2010–2019
“నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను”
April 2017 General Conference


“నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను”

ప్రభువు తన శిష్యులను వదిలి వెళ్ళబోయేముందు తన శాంతిని వారికి వాగ్దానము చేసెను. ఆయన అదే వాగ్దానమునే మనకు చేసారు.

నా ప్రియమైన సహోదరీలారా, ఈ రాత్రి దేవుని ఆత్మతో మనం దీవించబడ్డాము. శక్తిగల సహోదరి నాయకుల నుండి ప్రేరేపించబడిన సందేశాలు మరియు సంగీతము మన విశ్వాసాన్ని పటిష్ఠము చేసి మన ప్రేమగల పరలోకతండ్రితో మనం చేసుకొన్న పవిత్రమైన నిబంధనలను పాటించుటకు మన కోరికను అధికం చేసాయి. ప్రభువైన యేసు క్రీస్తునందు మనకు గల ప్రేమ వృద్ధిచెందుటను మరియు అద్భుతమైన ఆయన ప్రాయశ్చిత్త త్యాగ వరము కొరకు ప్రశంసను మనం భావించాము.

ఈ రాత్రి నా సందేశము సరళమైనది. ఈ రాత్రి మనం శాంతిని అనుభూతిచెందాము. మనందరము అటువంటి శాంతిని మనలో, మన కుటుంబాలలో, మనచుట్టూ ఉన్నవారిలో తరచు అనుభూతిచెందాలని కోరుకుంటాము. ప్రభువు తన శిష్యులను వదిలి వెళ్ళబోయేముందు తన శాంతిని వారికి వాగ్దానము చేసాడు. ఆయన అదే వాగ్దానము మనకు చేసారు. కాని ఆయన శాంతిని లోకరీతిలో కాకుండా, ఆయన విధానములో ఇస్తానని ఆయన చెప్పారు. శాంతిని పంపే ఆయన విధానమును ఆయన వివరించారు:

“ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

“శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి” (యోహాను 14:26–27).

లేమనీయుల యొద్దకు సువార్త పరిచర్యకు బయలుదేరిన మోషైయ కుమారులకు అటువంటి శాంతివరము అవసరమయ్యెను. వారు చేయవలసిన కార్య భారమును గ్రహించినప్పుడు, వారు ఎక్కువ ఆందోళనతో మరియొకసారి అభయమును పొందుటకు ప్రార్థన చేసారు. “ప్రభువు వారికి తన ఆత్మను పంపి, ఓదార్పు పొందుమనెను. మరియు వారు ఓదార్పు పొందిరి.” (ఆల్మా 17:10; ఆల్మా 26:27 కూడా చూడండి).

అప్పుడప్పుడు, మీరు అనిశ్చయతను, మీకు పెద్దవిగా కనిపించు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు శాంతి కొరకు వాంఛించవచ్చును. ప్రభువు మొరోనైకు బోధించిన పాఠమును మోషైయ కుమారులు నేర్చుకొన్నారు. అది మనందరికి మార్గదర్శి : “మనుష్యులు నా యొద్దకు వచ్చిన యెడల, నేను వారికి వారి బలహీనతలను చూపెదను. వారు తగ్గించుకొనునట్లు నేను మనుష్యులకు బలహీనతనిచ్చెదను; నా యెదుట తమను తాము తగ్గించుకొను మనుష్యులందరికి నా కృప చాలును. ఏలయనగా, నా యెదుట వారు తమను తగ్గించుకొని, నా యందు విశ్వసించిన యెడల, అప్పుడు నేను బలహీనమైన సంగతులను వారి కొరకు బలమైనవిగా చేయుదును.”(ఈథర్ 12:27).

