మృతుల విమోచనను గూర్చి దర్శనం
అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ పొందిన దర్శనము సత్యమని నేను సాక్ష్యమిస్తున్నాను. అది సత్యమని ప్రతీ వ్యక్తి తెలుసుకోగలరని నేను సాక్ష్యమిస్తున్నాను.
నా సహోదర, సహోదరిలారా, నా ప్రియమైన భార్య చనిపోకముందు నా ప్రసంగము సిద్ధపరచబడింది. మీ ప్రేమ మరియు మీ అమితమైన దయ కొరకు నేను, నా కుటుంబము మీకు కృతజ్ఞతను తెలుపుచున్నాము. ఈ ఉదయకాలము నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు నన్ను దీవించాలని నేను ప్రార్ధిస్తున్నాను.
100 సంవత్సరాల క్రితం, 1918 అక్టోబరులో, అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఒక మహిమకరమైన దర్శనాన్ని పొందారు. సుమారు 65 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘంలో ప్రభువుకు సమర్పించబడిన సేవచేసి, నవంబర్ 19, 1918న ఆయన మరణానికి కొన్ని వారాలకు ముందు, తన గదిలో క్రీస్తు ప్రాయశ్చిత్త త్యాగాన్ని ధ్యానిస్తూ, సిలువ మరణం తర్వాత ఆత్మల లోకంలో రక్షకుని పరిచర్యను గూర్చి అపోస్తలుడైన పేతురు వివరణను చదివారు.
ఆయన ఇలా వ్రాసారు: “నేను చదివినప్పుడు చాలా ప్రభావితం చేయబడ్డాను. . . . నేను ఈ విషయాలను గూర్చి ధ్యానించినప్పుడు. . . . నా గ్రహింపు యొక్క కనులు తెరువబడ్డాయి, ప్రభువు ఆత్మ నాపై క్రుమ్మరించబడింది, నేను చనిపోయిన వారి గుంపులను చూచాను.” 1 ఆ దర్శనం పూర్తిగా సిద్ధాతము మరియు నిబంధనలు సెక్షను 138లో వ్రాయబడింది.
ఈ అద్భుతమైన బయల్పాటును పొందుటకు జోసెఫ్ ఎఫ్. యొక్క జీవితకాల సిద్ధపాటును మనము మరింత పరిపూర్ణంగా అభినందించుటకు దాని నేపథ్యమును మీకిస్తాను.
ఆయన సంఘాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆయన 1906లో నావూను దర్శించి తనకు ఐదు సంవత్సరాలప్పటి ఒక జ్ఞాపకంను పునఃసమీక్షించారు. ఆయన “మా చిన్నాన్న జోసెఫ్, నా తండ్రి హైరం కార్థేజ్ చెరశాలకు వెళ్తున్నప్పుడు ఈ ఖచ్చితమైన ప్రదేశంలో నేను నిల్చున్నానని” చెప్పారు. మానాన్న గుర్రంనుండి దిగకుండా గుర్రపు జీనుపై నుండి వంగి నన్నెత్తుకొన్నారు. ఆయన ఇక సెలవని నన్ను ముద్దాడి, క్రిందకు దించాడు మరియు నేను ఆయన వెళ్లిపోవుటను చూచానని”2 చెప్పారు.
తర్వాత వారిని జోసెఫ్ ఎఫ్., తన తల్లి, మేరీ ఫీల్డింగ్, తనను ఎత్తికొనినప్పుడు కార్థేజ్ చెరశాలలో జూన్ 27, 1844న హతసాక్షులిద్దరూ క్రూరంగా చంపబడి ప్రక్కప్రక్కన పడియుండినప్పుడు చూసారు.
