2010–2019
కలవరపడకుము
అక్టోబర్ 2018


15:42

కలవరపడకుము

సహోదర సహోదరీలారా, సానుకూల దృక్పథముతో ఉండుము. అవును, మనము అపాయకరమైన కాలములలో జీవిస్తున్నాము, కానీ నిబంధన బాటపై నిలిచియున్నప్పుడు, మనము భయపడనవసరములేదు.

కొన్ని క్షణాల క్రితం ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల కూటమి యొక్క సలహాసభ సామరస్యము మరియు ఏకగ్రీవతతో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ ఇచ్చిన సందేశాలకు నా సాక్ష్యమును చేరుస్తున్నాను. బయల్పరచబడిన ఈ ప్రకటనలు ప్రభువు యొక్క మనస్సు మరియు చిత్తమని, రాబోయే తరముల కొరకు వ్యక్తులు, కుటుంబాలను మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘమును దీవించునని నేను ఎరుగుదును.

కొన్ని సంవత్సరాల క్రితం, క్రొత్తగా వివాహము చేసుకున్న మా కుమార్తెలలో ఒకరు, ఆమె భర్త కలిసి నన్ను, సహోదరి రాస్బాండ్‌ను చాలా ముఖ్యమైన, జీవితమును-ప్రభావితం చేసే ప్రశ్న అడిగారు: “మనము నివసిస్తున్న ఈ దుష్టమైన, భయంకరమైన లోకములోనికి పిల్లలను తీసుకొనిరావడం ఇంకా క్షేమమేనా, తెలివైన పనేనా?”

ఇప్పుడు అది అమ్మానాన్నకు, పెళ్ళైన తమ పిల్లల గురించి ఆలోచించుటకు ముఖ్యమైన ప్రశ్న. మేము వారి స్వరములలో భయమును వినగలిగాము మరియు వారి హృదయాలలో భయాన్ని అనుభవించాము. సువార్త ప్రధాన సూత్రములు, మా హృదయపు భావనలు మరియు జీవితపు అనుభవాలను వారితో పంచుకొన్నప్పుడు వారికి మా జవాబు స్థిరమైనది, “అవును, అది ఖచ్చితంగా అంగీకారమైనది.”

భయము క్రొత్తది కాదు. యేసు క్రీస్తు యొక్క శిష్యులు, గలిలయ సముద్రములో ఉండి, రాత్రి చీకటిలో “గాలికి, అలలకు” భయపడ్డారు. 1 నేడు ఆయన శిష్యులుగా మనము కూడా భయాలను కలిగియున్నాము. మన ఒంటరి యౌవనులు వివాహము చేసుకోవాలనే ఒడంబడికలను చేయుటకు భయపడతారు. మా పిల్లలవలే వివాహమైన వారు, దుష్టత్వము పెరుగుతున్న లోకములోనికి పిల్లలను తెచ్చుటకు భయపడవచ్చు. మిషనరీలు అనేక విషయాలకు భయపడవచ్చు, ప్రత్యేకంగా క్రొత్త వారిని సమీపించుటకు. విధవరాళ్ళు ఒంటరిగా ముందుకు సాగుటకు భయపడతారు. యుక్తవయస్కులు అంగీకరింపబడరేమోనని భయపడతారు; పాఠశాలకు వెళ్ళువారు మొదటిరోజు భయపడతారు; విశ్వవిద్యాలయ విద్యార్థులు పరీక్షా ఫలితము కొరకు భయపడతారు; మనము వైఫల్యము, తిరస్కారము, నిరాశ, మరియు తెలియని వాటి కొరకు భయపడతాము; నేలను, మన జీవితాలను సర్వనాశనం చేసే భూకంపాలు, తుఫానులు, మంటలకు భయపడతాము. ఒకవైపు ఎంపిక చేయబడమని, మరొకవైపు ఎంపిక చేయబడతామని భయపడతాము; తగినంత మంచిగా లేమని భయపడతాము; ప్రభువు దగ్గర మన కొరకు ఏ దీవెనలు లేవని భయపడతాము. మార్పుకు మనము భయపడతాము, మరియు మన భయాలు తీవ్రమై భీతిగా కావచ్చు. ఈ భయాలలో కొన్ని మీకున్నాయా?

