2010–2019
ప్రభువునందు నమ్మకముంచుము మరియు నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు
April 2017 General Conference


ప్రభువునందు నమ్మకముంచుము మరియు నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు

రక్షకునియందు మన జీవితాలను కేంద్రీకృతము చేసుకోవాలి అప్పుడు ఆయన మన త్రోవలను సరాళము చేయును.

ఆసియాలో నేను ప్రయాణించుచుండగా, ఒక ప్రియమైన సహోదరి నన్ను సమీపించి, ఆమె నా చుట్టూ తన చేతులు వేసి, “ఈ సువార్త సత్యమని మీరు నిజంగా నమ్ముచున్నారా” అని అడిగెను. ప్రియమైన సహోదరీ, అది సత్యమని నాకు తెలుసు. నేను ప్రభువునందు నమ్మకముంచుచున్నాను.

సామెతలు 3:5–6లో, మనం ఈ ఉపదేశమును చదువుతాము:

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము.”

”నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”

ఈ లేఖనము రెండు ఉపదేశములు, ఒక హెచ్చరికను మరియు మహిమగల ఒక వాగ్దానమును ఇచ్చును. ఆ రెండు ఉపదేశములు: “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము” మరియు “నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము.” ఆ హెచ్చరిక: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు.” మరియు ఆ మహిమగల వాగ్దానము: “ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”

మొదట హెచ్చరికను చర్చిద్దాము. ఆ దృశ్యచిత్రము మనం పర్యాలోకించుటకు మనకు ఎక్కువ అవకాశమునిచ్చును. ఆ హెచ్చరిక “ఆధారము చేసికొనవద్దు”- “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు” అనే పదాలలో వస్తుంది. ఆంగ్లములో ఆధారపడుట అనే మాటకు భౌతికముగా ఒక ప్రక్కకు ఒరుగుట లేదా కదులుట అనే అర్థాన్నిస్తుంది. భౌతికముగా మనం ఒక ప్రక్కకు లేదా మరొక ప్రక్కకు ఒరిగితే, మనం కేంద్రమునుండి కదిలి, సమతుల్యమును కోల్పోయి మనం తూలిపోతాము. మనం ఆత్మీయముగా మన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే, మన రక్షకుని నుండి మనం ప్రక్కకు ఒరుగుతాము. మనం ప్రక్కకు ఒరిగితే, మనం కేంద్రములో ఉండము; సమతుల్యములో ఉండము; క్రీస్తుపైన మన దృష్టి ఉండదు.

సహోదరీలారా, మన పూర్వమర్త్య జీవితములో, మనం రక్షకుని పక్షాన ఉన్నామని జ్ఞాపకముంచుకోండి. మనము ఆయనను నమ్మాము. మన పరలోక తండ్రి ఏర్పాటుచేసిన సంతోష ప్రణాళికకు మన సహకారాన్ని, ఉత్తేజాన్ని, సంతోషాన్ని మనం గొంతెత్తి ప్రకటించాము. మనం ప్రక్కకు ఒరిగిపోలేదు. మన సాక్ష్యాలతో మనం పోరాటము చేసాము మరియు “దేవుని బలగాలతో మనం ఏకమయ్యాము, ఆ బలగాలు జయముగలవి.” 1 మంచికి, చెడుకు గల పోరాటము భూమిపైకి ప్రవేశించింది. మరియొకసారి సాక్షిగా నిలబడి, ప్రభువునందు మన నమ్మకముంచవలసిన పవిత్ర ధర్మమును మనం కలిగియున్నాము.

మనలో ప్రతి ఒక్కరు ఇలా ప్రశ్నించుకోవాలి: నా స్వబుద్ధిని ఆధారము చేసికొనకుండా ఏవిధంగా కేంద్రములో ఉండగలను? లోక స్వరాలు చాలా బలవంతము చేయునట్లుగా ఉండగా, ఏవిధంగా నేను రక్షకుని స్వరమును గుర్తించి, అనుసరించగలను? రక్షుకనియందు నమ్మకమును ఏవిధంగా వృద్ధిచేసుకోగలను?

రక్షకునియందు మన జ్ఞానాన్ని, నమ్మకాన్ని పెంచుకొనుటకు మూడు మార్గాలను నేను మీకు ఇవ్వవచ్చునా. ఈ సూత్రాలు క్రొత్తవి కావు, కాని అవి ప్రాథమికమైనవని మీరు కనుగొంటారు. అవి ప్రతి ప్రాథమికలో పాడబడతాయి, యువతుల పాఠాలలో ప్రతిధ్వనిస్తాయి మరియు ఉపశమన సమాజము యొక్క అనేక ప్రశ్నలకు అవి జవాబులు. అవి కేంద్రములో ఉంచేవి కాని ప్రక్కకు ఒరిగే సూత్రాలు కావు.

మొదట, మనం “క్రీస్తు యొక్క మాటల విందారగించుట” ద్వారా ప్రభువును తెలుసుకొని, ఆయనయందు నమ్మకముంచుతాము. “ఏలయనగా క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు బోధించును.” 2

అనేక నెలల క్రితం, మేము కుటుంబ లేఖన అధ్యయనము చేయున్నాము. మేము చదువుచుండగా రెండు సంవత్సరాల మా మనవడు నా ఒళ్ళో కూర్చొని ఉన్నాడు. నా కుమారుని కుటుంబము వచ్చినందువలన ఎంతో సంతోషముతో, నానమ్మ పాత్రలో పూర్తిగా లీనమైయున్నాను.

మా లేఖన అధ్యయనము పూర్తవ్వగా, నా గ్రంథాన్ని నేను మూసాను. ఆ తరువాత వెంటనే నిద్రపోవాల్సి వస్తుందని నా మనవడికి తెలుసు.అతడు తన ఆతృతగల నీలిరంగు కళ్ళతో నన్ను చూసి: “మరిన్ని లేఖనాలు చదువు, నాని” అని ఒక నిత్య సత్యాన్ని పలికాడు.

చిత్రం
సహోదరి కార్డన్ యొక్క మనుమడు

మంచివాడు మరియు స్థిరమైన తండ్రి అయిన నా కుమారుడు, “అమ్మ, నువ్వు బలహీనముగా ఉండవద్దు. నిద్రపోకుండా తప్పించుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు,” అని నన్ను హెచ్చరించాడు.

కాని మా మనుమడు ఎక్కువ లేఖనాల కొరకు అడిగితే, మేము ఎక్కువ లేఖనాలు చదువుతాము! ఎక్కువ లేఖనాలు మన మనస్సులకు జ్ఞానవృద్ధిని కలుగజేసి, మన ఆత్మలను పోషించి, మన ప్రశ్నలకు సమాధానాలిచ్చి, ప్రభువునందు మనకున్న నమ్మకాన్ని పెంచి, మన జీవితాలను ఆయనయందు కేంద్రీకృతము చేసుకొనుటకు మనకు సహాయము చేస్తాయి. “మీరు వాటి ద్వారా లాభము పొందునట్లు వాటిని శ్రద్ధగా వెదకవలెనని జ్ఞాపకముంచుకొనవలెను.” 3

రెండవది, ప్రార్థన ద్వారా మనం ప్రభువును తెలుసుకొని, ఆయనయందు నమ్మకముంచగలము. మన దేవునికి ప్రార్థన చేయగలగుట ఎంత దీవెన! “హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి.” 4

ప్రార్థన గురించి నేను భద్రముగా దాచుకొనే తీపి జ్ఞాపకమొకటి ఉన్నది. కళాశాల నుండి నా ఒక వేసవి విరామములో, టెక్సాస్‌లో ఉద్యోగానికి అంగీకరించాను. ఐడాహో నుండి టెక్సాస్ వరకు వందల మైళ్లు నా పాత కారులో ప్రయాణించవలసి యుండెను, ఆ కారుకి నేను ప్రేమతో వెర్న్ అని పేరు పెట్టుకున్నాను. వెర్న్ పైకప్పు వరకు నింపబడింది మరియు నేను ఒక క్రొత్త సాహసానికి సిద్ధమయ్యాను.

తలుపు వద్దకు వెళ్ళే నా దారిలో, నా ప్రియమైన తల్లిని కౌగిలించుకున్నాను, ఆమె “నువ్వు వెళ్లేముందు మనం ప్రార్థన చెద్దాము” అని చెప్పింది.

మేము మోకరించగా, నా తల్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. నా క్షేమము కొరకు పరలోక తండ్రిని ఆమె వేడుకొన్నది. ఆ కారు నా అవసరానికి తగినట్లు పనిచెయ్యాలని అడుగుతూ, ఆమె ఎయిర్-కండిషన్ లేని నా కారు కొరకు ప్రార్థించింది. వేసవికాలమంతటిలో దేవదూతలు నాతో ఉండాలని ఆమె అడిగింది. ఆమె ప్రార్థన చేస్తూనే ఉన్నది.

ఆ ప్రార్థన వలన కలిగిన సమాధానము ప్రభువునందు నమ్మకముంచుటకు మరియు నా స్వబుద్ధిని ఆధారము చేసికొనకుండా ఉండుటకు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ వేసవికాలంలో నేను తీసుకున్న అనేక నిర్ణయాలలో ప్రభువు నా త్రోవను నడిపించెను.

ప్రార్థనయందు మనము పరలోక తండ్రిని సమీపించే అలవాటు చేసుకున్నప్పుడు, మనం రక్షకుని తెలుసుకుంటాము. ఆయనయందు నమ్మకముంచుటకు మొదలుపెడతాము. మన కోరికలు మరింతగా ఆయన కోరికలవలె అవుతాయి. కేవలం విశ్వాసముతో మనం అడిగితే పరలోక తండ్రి మనకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్న దీవెనలను మనకొరకు, ఇతరుల కొరకు సంపాదించుకొంటాము. 5

మూడవది, ఇతరులకు సేవ చేసినప్పుడు మనం ప్రభువును తెలుసుకొని, ఆయనయందు నమ్మకముంచగలము. అమీ రైట్ అనుమతితో ఈ కథను పంచుకుంటాను, ఆమె భయంకరమైన, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతు కూడా సేవచేయుట అనే సూత్రాన్ని అర్థము చేసుకొనెను. అమీ ఇలా వ్రాసెను:

“2015 అక్టోబర్ 29న, నాకు కేన్సర్ ఉందని నేను కనుగొన్నాను. నా కేన్సర్‌ 17 శాతము బ్రతికే రేటును కలిగియున్నది. అవకాశాలు మంచిగా లేవు. నేను నా జీవితం కొరకు పోరాటాన్ని చేయవలసి ఉంటుందని నాకు తెలుసు. నాకున్న సమస్తమును నా కొరకే కాదు, ముఖ్యంగా నా కుటుంబము కొరకు ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను. డిసెంబర్‌లో, నేను రసాయనచికిత్సను ప్రారంభించాను. కేన్సర్‌తో పోరాడే మందుల వలన కలిగే అనేక దుష్‌ప్రభావముల గురించి నాకు బాగా తెలుసు, కాని ఒకరు ఇంత జబ్బుతో ఉండి కూడా, జీవించి ఉండటం సాధ్యమని నాకు తెలియదు.

“ఒక సమయంలో, రసాయనచికిత్స మానవ హక్కులను ఉల్లంఘించడం అని నేను ప్రకటించాను. ఇక నా వల్లకాదు. నేను వదిలివేస్తున్నాను, నేను ఆసుపత్రికి తిరిగి వెళ్లను అని నా భర్తతో చెప్పాను. నా ప్రియుడు సహనముతో నేను చెప్పేది విని, తన జ్ఞానముతో ఇలా స్పందించెను, ‘అయితే, సేవచేయుటకు మనం ఎవరినైనా వెతకాలి.’”

ఏమిటి? తన భార్యకు కేన్సర్ ఉందని ఆమె ఇంకొకసారి వికారమును లేదా తీవ్రమైన నొప్పిని భరించలేదని ఆయన మరచిపోయాడా?

అమీ ఇంకా ఇలా వివరించింది: “నా వ్యాధి లక్షణాలు క్రమముగా తీవ్రమయ్యాయి, నెలలో ఒకటి లేదా రెండు రోజులు కొంచెం మెరుగుగా ఉండెవి [అప్పుడు] నేను, ఊపిరి పీలుస్తు ప్రాణముతో ఉన్న మనిషిలా కొంతవరకు పనిచెయ్యగలిగేదాన్ని. ఆ దినాలలో నా కుటుంబము సేవ చేయుటకు మార్గాలను వెతికేవారు.”

అటువంటి దినాలలో, అమీ కుటుంబము ఆసుపత్రిలో చిన్న ప్రదర్శనను ఏర్పాటుచేసి, రసాయనచికిత్స ఉపశమన కిట్లను ఇతర రోగులకు పంచారు, ఆ కిట్లు వారికి చిరునవ్వు కలిగించి, వారి రోగ లక్షణాలనుండి ఉపశమనము కలిగించే వస్తువులతో నిండియున్నవి. అమీకి నిద్రపట్టనప్పుడు, ఇతరుల దినాన్ని వెలుగుతో నింపే మార్గాలను ఆమె ఆలోచించేది. కొన్ని మార్గాలు పెద్దవి, కాని వాటిలో ఎక్కువ మార్గాలు ప్రోత్సాహాన్ని ప్రేమను తెలిపే కేవలం చిన్న చీటీలు లేదా అక్షర సందేశాలు. ఆమెకు నిద్రపట్టనంత ఎక్కువ నొప్పితో ఉన్న ఆ రాత్రులలో, ఆమె మంచముపైన పండుకొని తన ఐ-ప్యాడ్‌లో మృతులైన తన పూర్వీకులకు పూర్తిచేయబడవలసిన విధుల కొరకు వెతికేది. ఆశ్చర్యకరముగా నొప్పి తగ్గేది, మరియు ఆమె భరించగలిగేది.

“సేవ, నా జీవితాన్ని రక్షించింది” అని అమీ సాక్ష్యమిస్తుంది. “నా చుట్టు ఉన్నవారి బాధను తీసివేయుటకు ప్రయత్నించుటలో కనుగొన్న ఆనందమును, నేను ముందుకు సాగుటకు కావలసిన బలాన్ని చివరకు దానిలో కనుగొన్నాను. నా సేవా ప్రాజెక్టు కొరకు నేను గొప్ప ఆనందముతో, అపేక్షతో ఎదురుచూసాను. ఈ రోజువరకు అది విచిత్రమైన సిద్ధాంతముగా నాకు అనిపిస్తుంది. బోడితలతో, విషమివ్వబడి, [ఆమె] తన జీవితముతో పోరాడుచున్న ఒకరు, ‘ప్రస్తుతం అంతా నా గురించే’ అని ఆలోచించడంలో తప్పులేదు. అయినప్పటికి, నేను నా గురించి, నా పరిస్థితి గురించి, నా బాధ మరియు నొప్పి గురించి ఆలోచించినప్పుడు, లోకమంతా చీకటిగా, నిరుత్సాహముగా ఉండేది. నా దృష్టి ఇతరులపైకి మారినప్పుడు, అక్కడ వెలుగు, నిరీక్షణ, బలము, ధైర్యము, ఆనందము ఉండేవి. యేసు క్రీస్తు యొక్క బలపరచే, స్వస్థపరిచే, మరియు తోడ్పడే ప్రాయశ్చిత్త శక్తివలనే ఇది సాధ్యమని నాకు తెలుసు.”

అమీ ప్రభువును తెలుసుకొన్నప్పుడు, ఆమె ఆయనయందు నమ్మకముంచింది. ఆమె కొంచెమైనా తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనియుంటే, ఆమె సేవ చెయ్యాలన్ని ఆలోచనను ఆమె తిరస్కరించియుండేది. సేవ ఆమె తన బాధను, నొప్పిని తట్టుకునేలా చేసి, ఈ లేఖనాన్ని అనుసరించేలా చేసింది: “మీ తోటి ప్రాణుల సేవలో మీరున్న యెడల, మీరు మీ దేవుని సేవలోనే ఉన్నారని నేర్చుకొనవలెను.” 6

యేసు క్రీస్తు లోకమును జయించెను. ఆయన వలన, ఆయన అంతములేని త్యాగము వలన, చివరకు అంతా సవ్యముగా ఉంటుందని తెలిసి, నమ్మకముంచుటకు మనమందరం గొప్ప హేతువును కలిగియున్నాము.

సహోదరీలారా, మనలో ప్రతి ఒక్కరు ప్రభువునందు నమ్మకముంచి, స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు. ఆయనను తెలుసుకొనుట ద్వారా, రక్షకునిపై మన జీవితాలను కేంద్రీకృతము చేసుకోవాలి, అప్పుడు ఆయన మన త్రోవలను సరాళము చేయును.

“ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము” 7 అని యేసు క్రీస్తు ప్రకటించినప్పుడు, ఆయన పక్షాన ఉండేలా ఆయనయందు అదే నమ్మకాన్ని ప్రదర్శించుటకు మనం భూమిపైన ఉన్నాము.

చిత్రం
క్రీస్తు మరియు సృష్టి

ప్రియమైన సహోదరీలారా, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా సాక్ష్యమిచ్చారు, “మనకు వాగ్దానము చేయబడిన దీవెనలు కొలుచుటకు అతీతమైనవి. మనం యధార్థముగా నడుచుకున్నప్పుడు, పెనుతఫాను మేఘాలు కమ్ముకొనినప్పటికిని, వర్షాలు మనపైన కురిసినప్పటికి, మన సువార్త జ్ఞానము, మన పరలోక తండ్రి మరియు మన రక్షకుని యెడల మన ప్రేమ మనకు ఆదరణనిచ్చును మరియు ఊతమిచ్చును . . . . . మనల్ని ఓడించేది ఈ లోకములో ఏదీ ఉండదు.” 8

మన ప్రియమైన ప్రవక్త యొక్క సాక్ష్యముతో నాది చేరుస్తున్నాను. మన పరలోక తండ్రి యందు మరియు మన రక్షకునియందు మనము నమ్మకముంచి, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా ఉన్నయెడల, వారు మన త్రోవలను సరాళము చేసి, మన పట్ల కరుణగల బాహువును అందిస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

గమనిక: 2017, ఏప్రిల్ 1న, సహోదరి కార్డన్ ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వములో రెండవ సలహాదారిణిగా విడుదల చేయబడ్డారు, మరియు మొదటి సలహాదారిణిగా పిలవబడ్డారు.

ముద్రించు