు, ఇతరులకు సహాయపడుటకు క్రొత్త మరియు పరిశుద్ధ విధానాలను వెదకుతూ పరిచయమున్న పద్ధతులలో మంచివాటిని మనం పాటించినప్పుడు, పరిపూర్ణత అనేది క్రీస్తులోనే ఉందని, మనలో లేక లోకపు పరిపూర్ణత్వంలో లేదని గుర్తుంచుకోవడానికి మన విశ్వాసపు చలిమంట మనల్ని ప్రోత్సహిస్తుంది.
దేవుని ఆహ్వానాలు ప్రేమ మరియు అవకాశాలతో నింపబడియున్నాయి, ఎందుకంటే యేసు క్రీస్తే “మార్గమును, సత్యమును, జీవము.”20 భారంగా భావించువారిని, “నా యొద్దకు రండి,” అని ఆయన ఆహ్వానిస్తున్నారు మరియు ఆయన యొద్దకు వచ్చినవారికి, “నేను మీకు విశ్రాంతి కలుగజేతును,”21 అని వాగ్దానమిస్తున్నారు. “క్రీస్తునొద్దకు రమ్ము, ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము, . . . మీ సమస్త బలము, మనస్సు మరియు శక్తితో దేవునిని ప్రేమించిన యెడల, ఆయన కృప ద్వారా మీరు క్రీస్తునందు పరిపూర్ణులగునట్లు, అప్పుడు ఆయన కృప మీకు చాలును.”22
మనకు శాయశక్తులా చేసిన తర్వాత కూడా, మన తప్పేమీ లేకపోయినా, మనం ఆశించినట్లుగా లేక అర్హత కలిగియున్నట్లుగా ఏదీ జరుగనప్పుడు కూడా ప్రభువు యందు విశ్వాసము, నమ్మకంతో ముందుకు కొనసాగగలిగేలా “ఆయన కృప ద్వారా మీరు క్రీస్తునందు పరిపూర్ణులగునట్లు” అనే అభయములో కూడా ఓదార్పు, శాంతి, వాగ్దానమున్నాయి.
అనేక సమయాల్లో, అనేక విధాలుగా, మనమందరం తగనట్లుగా, అనిశ్చయంగా, బహుశ అయోగ్యులుగా భావిస్తాము. అయినప్పటికీ, దేవునిని ప్రేమించడానికి, మన పొరుగువారికి పరిచర్య చేయడానికి విశ్వాసంతో చేసే మన ప్రయత్నాలలో మనం దేవుని ప్రేమను మరియు వారికి, మనకు కావలసిన ప్రేరేపణను క్రొత్త మరియు పరిశుద్ధ విధానాల్లో అనుభవించగలము.
“క్రీస్తునందు ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్క మరియు మనుష్యులందరి యొక్క ప్రేమను కలిగి మనం ముందుకు త్రోసుకు వెళ్ళగలమని,”23 కనికరముతో మన రక్షకుడు ప్రోత్సహించి, వాగ్దానమిస్తున్నారు. క్రీస్తు యొక్క సిద్ధాంతము, మన రక్షకుని ప్రాయశ్చిత్తఃము మరియు ఆయన నిబంధన బాటను పూర్తి విధేయతతో అనుసరించడం ఆయన సత్యాలను తెలుసుకోవడానికి మనకు సహాయపడగలవు మరియు మనల్ని స్వతంత్రులనుగా చేయగలవు.24
ఆయన సువార్త యొక్క సంపూర్ణత్వము, ఆయన సంతోష ప్రణాళిక పునఃస్థాపించబడ్డాయని, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో, పరిశుద్ధ లేఖనాలలో, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ నుండి నేడు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వరకు ప్రవక్తలచేత బోధించబడుతున్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన నిబంధన బాట, “మీరు నిత్యజీవమును కలిగియుందురు,”25 అని మన ప్రేమగల పరలోక తండ్రి వాగ్దానమిచ్చిన గొప్ప వరమునకు నడిపిస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను.
మన విశ్వాసపు చలిమంట వద్ద మన హృదయాలను, నిరీక్షణలను, ఒడంబడికలను వెచ్చగా చేసుకున్నప్పుడు ఆయన దీవెనలు మరియు శాశ్వతమైన ఆనందము మనవి అగునుగాక, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.