విశ్వాసము యొక్క పునాదులు
నా విన్నపము ఏమిటంటే, ప్రభువైన యేసు క్రీస్తునందు మన విశ్వాసము యొక్క పునాదులను బలపరచుటకు కావలసిన వినయమును కలిగియుండి, మనము త్యాగాలు చేద్దాము.
ఇది ఒక దివ్యమైన సర్వసభ్య సమావేశము. మనం నిజంగా జ్ఞానవృద్ధిని పొందాము. ఈ సర్వసభ్య సమావేశానికి ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఉద్దేశము ఉందంటే, అది తండ్రియైన దేవునియందు, మన రక్షకుడును, ప్రభువునైన యేసు క్రీస్తునందు విశ్వాసమును పెంపొందించుట.
నా మాటలు ఆ విశ్వాసము యొక్క పునాదులు గురించి చర్చిస్తాయి.
వ్యక్తిగత పునాదులు, అనేక విలువైన అన్వేషణల వలె సాధారణంగా నెమ్మదిగా- ఒక వరుస, ఒక అనుభవము, ఒక సవాలు, ఒక వైఫల్యము, ఒక విజయముపైన నిర్మించబడతాయి. మనం బాగా ప్రేమించే భౌతిక అనుభవము ఒక పసిబిడ్ద మొట్టమొదటి అడుగులు వేయడం. అది చూడటానికి కనులపండుగగా ఉంటుంది. దృఢనిశ్చయము, ఆనందము, ఆశ్చర్యము మరియు సాఫల్యముల-- కలయికతో ముఖముపైన ప్రశస్తమైన చూపుతో నిజంగా అది చాలా ప్రాముఖ్యమైన సంఘటన.
మా కుటుంబములో ఇటువంటి స్వభావముగల ఒక సంఘటన గమనార్హమైనదిగా ఉన్నది. మా చిన్న కుమారునికి దాదాపు నాలుగేండ్ల వయసున్నప్పుడు, ఇంటిలోకి ప్రవేశించి ఆనందముతో గర్వముగా కుటుంబముతో ఇలా ప్రకటించాడు: “ఇప్పుడు నేను అన్నీ చెయ్యగలను. నేను కట్టుకోగలను, నేను త్రొక్కగలను, నేను జిప్పుపెట్టుకోగలను.” అతడు తన బూట్లకు లేసు కట్టుకోగలడని, తన పెద్ద మూడుచక్రాల సైకిల్‌ను త్రొక్కగలడని, తన కోటుకు జిప్పుపెట్టుకోగలడని మాకు చెప్తున్నాడని మేము అర్థం చేసుకున్నాము. మేమంతా నవ్వాము కాని వానికి అవి గొప్ప విజయాలని మేము తెలుసుకున్నాము. అతడు పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యక్తియని, పెద్దవాడయ్యాడని అనుకున్నాడు.
శారీరక, మానసిక, ఆత్మీయ అభివృద్ధి- వీటిలో చాలావిషయాలు ఉమ్మడిగా ఉన్నాయి. శారీరక అభివృద్ధిని చూడటం చాలా సులభము. మనం చిట్టి చిట్టి అడుగులతో మొదలుపెట్టి అంతిమ భౌతిక ఆకృతిని పొందేవరకు అభివృద్ధి చెందుతు, పెరుగుతు, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము పురోగమిస్తాము. ప్రతి వ్యక్తికి అభివృద్ధి భిన్నముగా ఉంటుంది.
గొప్ప క్రీడలు లేదా సంగీత ప్రదర్శనను మనం చూసేటప్పుడు, ఆ వ్యక్తి చాలా ప్రజ్ఞగలవాడని తరచు చెప్తాము, అది సాధారణంగా నిజమౌతుంది. కాని ఆ ప్రదర్శన సంవత్సరాల తరబడి చేసిన సాధన, సిద్ధపాటుపై ఆధారపడి ఉంటాయి. మాల్కం గ్లాడ్‌వెల్ అనే ప్రముఖ రచయిత దీనిని 10,000 గంటల నియమము అని అన్నాడు. క్రీడలలో, సంగీత ప్రదర్శనలో, విద్యాసంబంధ ప్రావీణ్యములో, ప్రత్యేకించబడిన పని నైపుణ్యాలు, వైద్య లేదా న్యాయసంబంధమైన ప్రావీణ్యము మొదలైన వాటిలో ఇంతటి సాధన అవసరమని పరిశోధకులు నిశ్చయించారు. “ఏవిషయములోనైనా ప్రపంచములో ఉత్తమమైన వారిమధ్యలో ఉండాలంటే, దానితో ముడిపడియున్న నైపుణ్య స్థాయిని సాధించుటకు పదివేల గంటల సాధన అవసరము” 1 అని ఈ పరిశోధన నిపుణులలో ఒకరు ఆరోపిస్తున్నారు.