మొరోనై తాను “ఈ మాటలను వినినప్పుడు,” “ఆదరణ పొందెను” (ఈథర్ 12:29) అని చెప్పెను. అవి మీకు కూడా ఆదరణగా ఉండవచ్చునని నేను ఆశిస్తున్నాను. తమ బలహీనతలను చూడనివారు అభివృద్ధి చెందలేరు. మీ బలహీనతను తెలుసుకొనుట ఒక దీవెన, ఎందుకంటే అది మీరు అణకువ కలిగి, మిమ్ములను బలముగా చేయుటకు, శక్తి కలిగిన రక్షకునివైపు తిరుగునట్లు చేస్తుంది. ఆత్మ మిమ్మల్ని ఆదరించుట మాత్రమే కాదు, కాని ఆయన కర్త కూడా, దాని ద్వారా ప్రాయశ్చిత్తము మీ సహజ స్వభావాలలో మార్పును కలిగించును. అప్పుడు బలహీన విషయాలు బలమైనవిగా మారును.

కొన్నిసార్లు సాతానుచేత మీ విశ్వాసము సవాలు చేయబడుతుంది; యేసు క్రీస్తు శిష్యులందరికి అది సంభవిస్తుంది. ఈ దాడులనుండి మీకు రక్షణ ఏమిటంటే పరిశుద్ధాత్మను మీ సహవాసిగా నిలుపుకొనుట. ఆత్మ మీ హృదయాలతో శాంతిని మాట్లాడును. విశ్వాసములో ముందుకు సాగుమని ఆయన మిమ్మల్ని పురికొల్పును. యేసు క్రీస్తు యొక్క వెలుగును, ప్రేమను అనుభూతిచెందిన సమయాలను ఆయన మీకు తిరిగి జ్ఞాపకము చేయును.

జ్ఞాపకము చేసుకొనుట అనేది ఆత్మ మీకిచ్చు అత్యంత ప్రశస్తమైన వరాలలో ఒకటి కావచ్చు. ఆయన “[ప్రభువు] మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” (యోహాను 14:26). ఆ జ్ఞాపకము జవాబివ్వబడిన సమాధానమో, పొందిన ఒక యాజకత్వ విధియో, సాక్ష్యము యొక్క నిర్ధారణో లేదా మీ జీవితములో దేవుని నడిపించే హస్తమును చూసిన క్షణమో కావచ్చును. బహశా రాబోయే దినములో మీకు బలము కావలసినప్పుడు, ఈ కూడిక సమయములో మీరు పొందుతున్న భావాలను ఆత్మ మీకు జ్ఞాపకము చేయవచ్చును. ఇది ఆవిధంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఆత్మ తరచు నా మనస్సులోకి తెచ్చు ఒక జ్ఞాపకము, అనేక సంవత్సరాల క్రితము ఇన్స్‌బ్రక్ ఆస్ట్రియాలో లోహపు షెడ్డులో జరిగిన ఒక సాయంకాలపు సంస్కార సమావేశము. ఆ షెడ్డు రైలుపట్టాల క్రింద ఉండెను. చెక్క కుర్చీలలో కూర్చోనియున్న, దాదాపు డజను మంది మాత్రమే అక్కడ ఉన్నారు. వారిలో చాలామంది స్త్రీలు, కొంతమంది యౌవనులు, కొందరు వృద్ధులు. ఈ చిన్న సమూహము మధ్య సంస్కారము అందించబడినప్పుడు కృతజ్ఞతగల కన్నీళ్ళను నేను చూసాను. ఆ పరిశుద్ధుల యెడల రక్షకుని ప్రేమను భావించాను, వారు కూడా అదేవిధంగా భావించారు. కాని నేను చాలా స్పష్టముగా జ్ఞాపకముంచుకొన్న అద్భుతము ఆ లోహపు షెడ్డుని నింపుతున్నట్లుగా కనిపించి, దానితోపాటు శాంతికరమైన భావనను తెచ్చిన వెలుగు. అది రాత్రి సమయము మరియు దానికి కిటికీలు లేవు, అయినప్పటికిని, మధ్యాహ్నపు సూర్యుని కాంతివలె ఆ గది వెలిగింపబడింది.