రెండు సంవత్సరాల తర్వాత, జోసెఫ్ ఎఫ్., తన కుటుంబం, విశ్వాసనీయురాలైన తల్లి, మేరీ ఫీల్డింగ్ స్మిత్‌తోపాటు నావూలోని తన గృహాన్ని విడిచి వింటర్ క్వార్టర్స్కు వచ్చారు. ఇంకా ఎనిమిది సంవత్సరాలు కూడా లేని జోసెఫ్ ఎఫ్. ఐయోవాలోని మాంట్రోస్ నుండి వింటర్ క్వార్టర్స్‌కు అక్కడనుండి ఆయన దాదాపు 10 సంవత్సరాల వయస్సున్నప్పుడు తర్వాత సాల్ట్ లేక్ లోయకు చేరుకునే వరకు ఎద్దులను నడపించవలసివచ్చింది. బాలురు, యువకులైన వినుచున్న మీరు దీనిని విని, ఆయన బాల్యంలో జోసెఫ్ ఎఫ్. పై పెట్టబడిన బాధ్యతను, అంచనాను గ్రహిస్తారని ఆశిస్తున్నాను.
నాలుగు సంవత్సరాల తర్వాత, 1852లో, ఆయనకు 13 సంవత్సరాలప్పుడు, తన ప్రియమైన తల్లి జోసెఫ్‌ను, అతని తోబుట్టువులను అనాధలను చేస్తూ మరణించింది.3
ఆయనకు పదిహేను సంవత్సరాల వయస్సున్నప్పుడు జోసెఫ్ ఎఫ్. 1854లో హవాయి ద్వీపాలకు మిషను సేవకై పిలవబడ్డారు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలము సాగిన ఈ మిషను, సంఘంలో జీవితకాల సేవకు ఆరంభము.
ఆయన యూటాకు తిరిగి వచ్చిన తర్వాత, జోసెఫ్ ఎఫ్. 1859లో వివాహం చేసుకున్నారు.4 తర్వాత కొన్ని సంవత్సరాలు, ఆయన జీవితం పని, కుటుంబ బాధ్యతలు, ఇంకో రెండు అదనపు మిషన్లతో నింపబడింది. జూలై 1, 1866లో 27 సంవత్సరాలప్పుడు అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ ఆయనను అపోస్తలునిగా నియమించినప్పుడు జోసెఫ్ ఎఫ్. జీవితం శాశ్వతంగా మారిపోయింది. మరుసటి సంవత్సరం అక్టోబరులో, పన్నెండుమంది సలహాసభలో ఒక ఖాళీని ఆయన భర్తీ చేసారు.5 1901లో అధ్యక్షునిగా నియమించబడక ముందు, ఆయన బ్రిగమ్ యంగ్, జాన్ టేలర్, విల్ఫోర్డ్ ఉడ్రఫ్, లొరెంజో స్నోకు సలహాదారుడిగా సేవ చేసారు.6
జోసెఫ్ ఎఫ్. ఆయన భార్య జులీనా వారి మొదటి కుమార్తె, మెర్సీ జోసెఫీన్‌ను వారి కుటుంబంలోనికి స్వాగతించారు.7 ఆమెకు రెండున్నర సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆమె చనిపోయింది. అది జరిగిన వెంటనే జోసెఫ్ ఎఫ్. వ్రాసారు: “నా . . . ప్రియమైన జోసెఫీన్ చనిపోయి నిన్నటికీ నెల రోజులయ్యింది. ఓ! నేను ఆమెను పెరిగి పెద్దయ్యేవరకు కాపాడగలిగియుండవలసింది. ప్రతీ రోజు ఆమె నాకు గుర్తు వస్తున్నది, నేను ఒంటరిని. . . . . దేవా నేను ప్రేమిస్తున్నట్లు నా చిన్నారులను ప్రేమించుట తప్పు అయితే నా బలహీనతను క్షమించు”8 అని వ్రాసారు.
తన జీవితకాలంలో, అధ్యక్షులు స్మిత్ తన తండ్రి, తన తల్లి, ఒక సోదరుడు, ఇద్దరు సోదరీలను, ఇద్దరు భార్యలను, పదమూడు మంది పిల్లలను కోల్పోయారు. ఆయన విచారమును, తన ప్రియమైన వారిని కోల్పోవడంను బాగా ఎరిగియున్నారు.
