మరియు ఇది నిత్యజీవము
దేవుడు మిమ్మల్ని ఎరుగును మరియు ఆయనను తెలుసుకొనుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు.
ప్రభువు సంఘము యొక్క ఈ భవిష్య నాయకులు, రాబోవు తరాలైన-యువత, ఒంటరి లేదా వివాహితులైన యుక్తవయస్కులతో నేను మాట్లాడుచున్నాను. నేడు ప్రపంచము దుష్టత్వము, గందరగోళము, భయము, కలవరమును కలిగియుండగా, దేవుని తెలుసుకొనుట వలన కలుగు ఘనత, దీవెనలను గూర్చి స్పష్టతతో నేను మీతో మాట్లాడుచున్నాను.
పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళికను, దానిలో మీ స్థానాన్ని వివరించు అనేక సత్యాలను యేసు క్రీస్తు బోధించెను. వాటిలో దేవుని బిడ్డగా మీ గుర్తింపును, జీవితములో మీ ఉద్దేశమును అర్థము చేసుకొనుటకు మీకు సహాయపడుటకు ఈ రెండిటిపై నేను దృష్టిసారిస్తాను.
మొదటిది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” 1
రెండవది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును యెరుగుటయే నిత్య జీవము.” 2
ఈ రెండు సత్యాలను మీ మనస్సులో నిలుపుకొనండి- -మీరు, మనందరము ఎలా దేవుని తెలుసుకొనవచ్చో వివరించుటకు నేను ప్రయత్నించినప్పుడు, అవి ఎందుకో— మనకు బోధిస్తాయి.
ప్రార్థన ద్వారా ఆయనను తెలుసుకొనండి
నా యౌవన స్నేహితులారా, ప్రార్థన ద్వారా మనం దేవుని తెలుసుకొనుట మొదలుపెట్టవచ్చు.
1829, ఏప్రిల్ 7న, 23యేళ్ల జోసెఫ్ స్మిత్‌కు, 22 సంవత్సరాల ఆలీవర్ కౌడరీ లేఖకునిగా తన పనిని మొదలుపెట్టెను. మీవలె వారు కూడా యౌవనులు. ఆలీవర్ పునఃస్థాపన గురించి, దానిలో తాను చేయవలసిన పని గురించి నిర్ధారణకొరకు దేవుని ప్రార్థించెను. దానికి సమాధానముగా, క్రింది బయల్పాటును పొందెను:
“ఇదిగో, నీవు నా యొద్ద విచారించితివని, నేను నీ మనస్సును వెలుగుతో నింపితినని నీవెరుగుదువు . . .
“అవును, దేవుడు తప్ప మరెవరును నీ హృదయ తలంపులను, ఆలోచనలను యెరుగరని నీవు తెలుసుకొనునట్లు నేను నీతో చెప్పుచున్నాను. . .
“. . . మరింత సాక్ష్యము కొరకు నీవు కోరినయెడల, నీ హృదయమందు నీవు నాతో మొరపెట్టుకొనియున్న ఆ రాత్రిని జ్ఞాపకము చేసుకొనుము. . .
“. . . నీ మనస్సుకు నేను శాంతిని కలుగజేయలేదా … ? దేవుని నుండి తప్ప మరే గొప్ప సాక్ష్యమును నీవు కలిగియుండగలవు?” 3
మీరు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఆత్మ మీ ఆత్మతో మాట్లాడినప్పుడు, మీరు దేవుని ప్రేమను అనుభూతిచెందుతారు. కొన్ని సమయాలలో, మీరెంత ఒంటరితనమును లేక అస్పష్టతను ఆనుభవించినను, ఈ లోకములో మీరు ఒంటరిగా లేరు. దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతముగా, యెరుగును. మీరు ప్రార్థించినప్పుడు, మీరు ఆయనను తెలుసుకొంటారు.
లేఖన అధ్యయనము ద్వారా ఆయనను తెలుసుకోండి
నీవు లేఖన అధ్యయనము చేసినప్పుడు, కేవలం నీవు రక్షకుని గురించి నేర్చుకొనుటయే కాదు, కాని నీవు నిజముగా రక్షకుని తెలుసుకొంటావు.