ఆ సాయంకాలము పరిశుద్ధాత్మ వెలుగు ప్రకాశవంతముగాను, సమృద్ధిగాను ఉండెను. దానిని లోపలకు రానిచ్చిన కిటికీలు ఏవనగా, తమ పాపములకు క్షమాపణ కోరుచు, ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొందుమని ప్రభువు యొద్దకు వచ్చిన ఆ పరిశుద్ధుల అణకువ గల హృదయాలు. ఆ సమయములో ఆయనను జ్ఞాపకము చేసుకొనుట కష్టముగా లేదు, మరియు ఆ పరిశుద్ధ అనుభవము యొక్క నా జ్ఞాపకము తదుపరి సంవత్సరాలలో ఆయనను మరియు ఆయన ప్రాయశ్చిత్తమును జ్ఞాపకము చేసుకొనుటను నాకు సులభతరము చేసింది. ఆత్మ మాతో ఉంటుందని సంస్కార ప్రార్థనలో ఉన్న వాగ్దానము ఆ రోజు నెరవేరింది, మరియు వెలుగు మరియు శాంతికర భావాలను తెచ్చింది.

నాకు శాంతి కావలసినప్పుడు, ఆదరణకర్తతో ప్రభువు నన్ను దర్శించిన అనేక విధానాల కొరకు మీవలె నేను కూడా కృతజ్ఞత కలిగియున్నాను. అయినప్పటికిని పరలోకమందున్న మన తండ్రి, కేవలము మన ఆదరణ కొరకే కాదు మనము పైకివెళ్ళే అభివృద్ధి కొరకు చింతిస్తారు. “ఆదరణకర్త” అనేది లేఖనాలలో పరిశుద్ధాత్మ వర్ణించబడిన అనేక విధానాలలో ఒకటి. ఇక్కడ మరొక్కటున్నది: “ఇప్పుడు, నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మేలు చేయుటకు నడిపించు ఆత్మయందు నమ్మకముంచుము” (సి మరియు ని 11:12). మిక్కిలి తరచుగా, మేలు చేయుటకు ఆయన మిమ్మల్ని నడిపించేది దేవునినుండి ఆదరణ పొందుటకు ఇంకొకరికి సహాయపడటము.

ప్రభువు తనకున్న జ్ఞానముతో, ఆయన సంఘములో మిమ్మల్ని సంస్థలు, తరగతులలో కలసి ఉంచారు. మేలు చేయుటకు మీ సామర్థ్యమును పెంచుటకు ఆయన ఆవిధంగా చేసారు. ఆయన కొరకు ఇతరులకు సేవచేయుటకు ఈ సంస్థలలోపల మీకు కొన్ని నిర్థిష్టమైన బాధ్యతలు కలవు. ఉదాహరణకు, మీరు యువతి అయితే, “తక్కువ చురుకుదనము” అని మనం కొన్ని సార్లు పిలిచినట్లుగా మారిన ఒక మియా మెయిడ్‌ను దర్శించమని మీ బిషప్పు లేదా మీ యువతుల నాయకురాలు చేత మీరు అడగబడవచ్చును. బిషప్పు లేదా యువతుల నాయకురాలి కంటే మీకు ఆమె బాగా తెలిసియుండవచ్చును. ఆమె ఇంటిలోను లేక పాఠశాలలోను లేదా రెంటిలోను ఇబ్బందిపడుతుందని మీకు తెలిసియుండవచ్చును. ఆమెను కలవమని మిమ్మల్ని అడుగుటకు వారెందుకు ప్రేరేపణ పొందారో మీ నాయకులకు తెలిసియుండకపోవచ్చు, కాని ప్రభువుకు తెలుసు, మరియు ఆయన తన ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఈ కార్యమును నడిపించును.

మీ ప్రయత్నాలలో సఫలము కావలంటే మీ యొక్క మరియు విడిపించుటకు మీరు పంపబడిన యువతి యొక్క హృదయములో మార్పు అనే అద్భుతకార్యము అవసరము-- దానికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కావాలి. తక్కువ చురుకుగా ఉన్న ఆ లారెల్‌ను ప్రభువు ఏవిధంగా చూస్తారో ఆవిధంగా మీరు చూచుటకు ఆత్మ అనుమతించును. ప్రభువు మీ హృదయమును మరియు ఆమె హృదయమును ఎరుగును, మరియు మార్పుచెందిన హృదయాల సాధ్యతలను ఆయన ఎరుగును. దీనమనస్సును, క్షమాపణను, మరియు ప్రేమను ప్రేరేపించుటకు ఆయన తన ఆత్మతో మిమ్మల్ని దర్శించును.