తన కుమారుడు ఆల్బర్ట్ జెస్సీ చనిపోయినప్పుడు, జోసెఫ్ ఎఫ్. తన సహోదరి మార్తా ఏన్‌కు ఆయన ప్రభువుతో తన కుమారుడ్ని రక్షించమని వేడుకున్నానని, మరియు “ఇలా ఎందుకు? ఓ. దేవా ఇది ఎందుకు జరిగిందని” 9 అడిగానని వ్రాశారు.
ఆ సమయంలో ఆయన ప్రార్థనలు చేసినప్పటికిని, జోసెఫ్ ఎఫ్. ఆ విషయంపై జవాబును పొందలేదు.10 ఆయన మార్తా ఏన్‌తో మరణం, ఆత్మలోకం అనే విషయంపై “పరలోకం మన శిరస్సులపై ఇత్తడివలే ఉన్నదని” చెప్పారు. అయినప్పటికీ, ప్రభువు యొక్క నిత్య వాగ్ధానాలపై ఆయన విశ్వాసం బలంగాను, స్థిరంగాను ఉండెను.
ప్రభువు యొక్క తగిన సమయంలో, అధ్యక్షులు స్మిత్ వెదకిన అదనపు జవాబులు, ఆదరణ, ఆత్మలోకం గూర్చిన జ్ఞానం అక్టోబరు 1918లో ఆయన పొందిన అద్భుతమైన దర్శనం ద్వారా వచ్చాయి.
ఆ సంవత్సరం ప్రత్యేకంగా ఆయనకు చాలా బాధాకరమైంది. గొప్ప ప్రపంచ యుద్దంలో చనిపోయిన వారి సంఖ్య 2 కోట్లకు మించిపోవడంపై ఆయన దుఃఖించారు. అదేకాకుండా, ప్రపంచమంతా పాకుతున్న పాండెమిక్ జ్వరం దాదాపు 10 కోట్లమంది ప్రాణాలను తీసుకున్నది.
ఆ సంవత్సరంలో, అధ్యక్షులు స్మిత్ కూడ మరో ముగ్గురు అమూల్యమైన కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఆయన జేష్ట్య కుమారుడు, మా తాతయ్య అయిన పన్నెండుమంది అపోస్తలుల కూటమికి చెందిన ఎల్డర్ హైరం మాక్ స్మిత్, అకస్మాత్తుగా అపెండిక్సు పగిలిపోవుటచే మరణించాడు.
అధ్యక్షులు స్మిత్ వ్రాసారు: “నేను వేదనతో--మాటల్లేకుండా ఉండిపోయాను! . . . నా గుండె పగిలిపోయింది; జీవం కోసం కొట్టుకొంది! . . . ఓ, నేనెంతగా అతన్ని ప్రేమించాను! . . . నేను అతడిని ఇంకా శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాను. అదేవిధంగా ఎప్పటికీ నా కుమారులు, కుమార్తెలందరిని కూడా ప్రేమిస్తాను, కానీ ఇతడు నా జేష్ట్య పుత్రుడు, జనులలో గౌరవప్రదమైన పేరును, అంతములేని నిరీక్షణను, సంతోషాన్ని నాకు తెచ్చిన జేష్ట్యుడు. నా ఆత్మ లోతులలోనుండి అతని గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను! కానీ ఓ అతడు నాకు అవసరం! మనందరికీ అతడు అవసరం! అతడు సంఘానికి చాలా ఉపయోగపడ్డాడు. ... ఇప్పుడు, . . . ఓ! నేనేమి చెయ్యగలను! . . . ఓ! దేవా నాకు సహాయం చేయుము!”11
మరుసటి నెల, అధ్యక్షులు స్మిత్ యొక్క అల్లుడు, అలాన్జో కెస్లర్, ఘోరమైన ప్రమాదంలో మరణించాడు.12 అధ్యక్షులు స్మిత్ తన దినచర్య పుస్తకంలో, “ఈ అతి ఘోరమైన, అతి విచారకరమైన ప్రమాదం, మరలా నా కుటుంబమంతటిని మిక్కిలి విచారగ్రస్తులను చేసింది,”13 అని వ్రాసారు.