శారీరక, మానసిక ప్రదర్శనలో శిఖరాన్ని అందుకోవాలంటే అటువంటి సిద్ధపాటు, సాధన అవసరమని చాలామంది గుర్తించారు.
దురదృష్టవశాత్తు, అభివృద్ధి చెందుతున్న లౌకిక ప్రపంచములో, క్రీస్తువలె మరింతగా అగుటకు మరియు స్థిరమైన విశ్వాసమునకు నడిపించే పునాదులను స్థాపించుటకు కావలసిన ఆత్మీయ ఎదుగుదల యొక్క పరిమాణమునకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మహనీయమైన ఆత్మీయ అవగాహన యొక్క క్షణాలను ఉద్ఘాటించుటకు మనం మొగ్గు చూపుతాము. పరిశుద్ధాత్మ మన హృదయాలలో, మనస్సులలో ప్రత్యేకమైన ఆత్మీయ పరిజ్ఞానమును సాక్ష్యమిచ్చెనని మనం తెలుసుకున్నప్పుడు ఇవి మనకు విలువైన సందర్భాలౌతాయి. ఈ సంఘటనలలో మనం ఆనందిస్తాము. అవి ఏవిధముగాను క్షీణించకూడదు. కాని స్థిరమైన విశ్వాసమునకు, ఆత్మ యొక్క నిరంతర సహవాసమును కలిగియుండుటకు, శారీరక, మానసిక అభివృద్ధితో పోల్చదగిన వ్యక్తిగత మత ఆచరణకు ఎటువంటి ప్రత్యమ్నాయము లేదు. ఈ ఆత్మీయ అనుభవాలపైన మనం నిర్మించాలి, అవి కొన్నిసార్లు పిల్లలువేసే చిట్టి అడుగులను పోలియుండును. పరిశుద్ధమైన సంస్కార కూడికలకు, లేఖన పఠనమునకు, ప్రార్థనకు, పిలుపుకు తగినట్లుగా సేవచేయుటకు మనకున్న పరిశుద్ధమైన నిబద్ధత చేత దీనిని మనం చేస్తాము. ఇటీవల 13మంది పిల్లల యొక్క తండ్రికి సంస్మరణ నివాళులు అర్పించు సమయములో, “అనుదిన ప్రార్థన, లేఖన పఠనము యెడల ఆయనకున్నసద్భక్తి తన పిల్లలపైన గొప్ప ప్రభావమును చూపి, యేసు క్రీస్తునందు విశ్వాసమునకు కదలని పునాది వేసెనని ”2 చెప్పబడెను.
15 సంవత్సరాల వయస్సులో నేను పొందిన అనుభవము నాకు పునాదిగా ఉండెను. విశ్వాసురాలైన నా తల్లి నా జీవితములో విశ్వాసము యొక్క పునాదులను నెలకొల్పుటకు వీరోచితముగా నాకు సహాయము చేయుటకు ప్రయత్నించింది. నేను సంస్కార కూడిక, ప్రాథమిక, ఆ తరువాత యువత మరియు సెమినరీకి హాజరయ్యాను. మోర్మన్ గ్రంథమును చదివి, ఎల్లప్పుడు వ్యక్తిగతముగా ప్రార్థన చేసాను. ఆ సమయములో నా ప్రియమైన అన్న తనకు రాబోయే మిషను పిలుపు కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన చోటుచేసుకుంది. సంఘములో తక్కువ చైతన్యముగా ఉన్న అద్భుతమైన మా తండ్రి, అతడు మిషను సేవ చెయ్యకుండ తన విద్యభ్యాసమును కొనసాగించాలని ఆశించెను. ఇది వివాదానికి దారితీసింది.
