నిబ్బరముగల స్త్రీలు
నిబ్బరముగల స్త్రీలు రక్షకుడైన యేసు క్రీస్తును ఆధారము చేసుకొన్న శిష్యులు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము యొక్క వాగ్దానము ద్వారా నిరీక్షణను కలిగియుండిరి.
ప్రియమైన సహోదరీలారా, ప్రథమ అధ్యక్షత్వము ఇచ్చిన ఆహ్వానమునకు, #నేనొకపరదేశిని అనే ప్రయత్నమునకు మీ సున్నితమైన హృదయాలు మరియు ఉత్సాహాముగల స్పందన కొరకు మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము మరియు కృతజ్ఞత కలిగియున్నాము. ఆత్మయొక్క గుసగుసలను వింటూ, మీరు పొందే ప్రేరేపణలను అనుసరిస్తూ, దయచేసి ప్రార్థిస్తూ ఉండండి.
నేను స్థానికముగాను లేదా ప్రపంచమంతటా ప్రయాణించినప్పటికిని, “నేను మీకు గుర్తున్నానా?” అని ఎవరో ఒకరు అడగడం అసాధారణమైనదేమీ కాదు. నేను బాధాకరంగా అపరిపూర్ణమైనదాన్ని కాబట్టి, నేను తరచు పేర్లను గుర్తుపెట్టుకోలేనని తప్పకుండా ఒప్పుకోవాలి. అయినప్పటికి, పరలోక తండ్రి యొక్క ప్రశస్తమైన కుమారులు, కుమార్తెలను నేను కలుసుకొన్నప్పుడు, నేను భావించుటకు ఆయన అనుమతించిన మిక్కిలి యధార్థమైన ప్రేమ నాకు జ్ఞాపకముంటుంది.
ఇటీవల చెరశాలలో ఉన్న కొంతమంది ప్రియమైన స్త్రీలను దర్శించుటకు నాకొక అవకాశము కలిగింది. మేము మా హృదయపూర్వక వీడ్కోలు పలికినప్పుడు, ఒక ప్రియమైన స్త్రీ, “సహోదరి బర్టన్, దయచేసి మమ్మల్ని మర్చిపోవద్దు” అని బ్రతిమాలింది. జ్ఞాపకము చేసుకోబడాలని ఆశించే ఆమె మరియు ఇతరులు - వారిని నేను మర్చిపోలేదని కొన్ని ఆలోచనలను మీతో పంచుకొన్నప్పుడు మీరు భావిస్తారని నేనాశిస్తున్నాను.
రక్షకుని కాలములో నిబ్బరముగల స్త్రీలు: రక్షకుడైన యేసు క్రీస్తును ఆధారముగా చేసుకొన్నారు
అన్ని యుగాలలో ఉన్న మన సహోదరీలు మనము కూడా ప్రయాసపడే శిష్యరికము యొక్క విశ్వాసమైన మాదిరిను ప్రదర్శించారు. “యేసు క్రీస్తునందు మరియు (ఆయన ప్రాయశ్చిత్తమునందు) విశ్వాసమును సాధన చేసి, ఆయన బోధనలను నేర్చుకొని, జీవించి, ఆయన పరిచర్య, అద్భుతకార్యాలు, మరియు ప్రభావము గురించి సాక్ష్యమిచ్చియున్న మనకు తెలిసిన లేదా తెలియని కొంతమంది స్త్రీల యొక్క వృత్తాంతములను క్రొత్త నిబంధన కలిగియున్నది. ఈ స్త్రీలు మార్గదర్శులైన శిష్యురాళ్ళుగా, రక్షణ కార్యములో ముఖ్యమైన సాక్షులుగా మారారు.” 1
లూకా గ్రంథములో ఈ వృత్తాంతములను పరిగణించండి. మొదటి వృత్తాంతము, రక్షకుని యొక్క పరిచర్య కాలములో జరిగింది:
“మరియు ఇది జరిగెను . . . వెంటనే [యేసు] దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామము లోను సంచారము చేయుచుండగా, పండ్రెండుమంది శిష్యులు ఆయనతో కూడ ఉండిరి,
అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా మగ్దలేనే …అనబడిన మరియయు, యోహన్నయు … , సూసన్నయు, ఆయనకు ఉపచారము చేయుచు వచ్చిరి.”2
తదుపరి ఆయన పునరుత్థానము తరువాత:
“అయితే మాలో కొందరు స్త్రీలు . . . తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి”
“ఆయన దేహమును కానక వచ్చి . . . కొందరు దేవదూతలు తమకు కనబడి ... ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.” 3
ఈ వృత్తాంతములను ఇంతకుముందు నేను అనేకసార్లు చదివాను మరియు “నిబ్బరముగల స్త్రీలు,” అని అసాధారణముగా కనబడిన భావనను దాటివెళ్ళాను, కాని ఇటీవల ఎక్కువ శ్రద్ధగా నేను ధ్యానించినప్పుడు, ఈ మాటలు పేజీనుండి గెంతినట్లుగా కనబడినవి. మాట యొక్క ఒక అర్ధము ఈ పర్యాయపదాలను పరిశీలించుము, కొందరు విశ్వాసులకు జోడించబడింది, కొందరు స్త్రీలు: “ఒప్పించబడి,” “నిశ్చయతగలిగి,” “ధైర్యముతో,” “స్థిరముగా,” “ఖచ్చితముగా,” “సంశయములేని,” మరియు “ఆధారపడదగినవారు.” 4
అ శక్తివంతమైన నిర్వచనాలను నేను లోతుగా ఆలోచించినప్పుడు, క్రొత్త నిబంధనకు చెందిన నిబ్బరముగల స్త్రీలలో ఇద్దరు నాకు జ్ఞాపకమొచ్చారు, వారు రక్షకుని గురించి నిశ్చయమైన, ధైర్యముగల, స్థిరమైన, రూఢియైన సాక్ష్యమిచ్చారు. వారు మనలాగే అపరిపూర్ణమైన స్త్రీలుగా ఉన్నప్పటికి, వారి సాక్ష్యము ప్రేరేపించేదిగా ఉన్నది.
బావివద్ద పేరు తెలియని స్త్రీ తాను రక్షకుని గురించి ఏమి నేర్చుకుందో వచ్చి చూడమని ఇతరులను ఆహ్వానించిన ఆమెను గుర్తుచేసుకోండి. ఆమె తన నిబ్బరమైన సాక్ష్యమును “ఈయన క్రీస్తుకాడా?”5 అని ఒక ప్రశ్నరూపములో చెప్పింది. ఆమె సాక్ష్యము మరియు ఆహ్వానము చాలా శక్తివంతముగా ఉండి “అనేకులు … ఆయనయందు విశ్వాసముంచిరి.” 6
తన సహోదరుడైన లాజరు మరణము తరువాత-ప్రభువు యొక్క ప్రియమైన శిష్యురాలు, స్నేహితురాలైన మార్త, మిక్కిలి భావోద్రేకముతో ఇలా ప్రకటించింది, “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.” ఆమె తన మాటలను కొనసాగించినప్పుడు, ఆమె నిశ్చయతను పరిగణించండి, “ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.” అమె ఇంకా ఇలా సాక్ష్యమిచ్చింది, “నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.”7
నిబ్బరముగల స్తీలు రక్షకుడైన యేసు క్రీస్తును ఆధారముచేసుకొని, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము యొక్క వాగ్దానము ద్వారా నిరీక్షణ కలిగిన శిష్యులని ఈ సహోదరీలనుండి మనము నేర్చుకుంటాము.
పునఃస్థాపనము యొక్క నిబ్బరముగల నిబంధనలు-పాటించు స్త్రీలు: త్యాగము చేయుటకు సిద్ధపడిరి
పూర్వకాలము, నిబ్బరముగల స్త్రీలు యేసు బోధనల గూర్చి సాక్ష్యమిచ్చి, వాటి ననుసరించి జీవించినప్పుడు త్యాగము చేసారు. పునఃస్థాపన యొక్క ఆరంభ దినాలలో నిబ్బరముగల స్త్రీలు ఆవిధంగానే చేసారు. క్లే కౌంటీ మిస్సోరిలో పరిశుద్ధులను హింసించినప్పుడు, క్రొత్తగా పరివర్తన చెందిన వారిగా డ్రుసిల్లా హెన్డ్రిక్స్ మరియు ఆమె కుటుంబము బాధపడినవారిలో ఉన్నారు. క్రుకెడ్ నది పోరాటములో ఆమె భర్త శాశ్వతంగా పక్షవాతమును పొందాడు. ఆమె అతడిని, అదేవిధంగా, ఆమె కుటుంబమును పోషించవలసి వచ్చింది.
“ప్రత్యేకంగా ఆ కుటుంబమునకు ఆహారము లేని ఒక దుఃఖకరమైన సమయములో, ‘సహనముగా ఉండుము, ప్రభువు సమకూర్చును’ అని ఒక స్వరము ఆమెకు చెప్పుట ఆమె జ్ఞాపకముంచుకొన్నది.’’’
మోర్మన్ బెటాలియన్‌కు తన కుమారుడు స్వచ్ఛందముగా సేవచేయుటకు అవసరమైనప్పుడు, ఆమె మొదట ప్రతిఘటించింది మరియు “ఆమెకు ఒక స్వరము ‘నీకు మహోన్నత మహిమ వద్దా’ అని చెప్పినట్లు అనిపించేంత వరకు పరలోక తండ్రితో ప్రార్థనయందు పెనుగులాడింది, ‘కావాలి’ అని ఆమె సహజముగా సమాధానమిచ్చింది,’ ‘అత్యంత గొప్ప త్యాగాలను చెయ్యకుండా నీవు ఏవిధంగా దానిని పొందాలనుకుంటున్నావు?’’8 అని ఆ స్వరము కొనసాగించింది.
నిబంధనలను పాటించే శిష్యత్వమునకు త్యాగము చేయుటకు మన సమ్మతి అవసరమని ఈ నిబ్బరముగల స్త్రీలనుండి మనం నేర్చుకుంటాము.
నేడు నిబ్బరముగల స్త్రీలు: ఆయన రాకను జ్ఞాపకము చేసుకొని, వేడుక చేసుకొనుటకు సిద్ధపడుట
రక్షకుని కాలములో, సువార్త పునఃస్థాపించబడిన ఆరంభ కాలములో నిబ్బరముగల స్త్రీల గురించి నేను ప్రస్తావించాను. కాని మన స్వంత కాలములో నిబ్బరముగల స్త్రీల యొక్క శిష్యత్వము మాదిరులు మరియు సాక్ష్యముల సంగతి ఏమిటి?
ఇటీవల ఆసియా వెళ్ళుటకు ఇవ్వబడిన బాధ్యతలో, నేను కలిసిన అనేకమంది నిబ్బరముగల స్త్రీలచేత నేను మరొకసారి ప్రేరేపించబడ్డాను. ప్రత్యేకముగా ఇండియా, మలేషియా, ఇండోనేషియాలో ఉన్న మొదటి తరము సభ్యులతో నేను ప్రభావితం చేయబడ్డాను, వారు స్వంత గృహాలలో సువార్త సంస్కృతిని జీవించుటకు శ్రమిస్తున్నారు, కొన్నిసార్లు గొప్ప త్యాగము చేస్తున్నారు, ఎందుకంటే సువార్తను అనుసరించి జీవించడం తరచు కుటుంబ మరియు దేశ సంస్కృతులతో విభేదిస్తుంది. హాంకాంగ్ మరియు తైవాన్ లో ఉన్న బహుతరాల నిబ్బరముగల స్త్రీలు రక్షకునిపై ఆధారపడి ఉండటం మరియు నిబంధనలను పాటించుటకు త్యాగము చేయడానికి సిద్ధపడటం ద్వారా తమ కుటుంబాల జీవితాలను, సంఘ సభ్యులను, సమాజాలను దీవిస్తూ ఉన్నారు. ఇటువంటి నిబ్బరముగల స్త్రీలను సంఘమంతటా కనుగొనబడతారు.
నా జీవితమును దశాబ్దాలుగా దీవించిన ఇంకొక నిబ్బరముగల స్త్రీ, ఇన్‌క్లూషన్ బాడీ మయోసైటిస్ అనే బలహీనపరచే, కష్టతరమైన ముదురుతున్న వ్యాధితో గత 15 సంవత్సరాలు పోరాడింది. ఆమె తన చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికి, ఆమె కృతజ్ఞత కలిగి ఉండటానికి ప్రయత్నిస్తుంది, మరియు “చెయ్యగలను జాబితాను” పాటించుటకు ప్రయత్నిస్తుంది: –నేను శ్వాస తీసుకోగలను, నేను మ్రింగగలను, నేను ప్రార్థన చేయగలను, నా రక్షకుని ప్రేమను అనుభూతిచెందగలను వంటి ఆమె చెయ్యగలిగిన పనుల జాబితాను కలిగియున్నది. దాదాపు ఆమె ప్రతిరోజు తన క్రీస్తు కేంద్రముగా స్థిరమైన సాక్ష్యమును తన కుటుంబము, స్నేహితులకు పంచుకుంటుంది.
నేను ఇటీవల జెన్ని యొక్క కథను విన్నాను. ఆమె తిరిగి వచ్చిన మిషనరీ, ఆమె తన మిషను సేవ చేస్తున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇంటికి తిరిగివ రావాలన్న ఆలోచన “[ఆమెను] చచ్చేంతగా భయపెట్టింది.” కాని ఇటలీలో ఆమె మిషను ముగింపులో, అమెరికాకు తన తిరుగు ప్రమాణములో దారిలో మిషను అధ్యక్షుని దర్శించినప్పుడు, ఒక నిబ్బరముగల స్త్రీ, మిషను అధ్యక్షుని భార్య, కేవలం అమె తల దువ్వుట ద్వారా సున్నితముగా సేవచేసింది.
అనేక సంవత్సరాల తరువాత, ఒక నిబ్బరముగల స్త్రీ టెర్రి -స్టేకు ఉపశమన సమాజ అధ్యక్షురాలు-మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యురాలు --వార్డు ఉపశమన సమాజ అధ్యక్షురాలుగా జెన్ని పిలువబడినప్పుడు ఆమె జీవితమును దీవించింది. ఆ సమయములో, జెన్ని తన డాక్టరేటు డిగ్రీ కొరకు తన పరిశోధన వ్యాసమును వ్రాస్తుంది. నాయకురాలిగా టెర్రీ జెన్నికు ఉపదేశకురాలిగా ఉండటమే కాక, జెన్నికి లుకేమియా ఉన్నట్లు కలవరపెట్టే ఆరోగ్యపరీక్షను పొందినప్పుడు, ఆసుపత్రిలో 10 గంటలు ఆమెతో గడిపింది. టెర్రి ఆసుపత్రిని దర్శించి, కారులో జెన్నిని అపాయింట్‌మెంటులకు తీసుకొనివెళ్లింది. “నేను చాలా సార్లు ఆమె కారులో వాంతి చేసుకొని ఉండవచ్చు” అని జెన్ని అంగీకరించింది.
తన వ్యాధిని లక్ష్యపెట్టకుండా, ఆమె వార్డు ఉపశమన సమాజ అధ్యక్షురాలిగా ధైర్యముగా సేవచేసింది. తన తీవ్రమైన పరిస్థితిలో కూడా, తన మంచముపైన పండుకొని ఉండి, ఫోను చెయ్యడం, అక్షర సందేశాలు, ఈ-మెయిల్స్ పంపడం చేసింది, వచ్చి తనను చూడమని సహోదరీలను ఆహ్వానించింది. కార్డులను, సందేశాలను వ్యక్తులకు పంపి, సుదూరమునుండి తన సహోదరీలను ప్రేమించింది. వార్డు చరిత్ర కొరకు ఆమె అధ్యక్షత్వము యొక్క ఛాయాచిత్రము కొరకు ఆమె వార్డు మనవి చేసినప్పుడు, వారు దీనిని పొందారు. జెన్ని తనకైతాను నిబ్బరముగల స్త్రీ కాబట్టి, తన స్వంత దానితో కలిపి ఇతరుల భారాలను, పంచుకోమని ఆమె అందరిని ఆహ్వానించింది.
నిబ్బరముగల స్త్రీగా, జెన్ని సాక్ష్యమిచ్చింది: “మనం ఇతరులను రక్షించుటకు మాత్రమే కాదు కాని మనల్ని మనం రక్షించుకోవడానికి ఇక్కడున్నాము. యేసు క్రీస్తుతో భాగస్వామిగా ఉండుట ద్వారా; ఆయన కృప, ఆయన ప్రాయశ్చిత్తము, సంఘము యొక్క స్త్రీల పట్ల ఆయన ప్రేమపూరిత భావాలను అర్థము చేసుకొనుట ద్వారా రక్షణ మనకు కలుగుతుంది. అది కేవలం ఎవరి జుట్టును దువ్వుట, నిరీక్షణ మరియు కృపగల ప్రేరేపించబడిన, స్పష్టమైన, బయల్పరచబడిన సందేశముతో ఒక నోటు పంపుట; లేక స్త్రీలను మనకు సేవ చేయనిచ్చుట.”9
సహోదరీలారా, మనము పరధ్యానముగా, సందేహముగా, నిరుత్సాహముగా, పాపులుగా, దుఃఖముగా, ఆత్మలు ముంచివేయబడినట్లుగా మారినప్పుడు, తన జీవజలములను త్రాగమని ప్రభువు ఇచ్చిన ఆహ్వానమును బావి వద్ద నిబ్బరముగల స్త్రీ అంగీకరించినట్లుగా మనము కూడా అంగీకరించి, “ఈయన క్రీస్తుకాడా?” అని మన స్పష్టమైన సాక్ష్యమును చెప్పుచు ఆవిధంగా చెయ్యమని ఇతరులను ఆహ్వానిద్దాము.
తన సహోదరుడు మరణించినప్పుడు మార్తాకు అనిపించినట్లుగా జీవితము అన్యాయముగా అనిపించినప్పుడు--మనం ఒంటరితనము, వంధ్యత్వము, ప్రియమైనవారిని కోల్పోవడము, వివాహము మరియు కుటుంబము కొరకు కోల్పోయిన అవకాశాలు, చీలిపోయిన కుటుంబాలు, బలహీనపరిచే నిరాశ, శారీరక లేదా మానసిక అనారోగ్యము, తీవ్రమైన ఒత్తిడి, కలవరము, వ్యసనము, ఆర్ధిక కష్టాలు లేదా ఎక్కువ ఇతర సాధ్యతలు మనం అనుభవిస్తున్నప్పుడు--మార్తాను మనం జ్ఞాపకము చేసుకొని అదేవిధమైన మన స్థిరమైన సాక్ష్యమును ప్రకటించెదముగాక: “కాని నాకు తెలుసు ... [మరియు] నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను.”
మన ప్రశస్తమైన రక్షకుడు సిలువపైన వేదనకరమైన అనుభవమునందు ఆయనను విడిచిపెట్టుటకు తిరస్కరించారు, అయనప్పటికిని గంటల తరువాత ఆయన మహిమకరమైన పునరుత్థానము యొక్క స్థిరమైన సాక్షుల మధ్య ఉండుటకు విశేషాధికారమును పొందిన అనేకమంది నిబ్బరముగల స్త్రీలను మనం జ్ఞాపకముంచుకొందామా. ప్రార్థనతోను, లేఖన పఠనముతోను అయనకు దగ్గరగా ఉండునట్లు మనం కనుగొనబడదాము. ప్రతివారము సంస్కార విధి సమయంలో ఆయన ప్రాయశ్చిత్త త్యాగమునకు పరిశుద్ధమైన చిహ్నాల కొరకు సిద్ధపడుట మరియు వాటిలో పాలుపంచుకొనుట ద్వారా, అవసరతలో ఉన్న ఇతరులకు సేవ చేయుట ద్వారా మన నిబంధనలను పాటించినప్పుడు మనం ఆయనకు దగ్గరౌతాము. అప్పుడు బహుశా ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన మహిమకరమైన ఆగమనమును వేడుక చేసుకొను నిబ్బరముగల స్త్రీలు, యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా, మనం కూడా భాగమౌతాము.
సహోదరీలారా, ప్రేమగల పరలోక తల్లిదండ్రుల గురించి; మన రక్షకుడైన యేసు క్రీస్తు గురించి; మన తరఫున ఆయన చేసిన అనంత ప్రాయశ్చిత్తము గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్తగా ముందుగానే నియమించబడెనని నాకు తెలుసు. మోర్మన్ గ్రంథము సత్యమని, దేవుని శక్తిచేత అనువదించబడిందని నాకు తెలుసు. మన కాలములో జీవిస్తున్న ప్రవక్త, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్‌చేత మనం దీవించబడియున్నాము. ఈ సత్యాలను గూర్చి నేను దృఢమైన నమ్మకాన్ని కలిగియున్నాను! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.
గమనిక: 2017, ఏప్రిల్ 1న, సహోదరి బర్టన్ ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షురాలిగా విడుదల చేయబడ్డారు.