ఏడు నెలల తర్వాత, సెప్టెంబర్ 1918లో, అధ్యక్షులు స్మిత్ యొక్క కోడలు మా అమ్మమ్మ, ఇడా బౌమెన్ స్మిత్, తన ఐదవ కుమారుడు, మా చిన్నాన్న హైరంకు జన్మనిచ్చిన తరువాత మరణించింది.14
కాబట్టి అక్టోబరు 3, 1918న, ప్రపంచములో యుద్దం, వ్యాధి వలన చనిపోయిన లక్షలాది మంది కొరకు, అంతేకాకుండా తన స్వంత కుటుంబ సభ్యుల మరణాల వలన, తీవ్రమైన విచారం అనుభవించిన అధ్యక్షులు స్మిత్ “మృతుల విమోచన యొక్క దర్శనం” అని పిలవబడిన పరలోకపు బయల్పాటును పొందారు.
మరునాడు అక్టోబరు సర్వసభ్య సమావేశంలో ఆయన ఆ బయల్పాటును గూర్చి తెలియజేసారు. అధ్యక్షులు స్మిత్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, ఆయన క్లుప్తంగా ఇలా మాట్లాడారు: “నేను ఈ ఉదయకాలమున, నా మనస్సులో దాచబడియున్న అనేక విషయాలను ప్రస్తావించలేను, ప్రస్తావించడానికి ధైర్యం చేయలేను, వాటిని కొంతకాలం వరకు వాయిదా వేసి, దేవుని చిత్తమైతే నా హృదయంలో వసిస్తూ నా మదిలోనున్న వాటిని గూర్చి మాట్లాడడానికి ఇంకొకసారి ప్రయత్నిస్తాను. (గత) ఐదునెలలు నేను ఒంటరిగా జీవించలేదు. నేను ప్రార్థనలో, మొరపెడుతూ, విశ్వాసంలో, మరియు తీర్మానముగల ఆత్మతో గడిపాను; మరియు నిరంతరము నేను ప్రభువు యొక్క ఆత్మతో నా సంభాషణను జరిపాను.”15
అక్టోబరు 3న ఆయన పొందిన బయల్పాటు ఆయన హృదయానికి ఆదరణనిచ్చి ఆయన అనేక ప్రశ్నలకు సమాధానాలనిచ్చింది. మనం కూడా ఈ బయల్పాటును అధ్యయనం చేసి, ప్రతీదినం మనం జీవించు విధానంలో దాని ప్రాముఖ్యతను ధ్యానించుట ద్వారా మనం మరణించి, ఆత్మల లోకానికి వెళ్తామని మన స్వంత భవిష్యత్తును గురించి ఇంకా నేర్చుకొని, ఆదరణను పొందగలం.
అధ్యక్షలు స్మిత్ చూసిన అనేక విషయాలలో సిలువపై తన మరణం తర్వాత ఆత్మల లోకంలోని విశ్వాసులను రక్షకుని దర్శనము కూడా కలదు. ఆ దర్శనం నుండి నేను కొన్ని పంచుకుంటాను:
“కానీ ఇదిగో, నీతిమంతులలో నుండి, ఆయన తన బలములను ఏర్పరచి, రాయబారులను నియమించి, వారికి శక్తిని అధికారమును ధరింప జేసి, చీకటిలోనున్న పురుషులు (మరియు స్త్రీల) ఆత్మలు అన్నింటికీ సువార్త వెలుగును తీసుకుపొమ్మని ఆజ్ఞాపించెను;”16 అందుకే సువార్త చనిపోయిన వారికి ప్రకటించబడెను. …
“వీరు దేవుని యందు విశ్వాసం, పాపము నుండి పశ్చాత్తాపం, పాపముల పరిహారం కొరకు ప్రత్యామ్నాయ బాప్తీస్మం, హస్త నిక్షేపణం చేత పరిశుద్ధాత్మ వరం గురించి,
“శరీరమందు మనుష్యుల ప్రకారము తీర్పు తీర్చబడుటకు, దేవునిని బట్టి ఆత్మయందు జీవించుటకు తమను తాము అర్హులుగా చేసుకొనుటకు బదులుగా వారు తెలుసుకొనుటకు అవసరమైన ఇతర సువార్త సూత్రములన్నియు బోధించబడెను. …
“ఏలయనగా మృతులు తమ శరీరముల నుండి తమ ఆత్మలు వేరుగానుండుటను నిర్భంధముగా చూచిరి.