ప్రాచీన కాలములనుండి, భయము దేవుని యొక్క పిల్లల దృష్టికోణమును పరిమితం చేసింది. 2 రాజులులో ఎలీషా యొక్క వృత్తాంతమును నేను ఎల్లప్పుడు ప్రేమించాను. సిరియా రాజు గొప్ప సైన్యమును పంపెను, వారు “రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనెను.”2 వారి ఉద్దేశము, ఎలీషా ప్రవక్తను పట్టుకొని చంపుట. మనమిలా చదువుతాము:

“దేవుని మనుష్యుని యొక్క సేవకుడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు, గుఱ్ఱములును, రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట కనబడెను. అంతట అతడి పనివాడు—అయ్యో, నా యేలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనెను”3

అక్కడ భయము మాట్లాడుచున్నది.

“(ఎలీషా) జవాబిచ్చాడు, భయపడవద్దు: మన పక్షము నున్నవారు వారికంటె అధికులై యున్నారు.”4

కాని అతడు అక్కడితో ఆగలేదు.

“యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేసెను. మరియు ప్రభువు ఆ చిన్నవాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను.”5

మన భయాలను చెదరగొట్టుటకు మరియు మన రాక్షసులను జయించుటకు అగ్ని రథములను మనము కలిగియుండకపోవచ్చు, కానీ పాఠము స్పష్టమైనది. ప్రభువు మనతో ఉన్నాడు, మనల్ని జ్ఞాపకముంచుకొన్నాడు మరియు ఆయన మాత్రమే చేయగల విధానములలో మనల్ని దీవిస్తున్నాడు. ప్రార్థన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తః త్యాగముపై మన ఆలోచనలు కేంద్రీకరించుటకు మనకవసరమైన బలము మరియు బయల్పాటు లభ్యమగునట్లు చేయును. కొన్నిసార్లు మనము భయపడతామని ప్రభువు ఎరుగును. నేను భయపడ్డాను మరియు మీరు కూడా, అందుకే లేఖనాలు ప్రభువు యొక్క సలహాతో నిండియున్నవి:

“కలవరపడకుడి, మరియు భయపడకుడి.”6

“ప్రతీ ఆలోచనయందు నావైపు చూడుము; సందేహించవద్దు, భయపడకుము.”7

“చిన్నమందా, భయపడకుము.”8 “చిన్నమందా,” మాటలోని మృదుత్వమును నేను ప్రేమిస్తున్నాను. ఈ సంఘములో లోకమునకు ప్రాముఖ్యమైనట్లు కనబడేంతగా మన సంఖ్య తగినంతగా లేకపోవచ్చు, కానీ మన ఆత్మీయ నేత్రములను మనము తెరచినప్పుడు, “మన పక్షము నున్నవారు వారికంటె అధికులైయున్నారు.”9 మన ప్రేమగల కాపరి యేసు క్రీస్తు ఇలా కొనసాగిస్తున్నారు, “భూమి, నరకము మీకు వ్యతిరేకంగా ఏకమైనప్పటికిని, మీరు నా బండపై కట్టబడిన యెడల, అవి ప్రబలం కావు.”10

భయము ఎలా తీసివేయబడుతుంది? ఆ చిన్న సేవకునికి, దేవుని యొక్క ప్రవక్త, ఎలీషా ప్రక్కనే అతడు నిలబడియున్నాడు. మనకు అదే వాగ్దానమున్నది. మనము అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ గారిని విన్నప్పుడు, ఆయన సలహాను లక్ష్యముంచినప్పుడు, మనము దేవుని యొక్క ప్రవక్త ప్రక్కన నిలబడుతున్నాము. జోసెఫ్ స్మిత్ మాటలు గుర్తుంచుకోండి: “మరియు ఇప్పుడు, ఆయనను గూర్చి ఇవ్వబడిన అనేక సాక్ష్యముల తరువాత, అన్నిటికంటె చివరిదైన, ఈ సాక్ష్యమును, మేము ఆయనను గూర్చి ఇస్తున్నాము: ఆయన జీవిస్తున్నాడు!”11 యేసు క్రీస్తు జీవిస్తున్నారు. ఆయన కొరకు, ఆయన సువార్త కొరకు మన ప్రేమ భయమును చెదరగొట్టును.