ఎల్డర్ బ్రూస్ ఆర్. మెఖాంకే తాను మరణించుటకు కేవలం 13 రోజుల ముందు, 1985లో ఏప్రిల్ సర్వసభ్యసమావేశములో ప్రసంగించెను. ఈ సాక్ష్యముతో ఆయన ముగించెను:
“ఆయన సాక్ష్యులలో నేను ఒకడినైయున్నాను, రాబోవు దినాలలో ఆయన చేతులలో, కాళ్లలో మేకుల గుర్తులను తాకి, ఆయన పాదాలను నా కన్నీళ్లతో తడుపుతాను.
“కాని ఆయన దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన కుమారుడని, రక్షకుడు మరియు విమోచకుడని, రక్షణ ఆయన ప్రాయశ్చిత్త రక్తము ద్వారా తప్ప మరే ఇతర మార్గము ద్వారా రాదని ఇప్పుడు నేను తెలుసుకున్న దానికంటే ఎక్కువ నేనుతెలుసుకోలేను.” 4
ఆరోజు ఎల్డర్ మెఖాంకే మాట్లాడగా విన్న మనము, మనమేవిధంగా భావించామో ఎప్పటికి మరువలేము. ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టినప్పుడు, తన సాక్ష్యము ఎందుకు బలమైనదో ఆయన బయలుపరచెను. ఆయన ఇలా చెప్పారు:
“ఈ అద్భుతమైన సంగతుల గురించి మాట్లాడుచున్నప్పుడు, అవి లేఖనపు మాటలని మీరు అనుకొన్నప్పటికి నేను నా స్వంతమాటలను ఉపయోగిస్తాను. . . .
“నిజమే అవి మొదట ఇతరులచేత ప్రకటించబడినవి, కాని అవి ఇప్పుడు నావి, ఎందుకంటే అవి సత్యమైనవని దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యమిచ్చెను, మరియు ఇప్పుడు అవి మొట్టమొదట ప్రభువు నాకు బయలుపరచినట్లుగా ఉన్నది.. అందువలన నేను ఆయన స్వరమునువిని, ఆయన వాక్యమును తెలుసుకున్నాను.”5
మీరు లేఖనములను అధ్యయనము చేసి, పర్యాలోచన చేసినయెడల, మీరు కూడా దేవుని స్వరమును విని, ఆయన మాటలను ఆయనను తెలుసుకొంటారు. దేవుడు మీకు వ్యక్తిగతముగా తన నిత్య సత్యాలను బయలుపరుస్తారు. ఈ సిద్ధాంతములు, సూత్రములు మీరెవరు అనేదానిలో భాగమై, మీ ఆత్మలోనుండి ఉద్భవిస్తాయి.
వ్యక్తిగత అధ్యయనమునకు అదనముగా, కుటుంబముగా లేఖన అధ్యయనము చేయుట ముఖ్యమైనది.
మన ఇంటిలో, మన పిల్లలు ఆత్మ యొక్క స్వరమును గుర్తించుటను నేర్చుకోవాలని మనం కోరుకుంటాము. కుటుంబముగా మనం మోర్మన్ గ్రంథమును అధ్యయనము చేసినప్పుడు అది సాధ్యమైందని మనం నమ్ముతాము. పరిశుద్ధమైన సత్యాల గురించి మనం మాట్లాడినప్పుడు మన సాక్ష్యములు బలపరచబడ్డాయి.
లేఖన అధ్యయనము అనేది ఆత్మ మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పాఠములు ఇచ్చుటకు ఒక మార్గముగా కాగలదు. ఒంటరిగాను, కుటుంబముగాను అనుదినము మీరు లేఖనములను అధ్యయనము చేసినప్పుడు, మీరు ఆత్మ స్వరమును గుర్తించుటను నేర్చుకొని, దేవునిని తెలుసుకుంటారు.
ఆయన చిత్తమును చేయుట ద్వారా ఆయనను తెలుసుకోండి
ప్రార్థన చేయడం, లేఖనాలను అధ్యయనం చెయ్యడంతో పాటు అదనంగా, మనం దేవుని యొక్క చిత్తమును చెయ్యాల్సిన అవసరమున్నది.