“వీరికి ప్రభువు బోధించి, మరణమునుండి తన పునరుత్థానము జరిగిన తరువాత, తన తండ్రి రాజ్యములోనికి ప్రవేశించి, అక్కడ అమర్త్యత్వాన్ని, నిత్యజీవాన్ని కిరీటముగా ధరించి ముందుకు వచ్చుటకు శక్తినిచ్చెను,
“ప్రభువుచేత వాగ్దానము చేయబడిన విధముగా అక్కడ నుండి తమ కార్యములను కొనసాగించి, ఆయనను ప్రేమించు వారి కొరకు దాచబడియున్న దీవెనలన్నిటిలో పాలుపొందెదరు.”17
దర్శనంలో, అధ్యక్షులు స్మిత్ తన తండ్రి హైరమ్‌ను, ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను చూసారు. ఆయన చిన్నబాలునిగా నావూలో చివరిసారిగా వారిని చూసినప్పుటి నుండి అప్పటికి 74 సంవత్సరాలయ్యింది. ఆయన తన ప్రియమైన తండ్రిని, చిన్నాన్నను చూసినప్పుడు కలిగే సంతోషం మనం కేవలం ఊహించగలం. ఆయన ఆత్మలన్నీ వారి మర్త్య శరీర ఆకారాన్ని కలిగియుంటాయని, వాగ్ధానం చేయబడిన వారి పునరుత్థాన దినం కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుసుకొనుటలో ప్రేరేపణను, ఆదరణను పొందియుండవచ్చు. ఆ దర్శనం పరలోకతండ్రి తన పిల్లలకై చేసిన ప్రణాళిక, క్రీస్తు యొక్క విమోచించు ప్రేమ, ఆయన ప్రాయశ్చిత్తంలోని సరిపోల్చలేని శక్తి యొక్క లోతును, వెడల్పును మరింత పరిపూర్ణంగా బయల్పరచింది.18
ఈ ప్రత్యేక 100వ వార్షికోత్సవంలో, ఈ బయల్పాటును ఆలోచనాపూర్వకంగా చదవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఆవిధంగా చేసినప్పుడు, దేవుని ప్రేమను, ఆయన రక్షణ ప్రణాళికను, తన పిల్లల కొరకు గల సంతోషాన్ని మీరు ఎక్కువగా గ్రహించి, మెచ్చుకొనులాగున ప్రభువు మిమ్ములను దీవించునుగాక.
అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ పొందిన దర్శనం సత్యమని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రతి వ్యక్తి దానిని చదివి అది సత్యమైనదని తెలుసుకోగలరని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ జీవితంలో ఈ జ్ఞానాన్ని పొందని వారు, ఆత్మలోకంలోనికి ప్రతీఒక్కరు ప్రవేశించినప్పుడు దాని సత్యాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. అక్కడ, అందరూ గొప్ప రక్షణ ప్రణాళిక కొరకు, శరీరం, ఆత్మ మరలా ఇంకెన్నటికీ వేరు చేయబడకుండా తిరిగి ఒక్కటిగా చేయబడే వాగ్దానమివ్వబడిన పునరుత్థాన దీవెన కొరకు దేవునిని, ప్రభువైన యేసు క్రీస్తును అందరూ ప్రేమించి, స్తుతిస్తాము.19
నా ప్రశస్తమైన బర్బారా ఎక్కడున్నదో తెలుసుకొన్నందుకు, మరియు మేము మా కుటుంబముతో తిరిగి కలిసి ఉండబోతున్నందుకు నేనెంత కృతజ్ఞత కలిగియున్నాను. ఇప్పుడు మరియు ఎల్లప్పుడు ప్రభువు యొక్క సమాధానము మమ్మల్ని బలపరచును గాక, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.