మనతో “ఎల్లప్పుడు ఆయన ఆత్మను కలిగియుండాలనే”12 కోరిక, మన మర్త్య జీవితాలను నిత్య దృక్పథంతో చూసేందుకు భయాన్ని ప్రక్కకు నెట్టివేయును. అధ్యక్షులు నెల్సన్ గారు హెచ్చరించారు, “రాబోయే దినములలో దారిచూపి, నడిపించి, ఓదార్చే పరిశుద్ధాత్మ యొక్క నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యము కాదు.”13

భూమిని కప్పివేసి, అనేకమంది హృదయాలను కఠినపరచే ఉపద్రవములను గూర్చి ప్రభువు ఇలా చెప్పారు: “నా శిష్యులు పరిశుద్ధ ప్రదేశాలలో నిలబడవలెను మరియు కదలరాదు.”14

తరువాత ఈ దైవిక సలహా: “కలవరపడకుడి, ఏలయనగా, ఇవన్నియు సంభవించినప్పుడు, మీకు చేయబడిన వాగ్దానములు నెరవేర్చబడునని మీకు తెలియును.”15

పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుము---కలవరపడవద్దు---వాగ్దానములు నెరవేర్చబడును. మన భయాలకు సంబంధించి వీటిలో ప్రతీఒక్క దానివైపు చూడుము.

మొదట, పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుము. మనము పరిశుద్ధ స్థలములలో---నీతిగల మన గృహాలు, సమర్పించబడిన మన సంఘ భవనాలు, సమర్పించబడిన దేవాలయములలో--- నిలిచియున్నప్పుడు మనము ప్రభువు యొక్క ఆత్మను అనుభూతిచెందుతాము. మనల్ని ఇబ్బందిపెట్టే ప్రశ్నలకు జవాబులను లేక వాటిని ప్రక్కన పెట్టుటకు శాంతిని మనము కనుగొంటాము. అది క్రియయందు ఆత్మ. భూమిమీద దేవుని రాజ్యములో ఈ పరిశుద్ధ స్థలముల కొరకు మన భక్తిగల గౌరవము, ఇతరులపట్ల మన గౌరవము, సువార్తను జీవించుటలో మన శ్రేష్టత, మరియు మన భయాలను ప్రక్కన పెట్టి, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము ద్వారా ఆయన స్వస్థపరచు శక్తిని వెదకుటకు మన నిరీక్షణలు అవసరము.

దేవుని యొక్క ఈ పరిశుద్ధ స్థలములలో లేక ఆయన పిల్లల హృదయాలలో భయానికి స్థలములేదు. ఎందుకు? ప్రేమ వలన. దేవుడు మనల్ని---ఎల్లప్పుడు ప్రేమిస్తున్నాడు మరియు మనము ఆయనను ప్రేమిస్తున్నాము. దేవునిపట్ల మన ప్రేమ భయములన్నిటిని నివారించును మరియు ఆయన ప్రేమ పరిశుద్ధ స్థలములలో సమృద్ధిగా ఉండును. దాని గురించి ఆలోచించుము. ప్రభువుతో మన ఒడంబడికలందు మనము అస్థిరముగా ఉన్నప్పుడు, నిత్య జీవమునకు నడిపించు ఆయన బాట నుండి మనము తొలగిపోయినప్పుడు, ఆయన దైవిక ప్రణాళికలో మన ప్రాముఖ్యతను సందేహించినప్పుడు, నిరాశ, కోపము, భంగపాటు, నిస్పృహలనే భయము యొక్క సహవాసులకు ద్వారమును తెరచుటకు అనుమతించినప్పుడు---ఆత్మ మనల్ని విడిచిపెట్టును, మరియు మనము ప్రభువు లేకుండా ఉంటాము. అది ఎలా ఉంటుందో మీకు తెలిసిన యెడల, అది మంచి స్థలము కాదని మీకు తెలుస్తుంది. దానికి వ్యతిరేకంగా, మనము పరిశుద్ధ స్థలములలో నిలిచియున్నప్పుడు, మనము దేవుని ప్రేమను అనుభూతి చెందగలము, మరియు “పరిపూర్ణమైన ప్రేమ సమస్త భయమును పారద్రోలును.”16

తరువాతి వాగ్దానము, “కలవరపడకుడి.”17 దుష్టత్వము మరియు గందరగోళము భూమిని ఎంతగా నింపినప్పటికిని, యేసు క్రీస్తునందు మన అనుదిన విశ్వాసము ద్వారా “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును”18 పొందుతామని మనము వాగ్దానము చేయబడ్డాము. సమస్త శక్తి, మహిమయందు క్రీస్తు వచ్చినప్పుడు, చెడు, తిరుగుబాటు మరియు అన్యాయము ముగియును.