రక్షకుడే మనకు పరిపూర్ణ మాదిరి. “నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని” 6 అని ఆయన చెప్పారు.
పునరుత్థానము చెందిన రక్షకుడు నీఫైయులకు ప్రత్యక్షమైనప్పుడు ఇలా చెప్పారు, “నేను లోకమునకు వెలుగును, జీవమునైయున్నాను; తండ్రి నాకు ఇచ్చిన ఆ చేదు పాత్రలోనిది నేను త్రాగియున్నాను; మరియు లోక పాపములను నాపైన తీసుకొనుటలో తండ్రిని మహిమపరచియున్నాను, దానికొరకు అది నుండి అన్ని విషయములందు తండ్రి చిత్తమునకునేను లోబడియున్నాను.” 7
నిబంధనలను గౌరవించుట ద్వారా, ఆజ్ఞలను పాటించుట ద్వారా, దేవునికి, మన తోటివారికి సేవచేయుట ద్వారా మీరు, నేను తండ్రి చిత్తమును చేస్తాము.
నా భార్య రోండా మరియు నేను, సామాన్యమైన ప్రజలుగా ఉన్న తల్లిదండ్రులను కలిగియున్నాము--బహుశా మీ తల్లిదండ్రుల లాంటివారే కావచ్చు. కాని మా తల్లిదండ్రుల గురించి నేను ప్రేమించే విషయమేమంటే దేవుని సేవకు వారు తమ జీవితాలను అర్పించుకొన్నారు, ఆవిధంగా చెయ్యాలని మాకు బోధించారు.
రోండా తల్లిదండ్రులకు వివాహమైన రెండు సంవత్సరాలకే, 23 సంవత్సరాల వయస్సుగల తన తండ్రి పూర్తికాల మిషను సేవ చేయుటకు పిలువబడెను. ఆయన తన యౌవనస్తురాలైన భార్యను, రెండు సంవత్సరాల కుమార్తెను వదిలి వెళ్లెను. తరువాత ఆయన మిషనులో ఆఖరి ఏడు నెలల కాలంలో-- వారి కుమార్తె బంధువుల సంరక్షణలో ఉంచబడి- తనతోపాటు సేవచేయుటకు ఆయన భార్య పిలువబడెను.
కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె తండ్రి విశ్వవిద్యాలయమునకు హాజరగుటకు అప్పటికి నలుగురు పిల్లలతో వారు మిసౌలా, మోన్టానాకు వెళ్లారు. అయినప్పటికి, వారక్కడ కొన్ని నెలలు ఉన్న తరువాత, అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యూ. కింబల్, ఎల్డర్ మార్క్ ఈ. పీటర్సన్‌లు నా మామగారికి క్రొత్తగా సృష్టించబడిన మిసౌలా స్టేకుకు మొదటి అధ్యక్షునిగా పిలుపునిచ్చారు. అప్పటికి ఆయన వయస్సు 34. ఆయన తన చిత్తాన్ని కాకుండా--ప్రభువు యొక్క చిత్తాన్ని చేయుటకు ప్రయత్నించినప్పుడు విశ్వవిద్యాలయము గురించిన ఆలోచనలు వదిలివేసారు.
నా తల్లిదండ్రులు 30 సంవత్సారాలకు పైగా నాన్న బంధించువానిగా, అమ్మ విధి కార్యకర్తగా --దేవాలయములో సేవ చేసారు. వారు కలిసి ఐదు పూర్తి కాల మిషన్లను---రివర్‌సైడ్, క్యాలిఫోర్నియా; ఉలాన్‌బాతర్, మంగోలియా; నైరోబి, కెన్యా; నావూ ఇల్లినాయ్స్ దేవాలయము; మరియు మాంటెరి మెక్సికో దేవాలయములో చేసారు. మెక్సికోలో క్రొత్త భాషను నేర్చుకొనుటకు చాలా కష్టబడ్డారు, 80 యేళ్ల వయస్సులో అది అంత సులభము కాదు. కాని జీవితములో వారి స్వంత కోరికలను వెదకుట కంటే, ప్రభువు చిత్తాన్ని చేయుటకు వారు ప్రయత్నించారు.
వారికి, మరియు ప్రపంచమంతటా సమర్పించుకొన్న కడవరి దిన పరిశుద్ధులందరికి, హీలమన్ కుమారుడు, ప్రవక్తయైన నీఫైకు ప్రభువు చెప్పిన మాటలను ప్రతిధ్వనింపజేస్తున్నాను: “అలసట లేకుండా … , నీవు చేసిన క్రియల నిమిత్తము నీవు ధన్యుడవు . . . [ఏలయనగా నీవు] నీ స్వంత ప్రాణమును కోరియుండలేదు, కానీ నా చిత్తమును మరియు నా ఆజ్ఞలను నెరవేర్చుటకు కోరియుంటివి.”8
విశ్వాసముగా ఆయనను, మన తోటివారిని సేవించుటకు మనం ప్రయత్నించినప్పుడు, మనం ఆయన అంగీకారమును పొంది, ఆయనను నిజముగా తెలుసుకొంటాము.
ఆయనవలె అగుట ద్వారా ఆయనను తెలుసుకోండి
దేవునిని తెలుసుకొనుటకు అతి ఉత్తమమైన మార్గము ఆయనవలె అగుట అని రక్షకుడు మనకు చెప్పియున్నారు. ఆయన ఇలా బోధించారు: “కాబట్టి మీరు ఏవిధమైన మనుష్యులై యుండవలెను? నేను ఉన్నట్లే అని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.”9
ఆయనవలె అగుటకు యోగ్యత కలిగియుండుట ఆవశ్యకమైనది. “మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి; అవును నేము మిమ్ములను పవిత్రులుగా చేయుటకు మీ హృదయములను శుద్ధి చేసుకొనుడి మీ చేతులను కడుగుకొనుడి” 10 అని ఆయన ఆజ్ఞాపించారు. ఆయనవలె అయ్యే మార్గములో నడుచుటకు మొదలుపెట్టుటకు మనం పశ్చాత్తాపపడి, ఆయన క్షమాపణను పొందుతాము, అప్పడు ఆయన మన ఆత్మలను శుద్ధిచేయును.
తండ్రివైపుకు అభివృద్ధిచెందుటలో సహాయపడుటకు ప్రభువు మనకు ఈ వాగ్దానమునిచ్చెను: “తన పాపములను విడిచిపెట్టి, నా నామమును బట్టి ప్రార్థన చేయుచు, నా మాటకు లోబడి, నా ఆజ్ఞలను గైకొని నా యొద్దకు వచ్చు ప్రతి ఆత్మ నా ముఖమును చూచి నేను ఉన్నవాడను అని తెలుసుకొనును.” 11
ఆయన ప్రాయశ్చిత్త త్యాగమునందు మనకున్న విశ్వాసము ద్వారా రక్షకుడు మనలను శుద్ధిచేయును, స్వస్థపరచును మరియు ఆయనవలె అగుటకు మనకు సహాయపడుట ద్వారా ఆయనను తెలుసుకొనుటకు మనకు సాధ్యముచేయును. మీరు దేవుని యొక్క కుమారులు కావలెనని, ఆయన ఉన్నట్లే, మనము ఆయనను చూచెదము , కావున ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె ఉండునట్లు హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి.”12 అని మోర్మన్ బోధించెను. దేవుని వలె అగుటకు మనం ప్రయాసపడినప్పుడు, మనకు మనంగా అయ్యేదానికంటే ఎక్కువగా ఆయన మనల్నిచేయును.
మన గురువులను అనుసరించుట ద్వారా ఆయనను తెలుసుకోండి
మనం కష్టపడి చేసే ప్రయత్నములో సహాయము చేయుటకు, దేవుడు మనకు ఆదర్శవంతులను, గురువులను ఇచ్చెను. వారిలో ఒకరైన ఎల్డర్ నీల్ ఏ. మాక్స్‌వెల్ గురించి నా భావాలను పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని వలె అగుటకు ఆయన చేసిన ప్రయత్నములో తండ్రి చిత్తానికి తన చిత్తాన్ని అప్పగించారు.