నాకంటే ఐదు సంవత్సరాలు పెద్దవాడైన నా సహోదరునితో జరిగిన గమనింపదగిన చర్చలో అతడు ఆ చర్చను నడిపించగా, తాను మిషను సేవ చెయ్యాలా వద్దా అనే తన నిర్ణయము మూడు విషయాలపై ఆధారపడియున్నదని మేము ముగించాము: (1) ) యేసు క్రీస్తు దైవసంబంధియా? (2) ) మోర్మన్ గ్రంథము నిజమా? (3) ) జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్తా?
ఆ రాత్రి నేను హృదయపూర్వకముగా ప్రార్థించినప్పుడు, ఆ మూడు ప్రశ్నల యొక్క యదార్థతను ఆత్మ నాకు నిర్ధారించింది. నా శేషజీవితములో దాదాపు నేను తీసుకోబోవు ప్రతి నిర్ణయము ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానాలపైన ఆధారపడి ఉంటుందని కూడా నేను అర్థం చేసుకున్నాను. యేసు క్రీస్తునందు విశ్వాసము ఆవశ్యకమని నేను మరిముఖ్యముగా తెలుసుకున్నాను. వెనుకకు తిరిగి చూసినప్పుడు, ఆ సాయంకాలము ఆ ఆత్మీయ నిర్ధారణను పొందుటకు కావలసిన పునాదులు ప్రథమంగా నా తల్లివలన వేయబడి ఉన్నాయని నేను గుర్తించాను. అప్పటికే సాక్ష్యము కలిగియున్న నా అన్న, మిషను సేవ చెయ్యాలని నిర్ణయించుకొని, చివరకు మా తండ్రి సహకారమును పొందాడు.
ఆత్మీయ నడిపింపు కావలసినప్పుడు, ప్రభువు నిర్ణీతకాలములో, ఆయన చిత్తప్రకారము పొందబడును. 3 మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన ఒక శ్రేష్ఠమైన ఉదాహారణ. నేను ఇటీవల మోర్మన్ గ్రంథము యొక్క మొదటి ప్రతిని చూసాను. జోసెఫ్ స్మిత్ 23 యేండ్ల వయస్సులో ఈ అనువాదమును పూర్తిచేసెను. ఆ అనువాద ప్రక్రియలో కొంత భాగమును, ఆయన ఉపయోగించిన సాధనాల గురించి మనకు తెలుసు. ఆ 1830 ముద్రణలో, జోసెఫ్ స్మిత్ ఒక క్లుప్త పీఠికను చేర్చి, “దేవుని వరము మరియు శక్తిచేత” 4 అనువదించబడిందని స్పష్టముగాను, సరళముగాను ప్రకటించెను. అనువాదమునకు సహాయకారకాలైన దీర్ఘదర్శుల రాళ్ళు -ఊరీము తుమ్మీము మాట ఏమిటి? అవి అవసరమా లేదా మరిన్ని ప్రత్యక్ష బయల్పాటులు పొందుటకు కావలసిన విశ్వాసమును జోసెఫ్ సాధన చేయుటకు అవి తర్ఫీదు పొందడానికి సైకిలుకు అదనంగా అమర్చబడిన చిన్న చక్రాలవలె ఉన్నాయా? 5
శారీరక లేదా మానసిక సామర్థ్యాన్ని పొందడానికి పునరావృత్తి, స్థిరమైన ప్రయత్నము ఏవిధంగా అవసరమో, ఆత్మీయ విషయాలలో కూడా అది అవసరము. పలకలు పొందడానికి సిద్ధపాటుగా ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ నాలుగు సార్లు ఒకే సందర్శకునిని అదే సందేశముతో స్వాగతించెను. ప్రతివారము పరిశుద్ధమైన సంస్కార కూడికలలో పాల్గొనడంలో ఉన్న ఆత్మీయ గూఢార్థములను మనం పూర్తిగా అర్థం చేసుకోమని నా నమ్మకము. లేఖనములు అప్పడప్పుడు చదువుటకంటే--వాటిని క్రమముగా లోతుగా ఆలోచించడం వలన మనకు అల్పజ్ఞానమును ఇచ్చుటకు బదులు మన విశ్వాసానికి మహత్తైన జీవితాన్ని మార్చే అభివృద్ధిని కలిగిస్తుంది.