ఒక గొఱ్ఱెపిల్లను మందలోకి తిరిగి ఆహ్వానించుటకు అవసరమైన మాటలు, క్రియలు, మరియు సహనమును ఆ ఆత్మ ప్రేరేపించగలదు. ఆ తప్పిపోయిన గొఱ్ఱెపిల్లను ప్రేమించి, ఆహ్వానించుటకు లారెల్ తరగతిలోని మంద యొక్క హృదయాలను ఆయన స్పృశించగలరు, తద్వారా ఆమె తిరిగి వచ్చినప్పుడు, ఆమె తన గృహానికి వచ్చెనని ఆమె భావించగలదు.

దేవుని యొక్క కుమార్తెల గుంపుగా మేలు చేసే మీ శక్తి, మీ మధ్య ఉన్న ఐక్యత, ప్రేమపైన అధికముగా ఆధారపడి ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే మరొక శాంతి వరము.

దీనిని ఆల్మా అర్థము చేసుకొన్నాడు. అందుకే అతడు తన ప్రజలతో “ఒకనితో మరొకనికి ఎట్టి వివాదములు ఉండరాదనియు ఒకే విశ్వాసము, ఒకే బాప్తీస్మము కలిగియుండి ఒకరి యెడల ఒకరు ఐక్యత యందును, ప్రేమ యందును తమ హృదయములు కలసి మెలసియుండునట్లు వారు ఒక్క లాగునే ముందుకు చూడవలెను” అని వేడుకొనెను (మోషైయా 18:21).

మన తరగతిలో, మన కుటుంబములో ఆత్మను కలిగియుండుటకు ఐక్యత మనకు అవసరము. కాని అటువంటి ప్రేమగల ఐక్యతను కొనసాగించుట కష్టమని అనుభవము నుండి నాకు తెలిసినట్లుగా మీకు తెలుసు. మన కళ్లను తెరిపించుట, మన భావాలను నిగ్రహించుకొనుట పరిశుద్ధాత్మ మన సహచరునిగా ఉండుటకు అవసరము.

ఒకసారి ఏడు లేదా మా ఎనిమిది సంవత్సరాల కుమారుడు మంచముపైన గట్టిగా గంతులు వేయడం వలన అది విరిగిపోతుంది అని నేను అనుకోవటం నాకు గుర్తుంది. రెప్పపాటు చిరాకు కలిగి, నా ఇంటిని చక్కబరచుటకు నేను వేగముగా కదిలాను. అతడి చిట్టి భుజాలను పట్టుకొని మా కళ్ళు కలిసేవరకు పైకెత్తాను.

“నీవొక గొప్ప వ్యక్తిని పట్టుకొనియున్నావు” అని అత్మ నా మనస్సులో ఈ మాటలను ఉంచెను. అది నిశ్శబ్ద స్వరముగా అనిపించింది, కాని అది నా హృదయానికి గుచ్చుకుంది. నేను మెల్లగా వానిని మంచముపైన దించి, క్షమాపణ అడిగాను.

40 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ నేను చూసేలా చేసిన గొప్ప వ్యక్తిగా ఇప్పుడతడు అయ్యాడు. ప్రభువు తాను చూసినట్లే ఒక దేవుని బిడ్డగా నేను చూచుటకు పరిశుద్ధాత్మను పంపి, నా దయలేని భావాలనుండి నన్ను రక్షించినందుకు నేను నిరంతరము కృతజ్ఞత కలిగియున్నాను.