చాలా కాలం క్రితం యౌవన తిమోతికి ఇలా చెప్పుచూ, అపొస్తలుడైన పౌలు మన కాలముల కొరకు ప్రవచించెను:

“అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

“ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, . . .

“ . . . దేవుని కంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు.”19

తెరకు ఇరువైపుల “మనతో ఉండువారు,” పూర్ణ హృదయము, శక్తి, మనస్సు, మరియు బలముతో ప్రభువును ప్రేమించువారి, “పక్షము నున్నవారు వారికంటె అధికులైయున్నారు”20 అని జ్ఞాపకముంచుకొనుము. మనము చురుకుగా ప్రభువు మరియు ఆయన మార్గములందు నమ్మకముంచిన యెడల, ఆయన కార్యములో మనము నిమగ్నమైయున్న యెడల, మనము లోకము యొక్క ధోరణులకు భయపడము లేక వాటి చేత ఇబ్బందిపడము. లోకసంబంధమైన ప్రభావములను, ఒత్తిళ్ళను ప్రక్కన పెట్టి, మీ అనుదిన జీవితములో ఆత్మీయతను వెదకమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభువు ప్రేమించే దానిని ప్రేమించుము---దానిలో ఆయన ఆజ్ఞలు, ఆయన పరిశుద్ధ స్థలములు, ఆయనతో మన పరిశుద్ధ నిబంధనలు, ప్రతీ సబ్బాతు దినమున సంస్కారము, ప్రార్థన ద్వారా మన సంభాషణ ఉన్నవి---మరియు మీరు కలవరపడరు.

చివరి విషయము: ప్రభువు మరియు ఆయన వాగ్దానములను నమ్ముము. ఆయన వాగ్దానములన్నీ నెరవేర్చబడునని నేనెరుగుదును. ఈ పరిశుద్ధ సమావేశమందు మీ యెదుట నేనిక్కడ నిలబడినంత నిశ్చయముగా దానిని నేను ఎరుగుదును.

ప్రభువు ఇలా బయల్పరిచారు: “ఏలయనగా జ్ఞానముగల వారు, సత్యమును పొందియున్నారు, పరిశుద్ధాత్మను వారి మార్గదర్శిగా తీసుకొన్నారు మరియు మోసగించబడలేదు---నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారు నరికివేయబడరు, అగ్నిలో పడవేయబడరు, కానీ ఆ దినమున స్థిరముగా నిలిచియుంటారు.”21

అందువలనే మనము నేటి లోక సంక్షోభముచేత, గొప్ప, విశాలమైన భవనములోని వారి చేత, ప్రభువైన యేసు క్రీస్తుకు సమర్పించబడిన సేవ మరియు నిజాయితీగల ప్రయత్నమును ఎగతాళి చేయువారి చేత ఇబ్బందిపడరాదు. సానుకూల దృక్పథము, ధైర్యము లేక దాతృత్వము కూడా, ఇబ్బందులు లేక సంక్షోభము చేత భారము కాని హృదయమునుండి వచ్చును. “భవిష్యత్తు గురించి ఆశాభావము” గల అధ్యక్షులు నెల్సన్ గారు మనకిలా గుర్తు చేసారు, “సత్యమును ముట్టడి చేయు అనేక అభిప్రాయాలు మరియు మనుష్యుల తత్వముల మధ్య ఏది విలువైనది లేక ఉపయోగకరమైనదో జాగ్రత్తగా పరిశీలించుటకు మనము ఆశించిన యెడల, మనము బయల్పాటును పొందడం నేర్చుకోవాలి.”22

వ్యక్తిగత బయల్పాటును పొందడానికి, సువార్తను జీవించుటకు, ఇతరులయందు, మనయందు విశ్వసనీయతను మరియు ఆత్మీయతను ప్రోత్సహించుటకు ప్రాధాన్యతనివ్వాలి.

నా బాల్యములోని ప్రవక్తలలో ఒకరు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్. ఈ గత కొన్ని సంవత్సరాలు, ఒక అపొస్తలునిగా పిలవబడిన తరువాత, 1943 అక్టోబరు సర్వసభ్య సమావేశములో ఆయన మొదటి సందేశములో, నేను సమాధానమును కనుగొన్నాను. ఆయన తన పిలుపుచేత ముంచివేయబడ్డారు; అది ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. ఎల్డర్ కింబల్ చెప్పారు: “నేను చాలాసేపు ఆలోచించాను మరియు ప్రార్థించాను, ఉపవాసము చేసాను మరియు ప్రార్థన చేసాను. నా మనస్సులో కలిగిన ఈ విరుద్ధభావాలను ఆలోచించకుండా ఉండలేకపోయాను: ‘నీవు ఆ పనిని చేయలేవు. నీకు యోగ్యత లేదు. నీకు సామర్థ్యము లేదు’---మరియు చివరకు ఎల్లప్పుడు విజయవంతమైన ఆలోచన వచ్చును: ‘నియమించబడిన పనిని నీవు చేయాలి---నిన్ను నీవు సమర్థునిగా, యోగ్యునిగా మరియు అర్హునిగా చేసుకొనుము.’ మరియు యుద్ధము కొనసాగెను.”23

ఈ బలమైన సంఘము యొక్క 12వ అధ్యక్షునిగా అయిన ఈ అపొస్తలుని యొక్క స్వచ్ఛమైన హృదయపూర్వకమైన సాక్ష్యము వలన నేను ప్రోత్సహించబడ్డాను. “అప్పగించబడిన పనిని చేయుటకు” తన భయాలను వదిలివేయాలని మరియు తనను తాను “సమర్థునిగా, యోగ్యునిగా మరియు అర్హునిగా చేసుకొనుటకు” బలము కొరకు ఆయన ప్రభువుపై ఆధారపడాలని ఆయన గుర్తించారు. మనము కూడా గుర్తించగలము . యుద్ధములు కొనసాగును, కాని మనము వాటిని ప్రభువు యొక్క ఆత్మతో ఎదుర్కొంటాము. మనము “కలవరపడము,” ఎందుకనగా ప్రభువుతో మనము నిలబడినప్పుడు, ఆయన సూత్రములు, ఆయన నిత్య ప్రణాళిక కొరకు నిలబడినప్పుడు, మనము పరిశుద్ధ స్థలములో నిలబడియున్నాము.

ఇప్పుడు, సంవత్సరాల క్రితం మా కుమార్తె, అల్లుడు అడిగిన చాలా హృదయపూర్వకమైన, అన్వేషితమైన, భయము ఆధారితమైన ప్రశ్న సంగతేమిటి? ఆ రాత్రి మా సంభాషణను వారు గంభీరంగా ఆలోచించారు; వారు ప్రార్థించారు, ఉపవాసమున్నారు మరియు వారి స్వంత నిర్ణయాలను చేసారు. వారు విశ్వాసము మరియు ప్రేమయందు ముందుకు సాగుతుండగా సంతోషకరంగా, ఆనందపూర్వకంగా వారి కొరకు, తాతమామ్మలమైన మా కొరకు, ఇప్పుడు వారు ఏడుగురు అందమైన పిల్లలతో దీవించబడ్డారు.

ఎల్డర్ మరియు సహోదరి రాస్బాండ్ యొక్క ఏడుగురు మనుమలు

సహోదర సహోదరీలారా, సానుకూల దృక్పథముతో ఉండుము. అవును, మనము అపాయకరమైన కాలములలో జీవిస్తున్నాము, కానీ నిబంధన బాటపై నిలిచియున్నప్పుడు, మనము భయపడనవసరములేదు. మీరు ఆవిధంగా చేసినప్పుడు, మనము జీవించు సమయములచేత లేక మనకు సంభవించు కష్టముల చేత మీరు ఇబ్బందిపడరని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. పరిశుద్ధ స్థలములలో నిలిచియుండాలని, కదలకయుండాలని ఎన్నుకొనుటకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క వాగ్దానములందు, ఆయన జీవిస్తున్నారని, ఆయన మనపై కావలికాయుచున్నారని, మనకొరకు శ్రద్ధ తీసుకొనుచున్నారని మరియు మన ప్రక్కన నిలిచియున్నారని నమ్ముటకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.