విశ్వాసము శక్తిగల సూత్రము. నేనొక ఉదాహారణ ఇస్తాను. నేను యౌవన మిషనరీగా ఉన్నప్పుడు, ఒక గొప్ప మిషను అధ్యక్షుడు6 లూకా 8లో కనుగొనబడిన ఒక గొప్ప లేఖన వృత్తాంతమునకు గంభీరమైన విధానములో నన్ను పరిచయము చేసెను, అందులో 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ వైద్యులకు తనకు కలిగియున్న సమస్తమును ఖర్చుపెట్టెను కాని వారు ఆమెను స్వస్థపరచలేకపోయారు. నేటికి కూడా నా ప్రియమైన లేఖనములలో అది ఒకటిగా ఉన్నది.
రక్షకుని వస్త్రపు పైచెంగును మాత్రము ముట్టుకొంటే ఆమె స్వస్థత పొందగలదని ఆమెకు విశ్వాసము ఉన్నదని మీరు జ్ఞాపకము చేసుకుంటారు. ఆమె ఆవిధంగా చేసినప్పుడు, ఆమె వెంటనే స్వస్థత పొందెను. తన శిష్యులతో నడుస్తున్న యేసు “నన్నుముట్టినదెవరు?” అనెను.
అందుకు పేతురు తనతో నడుస్తున్నవారందరు తనమీద పడుచున్నారని సమాధానమిచ్చెను.
“యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను.”
ప్రభావమునకు మూలపదము “శక్తి” అని సులభముగా వ్యాఖ్యానించబడవచ్చును. స్పానిష్ మరియు పోర్చుగీసులో అది “శక్తి” అని అనువదించబడినది. అయినప్పటికి, రక్షకుడు ఆమెను చూడలేదు; ఆయన ఆమె అవసరతపైన దృష్టి పెట్టలేదు. కాని ఆమె విశ్వాసము ఏవిధంగా ఉందంటే, వస్త్రపు పైచెంగును తాకడం వలన దేవుని కుమారుని యొక్క స్వస్థపరచు శక్తిని ఉపయోగించింది.
అందుకు రక్షకుడు “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను.” 7
ఈ వృత్తాంతమును నా యుక్తవయస్సంతా ధ్యానించాను. మన ప్రేమగల పరలోక తండ్రికి యేసు క్రీస్తు నామములో మనం చేసే వ్యక్తిగత ప్రార్థనలు, విన్నపాలు మనం అర్థంచేసుకొనే సామర్థ్యానికి మించి మన జీవితములో దీవెనలను తీసుకొనివచ్చును. ఈ స్త్రీ ప్రదర్శించినటువంటి విశ్వాసము, విశ్వాసము యొక్క పునాదులు మన హృదయము యొక్క గొప్ప కోరికలుగా ఉండాలి.
అయినప్పటికి, విశ్వాసము యొక్క మొదటి పునాదులు, ఆత్మీయ నిర్ధారణ పొందినప్పటికి, మనం సవాళ్లను ఎదుర్కోమని అర్థం కాదు. సువార్తకు పరివర్తన చెందడం వలన మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయని అర్థం కాదు.
విశ్వాసము యొక్క పునాదులను స్థాపించుటకు, ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ఊహించని పరిణామాలు, సవాళ్లతో వ్యవహరించుటకు ఉత్తమమైన ఉదాహారణలు ప్రారంభపు సంఘ చరిత్ర, సిద్ధాంతము మరియు నిబంధనలలో నమోదు చేయబడిన బయల్పాటులు కలిగి ఉన్నాయి.
కర్ట్లాండ్ దేవాలయము పూర్తిచేయబడటం సంఘమంతటికి పునాదిగా ఉండెను. ఆత్మీయ క్రుమ్మరింపులు, సిద్ధాంతపు బయల్పాటులు, సంఘ స్థాపన యొక్క కొనసాగింపుకు కావలసిన తాళపుచెవుల పునఃస్థాపన దానిని అనుసరించెను. పెంతెకోస్తు దినమున ప్రాచీన అపొస్తలులకు జరిగినవిధంగా, కర్ట్లాండ్ దేవాలయము యొక్క ప్రతిష్ఠకు సంబంధించి అనేకమంది సభ్యులు ఆశ్చర్యకరమైన ఆత్మీయ అనుభవాలను పొందారు. .8 కాని మన జీవితాలలో జరిగేవిధంగా, వారు ముందు ముందు సవాళ్లను, కష్టాలను పొందరని దాని అర్థము కాదు. వారి ఆత్మలనే పరీక్షించు సంయుక్త రాష్ట్రాల ఆర్థిక సంక్షోభము-1837 యొక్క భయాందోళనలు ఎదుర్కొనుట గురించి ఈ మొదటి సంఘ సభ్యులకు చాలా తక్కువ తెలుసు. .9
ఈ ఆర్ధిక సంక్షోభమునకు సంబంధించిన సవాళ్లకు ఒక ఉదాహారణ ఏదనగా, పునఃస్థాపన యొక్క గొప్ప నాయకులలో ఒకరైన ఎల్డర్ పార్లీ పి. ప్రాట్ అనుభవము. అతడు పన్నెండు మంది అపొస్తలులు కోరము యొక్క మొదటి సభ్యుడు. 1837 మొదటి భాగములో, అతని ప్రియమైన భార్య థ్యాంక్‌ఫుల్, వారి మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మరణించింది. పార్లీ మరియు థ్యాంక్‌ఫుల్ వివాహము చేసుకొని దాదాపు పది సంవత్సరాలు అవుతుంది మరియు ఆమె మరణము అతడిని తీవ్రమైన క్షోభకు గురిచేసింది.
కొన్ని నెలల తరువాత, సంఘము అనుభవించిన మిక్కిలి కష్టమైన కాలములలో ఒకదానిలో తాను ఉన్నట్లు ఎల్డర్ ప్రాట్ కనుగొనెను. తక్కువ ధరకు భూ కొనుగోళ్లు, జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ సభ్యులు స్థాపించిన ఆర్థిక సంస్ధ పడుతున్న ప్రయాసలతో కలిపి జాతీయ సంక్షోభము, ప్రాంతీయ ఆర్థిక సంక్షోభములు కర్ట్లాండ్‌లో కలహమును, వివాదమును సృష్టించాయి. సంఘ సభ్యులు తమ స్వంత జీవితాలలో అన్నివేళలా తెలివైన ఐహిక నిర్ణయాలను తీసుకోలేదు. పార్లీ గమనించదగ్గ ఆర్థిక నష్టాలతో శ్రమపడి, కొంతకాలము జోసెఫ్ స్మిత్ యెడల అసంతృప్తిగా ఉన్నాడు.10 అతడు తీవ్రంగా విమర్శిస్తు జోసెఫ్ స్మిత్‌కు లేఖ వ్రాసి, వేదికపైనుండి ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. అదే సమయంలో తాను మోర్మన్ గ్రంథము మరియు సిద్ధాంతము మరియు నిబంధనలను నమ్ముటను కొనసాగిస్తానని పార్లీ చెప్పెను. 11
ఎల్డర్ ప్రాట్ తన భార్యను, తన భూమిని, తన గృహాన్ని కోల్పోయెను. జోసెఫ్‌కు చెప్పకుండా పార్లీ మిస్సోరికి వెళ్లిపోయాడు. దారిలో, అనుకోకుండా కర్ట్లాండ్‌కు తిరిగివెళ్తున్న తోటి అపొస్తలులు థామస్ బి. మార్ష్ మరియు డేవిడ్ పేటన్‌ను కలిసెను. సమూహములో సామరస్యమును పునఃస్థాపించవలసిన గొప్ప అవసరతను భావించి, వారితో రమ్మని పార్లీని ఒప్పించారు. జోసెఫ్ స్మిత్ మరియు ఆయన కుటుంబము కంటె ఎక్కువ ఎవరు నష్టపోలేదని అతడు తెలుసుకొన్నాడు.
పార్లీ ప్రవక్తను వెదకి, దుఃఖించి, తాను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు. అతడి భార్య థ్యాంక్‌ఫుల్ మరణము తరువాత నెలలలో, పార్లీ ప్రతికూలంగా ప్రభావితము చేయబడి, భయాలు, నిరుత్సాహాలకు లోబడెను.12 వ్యతిరేకత, శోధనకు వ్యతిరేకంగా ప్రయాసపడుట ఏవిధంగా ఉంటుందో ఎరిగిన జోసెఫ్ స్మిత్, పార్లీని క్షమించి, అతడి కొరకు ప్రార్థించి, దీవించెను.13 విశ్వాసముగా నిలిచియున్న పార్లీ మరియు ఇతరులు కర్ట్లాండ్ సవాళ్లవలన ప్రయోజనము పొందెను. వారు జ్ఞానమందు వృద్ధిచెంది, మరింత ఘనులు, సుగుణవంతులయ్యారు. ఆ అనుభవము వారి విశ్వాసము యొక్క పునాదులలో భాగమయ్యెను.
ప్రతికూలతను ప్రభువు అనుగ్రహము కోల్పోయినట్లుగా లేదా ఆయన దీవెనలు వెనుకకు తీసుకొన్నట్లుగా మనం చూడకూడదు. అన్ని విషయాలలో వ్యతిరేకత నిత్య సిలెస్టియల్ గమ్యమునకు మనల్ని సిద్ధపరచుటలో కంసాలి అగ్నిలో భాగముగా ఉన్నది. 14 ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ లిబర్టి చెరశాలలో ఉన్నప్పుడు ఆయనకివ్వబడిన ప్రభువు యొక్క మాటలు శ్రమ, అబద్ధపు నిందలతో పాటు అన్ని రకాల సవాళ్లను వివరించెను--మరియు ఇలా ముగించెను:
“నరకపు దవడలు నీ కొరకు నోటిని విశాలముగా తెరచినను, నా కుమారుడా, ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు, మరియు నీ మేలుకొరకేనని తెలుసుకొనుము.”
“మనుష్య కుమారుడు వీటన్నిటికంటె హీనమైనవాటిని అనుభవించెను. ఆయన కంటే నీవు గొప్పవాడివా?” 15
జోసెఫ్ స్మిత్ కు ప్రభువు ఇచ్చిన ఈ సూచనలో తాను బ్రతుకు దినములు తనకు తెలుసని, అవి తక్కువ చేయబడవని కూడా స్పష్టము చేసెను. ప్రభువు ఇలా ముగించెను, “కాబట్టి, మనుష్యుడు ఏమిచేయునో అని భయపడకుము, ఏలయనగా దేవుడు నిరంతరము నీకు తోడైయుండును.”16
అయితే, విశ్వాసము వలన కలుగు దీవెనలు ఏమిటి? విశ్వాసము ఏమి సాధిస్తుంది? ఆ జాబితాకు అంతములేదు:
క్రీస్తునందు విశ్వాసము వలన మన పాపములు క్షమించబడతాయి.17
విశ్వాసము కలిగినవారందరు పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగియుంటారు. 18
క్రీస్తు నామమందు విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది. 19
క్రీసునందు మనకున్న విశ్వాసము ద్వారా మనం బలాన్ని పొందుతాము. 20
వారి విశ్వాసము వలన క్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములను శుభ్రము చేసుకొన్న వారు తప్ప వేరెవరును దేవుని విశ్రాంతిలో ప్రవేశింపరు.21
విశ్వాసమును బట్టి ప్రార్థనలకు సమాధానాలు ఇవ్వబడతాయి.22
నరులలో విశ్వాసము లేకుండా, దేవుడు ఎట్టి అద్భుతకార్యమును చెయ్యలేరు.23
ముగింపులో, మన నిత్య రక్షణకు, మహోన్నతస్థితికి యేసు క్రీస్తునందు మన విశ్వాసము ఆవశ్యకమైన పునాది. హీలమన్ తన కుమారులకు బోధించినట్లుగా, “ మీరు మీ పునాదిని దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండ పైన కట్టవలెనని జ్ఞాపకముంచుకొనుడి . . . , ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది. మనుష్యులు దానిపైన కట్టిన యెడల ఎన్నటికీ పడిపోరు.” .24
ఈ సమావేశమునుండి వచ్చిన విశ్వాసము యొక్క పునాదుల ప్రబలీకరణము కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. నా విన్నపము ఏమిటంటే, ప్రభువైన యేసు క్రీస్తునందు మన విశ్వాసము యొక్క పునాదులను బలపరచుటకు కావలసిన వినయమును కలిగియుండి, త్యాగాలు చేద్దాము. ఆయన గురించి నా నిశ్చయమైన సాక్ష్యమును చెప్పుచున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.