మనం ఒకరినొకరు చూసినప్పుడు—మనం ఒకరినొకరి కొరకు ఆలోచించినప్పుడు కూడా మనం చూసేదానిని ప్రభావితం చేసేలా పరిశుద్ధాత్మను అనుమతించినప్పుడు, మన కుటుంబాలలో, మన సంఘములో మనం కోరుకొనే ఐక్యత వస్తుంది. ఆత్మ క్రీస్తు యొక్క నిర్మలమైన ప్రేమతో చూచును. దాతృత్వమును వివరించుటకు మోర్మన్ ఉపయోగించిన మాటలను ఆలకించుము. దానిని భావించిన సమయాల గురించి ఆలోచించండి. మీరు దానిని అనుభూతిచెందిన సమయాలను గూర్చి ఆలోచించుము:

“దాతృత్వము, దీర్ఘకాలము తాళును మరియు కనికరము కలిగియుండును; అసూయపడదు, ఉప్పొంగదు, స్వలాభమునపేక్షించదు, సుళువుగా కోపమునకు రేపబడదు, ఎట్టి చెడును ఆలోచించదు మరియు దుర్ణీతియందు ఆనందించదు. కానీ సత్యమందు ఆనందించును. అన్ని సంగతులను భరించును. అన్ని సంగతులను విశ్వసించును. అన్ని సంగతులను నిరీక్షించును. అన్ని సంగతులను సహించును.

“అందువలన నా ప్రియమైన [సహోదరీలారా], మీరు దాతృత్వము కలిగియుండని యెడల, మీరు ఏమియు కారు. ఏలయనగా, దాతృత్వము ఎన్నడును విఫలము కాదు. అందువలన అన్నిటిలో గొప్పదైన దాతృత్వమును హత్తుకొనియుండుడి. ఏలయనగా, అన్నియు విఫలమగును.

“కానీ దాతృత్వము, క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది; మరియు అది నిత్యము నిలుచును, మరియు అంత్య దినమున ఎవడు దానిని కలిగియుండి కనబడునో, అది అతనికి మేలుగా ఉండును.

“అందువలన నా ప్రియమైన సహోదరులు, [సహోదరీలారా], ఆయన కుమారుడు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులైన వారందరి పైన ఆయన ఉంచిన ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని, మీరు దేవుని కుమారులు కావలెనని, ఆయన ఉన్నట్లే, ఆయనను చూచెదము కావున ఆయన ప్రత్యక్షమగునప్పుడు మనము ఆయన వలె ఉండునట్లు, మనము ఈ నిరీక్షణను కలిగియుండునట్లు, ఆయన శుద్ధముగా ఉన్నట్లు, మనము శుద్ధము చేయబడునట్లు హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి. ఆమేన్‌” (మొరోనై 7:45–48).

ఈ లక్ష్యమునే పరలోక తండ్రి తన ప్రశస్తమైన కుమార్తెల కొరకు కలిగియున్నారు. ఇది బహుదూరముగా ఉన్న లక్ష్యముగా మీకు అనిపించవచ్చును, కాని ఆయన దృష్టిలో మీరు అంత దూరములో లేరు. కాబట్టి మీకు ఆదరణనిచ్చుటకు, ప్రోత్సహించుటకు, ముందుకు సాగుటకు ప్రేరేపించుటకు ఆయన మిమ్మల్ని తన ఆత్మతో దర్శించును.

పరలోక తండ్రి మిమ్మల్ని ఎరుగునని, మీ అవసరాలు, మీ పేరు ఎరుగునని---మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మరియు మీ ప్రార్థనలు వినుచున్నారని, నా దృఢమైన సాక్ష్యమును మీతో వదలుచున్నాను. ఆయన ప్రియమైన కుమారుడు తన యొద్దకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. వారి కొరకు ఇతరులకు సేవ చేయుటకు మీ ప్రయత్నాలలో మీకు సహాయపడుటకు పరిశుద్ధాత్మను వారు పంపుతున్నారు.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము వలన, పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసము మీ ఆత్మపైన శుద్ధీకరించు మరియు పరిశుద్ధపరచు ప్రభావమును కలిగియుంటుంది. రక్షకుడు తన శిష్యులతో వదలి వెళ్లెదనని వాగ్దానము చేసిన శాంతిని మీరు అనుభూతి చెందుతారు. ఆ శాంతితో తండ్రినుండి, ఆయన ప్రియకుమారుని నుండి ఒక ప్రకాశవంతమైన నిరీక్షణ, వెలుగు మరియు ప్రేమగల భావన వస్తుంది, ఆయన తన జీవిస్తున్న ప్రవక్తకు బయల్పాటు ద్వారా భూమిమీద తన రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఆవిధముగా ప్రభువైన యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు