చుట్టూ చూడకండి, పైకి చూడండి!
క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇతరులను ఆహ్వానించుట మన ఉద్దేశము, మరియు యేసు క్రీస్తు వైపు చూచుట ద్వారా ఈ ఉద్దేశమును మనము నెరవేర్చగలము.
“క్రీస్తు యొద్దకు రమ్మని ఇతరులను ఆహ్వానించుటయే” 1 నా ఉద్దేశము. ఇది మీ ఉద్దేశము కూడా. ఈ ఉద్దేశాన్ని మనం క్రీస్తువైపుకు చూచుట ద్వారా నెరవేర్చవచ్చును.
నా పదహారేళ్ల వయస్సులో నా తల్లిదండ్రులతో పాటు నేను బాప్తీస్మము తీసుకున్నాను. అప్పటికి పద్నాలుగేళ్ల వయసున్న నా తమ్ముడు మా మేనమామ యంగ్ జిక్ లీ ద్వారా సంఘములో చేరి, మమ్మల్ని తన సంఘమునకు ఆహ్వానించాడు. మా కుటుంబములో పదిమంది సభ్యులు వేర్వేరు సంఘములకు చెందియుండటం వలన సత్యమును కనుగొన్నందుకు మేము ఆనందించాము మరియు మేము బాప్తీస్మము తీసుకొన్న తరువాత యేసు క్రీస్తు సువార్తలో కనుగొన్న ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాము.
సత్యమును నేర్చుకొనుటకు, పంచుకొనుటకు మా నాన్న మాలో అందరికంటే ఎక్కువ ఉత్సాహాన్ని కలిగియున్నాడు. ఆయన ప్రతిరోజు రెండుగంటలపాటు లేఖనాలను చదువుటకు ఉషోదయాన్నే లేచేవాడు. పని అయిన తరువాత మా కుటుంబాన్ని, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని దర్శించుటకు సువార్త బోధకులతో దాదావు ప్రతిరోజు వెళ్లేవారు. మేము బాప్తీస్మము పొందిన ఏడు నెలల తరువాత, మా కుటుంబము, బంధువులలో 23 మంది సంఘ సభ్యులయ్యారు. ఆ మరుసటి సంవత్సరము మా నాన్న చేసిన సభ్యుని మిషనరీ కార్యము ద్వారా 130 మంది జనులు బాప్తీస్మము పొందుటను చూసే అద్భుతము కలిగింది.
కుటుంబ చరిత్ర కూడా ఆయనకు ప్రాముఖ్యమైనది, మరియు ఆయన మా పూర్వీకులలో ఎనిమిది తరాలకు పూర్తిచేసెను. అప్పటినుండి, పద్నాలుగు సంవత్సరాల నా తమ్ముడు మొదలుపెట్టిన మా కుటుంబ పరివర్తన యొక్క ఫలాలు, సజీవులలోనే కాక మృతులలో కూడా లెక్కలేనన్ని విధానాలలో అభివృద్ధి చెందాయి. నా తండ్రి మరియు ఇతరులు చేసిన పనిని కొనసాగిస్తూ, మా వంశవృక్షము ఇప్పటికి 32 తరాలకు విస్తరించింది, మరియు అనేక శాఖలకు మేము దేవాలయ కార్యాన్ని పూర్చిచేస్తున్నాము. ఈరోజు మా పూర్వీకులను, మా సంతతివారిని జోడించుటకు నేను ఆశ్చర్యాన్ని, గొప్ప సంతోషాన్ని పొందుతున్నాను.
ఇటువంటి అనుభవాన్నే కొలంబస్ ఒహైయో దేవాలయములో అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ నమోదు చేసారు:
“దేవాలయములో కూర్చొనియుండగా, (నా ముత్తాత, తాత మరియు నా తండ్రి) జీవితాలను పర్యాలోచన చేస్తూ, నా కుమార్తె, తన కుమార్తె , . . . ఆమె పిల్లలైన నా మునిమనుమల వైపు చూసాను. నా వెనుక మూడు తరాలు, నా ముందు మూడు తరాలు- నేను ఈ ఏడు తరాల మధ్యలో ఉన్నానని హఠాత్తుగా నేను గ్రహించాను.
“ఆ పరిశుద్ధమైన, పవిత్రమైన మందిరములో, నా పూర్వీకులనుండి వారసత్వముగా పొందిన సమస్తమును నా తరువాత వచ్చిన తరాలకు అందించవలసిన గొప్ప బాధ్యత యొక్క తలంపు నా మనస్సులో కలిగెను.”2
మనందరము నిత్యకుటుంబము మధ్యలో ఉన్నాము. మన పాత్ర మంచి లేక చెడు విధానాలలో ప్రాముఖ్యమైన మార్పులు కలుగజేసే ఒక మలుపు కావచ్చును. అధ్యక్షులు హింక్లీ ఇలా కొనసాగించారు, “మీ తరాల గొలుసులో బలహీనమైన లింకు అగుటకు మిమ్మల్ని మీరు ఎప్పటికి అనుమతించవద్దు.” 3 సువార్తయందు మీ విశ్వాసము మీ కుటుంబాన్ని బలపరుస్తుంది. మన నిత్యకుటుంబములో మనం ఒక బలమైన లింకుగా ఉండుటకు మనమేవిధంగా నిర్ధారించగలము?
నా బాప్తీస్మము జరిగిన కొన్ని నెలల తరువాత, ఒకరోజు కొందరు సభ్యులు సంఘములో ఒకరినొకరు విమర్శించుకోవడం నేను విన్నాను. నేను చాలా నిరాశచెందాను. నేను ఇంటికి వెళ్ళి, మా నాన్నతో ఇక నేను సంఘానికి వెళ్ళకూడదేమో అని చెప్పాను. సభ్యులు ఆవిధంగా ఒకర్ని ఒకరు విమర్శించుకొంటు ఉంటే చూడటం చాలా కష్టముగా అనిపించింది. విన్న తరువాత, మా నాన్న నాకు, సువార్త పునఃస్థాపించబడింది, అది పరిపూర్ణమైనది, కాని సభ్యులు గాని, ఆయన గాని, నేను గాని పరిపూర్ణులు కామని బోధించారు. “నీ చుట్టూ ఉన్న వారిని బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, కాని యేసు క్రీస్తుతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకో. చుట్టూ చూడవద్దు, పైకి చూడు” అని ఆయన దృఢముగా చెప్పారు.
క్రీస్తువైపు చూడు-అన్న నా తండ్రి యొక్క తెలివైన సలహా, నేను జీవితములో సవాళ్ళను ఎదుర్కొన్న ప్రతిసారి నా విశ్వాసాన్ని బలపరచింది. “ప్రతి ఆలోచనలో నా తట్టు చూడుము; సందేహింపవద్దు, భయపడవద్దు” 4 అనే మాటలలో ఉన్నట్లుగా, క్రీస్తు బోధనలను ఏవిధంగా అన్వయించుకోవాలో ఆయన నాకు బోధించారు.
వాషింగ్‌టన్ సీయాటల్ మిషనుకు అధ్యక్షత్వము వహించుచుండగా, ఆ సంవత్సరములో చాలా రోజులు వర్షము కురిసింది. అయినప్పటికి, మన మిషనరీలు బయటకు వెళ్లి, వర్షములో మతప్రచారము చెయ్యాలని సూచించబడ్డారు. “వర్షములో బయటకు వెళ్లండి, పరలోకమువైపు చూడండి, మీ నోళ్లను తెరిచి, దానిని తాగండి! మీరు పైకి చూసినప్పుడు, ఏ భయము లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర మీ నోటిని తెరుచుటకు బలపరచబడతారు” అని వారికి చెప్పేవాడిని. వారి మిషను తరువాత కూడా వారు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు పైకి చూడాలి అనేది వారికి చిహ్నపూర్వకమైన పాఠము. దయచేసి దీనిని కలుషిత ప్రాంతాలలో ప్రయత్నించవద్దు.
ఇంకా సీయాటల్ మిషనులోనే సేవ చేస్తున్నప్పుడు, పియానో వాద్యకారుడైన నా పెద్ద కుమారుడు సన్‌బీమ్ నుండి ఫోను వచ్చింది. అతడు అంతర్జాతీయ పోటీలో గెలిచినందుకు, న్యూయార్కులోని కార్నిగీ హాల్‌లో ప్రదర్శించే విశేషాధికారము తాను కలిగియున్నాడని చెప్పాడు. మేము చాలా సంతోషించాము, అతడి గురించి పులకరించిపోయాము. అయినప్పటికి ఆ సాయంకాలము నా భార్య కృతజ్ఞతతో ప్రార్థన చెయుచున్నప్పుడు మేము అతని ప్రదర్శనలో పాలుపంచుకోలేమని గ్రహించి, పరలోక తండ్రితో ఇలా చెప్పెను: “పరలోక తండ్రి, సన్‌బీమ్‌కు మీరు ఇచ్చిన దీవెన కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. అయినప్పటికి, నేనక్కడికి వెళ్లలేనందుకు చింతిస్తున్నాను. ఈ దీవెనను మా మిషనుకు ముందు లేదా అయిన తరవాత ఇచ్చి ఉంటే నేను వెళ్లియుండవచ్చు. నేను ఫిర్యాదు చేయడం లేదు, కాని నాకు కొంత బాధ కలుగుతుంది.”
ఆమె తన ప్రార్థన ముగించిన వెంటనే, ఒక స్పష్టమైన స్వరాన్ని ఆమె విన్నది: “నువ్వు వెళ్లలేవు కాబట్టే, నీ కుమారునికి ఈ విశేషాధికారము లభించింది. దానిని నీవు బేరము చేస్తావా?”
నా భార్య ఆశ్యర్యపోయింది. ప్రభువు యొక్క రాజ్యములో తమ తల్లిదండ్రుల విశ్వాసపూరితమైన పని ద్వారా పిల్లలు దీవించబడతారని ఆమెకు తెలుసు, కాని మొదటిసారి ఆమె పాత్రను చాలా స్పష్టంగా అర్థముచేసుకొన్నది. వెంటనే ఆమె ఆయనకు ఇలా సమాధానమిచ్చెను. “వద్దు, వద్దు, నేను వెళ్లకపోవడం నాకు ఫరవాలేదు. అతడు ఆ ఘనతను కలిగియుండనివ్వండి.”
ప్రియమైన సహోదర, సహోదరిలారా, మనం మన ఐహిక నేత్రాలతో చుట్టూ చూస్తే పరలోక తండ్రి ప్రేమను అర్థము చేసుకొనుట మనకు అంత సులభము కాదు, ఎందుకంటే మనం అసౌకర్యమును, నష్టాన్ని, భారాల్ని లేదా ఒంటరితనమును మొదట చూస్తాము. మరొకవైపు, మనం పైకిచూస్తే వీటన్నిటనిమించిన దీవెనలను మనము చూడగలము. “మనము దేవుని నుండి ఏ దీవెనయైనను పొందినప్పుడు, అది నిర్దేశించబడిన ధర్మశాస్త్రమునకు విధేయత ద్వారా అది జరుగును” 5 అని ప్రభువు బయలుపరిచారు. దేవుని యొక్క ఏ సేవలోనైన ప్రవేశించిన వారందరు, మీముందు ఉన్నవారు, మీ తరువాత వచ్చు తరాల వారికి బలమైన దీవెనగా ఉండుటకు మీరు స్థిరమైన కలయిక అని తెలుసుకోండి.
నేడు, మా కుటుంబ సభ్యులలో అనేకులు నిబంధన మార్గములో నమ్మకముగా ఉన్నందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను కాని మా తరువాత ఖాళీ కుర్చీలు ఉండటాన్ని ఊహించుటకు నేను విచారిస్తాను. ఎల్డర్ ఎమ్. రస్సెల్ బల్లార్డ్ ఇలా చెప్పారు: “పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో చురుకుగా ఉండకుండా లేదా విడిచిపెట్టుటకు మీరు ఎంచుకుంటే, మీరెక్కడికి వెళ్తారు? మీరు ఏమి చేస్తారు? సంఘ సభ్యులతో, ప్రభువు ఎన్నుకున్న నాయకులతో ‘ఇక ఏమాత్రము నడవకూడదు’ అనే నిర్ణయము దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగియుంటుంది, అది ఎల్లప్పుడు చూడబడదు.” 6 అధ్యక్షులు థామస్ ఎస్ మాన్సన్ మనల్ని ఇలా ప్రోత్సాహించారు, “మనమెల్లప్పుడు సులువైన తప్పుకంటే కష్టమైన ఒప్పును ఎంచుకొందుము గాక.” 7
యేసు క్రీస్తువైపుకు చూచుట ఎప్పటికి అది ఆలస్యము కాదు. ఆయన బాహువులు మీకు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. మనం దేవుని యొక్క నిత్య కుటుంబముగా ఉండుటకు క్రీస్తును అనుసరించుటకు మనముందు వెనుక తరాలు మనపైన ఆధారపడియన్నవి.
స్టేకు అధ్యక్షునిగా నా పిలుపు నుండి నేను విడుదల చేయబడినప్పుడు, నాతో ఎక్కువ సమయము గడుపుటకు నా కుమారులు ఉత్సాహపడ్డారు. మూడు వారాల తరువాత నేను డెబ్బదిగా పిలవబడ్డాను. వారు నిరుత్సాహపడతారేమో అని మొదట నేను అనుకున్నాను, కాని నా చిన్న కుమారుని వినయముగల స్పందన ఎమిటంటే, “నాన్నా, మీరు చింతించకండి. మనం ఒక నిత్యకుటుంబము.” అది ఎంత సాధారణమైన, స్పష్టమైన సత్యము! చుట్టూ ఈ మర్త్యజీవితమును మొదట చూడటం వలన నేను కొంచెం కలత చెందాను, కాని నా కుమారుడు చుట్టూ చూడకుండా, నిత్యత్వము వైపు, ప్రభువు ఉద్దేశములపైపు పైకి కన్నులెత్తి చూడటం వలన సంతోషంగా ఉన్నాడు.
మీ తల్లిదండ్రులు సువార్తను వ్యతిరేకించినప్పుడు, మీరు చిన్న సంఘ విభాగములో సభ్యులుగా ఉన్నప్పుడు, మీ సహవాసి సభ్యుడు లేదా సభ్యురాలు కానప్పుడు, పెండ్లి చేసుకొనుటకు మీ ప్రయత్నము మీరు చేసినప్పటికి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక బిడ్డ త్రోవ తప్పినప్పుడు, మీరు ఒంటరి తల్లి లేదా తండ్రిగా ఉన్నప్పుడు, మీరు శారీరకముగాను లేదా భావావేశంగా సవాలు చేయబడినప్పుడు, లేదా ఒక దుర్ఘటనలో మీరొక బాధితులుగా ఉన్నప్పుడు, పైకి చూచుట అన్నిసార్లు సులభము కాదు. అటువంటి కష్టసమయాలలో మీ విశ్వాసమును పట్టుకొనియుండుము. బలము, సమతూల్యము, స్వస్థత కొరకు క్రీస్తువైపు చూడండి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి ద్వారా, “[మీ] మేలు కొరకు సమస్తము సమకూడి జరుగును.” 8
యేసు క్రీస్తు మన రక్షకుడు, విమోచకుడని ఆయన గూర్చి సాక్ష్యమిస్తున్నాను. మన జీవిస్తున్న ప్రవక్త అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్‌ను అనుసరించినప్పుడు, మనం యేసు క్రీస్తువైపు చూస్తాము. మనం అనుదినము ప్రార్థనచేస్తూ, లేఖనాలను అధ్యయనము చేసి, మరియు ప్రతి వారము హృదయపూర్వకముగా సంస్కారములో పాలుపంచుకొన్నప్పుడు, ఎల్లప్పుడుఆయనవైపు చూచుటకు బలాన్ని మనము పొందుతాము. ఈ సంఘములో సభ్యుడిగా ఉన్నందుకు, నిత్యకుటుంబములో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఇతరులతో ఈ గొప్ప సువార్తను పంచుకోవడం నేను ప్రేమిస్తున్నాను. క్రీస్తు యొద్దకు రమ్మని ఇతరులను ఆహ్వానించడం మన ఉద్దేశము, మరియు ఈ ఉద్దేశాన్ని యేసు క్రీస్తువైపు చూచుట ద్వారా నెరవేర్చగలము. ఈ సంగతులను గూర్చి వినయముతో యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.