20 యేళ్లకంటే ఎక్కువ కాలానికి ముందు, ఆయనకు కేన్సర్ ఉందని పరీక్షలో నిర్ధారించబడిన వెంటనే తరువాత నాతో ఆయన భావాలను పంచుకున్నారు. “[తెరకు] ఇటువైపు లేదా అటువైపు నైనా జట్టులోనే ఉండాలని నా కోరిక. ఒక ప్రక్కగా కూర్చోవాలనుకోవడం లేదు. నేను ఆట ఆడాలనుకుంటున్నాను,” 13 ఆయన నాతో అన్నారు.
తరువాత కొన్ని వారాలవరకు, తనను స్వస్థపరచమని దేవుని అడుగుటకు ఆయన సందేహించారు; దేవుని చిత్తాన్ని మాత్రమే చెయ్యాలని ఆయన అనుకున్నారు. గెత్సేమనే తోటలో యేసు మొదటి ప్రార్థన “సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము” అని, ఆ తరువాత మాత్రమే ఆయన “అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.”14 అని ఆయన భార్య కొలీన్ ప్రత్యేకించి సూచించెను. ఆమె ఎల్డర్ మ్యాక్స్‌వెల్‌ను ఉపశమనము కొరకు ప్రార్థించుటకు, ఆ తరువాత దేవుని చిత్తానికి తన చిత్తాన్ని అప్పగించుటకు రక్షకుని మాదిరిని అనుసరించమని ఆమె ప్రోత్సాహించగా ఆయన ఆవిధంగా చేసారు.15
విస్తృతమైన, బలహీనపరచు చికిత్సతో దాదాపు ఒక సంవత్సరము బాధపడిన తరువాత, ఆయన పూర్తిగా కోలుకొని, పూర్తిగా “ఆటలోకి” తిరిగివచ్చారు. ఆయన ఇంకా ఏడు సంవత్సరాలు సేవ చేసారు.
ఆ తదుపరి సంవత్సరాలలో ఆయనతో నాకు చాలా నియమితకార్యాలు ఉండెను. ఆయన దయను, కనికరమును, మరియు ప్రేమను నేను అనుభూతిచెందాను. రక్షకునివలె అగుటకు ఆయన కష్టపడినప్పుడు, కొనసాగుతున్న ఆయన బాధ ద్వారా, ఎడతెగని ఆయన సేవ ద్వారా అధికమౌతున్న ఆయన ఆత్మీయ శుద్థిని నేను కనులారా చూసాను.
మనకున్న అంతిమ ఆదర్శపురుషుడు, గురువు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు, ఆయన చెప్పారు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” 16 “వచ్చి, నన్ను వెంబడించుము.” 17
నా యౌవన సహోదర, సహోదరిలారా, దేవునిని తెలుసుకొనుట ఒక జీవిత కాల అన్వేషణ. “అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, (తండ్రి) పంపిన యేసు క్రీస్తును (మనము) యెరుగుటయే నిత్యజీవము. ”18
“సహోదరులారా, ఒక గొప్ప కార్యములో మనము ముందుకు సాగకూడదా? . . . ధైర్యము తెచ్చుకొనుడి [నా యౌవన స్నేహితులారా]; జయము పొందుటకు ముందుకు సాగుడి!”19
దేవుడు మిమ్మల్ని ఎరుగును మరియు ఆయనను తెలుసుకోమని ఆయన మిమ్మల్నిఆహ్యానిస్తున్నారు. తండ్రికి ప్రార్ధించుము, లేఖనాలను చదువుము, దేవుని చిత్తము చేయుటకు కోరుము, రక్షకుని వలె అగుటకు ప్రయాసపడుము, మరియు నీతిగల బోధకులను అనుసరించుము. మీరు చేసినప్పుడు, మీరు దేవుని మరియు యేసు క్రీస్తును తెలుసుకొనగలుగుతారు, మరియు మీరు నిత్యజీవమును వారసత్వముగా పొందుతారు. వారి యొక్క నియమించబడిన ప్రత్యేక సాక్షిగా ఇది మీకు నా ఆహ్వానము. వారు జీవిస్తున్నారు. వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క నామములో ఈవిధంగా సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.